"అన్నావనుకో. రెండు టాబ్లెట్స్ కు నిద్రపడుతుంది కానీ, అంత మొద్దునిద్ర పట్టదుకదా. ఆ స్థితిలో ఎవరయినా తట్టి లేపితే మెలకువ వస్తుంది కదా."
"నిజంగానండీ, నాకెలాంటి చప్పుడూ వినిపించలేదు. వినిపిస్తే ఇంత కిరాతకంచేసిన కిరాతకుడ్ని ఒదిలిపెడతానా అండి. అక్కడికక్కడే పట్టుకుని నరికి ముక్కలు చేసేవాడ్ని."
తర్వాత థియేటర్ ఇన్ ఛార్జ్ స్టాఫ్ నర్సుతో మాట్లాడింది.
మీరు నైట్స్ ఎక్కడుంటారు?"
"మా క్వార్టర్స్ లోనే వుంటాను."
"రాత్రుళ్ళు ఆపరేషన్లు చేసే అవసరం వుండదా?"
"ఎప్పుడోగాని ఎమర్జన్సీ ఆపరేషన్లు వుండవు. ఏదయినా ఇంజరీ కేసు వచ్చి అప్పటికప్పుడు అటెండవ్వాల్సిన కేసులు వుంటే తప్ప. అలా ఎప్పుడో అరుదుగా జరుగుతూ వుంటుంది. అటువంటి సమయాల్లో క్వార్టర్స్ కి కబురు చేస్తారు."
"నైట్సు కృష్ణచైతన్యగారు ఎన్నిగంటలదాకా పని చేస్తూ ఉంటారు? అంటే ఆపరేషన్ థియేటర్ లో?"
"సాధారణంగా ఆపరేషన్లన్నీ పగలే పూర్తి చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎంతో ఏకాగ్రతతో, అతి సున్నితంగా చేయాల్సిన ఆపరేషన్స్ అలిసిపోయినప్పుడూ, రాత్రివేళలా చేస్తే ఫెయిల్యూర్స్ ఎక్కువగా వుండే అవకాశముంది."
"ఈ మధ్య ఎప్పుడయినా నైట్ టైమ్స్ థియేటర్ తెరిచి ఉంచటం జరిగిందా?"
"లేదు."
"అసలు రాత్రివేళల థియేటర్ లాక్ చేసి వుంటుందా? తెరిచి వుంటుందా?"
"లాక్ చేసే వుంటుంది."
"దాని తాళం చెవులు ఎక్కడుంటాయి?"
"నా దగ్గరో డూప్లికేట్ వుంటుంది. సూపరింటెండెంటుగారి గదిలో ఒకటుంటుంది."
"మీ దగ్గరవున్న తాళంచెవి- ఈ ఇన్సిడెంటు జరిగిన రాత్రి మీ దగ్గరే ఉందా?"
"నా దగ్గరే వుంది."
"అది మధ్యలో కొంతసేపు కనిపించకుండా పోవటంగానీ, ఎవరయినా పని ఉన్నదని కావాలని తీసుకెళ్ళటంగాని జరిగిందా?"
"లేదు."
"ఆ రాత్రి మీరు ఎన్ని గంటలకి పడుకున్నారు?"
"పది గంటలకి."
"మళ్ళీ ఎన్నిగంటలకి లేచారు?"
"నాలుగింటికి- సాధారణంగా అలాగే లేస్తాను. ఎందుకంటే ఆపరేషన్ చెయ్యటం ఆరుగంటలకే మొదలవుతుంది. అప్పటికన్నీ సిద్ధంచేసి వుంచుకోవాలి."
"మీరు నిద్రపోయినప్పుడు తాళంచెవి ఎక్కడ వుంచుతారు?"
"నా షెల్ఫ్ లో వుంచుతాను, నిద్రపోయినప్పుడేకాదు. అవసరం లేనప్పుడు అందులోనే వుంచుతాను."
"ఆ రాత్రికూడా అక్కడే వుంచారా?"
"అవును."
