"నీ దగ్గరుందామని వచ్చానమ్మా? ఈ ముసలి తండ్రికి గుక్కెడు గంజి పొయ్యలేవా?" నమ్మాలేనట్లు చూసింది వారిజ. కళ్ళల్లో నీళ్ళు కాలువలు గట్టయి. కాడల్లా వున్న తండ్రి చేతులు పట్టుకు" అంత అదృష్టమా నాన్నా! నీకింకా నా మీద ఆ మాత్రం దయ వుందా?' అంది.
సత్యనారయణ వారిజ శిరస్సు వాత్సల్యంగా నిమిరాడు. నాకు తెలుసమ్మా! ఇంకా నేనేన్నాల్లో బతకను - ఒకనాడు నన్ను నువు సంతోష పెట్టడానికీ ప్రయత్నించావు. ఇవాళ నిన్ను సంతోష పెట్టడానికి నేను వచ్చాను. నీ చేతుల్లో చనిపోదామని మనం ఒకరి నోకరం ఇంకెలా సంతోష పెట్టుకోగలమమ్మా!"
తండ్రి ఒళ్లో వాలి బావురుమంది వారిజ. సత్యనారాయణ శోకమూ గట్లు తెగింది. కన్నీళ్ళతోనే ఒకరి నొకరు అనునయించుకొంటూ తండ్రీ కూతుళ్ళూ అలా ఎంత సేపో ఉండిపోయారు. ఆ మరునాటి నుంచే సత్యనారాయణ గుండె జబ్బు బాగా ఎక్కువయింది. వారిజ ఆయనను బ్రతికించుకోటానికి సమస్త శక్తులూ ఉపయోగించింది కాని, మూడు రోజులు యమ యాతన పడి చివరకు వారిజ చేతులో కళ్ళు మూశాడు సత్యనారాయణ.
7
"లతా!" అంటూ ఆప్యాయంగా దగ్గరగా తీసుకున్నాడు . వారిజ కళ్ళలో తనను చూడగానే వెలిగే మెరుపుల లాంటివి లత కళ్ళలోనూ చూడగలుగుతా ననుకున్నాడు . వారిజలా లత కూడా తనను ఎవరో అపురూప దేవతలా ప్రగడమయిన ఆరాధన భావంతో సమీపిస్తుందను కొన్నాడు.
అతను ఆశించిన దానిలో ఒక్కటి కూడా లత నుండి పొందలేక పోయాడు రామచంద్ర. పైగా ఏదో విసుగుదల కూడా లీలగా తోచింది. మొత్తం మీద యౌవన సహజమయిన వుద్రేకం తప్ప మరేమీ పొందలేక పోయాడు లత నుండి.
హృదయ పూర్వకమయిన .ప్రేమ.... ఆ ప్రేమతో కూడిన తపన.....అహంపూర్తిగా నశించిన ఆత్మార్పణ. ఒక స్త్రీ నుండి పొంద'గలిగిన పురుషుడు ఆ మాధుర్యాన్ని అంత తేలిగ్గా మరిచిపోలేడు. వారిజ వ్యక్తిగత జుగుప్సాకర చరిత్ర వారిజ నోటినే విని వారిజను చీదరించుకొంటున్నా, వారిజ తన మనసుకు కలిగించిన ఆ తీయని స్పందనలు అతని హృదయాన్ని ఇంకా వీడి పోలేదు.
చైతన్యం పరవళ్ళు తొక్కే కవింపులు, లాలిత్యం నిండించుకున్న అనునయాలు మాధుర్యం ఛిప్పిలే మందహాసాలు .......వీటి పులకరింతలను అతని శరీరం ఇంకా వదిలించుకోలేదు. తిరిగి అలాంటి అపూర అనుభవం కోసం, అతనికి తెలియకుండానే అతని హృదయం ప్రతీక్షిస్తోంది.
లత పూర్తిగా నిరుత్సాహాన్నే కలిగించినా సహించాడు రామచంద్ర. ఇంకా కొత్త పెళ్ళి కూతురు ప్రేమంటే ఏమిటో తెలియని పసి మనస్సు కావచ్చు. కాలం గడిచి తనను అర్ధం చేసుకుంటే ఆవిడే తనను ప్రేమిస్తుంది. ఆనాడు తన హృదయం ఏ అనుభవం కోసం పరితపించి పోతోందో ఆ అనుభవం ,మళ్ళీ పొందవచ్చు అని తనను తానూ ఒదార్చుకున్నాడు రామచంద్ర. తెల్లవారు జామునే లేవటం రామచంద్రం కలవాటు. లేచి కొంత సేపు వ్యాయామం చేసి, చెరువులో స్నానం చేసి అప్పుడు ఇంటికొచ్చి కాఫీ తాగుతాడు.
