Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 18

 

    "దాని దగ్గరేముందమ్మా? మహా యిస్తే ఒక వంద యిచ్చేను. రెండు వందలిచ్చేను  అంతే!"
    'అయినా అడిగి చూడు. "వారిజ ఏదో ఒక విధంగా సర్దుతుందన్న నమ్మాకం పార్వతి కుంది. రవి ద్వారా సంగతి విన్న వారిజ పొంగిపోయింది. ఆ ఎడే వారిజ బి.ఏ. కూడా ప్రయివేట్ గా పాసయింది. ఆ బి.ఏ. ఫలితం తెలిసిన నాడు కూడా యింతగా అనందించలేదు.
    "డబ్బు కేమిట్రా? నా ఇల్లు తాకట్టు పెట్టి అయిదు వేలు తెస్తాను. తరువాత మెల్లిగా తీర్చుకుంటాను. " వారిజ నుండి అంత సహాయం ఆశించని రవి ఆశ్చర్యపోయాడు. వారిజ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని " పద! నేనూ వస్తాను" అంది. అంత డబ్బు రవి సవ్యంగా యింట్లో యిస్తాడాయివడా అని ఒకటి.....
    లతను చూడాలని ఒకటి......
    వారిజను చూస్తూనే పాలిపోయింది పార్వతి ముఖం.
    "నువూ వచ్చావా?' అంది.
    తల్లి పాలిపోయిన ముఖమూ, ఆ మాటలూ , ఆ మాట్లాడినా కంఠ స్వరమూ వారిజ పొంగిపొరలే వుత్సాహం మీద చన్నీళ్ళు జల్లాయి.
    "మళ్ళీ వెంటనే వెళ్ళి పోతానమ్మా" అంది . పార్వతి ఇంకేం మాట్లాడలేదు. పాపం, పార్వతికి బాధగానే వుంది. కాని ఏం చేయగలదు? ఒక కన్ను పోయిందని రెండో కన్ను పొడుచుకోగలదా?
    వారిజ అయిదువేలు తల్లి చేతిలో పెట్టింది. రెండు వేలు పెళ్లి ఖర్చుల కుంచు. ఒక వెయ్యి పెళ్ళి కొడుక్కు బట్టలూ, పెళ్ళి వాళ్ళ బట్టలూ మొదలైనవి కొను. మిగిలిన రెండు వేలూ పెట్టి లతకి నగలు చేయించు, దానికి నగలంటే ఇష్టం.
    పార్వతి కన్నీళ్ళతో అందుకుంది. ఇల్లు తాకట్టు పెట్టి అయిదు వేలు లేకపోతె, అమ్మేసి ఏ యాభై వేలో తేకపోయావా? పాతికవేలు నువుంచుకున్నా ఏ పదివేలో కట్న మిస్తే నాకింత కన్న మంచి సంబంధం వచ్చేదిగా?" అంది లత రుసరుసలాడుతూ నిర్ఘాంతపోయింది వారిజ.
    "సంబంధం పూర్తిగా నిస్చయమయిపోయాక ఇంకో సంబంధమంటా వేమిటి లతా!"
    'అయితే మాత్రం! ఇంకో సంబంధం దొరికితే, ఇది వదులుకోకూడదని వుందా ఏం?"
    "ఒసేయ్ లతా! ఇంతకన్నా మంచి సంబంధం నీకు కోట్లు పోసినా రాదే! నాయపైసకి ఆశ పడకుండా గొప్ప మనసుతో నిన్ను చేసుకోవడానికి సిద్దపడ్డాడు . అలాంటి మనుష్యులుంటారుటే" కటకటలాడుతూ అన్నాడు సత్యనారాయణ.
    "గొప్ప మనసు! అతనేం బావుంటాడని? నా అందాన్ని చూసి ఒప్పుకున్నాడు."
    "నోరు మూసుకో" చికాగ్గా అన్నాడు సత్యనారాయణ.
    'అంతే! కొంతమంది మనుష్యులకు సుఖపడడం కూడా చేతకాదు." లత మూతి తిప్పింది వెటకారంగా.
    'అమ్మా! నేను పెళ్ళికి రానా?" భయం భయంగా అడిగింది వారిజ. కన్నీళ్ళతో చూసింది పార్వతి.
    "ఎలా అమ్మా? నిన్ను తెలియని వాళ్ళెవరు? పెళ్ళి పందిట్లో ఎవరైనా నిన్ను గుర్తుపడితే?' ఆగిపోయింది పార్వతి మాట పూర్తీ చేయలేక-
    "ఫరవాలేదు ఉండనియ్యమ్మా! వారిజక్కా! నా పెళ్ళికి రిసెప్షన్ నాడు నువు డాన్స్ చేస్తావా?" ఉత్సాహంగా అడిగింది లత.
