Previous Page Next Page 
ఆత్మబలి పేజి 19

   
    ఉమ కాలేజీకి తయారవుతూంది.
    "ఉమా! రావుగారొచ్చారు." తడబడుతూ అంది. పార్వతి తలెత్తి ఒక్కసారి శోభ ముఖంలోకి చూసి ఊరుకొంది. కామాక్షమ్మ ముఖం చిట్లించి "ఇంటిక్కూడా తీసుకొచ్చావా?" అంది.
    ఉమ ఎప్పటిలాగానే శాంతంగా "కాఫీ తయారుచేస్తానుండు అక్కయ్యా!" అంది.
    కొద్దిగా కళావిహీనమయి ఉన్న శోభ ముఖంలోకి చూస్తూ "ఇంట్లో ఎవరూ లేరా!" అన్నాడు.
    "అన్నయ్య లేడు. వదినా, పిన్నీ ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. మా చెల్లెలిని పరిచయం చేస్తాను."
    శోభ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ "నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? బాధపడకు. నిన్ననే అధికారం ఎవరికీ లేదు. నేనే మాట్లాడతాను. మీ పిన్నిగారితోనా?" అన్నాడు.
    "అన్నయ్యతో. కాని ఎప్పుడొస్తాడో నాకు తెలీదు."
    "ఫరవాలేదు. ఒక గంటా గంటన్నర వరకూ చూస్తాను."
    శోభ సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఉమ దగ్గరకు పరుగులా నడిచింది.
    "ఉమా" అంటూ చెల్లెల్ని గట్టిగా కౌగిలించుకుంది. కాఫీ కలుపుతున్న ఉమ ఆశ్చర్యంతో శోభవంక చూసి సంగతి ఊహించుకొని వికసించిన ముఖంతో "ఇద్దరూ ఒక నిశ్చయానికి వచ్చినట్లేనా?" అంది.
    "ఆయన అన్నయ్యతో మాట్లాడతానన్నారు."
    ఉమ తేలిగ్గా నిట్టూర్చింది.
    కాఫీ కలిపి రావుగారికందించింది ఉమ.
    "ఉమ! నా చెల్లెలు."
    పరిచయం చేసింది శోభ. ఉమ వినయంగా నమస్కారం చేసి లోపలికెళ్ళిపోయింది.
    ఒక అరగంటకే ప్రభాకరం వచ్చాడు. రావును చూస్తూనే ప్రభాకరం కనుబొమలు ముడిపడ్డాయి.
    "నమస్కారం" లేచి వినయంగా నమస్కారం చేశాడు రావు.
    "నమస్తే" అన్నాడు ప్రభాకరం ముభావంగా.
    "మీతో మాట్లాడాలని వచ్చాను."
    "నాతోనా?" అవసరానికి మించిన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు ప్రభాకరం.
    "దయచేసి కూర్చోండి." గంభీరంగా అన్నాడు రావు.
    రావు సాధారణంగా నవ్వుతూ ఉంటాడు. గంభీరంగా మారినప్పుడతని స్వరం మృదువుగానే ఉన్నా ఆజ్ఞాపిస్తున్నట్లుంటుంది. దానిని ధిక్కరించే సాహసం ఎవరికీ కలగదు సాధారణంగా.
    ప్రభాకరం కూర్చున్నాడు.
    "మీకు అభ్యంతరం లేకపోతే శోభను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను."
    ఒక్కక్షణం ప్రభాకరం ముఖం వెలవెలపోయింది. ఈ మార్పుకు శోభ ఆశ్చర్యపోయింది. అంతలో తేరుకుని "శోభ విషయంలో నా అధికారమేం లేదు. అది సర్వస్వతంత్రురాలు. ఈ విషయంలో నన్ను సంప్రదించటం పూర్తిగా అనవసరం" అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.
    తల ఎత్తలేకపోయింది శోభ. తమలో తమకెన్ని ఉన్నా, ఇలా పరాయివ్యక్తి ముందు అన్న తనను అవమానిస్తాడని ఊహించలేకపోయింది.
    "మీ అన్నయ్యది చాలా విశాలహృదయం శోభా! ఆడపిల్లలకు ఇంత స్వతంత్రం ఏ ఇంట్లోనూ ఇవ్వరు."
