Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 19


    సుందరమ్మా! ఇంక మనస్నేహం అసంభవమని రూఢిపడ్డ ఆ రాత్రి చైనాదీపంకింద కొత్తపందిట్లో నువ్వు చూచినచూపు యెందుకొ యీ సముద్రంమీద అర్దరాత్రి అర్ధచంద్రుడుదయించి\నప్పుడల్లా జ్ఞాపకం వొస్తుంది. సంవత్సరమంతా నిన్ను మరిచినా అట్లతద్ది రాత్రి తెల్లారకట్ట పిల్లలు కేకలు వేసే సమయాన నా పక్కలో వొచ్చికూచుని,
    "మరిచిపోయినావా?" అని జాలిగా పలకరిస్తావు.
    ఈ విశాల ప్రపంచంలో అనంతాకాళం విశాల సముద్రం ఎడ తెగని యీ యిసికబయలు వెనక యీ తుప్పలు- వీటి అన్నిటిలోనూ నా శరీరంలో మాత్రమే "నేను" అనే భావం. నేను యేమిటి? ఇదంతా ఏమిటి? అనుకోడం అదేనా భేదం? ఈ 'నేను' లేకపోతే నేనూ ఒక రాయినే, నిద్రపొయ్యే ఒక యిసక రేణువునే. సూర్యుడిలో మెరుస్తాను, వెన్నెట్లో తళతళ మంటాను-నాకేమీ తెలీదు. ఆనందిస్తున్నాననే భావం వుండదు....ఎందుకో యీ వేదాంతంలో పడగానే మాటలకి తడుముకుంటాను.......నీళ్ళలో కనపడని చాపలకి నా చుట్టూ సాయంత్రంపు గాలిలో కళ్ళెత్తి చూసే పీతలకి, "నేను" అనే భావం వుందేమో! దీని అంతటినించీ భిన్నమా నేను? ఆనందిస్తున్నాను యీ చుట్టూవున్నదాన్ని! ఆ దినాన్నించి వేరు అనే భావం ఎట్లా యేర్పడ్డదో! దానిలోనించేకదా నేనిట్లా వేరుపడ్డది! వేరుపడ్డానా, లేక వేరు పడ్డానని అనుకుంటున్నానా?
    కాని యీ చుట్టూ నిద్రపోతున్న ప్రపంచం....కాని నిద్రపోతోందా? దొర్లే అలలు, వీసే గాలి, అలలమీద రత్నాలకింద ముక్కలయ్యే యీ అస్తమయ కిరణాలు, వెనకగా సముద్రాన్ని పసుపుగామార్చే ఆ పెద్దమేఘం యివన్నీ నిద్రపోతున్నాయా? ఆ మేలుకున్నాయనే భావం నా హృదయంలోనేనా?
    ఒకవేళ నావలెనే నా చుట్టూవున్న ఆకాశం "నేను" అంటోందేమో!' అనగలడేమో! నావలెనే "నన్ను" అనేసి మరిచి నిద్రపోతుందేమో! ఆ సూర్యుడు "చూస్తున్నాను" "బావుంది" ఇట్లాంటి భావాన్ని పొందగలడేమో! వీటినన్నిటినీ కలిసే ఒక హృదయం ప్రపంచానికంతా కలిసి "నేను" అనేవి వుందేమో! నా హృదయంలోని "నేను" అనే శబ్దం ఆ విశ్వఆత్మ ప్రతిధ్వనేనేమో! ఆ విశాల అహం, ప్రతిచోటా ప్రతి  అణువులోనూ యిట్లా ధ్వనిస్తుందేమో, హృదయంలో రక్తప్రసరణ ఘాతం, ప్రతి నాడిలోనూ వినపడ్డట్టు!
    ఈ సముద్రం నేను రాగానే నన్ను గుర్తుపట్టి ఆహ్వానిస్తుందా? 'నిన్ను చూస్తున్నాను' అంటుందా, అనుకుంటుందా? ఈవాళ నీలంగా వున్నావు సముద్రమా అని నేనన్నట్టు, యీ సముద్రం నన్నుచూసి "ఎంత బావున్నా"వని కళ్ళలో మెరుగు చూపుతుందా, నా చిన్ని చిన్ని చి__వలె అదేనేమో జీవబ్రహ్మల సంయోగమంటే ఆ సముద్రం "నీ రాక నాకెంత ఆనందం" అనడం వినగలిగితే చి___చూపులో శబ్ధాలు నేను విన్నట్లు. Light ని sound గా మార్చడానికి టాకీ యంత్రాలెందుకు, నా హృదయం చాలదూ? ఒక్క నా చి__లో దే గాక ప్రతి స్తలంలో సృష్టిలో నన్ను చూసి గుర్తించి ఆహ్వానించే ఆనందం నేను తెలుసుకో గలిగితే యింక మనుషులెందుకు నాకు?
    కాని వుంది ఆ ఆనందం లేకపోతే నాకీ ఆనందం కలగదు. నన్ను చూసి ఆనందపడని జడురాలినించి నాకేం ఆనందం కలుగుతుంది? ఈ ప్రపంచమే నా ప్రియురాలు ఘోరరాత్రి ఆమె శిరోజం, యీ కిరణాలే ఆమె హస్తాలు, యీ వూగే అలలే ఆమె పక్షం, యీ ఇసిక ఆమె తొడలు-ప్రపంచమే నా ప్రియురాలు.