    పాలిపోయిన ముఖంతో లేచి నిలబడింది వారిజ. పిచ్చిదానిలా లత కేసి చూడసాగింది . వణుకుతోన్న శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ గబగబ వచ్చి వారిజ చెయ్యి పట్టుకున్నాడు సత్యనారాయణ.
    "పదమ్మా! నిన్ను రైలెక్కించి వస్తాను --ఇక్కడుండకు నడు. "మతిపోయిన దానిలా నిల్చున్న వారిజ చెయ్యి పట్టుకుని గబగబ బయటకు లాక్కుపోయాడు . లత పెళ్లి వైభవంగా ముగిసింది. పెళ్ళి ఖర్చులూ, అందరికీ పెట్టిన బట్టలూ , అవన్నీ చూసి ఆశ్చర్యపోయారు శంకరం, కళ్యాణి.
    "పాపం ఎక్కడయినా అప్పు చేశారేమో!" అంది కళ్యాణి.
    "వద్దంటే చిన్నబుచ్చుకుంటారు. అయినా చెప్పి చూడు" అన్నాడు శంకరం.
    "మనలో మనకి ఇవన్నీ ఎందుకు పార్వతీ! యేవో మాములు బట్టలు పెడితే పోలేదా?" అంది కళ్యాణి.
    "మాకింకా ఎవరున్నారు కళ్యాణీ , లతనైనా సుఖపడనీ! పెట్టడానికైనా ఎవరున్నారు? మా సంతోషం కోసం మీరు తీసుకోండి" అంది పార్వతి. కళ్యాణి ఇంకేం మాట్లాడలేదు. తనకు పెట్టిన సూట్ తీసుకోలేదు రామచంద్ర.
    "పల్లెటూళ్ళో పొలాల మధ్య తిరిగే వాడిని నాకు సూట్ ఎందుకు?" అన్నాడు. ఎవరెంత బలావంత పెట్టినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆ సూట్ రవి తోడుకున్నాడు దర్జాగా.
    ఒంటి నిండా నగలతో మెరిసిపోతున్న కూతుర్ని, కూతురు పక్కన కూర్చున్న రామచంద్రనీ కళ్ళ పండుగగా చూసుకుంది.
    తృప్తిగా ఆశీర్వదించాడు సత్యనారాయణ. కానీ ఆయనకా క్షణంలో పాలిపోయిన ముఖంతో జీవం లేని కళ్ళతో గుమ్మం దాటిపోతున్న వారిజ కళ్ళలో మెదిలి, కళ్ళ నిండా నీళ్ళు నిండాయి. చప్పున తుడుచుకున్నాడు.
    కోడలని చూసుకుని మురిసిపోయింది కళ్యాణి. మిగిలిన లాంచనాలన్నీ ముగిశాక లతను తీసుకుని వెళ్ళిపోయాడు రామచంద్ర. లేని ఓపికతో లత పెళ్ళిలో తిరిగిన సత్యనారాయణ ఆరోగ్యం పూర్తిగా నాశనమయింది గుండెల్లో నొప్పి తీవ్రమయింది . ఒక్క అడుగు వేస్తె తేలిపోతోంది.
    "నేను వారిజ దగ్గర కేళ్తున్నాను " ఉన్నట్లుండి అన్నాడు సత్యనారయణ. తెల్లబోయింది పార్వతి. "దాని దగ్గర కెందుకూ?"
    "చూడాలనుంది వెళ్తున్నాను" ఇంకేం వాదించలేదు పార్వతి. పార్వతికి ఒంట్లో బాగుండటం లేదు. అయినదానికీ కానీ దానికీ సత్యనారాయణతో వాదించడానికి ఓపిక లేకపోయింది.
    తలుపు తట్టిన చప్పుడుకు విసుగ్గా తలుపు తెరచిన వారిజ తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది. "నాన్నా! " అంది ఇంకేం మాట్లాడలేక.
    ఆయాస పడిపోతున్న సత్యనారాయణ నేరుగా వచ్చి మంచం మీద కూర్చున్నాడు. తండ్రికి ముందు గ్లాసుతో మంచినీళ్ళిచ్చి "ఏంటి నాన్నా!" అంది . ఆ మంచినీళ్ళు తాగి అయిదు నిమిషాలు అలా సోలిపోయినట్లు కూర్చున్నాడు సత్యనారాయణ. తరువాత వారిజ వంక చూసి వాత్సల్యంగా నవాడు.

 Previous Page Next Page