"ఏమిటవి?" అన్నాడు రాజా అప్రయత్నంగా.
"పందికొక్కు. పందికొక్కే ఇంగ్లీషులో బాండికూట్ అయ్యింది. అలాగే తప్పు; తప్పు అనే పదం "టాబూ" అయ్యింది. హిందీ నుంచి "జంగిల్" "పండిట్" "బజార్" మొదలయిన పదాలు ఇంగ్లీషులో చేరాయి. అలాగే తెలుగులో చేరిన ఇంగ్లీషు పదాలకి లెఖ్ఖలేదు. మనం నాలుగు మాటలు మాట్లాడామంటే, అందులో రెండు ఇంగ్లీషు పదాలే వుంటాయి" చెబుతూనే, రాజా వైపు చూశాడు ఆనందరావు.
కదలకుండా, మెదలకుండా, కూర్చుని కళ్ళూ, చెవులూ అప్పగించి ఆయన చెప్పేది వింటున్నాడు రాజా.
ఆనందరావు యింకా చెప్పడం మొదలెట్టాడు.
"ఇంగ్లీషు తర్వాత అంత అధికంగా తెలుగులో చేరిపోయినవి పర్షియన్ పదాలు. దీనికి కారణం వుంది. మనదేశం అనేక సంవత్సరాలపాటు మహమ్మదీయుల, ఆంగ్లేయుల పాలనలో ఉండిపోయింది. మహమ్మదీయులకు చాలా మందికి అప్పట్లో పర్షియన్, అంటే "పార్సీ" రాజభాష. రెవెన్యూ, న్యాయశాఖలలో ఉపయోగించబడిన పార్సీ పదాలే యిప్పుడు మనకి నిత్యం వాడుకలో వుంటున్నాయి."
"ఏమిటవి?" అన్నాడు రాజా.
"జుల్మానా, వాయిదా, సిఫారస్, జమీన్ దార్, తహసిల్దార్... ఇలా అనేకం వున్నాయి."
తనకు తెలియకుండా నోరు తెరిచి వింటున్నాడు రాజా.
సంతోషంగా కృష్ణాజీ వైపు తిరిగాడు ఆనందరావు.
"నాకిప్పుడు ధైర్యం వచ్చిందండీ! కుర్రాడికి యిన్నాళ్ళనుంచి సరైన పద్ధతిలో చెప్పేవాళ్ళు దొరకలేదు. ఇప్పుడు మీరున్నారు. నేనున్నాను. కొత్త విషయాలు తెలుసుకోవాలనే శ్రద్ధ వీడికి వుంది. ఇంకేం ఫర్వాలేదు."
కృష్ణాజీ మొహం వికసించింది.
అతనికి తెలుసు.
రాజా ఒక జీనియస్.
ఈ జనరేషన్ లో ఇలాంటి బాల మేధావులు అనేకమంది పుడుతున్నారు.
నిజంగానే ఇదివరకటికంటే ఇలాంటి బాలమేధావులు ఎక్కువగా పుడుతున్నారా?
లేదా కమ్యూనికేషన్స్, ఇన్ ఫర్మేషన్ సిస్టమ్స్ ఎక్కువ కావడం వల్ల యిలాంటివాళ్ళ వివరాలు ఎక్కువగా బయటికి వస్తున్నాయా?
బహుశా బాల మేధావుల సంఖ్య ఎక్కువ అవుతూ ఉండడమే నిజం కావచ్చు! తరతరాల మానవుడి నాగరికత విజృంభణని తమలో యిముడ్చుకున్న జీన్స్, ఈ తరంలో పిల్లలని యిలా మారుస్తున్నాయేమో!
ఇలాంటి చైల్డ్ ప్రాడిజీల వివరాలు చెప్పుకోవాలంటే అనేకం! పేర్లు వెంటనే గుర్తు రావడం లేదుగానీ, ఒక పిల్లాడు మూడో ఏటే ఎక్స్ పర్ట్ కెమేరామెన్ అయిపోయాడు. ఒక పిల్లాడు ఎనిమిదో ఏటే ఎక్స్ పర్ట్ డ్రయివర్ అయిపోయి, కార్లో ఇక్కడి నుంచి బెంగుళూరు దాకా వెళ్ళిపోయాడు. అక్కడి పోలీసు అధికారులు ఆ పిల్లాడి ఫీట్ కి మెచ్చుకుని అభినందించాలా, లేకపోతే డ్రయివింగ్ లైసెన్స్ లేకుండానే (మరీ చిన్నపిల్లాడు కదా. అందుకని లైసెన్స్ లేదు, రాదు కూడా!) డ్రయివ్ చేస్తున్నందుకు ఫైన్ వెయ్యాలా అన్న తర్జన భర్జనలో పడి, చివరికి తప్పనిసరై ఆ కుర్రాడికి ఫైన్ వేసి వసూలు చేశారు.
ఒక ఎనిమిదేళ్ళ కుర్రాడు పద్దెనిమిది వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఒక నగరం నుంచి యింకో నగరానికి వెళ్ళాడు.
ఒక పిల్లాడు మూడో ఏటే సంగీతంలో రాగాలన్నీ కనుక్కోగలిగాడు.
ఒక ఆర్టిస్ట్ తన మూడో ఏటే "పర్ ఫెక్ట్ సర్కిల్" గీయగలిగాడు.
మొన్నటికి మొన్న విదేశాల్లో వుంటున్న గణేష్ అనే ఒక శ్రీలంక కుర్రాడు పదమూడో ఏటే గ్రాడ్యుయేట్ అయి రికార్డు సృష్టించాడు.
పైగా, అతనికి మూడు నాలుగేళ్ళ వయసు ఉండగానే తనంతట తనే లెఖ్ఖల్లో ఒక విషయాన్ని కనిపెట్టాడు. ఒకరోజు వాళ్ళమ్మతో కలిసి కార్లో వెళుతూ తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు గణేష్. హఠాత్తుగా అన్నాడు "అమ్మా! నీకు తెలుసా? 1/8 + 1/9 + 1/7 + 1/6 + 1/4 + 1/3 + 1/5.... అలా ఎన్ని కలుపుకుంటూ వెళ్ళిపోయినా అది ఎప్పటికీ పూర్తిగా ఒకటి కాదు!" అని
ఆ విషయం అంత చిన్న పిల్లాడికి తోచటం అబ్బురమే!
అలా వుంది ఈ జనరేషన్!
ఆ కేటగిరీకే చెందుతాడు ఈ రాజా కూడా.
అయితే ఇక్కడొక ప్రాధమిక వ్యత్యాసం వుంది.
పైన చెప్పిన పిల్లలందరూ అప్పర్, మిడిల్ క్లాసుకు, కాకపోతే ధనిక వర్గానికో చెందినవాళ్ళు.
అందుకే వాళ్ళ టాలెంటు పత్రికా ముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
వాళ్ళ టాలెంట్ పూర్తిగా వికసించడానికి సరైన వాతావరణంలో పెరుగుతారు వాళ్ళు.
చాలా ఎత్తులు అందుకుంటారు కూడా.
ఈ రాజా అలా కాదు.
ఇతను నికృష్టమైన జీవితంలోకి నెట్టివేయబడ్డ అభాగ్యుడు.
ఇతను నివురుగప్పిన నిప్పు.
ఛుప్పారుస్తుం.
ఇతను తన కంటబడడం యితని అదృష్టం.
తనకి చాలా తృప్తిగా వుంది కూడా.
నిజంగా డిజర్వింగ్ కేసు రాజాది.
ఆ రాజాకి తను చేయూత యిస్తున్నాడు.