శరీరమంతా మొద్దుబారిపోతోంది. మనసు ఆలోచించలేకపోతోంది. మూతలు పడుతోన్న కనురెప్పలు బలవంతాన తెరచివుంచి ఇంకోసారి అతని వంక చూసింది.
హఠాత్తుగా అతనామె మీదకు వంగాడు.
హేమసుధ ఉలికిపడి అతనివంక చూసింది.
ఆ కళ్ళు...బెడ్ లైట్ వెలుగులో ఎర్రగా మెరుస్తున్నాయి. ఏం చేస్తాడు? ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? అతని మనసులో ఏముంది? ఎందరో అందుకుందామని అర్రులు చాచిన తన అందం, ఇంతవరకూ ఎవరికీ అందని ఈ అందం బలాత్కారంగా జుర్రుకుంటాడా? ఆమెకు విపరీతమైన భయం వేసింది. గట్టిగా అరవాలనుకుంది. అరిస్తే గొంతు నొక్కేస్తాడేమో...గొంతు నొక్కేసి చచ్చిపోయాక రేప్ చేస్తాడేమో?...అలా చంపేసి వెంటనే రేప్ చేసిన కథలు కొన్ని చదివింది.
"ఏం...చే...స్తా...వు...?" అని అడిగింది. గొంతు స్వాధీనంలోకి రావటంలేదు. కేవలం భయంవల్లనే కాదు, ఇంజక్షన్ ప్రభావం వల్ల కావచ్చు. మెదడుతోబాటు, నరాలు, నాలిక అన్నీ మొద్దుబారిపోతున్నాయి.
"రేపు ఆపరేషన్ కదూ?"
"....ఊఁ"
"కనురెప్పలు కత్తిరించాలి"
"....ఇందాక...సిస్టర్..." క్రమక్రమంగా మాట పూర్తిగా తగ్గిపోతోంది.
"చేస్తే చేసింది. మళ్లీ చెయ్యాలి."
"ఇప్పు...డా....అ...ర్థ...రా...త్రి...?"
"అవునిప్పుడే!" అతని కంఠం కఠినంగా మ్రోగింది.
ఆమె కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా తెరువలేకపోయింది. ఏదో జరుగుతోంది. ఒక నిముషం గడిచాక బయటినుంచి దేన్నో ఈడ్చుకువచ్చిన చప్పుడు. రెండు చేతుల్తో ఆమెను బెడ్ మీదనుండి లేవనెత్తి వీల్ చైర్ లో కూర్చోబెట్టాడు. దాన్ని త్రోసుకుంటూ బయటకు తీసుకువెళ్లాడు.
హాస్పిటల్ వరండాలో నుంచి వీల్ చైర్ ముందుకు తోసుకుపోబోతుంది. కొంతదూరం పోయాక ర్యాంప్ వచ్చింది. ర్యాంప్ మీదనుంచి క్రిందకు దిగిపోతోంది.
ఆమెకు చాలావరకూ మగత ఆవహించింది. కొద్దిగా...ఏ కొద్దిగానో తెలుస్తోంది. కానీ మాట అసలు రావటంలేదు.
ఆపరేషన్ థియేటర్, టేబుల్ మీదికి హేమసుధ శరీరం ఎక్కించబడింది. అతను థియేటర్ తలుపులు లోపల్నించి బిగించాడు.
హేమసుధలో అరిచే శక్తి లేదని తెలుసు. అయినా ఆమెకు నొప్పి తెలీకూడదు. మందాకినికి జరిగినట్లు ఆమె కంటిదగ్గర లోకల్ ఎనస్థీషియా ఇవ్వబడింది. ఆపరేషన్ చేసే పరికరాలు చేతుల్లోకి వచ్చాయి.
ఒకటి...రెండు...మూడు...నాలుగు...పది నిముషాలు గడిచాయి. ఆమె రెండు కనుగుడ్లూ ఊడి అతని చేతుల్లోకి వచ్చేశాయి.