రామచంద్రం స్నానం చేసి వచ్చాక కూడా లత లేవలేదు. లత మంచం మీద కూచుని చిందర వందరగా ఉన్నా లత ముంగురులు సవరిస్తూ "లతా" అన్నాడు మృదువుగా . లత బద్దకంగా వొత్తుగిలి 'అబ్బా! రాత్రి నిద్ర చాలలేదు కాస్సేపాగి లేస్తాను బాబూ!" అంది.
రామచంద్ర నవుకున్నాడు మత్తుగా, అస్తవ్యస్తంగా వున్న చీరతో పడుకున్న లత పసిపాపలా అనిపించింది రామచంద్రంకు. వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు . ఒక్కసారి చికాకుగా కదిలి మళ్ళీ కళ్ళు మూసుకుంది లత. రామచంద్ర తనే స్టౌ వెలిగించి లతకూ కాఫీ తయారుచేశాడు.
లతను బుజ్జగింపుగా లేపాడు. "లే , లత! కాఫీ తగవూ? పోనీ కాఫీ తాగి పడుకో!" చక్కిలిగిలి పెట్టాడు . లత బలవంతాన కళ్ళు తెరిచింది. భుజాలు పట్టుకు లేవదీశాడు . బాత్ రూమ్ కేసి నడిపించాడు. అప్పటి కి లతకు కాస్త మత్తు వదిలింది. ముఖం కడుక్కుంది.
"దేవి! ఇదిగో కాఫీ! స్వేకరించండి. " అంటూ చిరునవుతో కాఫీ గ్లాసు అందించాడు రామచంద్ర. రామచంద్ర సున్నిత మనస్కుడైన భావుకుడు. ఒక రకంగా చాలా అదృష్ట వంతుడు. అందమయిన ఒక అనుభవాన్ని లౌకికుడు. అనుభవించిన దానికంటే కొన్ని రెట్లు గాడంగా అనుభవించగలడు.
ఆనంద పారవశ్యాన్ని అతడు భుజించినట్లు సామాన్యుడు భుజించలేడు . కాని, ఈ భావుకతలో ఒక బలహీనత కూడా ఉంది. ప్రతి విషయాన్ని ముందుగానే తనలో భావనా దృష్టిలో చూడటానికి ప్రయత్నించటం. ఒక విషయం ఇంకా ప్రారంభం కాకుండానే తన ఊహలలో అందంగా చిత్రం చేసుకోవటం.
జీవితం అందమైన ఊహ కాదు - వెలుగు చీకట్ల రాగం . రాగాల - శ్రుత్యపశ్రుతుల - భోగమోక్షాల విచిత్రమైన సమ్మేళనం . భావుకుని వూహలా జీవితం ఎందుకుంటుంది.?
కాని, ఇలా అనుకుని సమాధానపడలేడు భావకుడు. తన ఊహకూ , వాస్తవానికి మధ్య గల భేదాన్ని తలుచుకుని బాధపడతాడు. కుంగిపోతాడు. విలవిలలాడుతాడు. ఈ సంఘర్షణే, ఒరిపిడే అతనిలోని భావుకతకు ఏదో విధమైన వ్యక్తీకరణను వాంచిస్తుంది. కనీసం తన భావనలను వేరు విధంగా వెలిగ్రక్కు కోవటంలోనైనా సంతృప్తిని పొందాలని పరితపిస్తుంది.అందుకే లోకంలో ఇంతమంది కవులు, కళా కారులు , గాయకులూ రచయితలూ , శిల్పులు.
తన కాఫీ అందించగానే లత నొచ్చుకుంటుందనుకున్నాడు రామచంద్ర. "మీరెందుకు చేశారు? నేనే స్వయంగా చేసి మీకివాలను కొంటుంటే?" అని అభిమానంగా కోప్పడుతుందనుకున్నాడు.
"పాపిష్టిదాన్ని - మెలకువ రాలేదు. మీరు చేశారా?' అని బాధతో తనను తను నిందించుకుంటుందనుకున్నాడు. "ఇంక మీదట ఇలా చేస్తేనా నా మీద ఒట్టే!" అని ముద్దుగా బెదిరిస్తుందనుకున్నాడు.
"అబ్బ! ఎంత బాగుందండీ! మీ చేత్తో ఇవబట్టి కాబోలు ఈ కాఫీకి ఎక్కడ లేని రుచీ వచ్చింది" అని తనను పొగుడుతుందనుకున్నాడు.
లత ఇవేమీ అనలేదు. కాఫీ కొంచెం తాగి విరగబడి నవింది.
'ఛీ! ఇదేం కాఫీ! పంచదార పానకం! ఎలా తాగుతారు ఇలా?" అంది. రామచంద్ర ముఖం వదలిపోయింది. "ఏదో చేశాను......పోనీ, నే నిచ్చానని ఇవాల్టికి ఎలాగో తాగెయ్యి - ఏం?" అన్నాడు నవు తెచ్చుకుంటూ. లత తన చేతిలో గ్లాసును టక్కున కింద పెట్టింది.