మాకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయ్.
కోపంగా మాకా స్థలాలు చూపించిన బ్రోకర్ వేపు చూశాం.
అతను తడబడ్డాడు.
"అబ్బే! మన స్థలాల్లో ఏం ప్రాబ్లమ్ లేదు సార్! వందడుగుల్లోపే నీరు పడుతుంది."
"నీకెలా తెలుసా విషయం?"
"వాటర్ డివైనర్ తో టెస్ట్ చేయించాం"
"మరి వాళ్ళూ ఆ టెస్ట్ చేయించారుగా"
"ఇదిగో చూడండి సార్! తీసుకుంటే తీసుకోండి. లేకపోతే లేదు. మీరు గాకపోతే ఇంకోళ్ళ కమ్మేస్తాను" అన్నాడతను కోపంగా.
ఆ తరువాత ఇంకో రెండు స్థలాలు చూశాక చివరికి విజయాద హైవేలో ముప్పయ్ కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థలాలు తీసుకున్నాం అందరం. రంగారెడ్డికి ఉచితంగా సంక్రమించిన స్థలం అక్కడే ఉండటం ఒక కారణం. ఆ ఏరియా తాలుకూ డెకాయిట్ గాంగ్ లీడర్ మా గోపాల్రావ్ కి బాగా తెలిసినవాడు. అతని ఇంటర్ వ్యూ ఒకటి గోపాల్రావ్ ఈ క్షణం డెయిలీ పత్రికలో పబ్లిష్ చేశాడు. నాలుగో కారణం అక్కడ ఇండస్ట్రీస్ లేవు! కనుక చెడుగాలీ, చెడు నీరూ ఉండదు. అయిదో కారణం ఆ ఏరియా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయే అవకాశం ఉందని చాలా మంది అంచనా! ముఖ్యమంత్రి అయితే ఇంకా ఈ ఏరియా ఎలా డెవలప్ అయిపోతుందో మాకు బాగా తెలుసు.
చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనింటి కెళ్ళేదారి విశాలంగా చక్కని పూల మొక్కలతో నిండిపోవటం మేం చూశాం. అంజయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనున్న ఏరియా ఎలా బాగుపడిందో మాకు తెలుసు. అలాగే ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రి అవగానే గండిపేట రోడ్ ఎలా ఠకీమని మారిపోయిందో కూడా మేము చూస్తూనే ఉన్నాం.
పెళ్ళాల నగలు తాకట్టుపెట్టి పి.ఎఫ్. లోన్లు, సొసైటీ లోన్లు అన్నీ తీసుకుని స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాం. ఆ తర్వాత హౌసింగ్ లోన్ కోసం అందరం అప్లయ్ చేశాం.
హౌసింగ్ లోన్ అంటే చాలా తేలిగ్గా వస్తుందని మేమనుకున్నాం. కాని దానివల్ల మనిషి ఎంత నరకం అనుభవిస్తాడో మాకు అప్పుడే తెలిసింది. మా డిపార్ట్ మెంట్ వాళ్ళే మమ్మల్నంత హింసలు పెడతారని మేము కలలో కూడా అనుకోలేదు.
ముందు అర్భన్ లాండ్ డెవలప్ మెంట్ అథారిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తెమ్మన్నారు తర్వాత హుడా క్లియరెన్స్ అన్నారు. అంతే! హుడా ఆఫీస్ చుట్టూ రెండేళ్ళు తిరిగాం తర్వాత నాన్ ఎన్ కంబరెన్స్ అన్నారు. దాని తర్వాత పహాణి పట్టా అన్నారు.
దురదృష్టవశాత్తు మనకి సర్టిఫికెట్స్ ఇచ్చే ఆఫీస్ లన్నీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉన్నాయ్.
మరి స్టేట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో సర్టిఫికెట్లు సంపాదించాలంటే ఎంతటి భయంకరమయిన పరిస్థితిల్లో చిక్కుకు పోతామో మా అందరికీ తెలుసు. ముందు వాళ్ళు మనల్ని ఉసుళ్ళు అనే పురుగుల్ని చూసినట్లు చూస్తారు.
'ఏం కావాలి?" అని అసహ్యించుకుంటూ అడుగుతారు.
"అప్లికేషన్ ఇచ్చిపో" అంటూ బిచ్చగాడిని కసురుకున్నట్లు కసుర్తారు.
పదిరోజుల తరువాత "ఏం అప్లికేషనూ?" అనడుగుతారు.
మనం ఈసారి వందనోట్లు ఒకటో రెండో ఇస్తాం. ఇచ్చినా గాని సరిగ్గా మాట్లాడరు. తర్వాత కనబడు అంటారు చిరాకుగా మొఖంపెట్టి.
"మేము లంచం ఇచ్చాం కదా?" అంటాం మనం- లంచం సంగతి గుర్తుచేస్తూ.
"ఏమిచ్చావ్?" అంటారు వాళ్ళు ఇంకా చికాకుగా.
"అదే" అంటాం మనం అందరిలో చెప్పటం ఇష్టంలేక.
"అదే అంటే?" అడుగుతారు వాళ్ళు.
