Previous Page Next Page 
కళ్ళు పేజి 19


    డాక్టర్ కృష్ణచైతన్య రెండు చేతుల్తో తల పట్టుకుని తన గదిలో ఈజీఛైర్ లో కూర్చున్నాడు. తన హాస్పిటల్లో, ఎంత ఉదాత్తమైన ఆశయాలతో ప్రారంభించబడి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన పద్మ నేత్రాలయలో ఈ ఘోరమైన దుర్ఘటన. హాస్పిటల్ ఏమయిపోతుంది? అందులో చేరిన పేషెంట్లు ఏమయిపోతారు? భవిష్యత్ అంతా అంధకార బంధురమైపోయిన ఆ అభాగ్యురాలి జీవితమేమైపోతుంది?

 

    గుండె ఒత్తిడికి, తీవ్రమైన మానసిక సంక్షోభానికి తట్టుకోలేక ట్రాంక్విలైజర్స్ ఎన్నో వేసుకుంటున్నాడు. ఒక్కటీ పనిచెయ్యటంలేదు. తన హాస్పిటల్, పేషెంట్లు, వాళ్ళ ఆక్రందనలు...అతని తల హోరెత్తి పోతూంది.


                                   *  *  *


    రంజిత పద్మనేత్రాలయలో తాను వేసుకున్న లిస్టు ప్రకారం ఒక్కొక్కరినీ కలవసాగింది.

 

    మొదట డీలక్స్ రూమ్స్ వార్డు నైట్ డ్యూటీ సిస్టర్ని కలిసింది.

 

    "ఆ రాత్రి ఏం జరిగింది?"

 

    "షుమారు ఒంటిగంట ప్రాంతంలో డాక్టర్ కృష్ణచైతన్యగారు తమ గదిలోంచి బయటకు వచ్చి కాసేపు అటూఇటూ పచార్లు చేసి తర్వాత హేమసుధగారి గదిలోకి వెళ్ళారు."

 

    "ఆయనకప్పుడప్పుడు అలాచేసే అలవాటుందా?"

 

    "ఉంది. ఆయనకు మనస్సు బాగుండనప్పుడల్లా హాస్పిటల్ వార్డ్సు అన్నీ తిరిగి పచార్లు చేస్తూ వుంటాడు. హాస్పిటలన్నా, అందులోని గదులు, బెడ్స్, గోడలు అన్నా ఆయన ప్రాణం. ఆయన హాస్పటల్ ని విడిచి ఒక్కరోజుకూడా వుండలేరు."

 

    "హేమసుధగారి గదిలో ఎంతసేపు వున్నారు?"

 

    "దాదాపు పది నిమిషాలున్నారు."

 

    "అలా పేషెంట్స్ గదుల్లోకి రాత్రివేళల్లో వెళ్ళే అలవాటాయనకు వుందా?"

 

    "ఉంది. మర్నాడు ఆపరేషన్ అనగా కొంతమంది పేషెంట్స్, భయంతో నిద్రపట్టక బాధపడుతూంటారు. అలాంటప్పుడు ఆయన వెళ్ళి ధైర్యం చెప్పి వారి భయాన్ని పారద్రోలుతూ ఉంటారు."

 

    "డాక్టర్ కృష్ణచైతన్యగారు హేమసుధగారి గదిలోంచి బయటకు వచ్చాక ఏం చేశారు?"

 

    "సరాసరి డ్యూటీరూంలోవున్న నా దగ్గరకు వచ్చారు. హేమసుధగారు టెన్షన్ తో నిద్రపట్టక బాధపడుతున్నారనీ, వెంటనే ఓ వేలియంటెన్ ఇంజక్షనిమ్మని చెప్పి తమ గదివైపు వెళ్ళిపోయారు."

 

    "ఆ సమయంలో అక్కడెవరైనా వున్నారా?"

 

    "లేరు."

 

    "రాత్రివేళల డ్యూటీలో మీరు తప్ప ఎవరూ వుండరా?"

 

    "వార్డ్ బాయ్ అవసరమైనప్పుడైతే వుంటాడు. లేకపోతే తన గదిలో రెస్ట్ తీసుకొంటూ వుంటాడు. ఇతర వార్డ్ లలోని సిస్టర్స్ మధ్య మధ్య వచ్చి పలకరించిపోతూ వుంటారు. డీలక్స్ రూమ్ లో ఎక్కువగా పని ఉండదు. ఎందుకంటే పేషెంట్స్ ఎవరిమట్టుకు వారు తలుపులు బిడాయించుకుని నిద్రపోతూ ఉంటారు. ఒకవేళ మాకేదన్నా చెప్పాలనిపించి వెళ్ళినా ఒక పట్టాన తలుపులు తియ్యరు."