7
హాస్పిటల్లో హాహాకారాలు చెలరేగటమే కాదు.. ఊరు, దేశం అట్టుడికినట్లు ఉడికిపోతోంది. ప్రాంతీయ పత్రికలు, దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోని పత్రికలూ విదేశీ పత్రికలూ ఈ వార్తను చాలా ప్రాముఖ్యతనిచ్చి ప్రచురించాయి. ఈ చిత్రమైన, ఘోరమైన సమాచారాన్ని గురించి రేడియోలో విపరీతమైన ప్రాచుర్యమిచ్చి ప్రసారం చెయ్యబడింది. ఏ పత్రికలో చూసినా విశాలమైన నేత్రాలతో, రెండు కళ్ళూ లేకుండా వున్న హేమసుధ ఫోటోలు.
ప్రజలు బెంబేలెత్తి పోయారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ జరగని భయానకమైన సంఘటనలు.
పద్మ నేత్రాలయంలో జరిగిన ఈ అతి భయంకరమైన సంఘటనతో డాక్టర్ కృష్ణచైతన్య షాక్ అయిపోయాడు. ఒకటి రెండురోజులు దాకా ఎవరికీ ఇంటర్వ్యూళు ఇవ్వడానికి తన గదిలోంచి బయటకు రాలేదు.
ఎస్.పి. జయసింహ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పరుగులు తీసింది. నగరంలో అనుమానమున్న చోటల్లా పోలీస్ డిపార్ట్ మెంట్ మనుషులు, గూఢచారి శాఖ మనుషులు గాలించి వదిలిపెట్టారు. పోలీసు కుక్కలు విపరీతంగా శ్రమపడ్డాయి. ఎటువంటి ఆచూకీ లభించలేదు.
కొన్ని వందలమంది సంచరించే హాస్పిటల్లో ఎంత రాత్రివేళయినా నైట్ డ్యూటీ సిస్టర్స్, వాచ్ మన్, వార్డ్ బోయ్ ళు, ఎమర్జెన్సీకోసం వినియోగించబడిన నైట్ డ్యూటీ డాక్టర్లు, ఇంకా ఎందరో పేషెంట్స్ మెలిగే హాస్పిటల్లో, ఆపరేషన్ థియేటర్ లో... అంత పబ్లిక్ గా, ఎంతో అనుభవమున్న డాక్టర్ ఆపరేషన్ చేసినట్లు ఒక ప్రఖ్యాత సినిమానటి కళ్ళకి ఎన్యుక్లియేషన్ ఎలా జరిగింది? హాస్పిటల్ సిబ్బంది అంతా ఏం చేస్తున్నారు?
దేశం నలుమూలలనుండి పత్రికా విలేఖరులు వచ్చి వ్రాలారు. హాస్పిటల్లో డాక్టర్లనీ, మిగతా సిబ్బందినీ ప్రశ్నలు గుప్పించి పారేస్తున్నారు. రకరకాల హెడ్డింగ్స్ తో వార్తలు వెలువడుతున్నాయి.
"కొన్ని వందలమంది సంచరించే హాస్పిటల్లో ఒక ప్రఖ్యాత నటీమణికి కళ్ళు పీకెయ్యటం ఎలా జరిగింది?"
"సాక్షాత్తూ ఆపరేషన్ థియేటర్ లో ఈ ఘోరం జరగటం ఎలా సాధ్యపడింది?"
"హాస్పిటల్ సిబ్బంది, డ్యూటీలో వున్న డాక్టర్ ళు, థియేటర్ ఇన్ ఛార్జిగా వున్న స్టాఫ్ ఏం చేస్తున్నారు?"
"అసలీ సంఘటనలో దురుద్దేశమేమిటి? మందాకిని కళ్ళు పీకేసింది, హేమసుధ కళ్ళు తీసేసింది ఒకరేనా?"
"ఈ కళ్ళు తస్కరించటం ఇతరులకెవరికైనా అమ్ముకోవడానికా? అలా ఐతే ఐ బ్యాంక్స్ దృష్టిలోకి రాకుండా ఇది సాధ్యమేనా?"
"అసలీ కళ్ళు పీకటంలో అంతరార్ధమింకేదైనా ఉందా?"
"ఈ ఘోరం చేసింది ఒక డాక్టరై వుంటాడా? డాక్టరుకాని పక్షంలో మామూలు వ్యక్తి చాలా నిపుణులైన డాక్టర్లు చేసినట్లు ఆ ఆపరేషన్ నిర్వహించటం సాధ్యమేనా?"
"హాస్పిటల్లో డాక్టర్లకీ, ఈ సంఘటనకీ ఏమీ సంబంధంలేకుండా ఇలా జరగటం సంభవమేనా?"