"మీకు టూ హండ్రడ్ ఇచ్చాను మొన్న" అంటారు మీరు.
"ఇస్తే వీళ్ళందరూ ఇచ్చినోళ్ళు కాదా? నువ్వేం దిగివచ్చావా? బయట కూర్చో" అంటారు. ఈ బాధలన్నీ అనుభవించాక దేనికయినా ఓ హద్దు ఉంటుందన్న విషయం మాకు తెలిసొచ్చింది. మరి ఆ ఆఫీసుల్లో లంచానికి హద్దులు లేవు గనుక, మా సహనానికి హద్దులున్నాయి గనుక మేం డిపార్ట్ మెంట్ లోన్స్ కోసం పెట్టిన అప్లికేషన్ సంగతి మర్చిపోయాం.
మళ్ళీ ఏవో తంటాలుపడి నగలు తాకట్టు పెట్టి బేస్ మెంట్ వేయటం మంచిదని రంగారెడ్డి సలహా ఇచ్చాడు.
అలా చేస్తే తర్వాత ఆ అప్పులు తీరిపోయాక మళ్ళీ అప్పులు చేసి రూఫ్ వరకూ వేయటం, ఆ తర్వాత మళ్ళీ అప్పులు చేసి మిగతాది కంప్లీట్ చేయడం, సరయిన పద్ధతిని ఇంకొంతమంది కూడా అనేసరికి మేమందరం ఆ కార్యక్రమం అమలు పరచాలని నిశ్చయించుకున్నాం.
ఓ మంచిరోజు చూసుకుని భూమి పూజలు చేయడానికి మా కాలనీ తాలుకూ ఆడా, మగా, పిల్లా, పీచూ అందరం మా స్థలాల దగ్గరకు బయలుదేరాం.
మా ఆడాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు.
"మా స్థలంలో భూమిపూజకెళ్తున్నాం పిన్నిగారూ! ఎప్పటికయినా సొంతిల్లనేది కట్టుకుంటే గానీ సుఖం ఉండదు కదాఅ౧ ఇక్కడ చూడండి! ఈ కాలనీలో అన్నింటికీ నానా చావూ ఛస్థున్నాఅమ౧ ఒక గాలీ, వెలుతురూ లేదు. నీళ్ళు ఉండవ్. ఛఛ!" అంటూ చాలా హాపీగా చెప్పారు.
అయితే బస్ లో హయత్ నగర్ దాటేసరికి వాళ్లల్లో ఉత్సాహం క్రమేపీ తగ్గిపోసాగింది.
"ఇంకెంత దూరమండీ?" అంటూ ఆత్రుతగా అడగ సాగారు.
హయత్ నగర్ లో దిగాక ఇంకో బస్ కోసం నిలబడేసరికి వాళ్ళ కళ్ళల్లో కాంతి పూర్తిగా పోయింది. మొఖాలు వాడిపోయినయ్.
తీరా మరో బస్ లో కొంతదూరం వెళ్ళి అక్కడ దిగి రెండు కిలోమీటర్లు మట్టి రోడ్ మీద నడవాలనేసరికి వాళ్ళకు నీరసం వచ్చేసింది.
"ఏమిటి? అడవిలోనా మీరు స్థలాలు కొన్నది?" అంటూ విరుచుకుపడ్డారు.
"ఇల్లు కట్టుకుని మీ మగాళ్ళే ఉండండక్కడ! మేము ఛస్తేరాము" అనేశారు. ఎలాగయితేనేం అక్కడ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ వస్తోందనీ, ఎనిమిది కాలేజీలూ, రెండు పబ్లిక్ స్కూళ్ళూ ఓ బస్ డిపో, ఓ రింగు రోడ్డూ- ఇలాంటివన్నీ వస్తున్నాయని అబద్ధం చెప్పాక కొంత శాంతించారు.
తీరా స్థలాల దగ్గరకు చేరుకునేసరికి అక్కడి దృశ్యం చూసి మా గుండెలవిసిపోయినయ్.
మా ప్లాట్లల్లో వరుసగా పాతిక గుడిసెలు వేసి వున్నాయ్.
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఎక్కడయినా ఓ గుడిసె కనిపించిందీ అంటే దానర్ధం జంట నగర వాసులందరికీ క్షుణ్ణంగా తెలుసు.
ఆ గుడిసెలో ఓటు హక్కున్న ఓ పౌరుడుంటాడు. అతని వెనుక ఆ ఏరియాలో పేరుమోసిన ఓ గూండా వుంటాడు. ఆ గూండా వెనుక ఆ నియోజకవర్గం తాలూకూ ఎమ్మెల్యేగానీ, ఎం.పీ.గానీ ఉంటాడు. వాళ్ళిద్దరి వెనుకా ఓ రాజకీయ పార్టీ ఉంటుంది. పార్టీ వెనుక ప్రభుత్వం ఉంటుంది.
అందుకే మా అందరికీ సగం ప్రాణాలు పైనే పోయాయి మా అందరికీ మాటపడిపోయింది. చూపు పవర్ తగ్గిపోయింది. కాళ్ళూ చేతులూ సన్నగా వణుకుతున్నాయి.