Previous Page Next Page 
ఆత్మబలి పేజి 18


    "ఉహు! నాకు నీలో ఆకర్షణ లేదు."
    "మొగుడికి విడాకులిచ్చి రెండోపెళ్ళికి తయారయిన ఆడదానిలో ఏ మొగాడికీ ఆకర్షణ ఉండదు.
    "నువ్వు పొరబడుతున్నావు. కేవలం అందం మాత్రమే నన్ను కదిలించలేదు. నా మనసొక విధంగా బండబారిపోయింది. దానిని కదిలించగలిగే చైతన్యమూర్తి నాకు తటస్థించినప్పుడు రెండోపెళ్ళి కాదు నాలుగో పెళ్ళయినా సంకోచించను."
    "నాలో చైతన్యం లేదా? నా అంత నేనుగా మిమ్మల్ని సమీపించానే?"
    "క్షమించు. దీన్ని చైతన్యం అనరు."
    "ఏమంటారు?"
    "చెప్తే నువ్వు బాధపడతావు."
    "బాధపడను. చెప్పండి."
    "వెకిలితనమంటారు. ఇది ఆకర్షణ కలిగించదు. విరక్తి కలిగిస్తుంది. నీ అందానికిదొక మచ్చ."
    కామాక్షి కోపంతో లేచిపోయింది...
    ఆనాటి సంఘటన గుర్తుచేసుకుని ఆయా మళ్ళీ మళ్ళీ నవ్వింది.
    ఈ కథ శోభ మనసుకెంతో ఆహ్లాదాన్ని కలుగజేసింది.
    తను రెండోపెళ్ళివాడయినా కన్యను కోరే మనస్తత్వం కాదతనిది. కాకతాళీయంగా అతను కోరిన యువతి కన్య కావటం తటస్థించింది. ఎవరో ఒక అందమైన యువతితో సంసారం చెయ్యటం అతని లక్ష్యంకాదు. ఒక ప్రత్యేకత గల వ్యక్తి కావాలని కోరుకున్నాడు. తనలో ఆ ప్రత్యేకత చూడగలిగాడు. అతనికి కావలసింది శోభ. చదువుకున్న, అందమైన అమ్మాయి కాదు.
    చదువుకున్న, అందమైన అమ్మాయిలు చాలామంది ఉండవచ్చు కాని శోభ తను ఒక్కర్తే.
    సంతృప్తిగా కళ్ళు మూసుకుంది శోభ. మనసు ఏవో మధుర లోకాలలో విహరిస్తూంటే శరీరం సుషుప్తావస్థలోకి జారుకుంది.


