"మన ప్లాట్లలో గుడిసెలు ఉన్నాయేమిటి?" భయంగా అడిగాడు రంగారెడ్డి.
"అదే ఆశ్చర్యంగా ఉంది. మనం కొని ఎన్నోరోజులు కూడా అవలేదు" దిగులుగా అన్నాడు శాయిరామ్.
"పదండి! వాళ్ళెవరో ఏమిటో కనుక్కుందాం!" కోపంగా అన్నాడు గోపాలరావ్.
అందరం గుడిశెలకు సమీపంగా వెళ్ళాం.
బాగా దగ్గరకెళ్ళాక మాకు కనిపించినయ్ రెండుబోర్డులు పక్కపక్కనే!
ఎన్టీఆర్ నగర్! రాజీవ్ గాంధీనగర్!
కొంతమంది ఆ గుడిశెల ముందు కూర్చుని ఏదో చర్చించుకుంటున్నారు. వాళ్ళ దగ్గరకు నడిచాం అందరం.
"ఎవరివయ్యా ఈ గుడిశెలు?" అడిగాడు గోపాల్రావ్ ధైర్యం తెచ్చుకుని.
అందరూ మాట్లాడుకోవటం ఆపి మా వేపు విచిత్రంగా చూశారు గానీ ఏమీ మాట్లాడలేదు.
"మిమ్మల్నేనయ్యా అడిగేది?ఎవళ్ళవీ గుడిశెలు?" తనూ గట్టిగా అరిచాడు యాదగిరి.
"మావే! ఏం సంగతి?" ఒకడు మావేపు సీరియస్ గా చూస్తూ అడిగాడు.
"ఏం సంగతేమిటయ్యా! మా వాళ్ళందరం కలసి ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటే మీరందులో గుడిశెళు వేస్తారా? ఎవర్నడిగి వేశారిక్కడ?"
ఈసారి కొంతమంది గుడిశెల్లోని స్త్రీలూ, పిల్లలూ బయటికొచ్చి మూగారు మా చుట్టూ కూర్చున్న వాళ్ళల్లో ఒకతను లేచి మా దగ్గరకొచ్చాడు.
"ఈ ఇండ్ల స్థలాలు మీవా?" వెటకారంగా అడిగాడు.
"అవ్!"
"అయితే ఇండ్లెందుకు కట్టలేదయ్యా?"
"మా ఇష్టమొచ్చినప్పుడు కట్టుకుంటామయ్యా! మీకెందుకా సంగతి?"
"మా కిప్పుడే ఇష్టమయినాది. మేం కట్టినాం! మీకేమాయే మళ్ళా?"
"కట్టుకో కానీ నీ స్థలంలోనే నువ్వు కట్టుకోవాలయ్యా!"
"ఇది మా జాగానే! ఎవళ్ళు కాదంటారు?"
మేము అదిరిపడ్డాము.
"ఆ! ఇవి మీవా?"
"అవ్!"
"ఏవి? డాక్యుమెంట్స్ చూపించండి"
"నువ్వెవళ్ళు అన్నీ సూపనికి? ఇది మా జాగా! మేము కట్టుకున్నాం"
యాదగిరికి వళ్ళు మండిపోయింది.
"ఏయ్! ఈడ కెళ్ళి గుడిశెళు తీస్తారా లేదా?"
"ఏయ్ నీకేం దమాకున్నాది బే? నువ్వెవళ్రా- గుడిశెళు తీయ మననికి?"
"ఏందిరా! దమాకున్నదా అనడుగుతావ్ బే- సాలే! ఈ జాగాలో ఇండ్లు కట్టి ఇంకా మీదికెళ్ళి నకరాలు జేస్తున్రు బే" అంటూ యాదగిరి వాళ్ళ మీదకు వెళ్ళబోయాడు కానీ మేము వెనుకకు లాగేశాం.
ఎందుకంటే అవతల వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంది.
"మనం మంచిగ జెపితే వినరన్నా! మనమే ఈ గుడిశెలన్నీ పీకిపారేయాలి. అప్పుడుగానీ సుధరాయించరు కొడుకులు-"
యాదగిరి మాటలు పూర్తి కాకుండానే అందరినీ వెనక్కు నెట్టుకుంటూ, తాగిన మైకంలో తూలుతూ లావుగా, పొడుగ్గా ఉన్న ఓ వ్యక్తి మా ముందుకొచ్చి నిలబడ్డాడు.
"ఏమ్ బిడ్డా! గీ ఇండ్లన్నీ పడేస్తావ్? అంత ధైర్యమున్నది బే నీకు?" ఆడిగాడతను కోపంగా.
అతన్ని చూసేసరికి మా గుండెల విసిపోయినయ్.
అతను మరెవరో కాదు. తరచుగా ఆ ఏరియాలో తనసైన్యంతో వీరవిహారం చేసే పాండూ దాదా!
యాదగిరి కూడా అతనిని చూడగానే చల్లబడిపోయాడు.