 

    "పోనీ అనుమానాస్పదమైన వ్యక్తి ఎవరైనా ఆ సమయంలో కనిపించారా?"

 

    "లేదు."

 

    "ఎవరైనా కొత్త వ్యక్తి?"

 

    "లేదు."

 

    "తర్వాతేం జరిగింది?"

 

    "ఇంజక్షన్స్ వున్న వాడ్రోబ్ దగ్గరకెళ్ళి వేలియం టెన్ సిరంజిలో లోడ్ చేశాను. వెనకేదో అలికిడయినట్లయింది. తలత్రిప్పే లోపల ఏదో జరిగింది. ఏం జరిగిందో నేను సరిగ్గా చెప్పలేను. కళ్ళు మూతలు పడిపోయాయి. తెలివొచ్చేసరికి ఎవరో నన్ను భుజం తట్టి లేపుతున్నారు. హాస్పటలంతా గగ్గోలుగా వుంది. జరిగిన ఘోరమప్పుడే తెలిసింది" సిస్టర్ కళ్ళలోంచి జలజల నీళ్ళు కారుతున్నాయి.

 

    రంజిత ఆమె ముఖంలోకి పరీక్షగా చూసింది. అమాయకంగా, నిర్మలంగా వుంది. కళ్ళు గొప్ప అందంగాలేవుగాని, వాటిలో వెలుగువుంది. జరిగినదానికి ఆమె చాలా బాధపడుతూన్నట్లు కనిపించింది. ఆమె చెబుతూన్నవన్నీ నిజమేననిపించింది రంజితకు.

 

    "ఆపరేషన్ థియేటర్ కు పేషెంటును మామూలుగా ఎలా తీసుకెడతారు?" అనడిగింది.

 

    "వీల్ చైర్ లోగాని, వీల్స్ వున్న స్ట్రెచర్ మీదగాని తీసుకెడతారు."

 

    "నేరస్థుడు ఆమెను వీల్ చైర్ లో తీసుకెళ్ళినట్లు ఆధారాలు లభించాయి. అలా ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెడుతూంటే ఎవరూ చూసే అవకాశం లేదా?"

 

    "మామూలు వార్డ్స్ గాని, జనరల్ వార్డ్స్ గాని అయితే చాలామంది చూసే అవకాశముంది. డీలక్స్ వార్డ్ నుంచి వచ్చిన ర్యాంప్ ఆపరేషన్ థియేటర్ కు పదిగజాల దూరంలో ఆగుతుంది. రాత్రివేళ ఆ పదిగజాలదూరం ఎక్కువ మంది చూసే అవకాశంలేదు."

 

    "సరే. వస్తాను" అంటూ రంజిత అక్కడ్నుంచి కదిలింది.

 

    తర్వాత నైటు డ్యూటీలోవున్న వార్డ్ బాయ్ ని కలిసింది.

 

    "ఆ రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నావు?"

 

    "మామూలుగా పది పదిన్నరకల్లా పడుకుంటాను. ఆ రాత్రి ఎంతకీ నిద్రపట్టకపోతే పదకొండు గంటలదాకా ప్రయత్నించి కాంపోజ్ టాబ్లెట్స్ రెండు వేసుకుని పడుకున్నాను."

 

    "కాంపోజా? నీకు అలవాటుందా?"

 

    "పూర్తిగా అలవాటు లేదు కానీ మెంటల్ వర్రీసండి. నేను నైట్ డ్యూటీలో వున్నప్పుడల్లా నా పెళ్ళానికి అనుమానమండి ఇక్కడేదో సిస్టర్స్ తోనో ఆయాలతోనో వెలగబెడుతున్నానని. మీరు నిజం చెప్పండి. నేను నైట్ డ్యూటీలో వున్నప్పుడు అదీ ఇంట్లో వంటరిగా వుంటుంది కదండీ. ఆమాటకొస్తే నేను అనుమానించాలి కదండీ."

 

    "అది సరే! ఆ రాత్రి నీకేమీ శబ్దాలు వినిపించలేదా?"

 

    "చెప్పాను కదండీ. కాంపోజ్ లో వున్నానని."

 Previous Page Next Page