Previous Page Next Page 
మైదానం పేజి 19


    అయినప్పటికి వెన్నెలరాత్రులు నీటికి వెళ్ళినప్పుడు చందమామ యేటినీటిలో కనబడితే, అర్థరాత్రి నక్క అరుపుకి మెలుకువ వొస్తే, అరుద్ర పడమట పెద్దగా అస్తమిస్తూ వుంటే, అమీరులేని లోటు నన్నావరించి బాధపెట్టేది. మీరా నన్నెంత వుత్సాహ పెట్ట ప్రయత్నించినా వ్యర్థమయ్యేది.
    "నిన్నంత బాధపెడుతున్నాడు. వాడు నీ శత్రువు" అంటాడు మీరా.
    "నేను పెద్దవాణ్నయితే నాకోసం యెవరన్నా యింత బాధపడతారా, నువ్వు అమీర్ కోసం పడుతున్నట్టు?" అన్నాడొక రోజు.
    ఒకసారి యాలక్కాయలన్నీ జేబులో పోసుకొస్తే వాళ్ళ పిన్ని చూసి "అది నీ చేత దొంగతనాలు కూడా చేయించుకుంటోందా? ఉండు ఒకసారి నౌకరిని పంపి తిట్టిస్తానంది."
    "ఆ మాట నాకు చెప్పడానికి అతను పడ్డ సిగ్గు - ! ఒకరోజు ఒక చిన్న బాకు తీసుకొచ్చి యిచ్చి అది తలకింద పెట్టుకుని పడుకోమన్నాడు. ఎందుకంత ప్రేమ అతనికి నాపైన అనిపించేది.
    ఒకనాడు మేమిద్దరమూ యేరుదాటి జీడిమామిడి గుబురులో దూరి కూచున్నాము. గాలి వచ్చి రాలిన ఆకులన్నిటినీ యిటూ అటూ తోసి ఆడిస్తోంది. ఆకాశాన తెల్లని మబ్బులు వరుసగా లేచి బయలుదేరి పోతున్నాయి. మీరాకి కోపం తెప్పించడం చాలా సులభం.. అతని కోపం మొహం చూడడం నాకెంతో యిష్టం. ఆ తెల్లని చర్మంలోకి యెర్రని మెరుపువచ్చి గులాబి మొహమల్ వలె ప్రకాశిస్తుంది. మీరా తన వేళ్ళతో నా పెదిమల మీద మెల్లిగా తాకుతూ పాడుతున్నాడు. నేను పరధ్యానంగా వేళ్ళని తీసేశాను. వెంటనే కోపం వచ్చి తల తిప్పేశాడు. అతన్నింకా వుడికించాలని దూరంగా జరిగాను. నా వంక చూశాడు. నేను పలకలేదు. బాగా వుడుక్కుని చప్పున లేచివొచ్చి యెదురుగా ఉధృతంగా నన్ను కావలించుకొన్నాడు. అతని మొహం బాగా యెర్రనయింది. శ్వాస నా మొహాన తుఫానువలె కొడుతోంది. కళ్ళు తళతళ మెరుస్తున్నాయి. నా భుజం మీద రవికెను పట్టుకున్న వేళ్ళు వణుకుతున్నాయి. కొత్త ఆవేశం తెలుస్తూ వుంది. తన నోటితో నా పెదిమల్ని వెతుకుతున్నాడు. చాలా మచ్సికగా వున్న పులిపిల్ల రక్తమాసించి తిరగబడినట్లయింది. భయంతో, కోపంతో "యేమిటది మీరా?" అన్నాను. మెల్లిగా పట్టు వొదిలింది. సాయంత్రపు పశ్చిమదిశవలె యెరుపుజారి మొహంలో సిగ్గు సలుపు కమ్మింది. చప్పున నన్ను వొదిలి పరుగెత్తి వెళ్ళిపోయినాడు. ఇంక రాడేమోనని భయమేసింది నాకు. కాని సాయంత్రం మెల్లగా తలవంచుకుని వచ్చి వొంగి నా కాళ్ళు పట్టుకున్నాడు.
    "ఇంకెప్పుడూ చెయ్యను."
    లేవనెత్తి గట్టిగా కావలించుకున్నాను.
