"టచ్ డౌన్ అవుతున్న రష్యన్ చాకేట్ లాగా...." నవ్వుతూ అన్నాడు భవానీశంకర్.
చిరంజీవి మరీ దిగులుపడిపోయాడు. మళ్ళీ కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచినాయ్. హటాత్తుగా భవానీశంకర్ లేచి నిలబడ్డాడు. అతనిలో మంచి చైతన్యం కనబడుతోంది.
"కమాన్ ఫ్రెండ్! గెటప్! హత్ మిలావ్!" అన్నాడు వెలిగిపోతున్న కళ్ళతో.
చిరంజీవి కేమీ అర్ధం కాలేదు.
"ఎందుకు?" అన్నాడు అయోమయంగా.
"ముందు చేయి కలపమన్నానా?" అంటూ చిరంజీవి చేతిని తీసుకుని గట్టిగా కుదిపేశాడతను.
"చూడు బ్రదర్! ఈ క్షణం నుంచీ భవానీశంకర్ అనబడే నేనూ, చిరంజీవి అనేబడే నువ్వూ కలిసి జాయింట్ గా యుద్ధభేరి మ్రోగిద్దాం! కోన ఊపిరున్నంతవరకూ పోరాడి అంతిమ విజయం మనదేనని చాటుదాం!"
చిరంజీవికి అతని మాటలేమీ అర్ధం కావడం లేదు. అయోమయంగా స్వప్న వేపు చూశాడు. స్వప్న కూడా విచిత్రంగా చూస్తోంది. భావానీశంకర్ వేపు.
"ఏ విషయం నువ్ మాట్లాడేది ' అనుమానంగా అడిగాడతను.
భవానీశంకర్ మరింత ఉత్సాహంగా మాట్లాడాడు.
'అదే ఫ్రెండ్! తెలుగు కిరణం సర్క్యులేషన్ చాలెంజ్ ని మనం ఎదుర్కొందాం! ఇవాళ్టి నుంచే రంగంలోకి దూకుదాం! ది గ్రేట్ గోల్డ్ మెడలిస్ట్ భవానీశంకర్ పక్కనుంటే తెలుగుకిరణమే కాదు, ఇంకే కిరాణాన్నయినా దున్నేయగలవ్ బ్రదర్! మనలాంటి 'డేర్ డెవిల్స్ ' కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేయకు-"
అతని మాటలు వింటుంటే చిరంజీవికి కూడా ఎక్కడలేని ఉత్తేజం కలిగింది.
"కాని.....అది....సాధ్యమేనంటావా?" అడిగాడతను.
"అదంతా నాకొదిలెయ్ ఫ్రెండ్! 'తెలుగుకిరణం' కి సంబంధించిన ఆఫీస్ వ్యవహారాలన్నీ నువ్ చూసుకో! దాని తాలుకూ జర్నలిజం , ఎడిటోరియల్ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను - బైదిబై నేను జర్నలిజంలో గోల్డు మెడలిస్ట్ నన్న సంగతి నీకు చెప్పానా?"
"పద్దెనిమిదిసార్లు-"
"దట్సాల్ రైట్! ఇప్పుడ మళ్ళీ చెప్తున్నాను! అయాం భవానీ శంకర్ దిగ్రేట్ ! గోల్డ్ మెడలిస్ట్ జర్నలిస్ట్ ని! అడ్రస్ - ఇవాళ్టి నుంచీ కేరాఫ్ తెలుగు కిరణం. ఓకే?"
"ఓకే!" అన్నాడు చిరంజీవి కొత్త ఆశలతో.
"నువ్వేమంటావ్ చెల్లమ్మా?" స్వప్న నడిగాడతను.
"ఓ.కే !" అందామె చిరునవ్వుతో.
భవానీశంకర్ మాటలు వింటున్నంతసేపూ అమితమైన ఉత్తేజం కలుగుతోంది చిరంజీవి. ఐతే మరో యాంగిల్లో తెలుగు కిరణం పేపర్ నూ, శివతాండవాన్నీ గుర్తుకు తెచ్చుకునేసరికి ఆ ఉత్సాహమంతా విస్కీ తాగిన మరుక్షణమే మజ్జిగ తాగినట్లుగా దిగజారిపోతోంది.
