పాపిటలాంటి అడవిబాట. అది ఎప్పుడూ సద్దుమణిగి ఉంటుంది. కాని ఇప్పుడు ఆ బాటమీద డప్పులు మ్రోగుతున్నాయి. కొమ్ములు పాడుతున్నాయి. అధికారులు ఆ బాటమీద సాగుతున్నారు. అందుకు ఆ సంరంభం. ముందు డప్పులవాళ్ళు, కొమ్ములవాళ్ళూ సాగుతున్నారు. వారి వెనుక బరిశెలుగల తలార్లు వారి వెనుక రెండు గుర్రాలు- ఒకదాని మీద గిర్దావరు, రెండవదాని మీద అమీను. గుర్రాల వెనుక పెట్టెలు, పక్క చుట్టలు నెత్తిన పెట్టుకొని వస్తున్నారు. మనుషులు గుర్రాలకంటే ముందు పరిగెత్తాలి. ముందరివారు అంతవేగంతోనూ పరిగెత్తాలి వెనుకవాళ్ళు. చింతబరికలు తగులుతుంటాయి గుర్రాలకు.
అడవిలోంచి అధికారులు సాగిపోతున్నారు. అధికారులు, వారిని చూసి అడవి హడలుతుందా? హడలదని అధికారులకు తెలుసు. అందుకే తమ ముందు బలిపశువులను నడిపిస్తున్నారు. వచ్చిన పులి ముందు డప్పుల వాళ్ళను బలిగొంటుంది. తరవాత బరిశెలవాళ్ళు. అంతలో అధికారులు సర్దుకుంటారు. అందుకే వారికి గుర్రాలు మిగతా వారికి కాలినడక.
మనిషికి భయం అయినప్పుడు చప్పుడు చేస్తాడు. ఆ చప్పుళ్ళే డప్పులు. కొమ్ములు. అవి అధికారుల భయానికి చిహ్నం. అది వారి ఆడంబరం! అందరినీ హడలగొట్టేవారు, అడవిలో హడలి చస్తున్నారు. అవును జంతువులమీదా చెట్లమీదా వారి అధికారమేం?
అది దండయాత్ర అమాయకులైన కోయలమీదికి? ఇక్కడ భయంతోచస్తూ, అక్కడ భయపెట్టడానికి సాగుతూంది యాత్ర!
సూర్యుడు పడమట పొదల్లోకి దూరాడు. ఆకాశంలో మబ్బులు మందలు మందలుగా మేతకు బయలుదేరాయి. డప్పుల మోతకు ఉరుములు శృతికలిపాయి. వాన రానున్నది. మెరుపులు మెరిశాయి. గుర్రాలకు చింతబరికెలు బాగా తగిలాయి. నడిచేవాళ్ళ సత్తువ చచ్చిపోతూంది. డప్పులమోత తగ్గుతూంది. చిటపట చినుకులు మొదలై జడివానగా మారింది. జోరున వాన. అధికారులు చెట్లకిందకి చేరారు. వారిచుట్టూ వలయాకారంగా జనం. అధికారులు వానమీద మండిపడ్డారు. అయినా అది వినలేదు. పడుతూనే ఉంది. పిల్లకాలువలు జలజలా పారుతున్నాయి. గిర్దావరు గుండెల్లో ఉరుములు! అమీను కళ్ళలో మెరుపులు! అయినా అడవిలో అధికారులకు బసలేదు. కోయగూడెం చేరాల్సిందే.
కోయగూడెం చేరేవరకు బాగా రాత్రి అయింది. చీకట్లు చినుకులు డప్పులు మెత్తబడ్డాయి. మోతలేదు. కొమ్ములవారు వణుకుతున్నారు. అందరినీ వడికించే అధికారులు చలికి వణుకుతున్నారు. సందడి లేకనే గూడెంలో ప్రవేశించారు. గూడెం నిద్రపోతూంది. గుడిసెల మీద వాన పొగలు లేస్తున్నాయి. అధికారుల కోపం అంబరాలు అందుకుంటూంది. గుర్రాలతోనే గుడిసెల్లో దూరారు.
