"ఎంత పిచ్చిదానివక్కయ్యా! అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతాయా? వాసు శ్రద్ధగా చదవాలి. మూడేళ్ళలో డిగ్రీ తీసుకోవాలి. తరువాత ఇంటిబాధ్యత స్వీకరించాలి. ఇంతలో ఏదెలా జరుగుతుందో? అనవసరంగా కాలయాపన చెయ్యక వెంటనే పెళ్ళి చేసుకో! "Time and tide wait for no man" విరక్తిగా నవ్వి కాలేజికి బయలుదేరింది ఉమ.
ఎటూ తెగని ఆలోచనలతో సతమతమవుతూ ఆఫీస్ కు తయారుకాసాగింది శోభ.
13
"మూర్తి మావయ్యా!" అంటూ ఒక్కపరుగునవెళ్లి మూర్తి నల్లేసుకుంది ఆశ.
మూర్తి ఆశ నెత్తుకుని తన చేతిలో ఉన్న బిస్కట్ల పాకెట్ ఇచ్చి లోపలికొచ్చాడు.
"ఊరకరారు మహాత్ములు!" ఏం విశేషాలు మూర్తీ? మళ్ళీ ఎక్కడైనా ఉపన్యాసమివ్వాలా?" కూర్చోమని సైగచేస్తూ నవ్వుతూ అన్నాడు రావు.
మూర్తి కూర్చున్నాడు.
"నేను మహాత్ముణ్ణి అయినా కాకపోయినా, ఊరికే రానిమాట మాత్రం నిజం!"
"సరే! ఆ రాచకార్యమేదో సెలవియ్యి. ఉపన్యాసానికి మాత్రం నిజం!"
"అందుకు కాదులే!"
"బ్రతికించావ్. వైద్యానికా?"
"ఛ! ఛ! నీ దగ్గిరకు వైద్యానికొస్తానా?"
పకపక నవ్వాడు రావు.
"సరే! ఎందుకొచ్చావో చెప్పు."
"కొంచెం ఊపిరి తీసుకోనియ్యవేవిఁటీ? కాఫీ అదీ ఇయ్యవా? బొత్తిగా అతిథిమర్యాదలు తెలియవేం?"
"ఇల్లాలు లేనివాడు గృహంలో ఉన్నా గృహస్తుకాడు. అతిథి మర్యాదల విధులన్నీ గృహస్థులకే! వంటవాడొచ్చాక కాఫీ పెట్టిస్తానులే! సంగతి వివరించు."
"నాకు నీ సలహా కావాలయ్యా!"
"భేష్! నన్ను డాక్టర్ గా కాక లాయర్ గా ఉపయోగించుకోదలచుకున్నావన్నమాట."
"డాక్టర్ గా నీలో నాకు నమ్మకం లేదు. లాయర్ గా నువ్వు నాకు తెలియదుగా! నమ్ముతాను."
"అంత విలువ ఇస్తున్నావు కనుక నా సలహాకి ఫీజ్ ఇచ్చుకోవాలి. తెలిసిందా?"
"అయ్యబాబోయ్! ఏవిఁచ్చుకోవాలి? ముందే చెప్పు."
"నా పెళ్ళి ఏర్పాటు చేసిపెట్టాలి."
"నీ పెళ్ళా?"
"అంత ఆశ్చర్యపోతావేం? అంత ముసలివాడినయిపోయానా?
"అదికాదు. నువ్వప్పుడే మా చెల్లెల్ని..."
రావు కొంచెంసేపు మౌనంగా కూర్చుని గంభీరంగా అన్నాడు.