భవానీశంకర్ చిరంజీవి పరిస్థితి గ్రహించాడు. ముందు చిరంజీవికి పూర్తీ నమ్మకం. ధైర్యం కలుగజేయటం తన తక్షణ కర్తవ్యం గా కనిపించదతనికి.
"యస్, మైడియర్ బాయ్! నీ మనసులో ఏవో అనుమాన మేఘాలు కదలాడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఈజిట్ ట్రూ?" అడిగాడతని వంక అనుమానంగా చూస్తూ!
చిరంజీవి ఓ క్షణం నిశ్శబ్దంగా ఊరుకున్నాక తలవంచుకునే తన మనసులోని అనుమాన మేఘాన్ని అతని ముందు వర్షించేశాడు.
"తెలుగుకిరణాన్ని ఎవరూ బాగుచేయలేరూ గురూ!" విచారంగా అన్నాడతను.
"అది మీ మావయ్య అభిప్రాయం! కాని దానిని ఇంకెవ్వరూ చెడగొట్టలేరు అనేది మన అభిప్రాయం! కనుక మనం ఏం చేసినా అది ఎంతో కొంత బాగుపడాల్సిందే తప్ప అంతకంటే చెడిపోయే అవకాశాలు బొత్తిగా శూన్యం-"
అతని మాటల్లో కొంత రీజనింగ్ కనిపించింది చిరంజీవికి నిజమే! దానినింకే మాత్రం చెడగొట్టలేరు. కనక తామేం చేసినా అది చచ్చినట్లు బాగుపడాల్సిందే! అంటే సర్క్యులేషన్ ఎంతో కొంత పెరగాల్సిందే! అంటే తన ఆస్తి తనకు......
"భవానీ....." ఆశగా , ఆత్రుతగా పిలిచాడు చిరంజీవి.
"యస్, మైడియర్ ఫ్రెండ్!"
"తెలుగు కిరణాన్ని మనం లార్జెస్ట్ సర్ల్యులేటెడ్ పత్రికగా చేయగల మంటావా?"
"నిస్సందేహంగా ! నువ్వింక మొఖంలో ఆ అనుమానాన్ను చేరిపెసేయ్! ఒక్కసారి మన సెయింట్ మేరీస్ రోజుల్ని గుర్తు తెచ్చుకో! ఎనిమిది నీటిపాముల్ని ఎంత ధైర్యంతో , ఎంత చాలెంజ్ గా తెచ్చి ప్రిన్సిపాల్ రూమ్ లో పడేశామో మర్చిపోకు! దటీజ్ కాల్డ్ స్పిరిట్! ఆ తెగింపు , ధైర్యం లాంటివన్నీ ఇప్పుడు కూడా ప్రయోగిస్తే - మనకు ఆస్తి దక్కటం - ఆ బూడిద బాబా నోట్లో...."
"బూడిద బాబా కాదు! విభూతి బాబా!"
"యస్! అదే! ఆ విభూతి నోట్లోకి మట్టి గంటకు మూడొందల కిలోమీటర్ల వేగంతో సరఫరా అవటం జరిగి తీరుతుంది! మనలాంటి యంగ్ బ్లడ్ - మనకున్న రివల్యుషనరీ ఐడియాలతో రంగంలోకి దూకామంటే - మనకిక ఎదురనేది ఉండదు! అంతవరకూ ఎందుకు? నేను 'ఆంధ్రఖ్యాతి' డైలీలో వర్క్ చేసినప్పుడు ఏం జరిగిందనుకున్నావ్? మనలో క్రిక్కిరిసిపోయున్న టాలెంట్స్ లో కొన్నింటిని మచ్చుక అలా వదిలాను! అంతే! ఆ ఆఫీసులో సంక్షోభం చెలరేగిపోయింది. చీఫ్ ఎడిటర్ పరేషాన్ అయిపోయాడు. ఓరోజు తెల్లవారు జామునే రూమ్ కొచ్చి - నన్ను నిద్రలేపి కౌగలించుకుని బావురుమని ఏడ్చాడు-"
"ఏడ్చాడా!' నమ్మలేనట్లు అడిగింది స్వప్న.