    "నా కట్లా బాగుండదు. ఏం?" అన్నాను.
    "మరి నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు?"
    నా తప్పు తెలిసింది.
    "మీ అక్క ముద్దు పెట్టుకోదూ. పోనీ మానేస్తాలే."
    "వొద్దు, మానెయ్యవొద్దు. నాకు కోపం తెప్పించకు మరి" అన్నాడు.
    అమీర్లేని సంగతి వూళ్ళో తెలీడం కొంత కాలం పట్టింది.
    అతనికి పట్టిన అదృష్టాన్ని చూసి యీర్ష్యపడి నావంక కన్ను వేసి వుంచినవారు లేకపోలేదనీ మీరా పుచ్చుకున్న ముందు జాగ్రత్త వృధా కాదనీ. నా కొకనాటి రాత్రి స్వప్నమయింది. నిద్రపోతున్న నాకు ఎవరో దగ్గిరగా నడుస్తున్నట్లు తోచి మెలుకువ వొచ్చింది. చీకట్లో యింకా నల్లగా కనబడ్డది.
    "ఎవరు?" అన్నాను భయంతో.
    "నువ్వెవరే?"
    "ఇదే మా యిల్లు. నువ్వెందుకొచ్చావు."
    "దారితప్పి-"
    కంఠమే చెపుతోంది అబద్ధమని.
    "వూరు అటు"
    "నాకు తెలీదు. కొత్తవాణ్ణి. ఈ రాత్రి ఇక్కడ పడుకుంటాను."
    "వీల్లేదు."
    "నేను కదలలేను."
    దగ్గిరగా వచ్చి కూచున్నాడు.
    "నువ్వొక్కత్తెవేనా?"
    "వెళ్ళమంటే; నీకు కాదూ చెప్పేది?"
    "వొక్కత్తెకూ భయంలేదూ? ఏం తోస్తుంది? నేను సహాయం వుంటానంటే సంతోషించక, పొమ్మంటావేం?"
    "నాకేం సహాయ మక్కర్లేదు."
    "నీకు సహాయ మక్కర లేకపోతే నాక్కావాలి?"
    చప్పున నా మీదికి వచ్చాడు కంఠానికి గురిచూపిన బాకు భుజంలో గుచ్చుకుంది. కేకేసి బూతులు తిట్టుకుంటూ పోయినాడు. మర్నాటినించి మీరా ఎవత్తెనో మొగాడాంతదాన్ని నాకు సహాయం పడుకోబెట్టాడు కొన్నాళ్లు.
    ఆ రాత్రి దీపావళి వెళ్ళిన పౌర్ణమి. యాడాదిక్రింద ఆ రాత్రి అమీర్ తో నేను గడిపిన గడియలు ఆ చిన్న చలితోనూ, ఆ కొండలమీద వెలుగుతోనూ, అవ్యక్తమైన పరిమళంతోనూ, జ్ఞాపకం వొస్తున్నాయి. వ్యర్థంగా శూన్యంగా నేను గడుపుతున్న కాలపు దుర్భలత్వం మనసుకి గాఢంగా తడుతోంది. మీరా నా వొళ్ళో పడుకుని మాట్లాడుతున్నాడుగాని అతని మాటల ధోరణి మధ్య మధ్య మరిచిపోయి పరధ్యానంగా వూఁ కొడుతున్నాను.
    "నువ్వు వినటం లేదు"
    "కానీ...."
    "వినటం లేదు. ఏమాలోచిస్తున్నావు?"
    ఇట్లాంటి వెన్నెలలో అమీర్ ఒక నిమిషం యిట్లా తీరుబడిగా తోచకుండా కూచోనిచ్చేవాడా?"
    "మాట్లాడవేం"
    "అబ్బా మధురమైన అమీరు ఆలోచనలలో మునిగి కలలన్నా కననీకుండా యీ మీరా యేమిటి గోల!'
    మీరా నాకెంతో ప్రేమాస్పదుడైనా, అమీర్ ధ్యాస తిరగబెట్టిందా? యింక నా మనసంతా అతని ఆయత్తమై ప్రపంచాన్నే మరిపిస్తుంది.

 Previous Page Next Page