"అది కాద్సార్! ఇవన్నీ మా ఇండ్ల స్థలాలు! అందులో వీళ్ళు గుడిశెళు వేస్తే ఎలా?"
"ఇది గవర్నమెంట్ లాండ్! మీరెట్లా కొంటారువయ్యా?"
"గవర్నమెంట్ లాండ్ కాదు! భూపాల్ రెడ్డి దగ్గరకొన్నాం! ప్రైవేట్ లాండిది! కావాలంటే మీకు డాక్యుమెంట్స్ తెచ్చి చూపిస్తాం"
అతను ఓ క్షణం ఆలోచించాడు"
"మరి మావోడు గవర్నమెంట్ లాండ్ అని జెప్పిండే! ఇగో! ప్రైవేట్ గానీ, గవర్నమెంట్ గానీ దాన్తోటి మనకేం పనిగానీ ఆళ్ళు గరిబోళ్ళు! గుడిశె లేసుకున్రు! ఆళ్ళ నిప్పుడు పొమ్మంటే ఏడకు బోతారువయ్యా!"
మా గుండెల్లో రాయిపడింది.
"మేము మాత్రం పైసులన్నోళ్ళం కాదు కదండీ! గవర్నమెంట్ సర్వెంట్స్ మి! మా గతేం కావాలి మరి?"
"మీ గవర్నమెంటోళ్ళకు పైసలకేం తక్కువ? కాగితం కదలాలంటే పైసలు- కదలొద్దంటే పైసలు! ఇగో సూడు! మీరింకొక దిక్కేడయిన వేరే జాగాలూ కొనుక్కోండ్రి గాని ఈడకు రావద్దు! సమజైందా?"
"ఇదన్యాయమండీ! మేము చెమటోడ్చి సంపాదించుకున్న డబ్బుతో ప్లాట్లు కొనుక్కుంటే మీరిలా గుడిశెలేయిస్తే ఎలా? మర్యాదగా ఈ గుడిశెళు తీయకపోతే పోలీస్ కంప్లయింటిస్తాం. ఆ!" ధైర్యం చేసి హెచ్చరించాడు శాయిరామ్.
పాండూ దాదా పగలబడి నవ్వాడు.
"నీయవ్వ! ఇంత బేవకూఫ్ గాళ్ళేమయ్యా మీరు! పోలీస్ కంప్లెయింటిస్తారు? వాండ్లేం జేస్తరువయ్యా? వచ్చి గుడిశెళు తీస్తారు?"
మేమంతా రంగారెడ్డిని కోప్పడ్డాం! రౌడీల దగ్గర పోలీసుల పేరెత్తితే వాళ్ళు మరింత రెచ్చిపోతారని మాకు తెలుసు. పోలీసుల మీద కోపంతోనూ, ఇతర గూండాల మీద కోపం తోనూ హైదరాబాద్ లోని చాలామంది గూండాలు ఊరికే దారినిపోయే వారందరినీ పొడిచి పారెయ్యటం మేము ప్రత్యక్షంగా చూశాము. ఎన్నో సందర్భాల్లో వాళ్ళ చేతికి దొరక్కుండా తప్పించుకున్నాం కూడా.
"సారీ సార్! మారంగారెడ్డికేం తెలీదు! అతని మాటలు పట్టించుకోకండి! పోలీసోళ్ళేం జేస్తారండీ? వాళ్ళేం దాదాలా? గుడిశెళు ఏయించటానికి పీకటానికీనూ?" సర్ది చెప్పాడు శాయిరామ్.
"ఇగో! మంచిగ చెప్తున్నా ఇనండ్రి! ఈ గుడిశె లీడకెళ్ళి తియ్యనికయితే గాదు. నేనొక్కసారి గుడిశెలేయించి నానంటే ఇంక చీఫ్ మినిష్టర్ గాదు ప్రైమినిష్టరొచ్చినా గాని తియ్య! సమజయిందా?"
"అయింది సార్!"
"అయితే ఇంక పోండ్రి మరి"
ఇంక లాభం లేదని నేను కల్పించుకున్నాను.
"చూడండి భాయి సాబ్! మేము మీ ఏరియాలో మీ దయమీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళం! ఏనాడూ మేము పోలీసుల్నిగానీ, ప్రభుత్వాన్ని గానీ నమ్ముకున్న వాళ్ళం కాదు. కావాలంటే మా ఏరియాలో వుండే శంకర్ దాదా నడగండి! అతనేం జేస్తే అది చేసేటోళ్ళం. కనుక మా పరిస్థితి కూడా మీ రాలోచించాలి మళ్ళీ ఇంకో స్థలం కొనే తాహతు మా దగ్గర లేదు. మీరు నమ్ముతారో నమ్మరో గానీ చాలామంది మా కాలనీవాళ్ళు భార్య మెడలో వున్న గొలుసులు కాస్తా తాకట్టుపెట్టి ఈ స్థలాలు కొనుక్కున్నాం."
ధీనంగా మాట్లాడాను.
మేమాశించిన ఫలితం కనిపించిందతని మొఖంలో.