                                      13


    అది ఏదో బాలల లోకం. అందమైన చిన్నారి బాలలు అమాయకంగా పిలుస్తున్నారు. ఆ పిలుపులో ఏదో ఆకర్షణ ఉన్నా వివరించలేని ఏదో అసహనం అడ్డుతగిలి ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేకపోతూంది తాను. ఆ గుంపులోంచి ముద్దులు మూటకట్టే చిన్నారి పాప ముందుకువచ్చి ఏదో తీయగా పాడుతూ ఆహ్వానిస్తుంది. సహజంగా సంగీతంలో మైమరచే తనను ఆపాట ఆకర్షించింది. ఆ పాట దగ్గరవుతోంది. ఇంకా..ఇంకా.. దగ్గిరవుతోంది.
    శోభ కళ్ళు తెరిచింది. ఆశ తన మంచందగ్గిరగా కుర్చీలో కూర్చుని పాడుతోంది. ఇదివరలో తను నేర్పించిన పాటే. ఆ రాగ జ్ఞానానికీ, ఆ కంఠస్వరంలో మాధుర్యానికీ ముగ్ధురాలయింది శోభ. రెండు చేతులూ జాపింది. పాట ఆపి శోభ చేతులలో వాలిపోయింది ఆశ. ఆప్యాయంగా గుండెల కదుముకుంది శోభ.
    తను ఎన్నాళ్ళ క్రిందటో పోగొట్టుకున్న సౌఖ్యమేదో తిరిగి లభించినట్లయింది ఆశకు. తానింతకు ముందెరుగని అలౌకిక సౌఖ్యమేదో రుచి చూసినట్లయింది శోభకు. ఆశ మరింత గాఢంగా శోభ నల్లేసుకుంది. శోభ ఆప్యాయంగా ఆమె తల నిమిరింది. అడుగుల చప్పుడు విని తలెత్తిన శోభ ఎదురుగా రావును చూసి చటుక్కున లేవబోయింది. ఆశ లేవనియ్యలేదు. మృదువుగా ఆశను లేవనెత్తి లేచి కూర్చుంది.
    ఆ దృశ్యం చూసిన రావు కళ్ళలో అంతులేని ఆనందం తొణికిసలాడింది. అసలే అందమైన రావు ముఖం సంతోషంతో వికసించి, మరింత ఆకర్షణీయంగా కనిపించింది. తనవంక ఆప్యాయంగా చూసే ఆ చురుకైన కళ్ళలో ప్రతిఫలిస్తూన్న సంతృప్తిని గమనించిన శోభ తనను తాను మరిచిపోయింది.
    "ఇప్పుడా లేవటం? ఏడయింది తెలుసా?"
    "మీ అమ్మాయి మేలుకొలుపు పాడింది. లేకపోతే అప్పుడే లేచేదానిని కాను." అంటూ నవ్వుతూ లేచింది శోభ.
    "జ్వరంతో మూలుగుతున్నదానికి పాటలుపాడి వినిపించి పాడేలా చేశావు. అనుభవించు."
    "నేను కాక మరెవరు అనుభవిస్తారు? ఎందుకనుభవించనిస్తాను? ఈ మేలుకొలుపు పాటలు వినగలిగే హక్కు నాదే."
    మనసులో మమతనంతా రంగరించి శోభవంక చూశాడు రావు. తన చూపులతోనే ఆ ధీరమూర్తిని పూజించింది శోభ.
    "ఆశకు నయమయిపోయింది. ఇంటిదగ్గర మీవాళ్ళు గాభరాపడతారేమో? ముఖం కడుక్కుని కాఫీ ఫలహారాలు తీసుకుని ఇంటికెళ్ళు శోభా!" కర్తవ్యం గుర్తుచేశాడు రావు.
    ఇంటి సంగతి గుర్తురాగానే శోభకు సర్వాంగాలు వణికాయి. త్వరత్వరగా కాలకృత్యాలూ, కాఫీ ఫలహారాలూ ముగించుకొంది. రావుకు చెప్దామని రావు గదిలోకెళ్ళింది.
    రావు విశాలమైన స్ప్రింగ్ మంచంమీద పడుకొని ఉన్నాడు. ఎదురుగా నిలువుటద్దం. శోభను చూడగానే పడుకున్నవాడు లేచి "రా శోభా!" అన్నాడు.
    శోభ కొంచెం దగ్గిరగా వచ్చి "వెళ్తున్నాను" అంది. ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో శోభ ప్రతిబింబం కనిపిస్తోంది రావుకు. శిల్పులకు ఆదర్శ ప్రాయమనిపించే ఆ అంగసౌష్టవం నుంచి దృష్టి తిప్పుకోలేకపోయాడు.
    రావు లేచి శోభ దగ్గిరగా వచ్చి ఆమెచుట్టూ చేతులేసి "అలా అనకు వినటానికెలానో ఉంది. నువ్వు నా దగ్గిర్నుంచి ఈ ఇంట్లోంచి వెళ్ళటమేవిఁటి?" అన్నాడు.
    శోభ నవ్వింది. "వస్తాను. మీరు పొమ్మన్నా హక్కులతో పోరాడి ఉండేందుకు తయారైవస్తాను." అంటూ నవ్వుతూనే చేతులు విడిపించుకొంది.
    శోభ ఎన్ని విధాలుగా ఆటంకపరిచినా వినక ఆమెను తన కారులోనే ఇంటిదగ్గర దింపాడు రావు.
    "లోపలకు రమ్మంటారా?" అన్నాడు రావు.
    "రండి" అంది. రావద్దనటానికి నోరురాక. ఆమె గుండెలు దడదడ లాడ్తున్నాయి.
    వీధి గదిలో కుర్చీవేసి కూర్చోబెట్టింది. ప్రభాకరం ఇంట్లో లేడు. పార్వతీ, కామాక్షమ్మా లోపల పనులు చూసుకుంటున్నారు.

 Previous Page Next Page