అమీను గుర్రం తడికను చీల్చుకుని సమ్మయ్య గూటిలోకి దూకింది. దంపతులు మంట కాగుతున్నారు. బిత్తరపోయి నుంచున్నారు. గుర్రం గూటినిండా కలయతిరిగింది. కుండల బద్దలయినాయి. సారాయి ప్రవహించింది. అమీను గుర్రంమీంచి దూకాడు. చింతబరికెతో సమ్మయ్యను బాదాడు. "అప్పర్లు1 వస్తున్నరని ఎరికెలే ఇంతజాము2 లెందుకు చెయ్యలే హరామ్జాదే. మస్తీ3 ఎక్కింది." అని బాదసాగాడు. సమ్మయ్య కిక్కురమనలేదు. కాని దెబ్బలు తప్పుకోవడానికి గుడిసె బయటకు వచ్చేశాడు. వాన. అధికారి గుడిసెదాటి రాలేదు. కాని సారాయి తెప్పించు, కోళ్లు తెప్పించు అని కేకలు పెడుతున్నాడు.
__________________________________________
1.ఆఫీసర్లు. 2.ఏర్పాట్లు. 3.పొగరు.
సమ్మయ్య భార్య అంతకుముందే బయటపడింది. వానలో తడస్తూంది. నిండు చూలాలు! ఆమెను చూస్తూ నుంచున్నాడు సమ్మయ్య. తన నిస్సహాయతకు తానే దుఃఖపడుతున్నాడు. మెరుపు మెరిసింది. ఆ వెలుగుకు అమీనుకు కనిపించాడు సమ్మయ్య.
"నిక్లో, జల్దీలావ్, బందూక్ సె ఉడాదేవుఁగా" అని కేకలు పెట్టాడు.
సమ్మయ్య కేకలు విన్నాడు. అడుగులువేసి బయటపడ్డాడు. గూడెం సాంతం వానలో తడుస్తూంది. ఆడా, మగా, పిల్లా జల్లా అంతా నానుతున్నారు. ఆ తప్పంతా తనదే ననుకున్నాడు. వేట మురిపెంలో ఏర్పాట్లు మరచా ననుకున్నాడు. అందుకు అనుభవించాల్సిందే ననుకున్నాడు.
అధికారులు వారి మందీ మార్బలం అన్ని గుడిసెలూ ఆక్రమించుకున్నారు. ఏ ఇద్దరు ఒక గుడిసెలో ఉండలేదు. వారికి కులాలు, మతాలు అడ్డువచ్చాయి. గుర్రాలకు ప్రత్యేకం గుడిసెలు. అవీ వణుకుతున్నాయి మరి!
సమ్మయ్య భార్య వానలో సాగిపోతూంది. ఆమె చెట్టు నీడ చూచుకుంటూంది. సమ్మయ్య మనసు క్రుంగింది. అయినా ఆమెను అనుసరించలేకపోయాడు. అతడు ఏర్పాటు చేయాలి. ఇంటింటికి వెళ్ళి సారాయి సంపాదించాడు. కోళ్ళను సమకూర్చాడు, గుడిసెల్లో వంటలు సాగుతున్నాయి. సారాయి అధికారులకు వేడినిస్తూంది. కోయలు వానలోనే అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆడవారు చెట్లక్రిందకు చేరారు.
చిమ్మున చీకటి ఉరుములు, మెరుపులు వాన. సమ్మయ్య భార్యకు నొప్పులు వచ్చాయి. వడకు, నొప్పులు ప్రసవవేదన! ఒక ప్రాణిని చీల్చుకొని మరొక ప్రాణి బయట పడాలి. ఆమె కేకలు వేయలేదు. అరవలేదు. మౌనంగానే భరించింది ఆ తల్లి! మరొక కోయబిడ్డ నేలమీద పడింది. కేరుమన్నది. పదునైన రాయి చూచింది. తల్లి! బొడ్డుకోసింది. బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. వానదేవునికి చూపింది. అతడు కరుణించాడు. మెరిశాడు. తల్లి బిడ్డను చూచుకుంది. మురిసిపోయింది. వానదేవుడే స్నానం చేయించాడు. గజ గజ వణుకుతున్న తల్లి బిడ్డను రొమ్ములో దాచుకుంది. అక్కడి వేడితో వెచ్చదనం కల్పించాలని ఆ పిచ్చి తల్లి ఆశ!
తన బాధ ఎరగదు తల్లి. బిడ్డ సుఖంగా.. ఉండాలి. అంతే. అందులోనే ఆనందం ఉంది.