    చి___ని చూసినకొద్దీ ఆమెలో నాకీ ప్రపంచ సౌందర్యం కనిపిస్తోంది. ప్రపంచ సౌందర్యంలో ఆమె కనబడుతుంది. ఇట్లా రెండు రూపాలూ కలిసిపోకూడదా? అప్పుడు ఆమె సంసారమూ నీతి నిబంధనలూ, లోకమూ, ఆమె విచారమూ ఏమీ వుండవు, అంటవు. ఇంక ఆమెని నేను అంత ఆతృతగా, దాహంతో కోరనక్కర్లేదు. మోహమనే తాపజ్వరాన్నించి విముక్తి కలుగుతుంది. కాని ఆమెకి ఆమెకోరే ఇంత కోర్కె, యింత తాపం, యింత పూజ, ఆమె హృదయంలోనూ వుందా? వుందనుకునే నా హృదయంలో నేనా? పిచ్చివాడి మనసులోవున్న మహారాజ్య పదవుల్లాగు. అట్లా చూస్తే పిచ్చివాడికీ, సాధారణుడికీ మాత్రం యేం భేదం? మనదీ imagination అతనికీ అంతే. ఇంకొంచెం దూరం పోయింది.
    ఇట్లా లేనిబాధలు నేను ప్రేమించిన స్త్రీలు నా కోసం పడుతున్నారని యోచించుకుని ఎన్ని అపాయాల్లోకి నడిచాను, వేదనలతో గడిపాను అర్ధరాత్రులు!
    మొదట చి___తన కళ్ళతో చెప్పింది నాకు యీ విశ్వప్రేమ విషయమై. సాధారణ ప్రేమవాక్యాలు నా నాలిక చివరికి వచ్చాయి. ఇన్ని నెలలనించి నిన్ను ఆరాధిస్తున్నాను అనబోయినాను.
    కాని ఆమె నన్ను నిరాకరిస్తే? జంకితే? అదికాదు నా వుద్దేశ్యం అంటే? ఇంకా ఆమెనిచూసే భాగ్యంకూడా తప్పిపోతుంది. ఆ కంఠంలో, ఆ వాక్యాల్లో (ఆమె యేదో కొత్తగా ప్ర్రారంభిస్తుంది వాక్యాల్ని) ఆ అందంవిసే భాగ్యంకూడా పోతుంది.
    అంతకన్నా భయం-నన్ను, నా ప్రేమని అంగీకరిస్తే- నా కలే బద్దలైపోతుంది. సాధారణ ప్రియురాళ్ళవలె నన్ను ఆహ్వానిస్తే! నా భుజంమీద తలఆనించి నా ముఖంవంక ఆ నేత్రాలతో చూస్తే! నా కలంతా పటాపంచలవుతుంది. ఎంతో అందమూ ఆకర్షకమా అనుభవం. కాని ఆశయాలతో కలలు కన్న నా హృదయం ఏడుస్తుంది. వీల్లేదు. ఆమె నావంటి క్షుద్రుల్ని అంగీకరించకూడదు. సాధారణ మోహానికి ఆమె దిగకూడదు. నాకు విశ్వ ప్రేమని అందివ్వాలి. చి___లో కంటికి కనపడే ఆ అసాధారణ సౌందర్యానికి కారణమై ఆ మధుర శరీరంలో, పెదవుల మందహాసంతో ఆ విశాల నేత్రకాంతుల్లో అద్భుతమైన ఆత్మవుండని విశ్వసించి ఆమెని కోరాను. శరీరాన్ని ప్రేమించాను, ఆత్మని ఆరాధించాను.
    "నిన్ను ప్రేమించాను" అనగానే చేతులుజూస్తే, యిదివరకు ఎంతమందో - స్త్రీలు చేసినట్లు!...
    వీల్లేదు.
    నావంటి సాధారణున్ని అంగీకరించిందా! ఎంత సాధారణురాలు! అనుకుంటాను.
    నిరాకరించిందా? ఎంత క్ర్రూరురాలు, అని కోపగించు కుంటాను. ఇంకా ఆమెనెట్లా చూడనని సిగ్గుపడతాను.
    విచిత్రం మానవహృదయం!
    నా ఆరాధన దృష్టుల్ని అంతర్ముఖం చేసుకుని మౌనం పూనడమే ఉత్తమం. కాని నా యీ శరీరం, యీ రక్తం, వూరుకుంటుందా? ఏనాడో నా ఆత్మ ఆజ్ఞలనించి తెంచుకుని ఆమె మీదికి వురుకుతుంది, చీలుస్తుంది, పీలుస్తుంది, తినేస్తుంది, చంపేస్తుంది -- అనుకున్నాను ఆనాడు.
    నేను చూసే చి_లో లావణ్యమంతా నిజంగా చి___లో వుందా? లేక సాధారణ బాలికలో యీ ఆరాధననంతా నేనే కల్పించుకున్నానా? ఏమైతేనేం? పాపయ్య అన్నట్టు సమస్తమూ, మన ప్రేమ అంతా ఆత్మకల్పితం objective నా sublimation కి చి__సౌందర్యం ఆధారం. "నేను, నేను,__ నేను,___నేను" అంతా నేను. ఇంకేం లేదు. చి___, యీ సముద్రం, ఆకాశం, యీ లోకం__అంతా నేనే. నేనే వున్నాను అంతే ఇంకేం లేదు. వుంటేనేం? అదంతా నేనే! ఎంత ఆనందాన్నిస్తోంది ఆ ధ్యాస! భయాలు, బాధలు, మరణం__అన్నీ నేనే!
    ఇంత సౌందర్యాన్ని కల్పించుకో కలిగిన నా మనసు, యింత ఆనందాన్ని కల్పించుకొ గలిగిన నా హృదయం చి___అనే వ్యక్తి లేకుండానే కల్పించుకో లేదా యా ఆనందాన్నంతా! ఆ శక్తి కలుగుతుందా? వుత్తభ్రమా?
    
                                              -------

 Previous Page Next Page