"చిన్న పిల్లాడిలా!"
"కానీ....అసలు ఏడవటం ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగిందామె.
"తన జీవితకాలంలో అంత గొప్ప జర్నలిస్టుని ఎక్కడా చూడలేదట! అలాంటి గ్రేట్ గోల్డ్ మెడలిస్ట్ ని ఉద్యోగంలోంచి తీసెయ్యటం తన కెంతో బాధ కలిగించిందట! ఆ దుఃఖం పట్టలేక అలా చేశాడన్నమాట!"
"అదేమిటి> ఉద్యోగంలోంచి ఎందుకు తీసెయ్యటం?" అడిగాడు చిరంజీవి.
"నేను ఇచ్చే స్టోరీలు మరీ విప్లవాత్మకంగా ఉన్నాయనీ - ఓ యాభై సంవత్సరాల తర్వాత కావలసిన జర్నలిజం నేను ఇప్పుడే సరఫరా చేసేస్తున్నానని మేనేజ్ మెంట్ అభిప్రాయపడిందట! అది వేరే విషయమనుకో! కనుక నేను చెప్పేదేమిటంటే ...... ఏమిటంటే - ఏమిటబ్బా - బైదిబై - నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నాను?"
"అదే - తెలుగుకిరణం పేపర్ సర్క్యులేషన్ చాలెంజ్ గురించి - " అందించింది స్వప్న.
"కరెక్ట్! కనుక మన కెపాసిటీని తక్కువ అంచనా వేసుకోకూడదు."
"ఆఫ్ కోర్స్ - ఆఫ్ కోర్స్-"అన్నాడు చిరంజీవి మళ్ళీ సెయింట్ మేరీస్ రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ.
"కనుక ప్రియమైన సోదరా! ఈ క్షణం నుంచీ మన బృందగానం ఏమిటో తెలుసా? "జయంబు నిశ్చయంబురా భయమ్ము లేదురా- జంకు గొంకు లేక ముందుకు సాగిపొమ్మురా....' ఈ పాటను ప్రతిరోజూ వినిపించమని హైదరాబాద్ నుంచి భవానీశంకర్ , చిరంజీవి, స్వప్నా వారి మిత్రులు కోరుతున్నారు...."
స్వప్న నవ్వాపుకోలేక నవ్వేస్తోంది.
"మరినేనింక శెలవు తీసుకోవచ్చా? మానవసేవే మాధవ సేవ స్కీమ్ లో ఓ గొప్ప రచయితకు కొంచెం సేవ చేయాల్సి ఉంది! ఆ విషయం చూచుకుని రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా 'తెలుగుకిరణం' డెయిలీ ఆఫీస్ కి చేరుకుంటాను. అంతకుముందే నువ్వక్కడికి చేరుకొని ఆఫీసంతా రంగు కాగితాలతో అలంకరించి, మంగళ వాయుద్యాలతో నాకు ఎదురొచ్చి లోపలకు ఆహ్వానిస్తావన్నమాట! చెల్లమ్మేమో ప్రధాన ద్వారం దగ్గర నా మొఖానికి బొట్టు పెట్టి మంగళహారతి ఇస్తుంది. చిన్నారి పాపలు అరడజను మంది - పూలమాలలు తెచ్చి నా మెడలో వేస్తారు.
అందరం కలిసి మంగళవాయిద్యాలు తోడు రాగా చీఫ్ ఎడిటర్ ఆఫీస్ గది దగ్గరకు చేరుకుంటాం! నేను ఆ సీట్లో కూర్చోగానే బయట భూమి దద్దరిల్లే శభ్దాలతో స్టాఫ్ అంతా బాణాసంచా కాలుస్తారు. ఆ తరువాత నా ఆఫీస్ బయట కోయ్ డాన్స్ జరుగుతుంది...."