"ప్రొద్దుట ఎన్ని గంటలకి లేచారు?"
"ఇంచుమించు మామూలు టైముకే. కాని స్వాభావికంగా లేవలేదు. ఏదో గొడవ జరిగినట్లు చప్పుళ్ళు వినిపిస్తుంటే మెలకువ వచ్చింది. తర్వాత అందరితోబాటూ జరిగింది తెలుసుకున్నాను."
"అప్పుడు తాళంచెవి యథాస్థానంలోనే వుందా?"
ఒక్కక్షణం స్టాఫ్ నర్స్ జవాబు చెప్పటానికి తటపటాయించింది.
"చెప్పండి?"
"ఉంది."
"జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి."
"ఉంది."
"సరే, అని రంజిత ఆమెను విడిచిపెట్టి వచ్చేసింది.
తర్వాత పేషెంట్సునూ, వారి తాలూకూ అటెండెంట్స్ నూ కలవగా కలవగా ఇద్దరు ముగ్గురు మాత్రం కొంత సమాచారం అందించగలిగారు.
అర్దరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో నిద్రపట్టక బయటకు వచ్చి వరండాలో అటూఇటూ తిరుగుతున్నాను. ర్యాంప్ మీదనుంచి ఓ వ్యక్తి వీల్ చైర్ లో ఓ యువతిని కూర్చోపెట్టి తీసుకువస్తున్నాడు. ఆ యువతి తల ప్రక్కకి వాలిపోయి వుంది. ఆ తీసుకువస్తోన్న మనిషి ఇంచుమించు ఆరడుగుల పొడవున్నాడు. మొహానికి ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు వేసుకునే మాస్క్ లాంటిది వుంది. ఒక్క కళ్ళు తప్ప ఏమీ కనపడటం లేదు. అతనిలో తొట్రుపాటు, భయం, కంగారు ఏమీలేవు. తాపీగా ఒక రోగిని ఆపరేషన్ కోసం తీసుకెళ్ళినట్లు వెళ్ళాడు. ఏదయినా ఆపరేషన్ వుందేమో అందుకని తీసుకెడుతున్నాడనుకుని ఆ సంఘటనని చాలా సాధారణంగా తీసుకున్నాం.
వాళ్ళందరూ విడివిడిగా చెప్పిన సమాధానాల్లోని సారాంశమది.
హేమసుధను ఆపరేషన్ థియేటర్ లో మొదటగా చూసింది ఎవరు? అసలా దారుణం జరిగాక మొదట ఎలా బయట పడింది?
రెండో అంతస్థులో వున్న మామూలు రూమ్స్ వున్న వార్డు సిస్టర్ చంచల ఈ సమాచారాన్నందించింది.
చంచలకు ఆ రాత్రి పనేమీ లేదు. చాలాసేపు నవల చదువుకుంది. డ్యూటీరూమ్ లో వుండటంవల్ల ర్యాంప్ మీద నుంచి ఏదన్నా వీల్ చెయిర్ వెళ్ళిందేమో తెలీదు. నవల చదివే ధ్యాసలో వుండటంవల్ల వీల్ చెయిర్ సాగిన శబ్దంకూడా పట్టించుకోలేదు. మూడుగంటల ప్రాంతంలో నిద్ర వస్తున్నట్టుగా వుంటే క్రింద అంతస్థులోవున్న సిస్టర్ దగ్గరకు వెళ్ళి టీ త్రాగి వద్దామని బయల్దేరింది. క్రిందికి రాగానే ఆపరేషన్ థియేటర్ ఎందుకు తెరిచివుంది? ఎమర్జెన్సీ ఆపరేషనేమైనా జరుగుతుందా? అలా అయితే ముందుగా తనకి తెలుస్తుందే? ఒకవేళ ఆపరేషన్ జరుగుతోంటే థియేటర్ అంత నిశ్శబ్దంగా ఎందుకుంది? కొంత సందడిగా వుండాలే? ఉత్సుకత కలిగి సమీపంలోకి వెళ్ళింది.