"కావాలంటే మీరు చేసుకున్నది మీరు తాగండి బాబు! ఈ పానకం నేను తాగలేను . నేను మళ్ళీ పెట్టుకుంటాను.' అంటూ వంటింటిలో కెళ్ళి పోయింది. తన గ్లాసులోది , లత గ్లసులోది కూడా కాఫీ అంతా అవతల పారబోసి పక్క మీద వాలి కళ్ళు మూసుకున్నాడు రామచంద్ర.
లతను ప్రేమించి ప్రేమింపబడాలని రామచంద్ర తన హృదయాన్ని శృతి చేసుకుంటుండగానే అవసరాలు వినిపించేస్తున్నాయ్. వాటిని సర్దుకోడానికి మధన పడుతున్నాడు.
పది నిమిషాల్లో లత కాఫీ తాగుతూ రామచంద్రం దగ్గర కొచ్చింది . "ఇదీ కాఫీ అంటే! ఎంత బాగుందను కున్నారు.?"
"మరి నాకేది?"
"మీరు చేసుకున్నది మీకు బాగుందిగా! నామట్టుకే పెట్టుకున్నాను. "కాఫీ తాగుతూనే అంది. "పోనీ సగం తీసుకోండి" అంటే బాగుండునని ఆశ పడ్డాడు రామచంద్ర. ఆమె అలా అని వుంటే "నాకొద్దులే నువే తాగు.." అని వుండేవాడు. కానీ లత మాట్లాడకుండా కాఫీ తాగి ఖాళీ గ్లాసు తీసుకుని వెళ్ళిపోయింది.
ఒక్క నిట్టుర్పు విడిచి పొలం మీదికి బయలుదేరాడు రామచంద్ర.
-----------
రామచంద్రకు బాగా జబ్బు చేసింది. తను స్వయంగా దగ్గిరుండి సేవలు చేస్తోంది. అతని శారీరక బాధనంతా తన సపర్యలతో , అనునయ వాక్యాలతో మరిపిస్తోంది. తన కళ్ళలోకి చూస్తూ, తన కబుర్లు వింటూ, తనకు జబ్బు రావటం కూడా ఒక అదృష్టమే అనుకుంటున్నాడు రామచంద్ర.
రామచంద్రకి జబ్బు నయమైంది. తనకూ, రామచంద్ర మధ్య సాన్నిహిత్యం ఎక్కువయింది. తన మనసునూ మమతనూ అర్ధం చేసుకున్న రామచంద్ర తన గత చరిత్రలోని మాలిన్యాన్ని క్షమించి మరఛి పోగలిగాడు.
"వారిజా! నిన్ను ప్రేమిస్తున్నాను.....గాడంగా.....అతి గాడంగా - కావాలి. నువు కావలి నాకు. నీతి నియమాలు , సంఘము, మంచి చెడ్డలూ ఇవేమీ అక్కరలేదు. నువు చాలు -----రా! నాలో కలిపేసు కుంటాను.
అంటూ తనని దగ్గిరిగా లాక్కొని కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేశాడు. అతని వూపిరి వెచ్చగా తనకు గిలిగింతలు పెడుతుంది. అతని పెదవులు తన పెదవులను బలవంతంగా ఒత్తు కుంటున్నాయి. తమలో అమృతాన్ని నింపి తన నుండి మధువును లాక్కుంటున్నాయి . ఏదో తమకంతో లాలనతో పెదవులు తన ముఖమంతా తడిమాయి. మెడ మీద చక్కిలిగింత పెట్టాయి. అతని చేతులు తన శరీరం మీద బిగుసుకుంటున్నాయి. నడుమును చుట్టుకొన్న అతని చేతులు మీదకి లేస్తున్నాయి. తన జాకెట్ హుక్స్ తెగిపోయాయి. తన ..........
"వారిజా!' అన్న రవి పులుపుకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది.
"వారిజా! నీ దగ్గర ఒక పది రూపయలుంటే ఇవ్వు వారిజ."
"పది పైసలు లేవు. ఒకపక్క అప్పు తీర్చాలి ఈ నెలలో ఇప్పటికప్పుడే మీకు వందపైగా యిచ్చాను." కసురుకుంది వారిజ.
రవి చిన్నబుచ్చుకుని "పోన్లే! అమ్మ మందు కోసం అడిగాను. వెళ్తాను. ఎవరెలా చస్తే నీకేం ?" అన్నాడు.
'అవును ఎవరెలా చచ్చినా నాకక్కరలేదు. నాచావు మాత్రం మీకందరకూ కావాలి!" అంటూ వారిజ లేచి, మిగిలిన సగం నేలకూ తనకు అయిదు రూపాయలు మాత్రం మిగిల్చుకుని అయిదు రూపాయలు రవి చేతిలో పెట్టింది.
రూపాయలు కంటబడగానే రవి ముఖం వికసించింది. వారిజ నిష్టూరాలు గాలి కెగిరిపోయాయి. "వస్తాను వారిజా!" అంటూ హుషారుగా వెళ్ళిపోయాడు . రవి రాకతో తెగిపోయిన ఆలోచనలన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి ఆమెకి. శరీరం జలదరించింది.