    మలినమయిన శోభ ముఖంలోకి చూస్తూ జాలిగా అన్నాడు రావు. అతడి సౌజన్యానికి ముగ్ధురాలయింది శోభ.
    "నేను వెళ్ళిరానా?" అంటూ లేచాడు రావు.
    మౌనంగా తలూపింది శోభ.
    "సాయంత్రం వస్తావు కదూ?"
    "తప్పకుండా వస్తాను."
    రావు వెళ్ళిపోయాడు.
    శోభ లోపలికొచ్చింది. ఆమెతో ఎవ్వరూ, ఏమీ మాట్లాడలేదు. పిచ్చిగా, ఉన్న రెండు గదులూ కలయతిరిగి తనూ, ఉమా, పిల్లలు పడుకునే చిన్నగదిలో కొచ్చింది. ఉమ కాలేజీ పుస్తకాలు సర్దుకొంటూంది.
    "ఉమా! నేనేం తప్పు చేశాను? నన్నెందుకిలా అందరూ వెలేసినట్లు చూస్తున్నారు?"
    కళ్ళలోని ఉత్సాహమంతా నీరుకారిపోతుండగా అంది శోభ.
    జాలిగా అక్కవంక చూసింది ఉమ.
    "ఏది తప్పు, ఏది ఒప్పు అనే ప్రశ్నకి సమాధానమివ్వటం చాలా కష్టం అక్కయ్యా! మానవుడు సంఘజీవి. సంఘ నియమాలను కాదని అతడు బ్రతకలేడు. అందుకు నువ్విప్పుడనుభవిస్తున్న ఆవేదనే సాక్ష్యం. మానవుడికి సెక్స్ లో ఉన్నంత అభిరుచి మరి దేనిలోనూ లేకపోవటంవల్ల కాబోలు సంఘంలో దానికున్నంత ప్రాధాన్యం మరి దేనికీ లేదు. క్రిస్టెన్ కేలర్ ను గురించి చెప్పుకున్నంతగా చైనా దండయాత్రలను గురించి కూడా చెప్పుకోరు. కన్నతల్లికి తిండి పెట్టని కొడుకునీ, లంచగొండినీ, దేశద్రోహినీ కూడా సంఘం, ముఖ్యంగా మన సంఘం నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆ విషయంలో మానవులకుండే ఆసక్తి అంతటిది. వ్యభిచార సంబంధమైన విమర్శలకే కాస్త సందు దొరికినా ఎవరూ వదిలిపెట్టరు. నువ్వు రాత్రంతా రావుగారింట్లో గడిపిరావటం సామాన్యదృష్టికి సాధారణ విషయం కాదు మరి! ఈ తిరస్కారాన్ని నువ్వు సహించకా తప్పదు. సాధ్యమైనంత త్వరలో రావుగారిని పెళ్ళిచేసుకో! అదొక్కటే పరిష్కార మార్గం."
    పెద్ద ఆరిందాలా ఉమ మాట్లాడుతుంటే విస్తుపోయి చూసింది శోభ. తనకంటే నాలుగేళ్ళు చిన్నదయినా, ఉమ తనను శాసిస్తున్నట్లుగా అనిపిస్తూంటుంది శోభకు. కాని ఉమ శాసనం ఎన్నడూ కఠినంగా ఉండదు. అత్యంత మృదువుగా ఉంటుంది. కాదనటానికి వీల్లేనట్లుగా ఉంటుంది.
    "కాని ఉమా! ఇప్పుడు నేను పెళ్ళిచేసుకుంటే మన సంసారం సంగతేం కావాలి! నీ బి.యస్.సి. పూర్తికావాలి. వాసు పి.యు.సి.లో కొచ్చాడు. ఇంకా చిన్నవాళ్ళున్నారు. వదిన మళ్ళీ కడుపుతో ఉన్నట్లుంది. అన్నయ్య సంపాదన అన్నయ్య సంసారానికి సరిపోదు. ఈ సంసారాన్ని నడిసముద్రంలో వదిలి నాదారి నేను చూసుకోగలనా? ఇంక మూడేళ్ళలో వాసు డిగ్రీ తీసుకుంటాడు. వాడికీ బాధ్యత అప్పచెప్పి నేను పెళ్ళిచేసుకుంటాను."

 Previous Page Next Page