ఆ ఉత్సాహంలో ఏదో గుర్తుకు వొచ్చినట్లు టైం చుచుకున్నాడతను.
"మైగద౧ చాలా టైమయిపోయింది - వస్తాను బ్రదర్! ఒకే చెల్లెమ్మా! వెళ్తాను! బైదిబై - నీ చేతి అద్భుతమయిన భోజనానికి మెనీ మెనీ థాంక్స్! అన్నట్లు రేపట్నుంచీ మా ఇద్దరికీ ప్రతి రెండు గంటలకూ ఓసారి పెద్ద టిఫిన్ కారియర్ నిండుగా భోజనం సప్లయి చేయాల్సిన శ్రమ నీకు తప్పదు - అంతగా మేము ఆఫీసు పనిలో మునిగిపోయి ఉంటామన్న మాట!"
"అందులో శ్రమేముంది?"
"దట్ ఘుడ్ బి ది స్పిరిట్! ఆ - స్పిరిట్ అంటే గుర్తోంచ్చింది! మావాడొకడు ఇలాగే ప్రతి మనిషిలోనూ 'స్పిరిట్' ఉండాలి. అన్న దేశనాయకుడి మాటను అపార్ధం చేసుకుని రాత్రింబగళ్ళు స్పిరిట్ తాగటం అలవాటు చేసుకున్నాడు. స్పిరిట్ అంటే అర్ధం 'దెయ్యం' అని వాడిని నమ్మించే సరికి నానా చావూ అయిందనుకో- ఓ - కే- సీయూ - తెలుగుకిరణం ఆఫీస్ - మాణింగ్ ఎయిటో క్లాక్ షార్ప్ -" అనేసి హడావుడిగా బయటకు నడిచాడతను.
*****
'వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది . ఎలాంటి మార్పు వుండదు" అంటూ టీవీ వాళ్ళూ , రేడియో వాళ్ళూ ముక్త కంఠంతో వెదర్ రిపోర్ట్ చాటిన కొద్ది క్షణాలకే బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ ఉరుము గట్టిగా ఉరిమింది. అది వినేసరికి పార్లమెంట్ మెంబర్ ఆర్.భీమారావ్ కి వళ్ళు మండిపోయింది.
టీవీ వాళ్ళ వాతావరణం ప్రశాంతంగా ఉంటుందంటూ చెప్పిన ఫోర్ కాస్ట్ ని నమ్మి తను లాన్స్ లో కూర్చున్నాడు. రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో రాష్ట్రం లో తమ పార్టీ విజయావకాశాల గురించి తను జరిపిన సర్వే రిపోర్ట్ అర్జెంటుగా ఆవేళ తయారు చేసి పార్టీ ప్రెసిడెంట్ కి పంపాల్సి వుంది. ఆ పనిని హాయిగా లాన్స్ లో కూర్చుని చేయబోతుండగా ఆ ఉరుము వినిపించి తన ఏకాగ్రతను భంగపరిచింది. దానికి తోడు ఓ నమ్మమబ్బు ముక్కు కూడా ఆకాశంలో దొంగలా పాకివచ్చి సరిగ్గా ఆర్. భీమారావ్ లాన్స్ మీదే ఆగి- తన పవర్ కి మచ్చుతునకగా ఓ చినుకుని అయన నెత్తి మీదికి గురి చూసి వదిలింది.
'నేను సెంట్రల్ మినిష్టర్నయాక ఈ టీవీ వాళ్ళ పని పడతాను' అనుకుంటూ కోపంగా లేచి పైల్సన్నీ తీసుకుని ఇంట్లోకి నడిచి హల్లో కుర్చున్నాడతను. ఫైల్స్ తెరచి రెండు ముక్కలు రాశాడో లేదో డోర్ బెల్ మోగింది. దాంతో ఆర్. భీమారావ్ కి తిక్క రేగిపోయింది.