"ఛీ! ఛీ!" అనుకుంది. ఏమిటీ ఆలోచనలు? తన మనసు ఇంత క్షుద్రమైందా రామచంద్ర సాన్నిహిత్యాన్ని పొందడం కోసం అతనికి తీవ్రమైన జబ్బు చెయ్యాలని కామక్షిస్తుందా? వేడిగా కాలిపోతున్న తన శరీరాన్ని, ఎగసి ఎగసి పడుతున్న రొమ్ముల్ని చూసుకొని అదిరిపడింది వారిజ. తన శరీరం యింకా యింత కామాన్ని వాంచిస్తోందా? అశాలన్నీ అణగిపోయాయనుకోవటం కేవలం రామచంద్ర ధ్యాసతో మాత్రమే సంతృప్తి పడగలననుకోవటం - ఇదంతా ఆత్మవంచనా? ఎలా జయించాలి ఈ కామాన్ని ? తన బ్రతుకుకి విముక్తి లేదా? చటుక్కున వారిజకు స్పురించింది.
ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలను తన మనసును ఆక్రమించుకోవడానికి ప్రధానమైన కారణం సోమరితనము, తనకు మొదటి నుంచి ఉక్కిరిబిక్కిరిగా పని చెయ్యటం అలవాటు. సినిమా రంగంలో ఉన్నప్పుడు సరేసరి. మొన్నటి వరకు బి,ఏ చదువుతో సరిపోయింది. ఇప్పుడు ఏ పని లేకపోయేసరికి ఈ మనసు ఇష్టం వచ్చినల్టు పరుగులు పెట్టేస్తోంది. లోలోపల నిద్రాణంగా వున్న పాశవిక శక్తులు నుండి మానవుడి కసలు విముక్తి లేదు. ఇవి సంపూర్తిగా నాశనమవటం అంటూ ఉండనే ఉండదు. రక్త మంసాలలో ఒక భాగంగా శరీరంలో ఇవి జీర్ణించుకు పోయే ఉంటాయి. మానవుడు చేయగలిగిందల్లా వీటిని అణచి ఉంచటమే!
ఏ మనిషికైనా సోమరితనాన్ని మించిన శత్రువు లేదు. సోమరితనం జడత్వానికి దారితీస్తుంది. ఈ జడత్వం పశుత్వం కు పునాది. లాభం లేదు. ఇంకా తను సోమరిగా వుండకూడదు.
ఆ రోజు నుంచి వారిజ అనేక ఉద్యోగాల దరఖాస్తులు పెట్టసాగింది. లైబ్రరీలన్నీ తిరిగి మంచి పుస్తకాలు సంపాదించి చదవటం మొదలు పెట్టింది. ఒకరోజు అలవాటుగా పేపరులో "కావలెను" ప్రకటనలు చూస్తుండగా రామచంద్ర ఊళ్ళోనే కొత్తగా పెట్టిన ఆడపిల్లల బళ్ళో టీచర్ కావాలని ప్రకటన కనిపించింది. వారిజ హృదయం విపరీతమయిన ఆవేశంతో స్పందించింది. వెంటనే దరఖాస్తు రాసింది.
ఎందుకు తననంతగా అసహ్యించుకుంటున్న రామచంద్ర దగ్గిరకు ఎందుకు మళ్ళీ? రంపపు కోత తప్ప తను బావుకునేది ఏమి ఉంటుంది?
అతని తిరస్కారం తనను ఎంత చిత్రవధ చేసినా ఒకసారి అతనిని చూడాలని తన మనసెంతగా తపించిపోతోంది. తీక్షణమైన అతని కన్నులనీ, నిర్మలమైన అతని నవునీ ఒక్కసారి దర్శించుకో గలిగే అదృష్టం లభిస్తే మరో ఇంత అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తే మాత్రం ఏం?
తనని విపరీతంగా దేషించే మనిషిని తను ఎంతగా అరాదిస్తే మాత్రం ఏం లాభం?
రామచంద్రకు తన మీద దేషమేనా? ఇంకేమీ లేదా! ఆనాడు తను చివరిసారిగా సెలవు తీసుకున్నప్పుడు గుమ్మం వరకూ అతడ్ని నడిపించి తీసుకొచ్చిన అదృశ్య శక్తి ఏమిటి? ఆనాడు అతని కనుకొలకుల నిలిచిన నీటి బిందువులకు అర్ధం ఏమిటి?
వారిజ దరఖాస్తు కవరులో పెట్టి అంటించి అడ్రస్ రాసింది. వెంటనే చింపేసింది. మళ్ళీ రాసి మళ్ళీ కవరులో పెట్టి పోస్టాఫీస్ దాకా వెళ్ళి పోస్ట్ బాక్స్ లో వేయడానికి బదులు చెత్త డబ్బాలో పారేసి వచ్చింది. కొంచెం సేపాగి మళ్ళీ రాసింది. ఈసారి పోస్ట్ డాబ్బాలో పడేసి, వేగంగా స్పందించే గుండెలతో సమాధానం కోసం ఎదురు చూడసాగింది.