"మూర్తీ! నేను మీ చెల్లెల్ని ప్రాణాధికంగా ప్రేమించిన మాట నిజమే! ఆమె నీనాటికీ మరవలేదు. మరిచిపోవలసిన అవసరమూ లేదు. కాని, నేనీ ఒంటరితనాన్ని సహించలేను. ఆశను చూసుకుంటూ జీవితశేషాన్ని గడపాలని నిశ్చయించుకున్నాను. కాని నాకు తెలిసింది-నాలో ఇంకా ఆశలు చావలేదు. కోరికలు వదలలేదు. ఆత్మవంచన చేసుకోలేను. ఆశ కన్యాయం జరగదు. ఆ రాబోయే యువతి ఆశ నాదరంగా చూస్తే అదృష్టమే! లేకపోతే, ఆశను హాస్టల్లో చేర్పిస్తాను. నేను రోజూ చూస్తుంటాను. దానికేలోటూ రానియ్యను. ఆవిడ నాక్కావాలి. ఏ పరిస్థితులలోనైనా, నేనేమైపోయినా ఆమెను పొంది తీరాలి. ఆవిడను చేసుకోకుండా ఉండలేను మూర్తీ!"
"నిన్నింతగా కదిలించిన ఆ యువతీలలామ ఎవరో?"
"చెప్తే ఆశ్చర్యపోతావు."
"ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు."
"ముందు నీ సంగతి చెప్పు."
"సరే! మా ఆవిడ బతికే ఉంది."
"ఇదేవిఁటీ?"
"వినుమరీ! నాకిద్దరు పిల్లలు. 'చేయి చేయి కలిపి హాయి హాయిగా' తిరుగుతున్నానో లేదో కాని గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. ఇట్లాంటి నా జీవితంలోకి సుడిగాలిలా వచ్చిపడిందయ్యా ఒక నారీరత్నం!"
"వాట్?"
"నాకు పెళ్ళయిందన్నాను" అయినా తననూ చేసుకోమంది.
చట్టమొప్పుకోదు అన్నాను.
పెళ్ళి అయినా కాకపోయినా భార్యాభర్తలమే అంది.
"లోకం!" అన్నాను.
దాన్ని లెక్కచెయ్యను అంది.
మనుష్యులను నిలువనీయక కవ్విస్తుంది. పెంకె మాటలతో రెచ్చగొడుతుంది. అద్భుతమైన ఆకర్షణతో మనసునూ ప్రాణాలనూ తోడేస్తుంది. ఈమె లోభానికి తట్టుకోలేకపోతున్నాను రావు!"
"ఎవరా ఉన్మాదిని?"
"నీకు గుర్తుందో లేదో? ఆరోజు నువ్వు మా సమాజంలో ఉపన్యాసాలిచ్చిన తరువాత నాట్యానికి పాటపాడి తరువాత 'ఓట్ ఆఫ్ థాంక్స్' చెప్పింది చూడు. ఆవిడ. పేరు శోభ. మా ఆఫీస్ లోనే పనిచేస్తూంది."
రావు ముఖం తెల్లగా పాలిపోయింది. సిగరెట్ కేసు తెరిచి నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల అంటించాడు. ఆ మంట అతని కళ్ళలో ప్రతిఫలించింది.
"నన్ను ఏం చెయ్యమంటావో చెప్పు రావ్! ఇవాళేమైనా సరే, సినిమాకు రమ్మని పట్టుబట్టి కూర్చుంది. 'మనిద్దరం కలిసి సినిమాలకు షికార్లకూ తిరిగితే చూసేవాళ్ళకు బాగుండ'దని చెప్పాను. 'నాకు నీతోటిదే లోకం. ఎవరేమనుకున్నా లక్ష్యం లేదు' అని కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ కన్నీళ్ళు చూడలేక 'వస్తాను' అని వాగ్దానం చేశాను. కాని అంతరాత్మ పీకుతోంది. ఏం చెయ్యాలో తోచక నీదగ్గరికొచ్చాను."
సిగరెట్ పొగ గాలిలోకి వదిలాడు రావు.
"అంత అందమయిన ఆడది ఏరి కోరి వస్తూంటే కాదనటం దేనికి? వెళ్ళు."