తెల్లవారికి వాన తగ్గింది. అయినా చినుకులు రాలుతూనే వున్నాయి. గొడ్డళ్ళు భుజాన వేసుకొని అడవిలో దూరారు. వెదురు బొంగులు, వాసాలు, ఆకు నరికి తెచ్చారు. గుడిసెలు తయారుచేశారు. అధికారులు కొత్తగుడిసెల్లోకి మారారు. కుందేళ్ళు, నెమళ్ళు, కోళ్ళు, గొర్రెలు వచ్చాయి, తెగాయి, ఉడికాయి, అధికారులకు జల్సాలు సాగేయి. తాగి తందనాలాడారు. ఆ రోజు వారికి తెలియకుండానే గడిచిపోయింది, చిత్తుగా తాగారు, మత్తుతో గడిచి పోయింది రోజు.
సమ్మయ్య దంపతుల ఆరాటానికి అంతులేదు. ఒక బిడ్డ వచ్చాడు. ఒకడు అడవిలో పోయాడు. సింగన్న ఏమైనట్లు! అతనికి అడవి కొట్టిన పిండి. పులిని పిల్లిలా చెవులు పట్టి ఆడించగలడు. అయినా అడవిని నమ్మరాదు. అది ఎంత వాణ్ణయినా మోసం చేస్తుంది. ఎందర్ని మింగిందో. ఇక ఎందర్ని మింగుతుందో? తమ సింగన్ననూ మింగిందా? అనే వారి ఆరాటం, వారి ఆవేదన. అది ఎంతో ఎలా కొలవగలం?
మళ్ళీ తెల్లవారింది. అధికార్లు గూడాన్ని పిలిపించారు. వారు మంచాలమీద కూర్చున్నారు. కళ్ళు ఎర్రగా వున్నాయి. కోయ దొరలంతా మంచాలకు దూరంగా గొంతుక్కూర్చున్నారు. సమ్మయ్య అందరిముందున్నాడు. నుంచున్నాడు. దుఃఖం మూర్తీభవించినట్లున్నాడు. కన్నీరు దుముకుతుందా అన్నట్లున్నాడు.
"ఏంబే! దొరలొస్తురని ఎరికలె. మస్కూర్ను పంపించినా మస్తి ఎక్కిందిలే. హడ్డీనరమ్ చేస్త. ఏమనుకున్నరో అమీనంటె!"
"వేటకు పోయినం దొర మరిచినం...."
మాట పూర్తి కాకుండానే పైనపడ్డాడు అమీను. కర్రతో బాదసాగాడు. సమ్మయ్య దెబ్బలు తప్పుకోడానికి ప్రయత్నమైనా చేయడంలేదు. కాని చేయి అడ్డం పెడ్తున్నాడు. అక్కడ చేరినవాళ్ళు అమీనును బ్రతిమాలాడుతున్నారు. కాని అడ్డుకోవడంలేదు. గిర్దావరు తమాషా చూస్తున్నాడు. డబ్బు ఎక్కువ రాలుతుందని సంతోషపడుతున్నాడు.
గూడెంలో అడుగు పెడ్తున్న సింగన్నకు ఆ దృశ్యం కనిపించింది. భరించలేకపోయాడు. పరిగెత్తాడు. అమీను చేతిలో కర్ర లాగి పారేశాడు. నుంచున్నాడు. జనం బిత్తరపోయింది. అమీను తెల్లపోయాడు. అతని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. సింగన్న యమునిలా కనిపించాడు. క్షణం చిత్తరువై నుంచున్నాడు. గిర్దావరు గూట్లోకి దూరాడు. అంతలో తాను అమీనును అనే విషయం గుర్తుకు వచ్చింది. పక్కన పడివున్న కర్రను అందుకున్నాడు. సింగన్నమీద పడ్డాడు. అప్పటికి సింగన్న తనను అర్థంచేసుకున్నాడు. కిక్కుర మనకుండా దెబ్బలు తిన్నాడు. అమీను బాత్తున్నాడు. సింగన్న కదలడు. అమీను కాళ్ళమీద పడ్డారు కుర్రాడు. తెలియదన్నాడు. క్షమించాల్సిందని ఏడ్చాడు.గిర్దావరు బయటికి వచ్చాడు. అమీను ప్రార్థనలకు లొంగలేదు. కాని అలసిపోయాడు. కర్ర పారేసి తడుస్తూ మంచంలో కూలబడ్డాడు. అమీను వీపుచరిచాడు గిర్దావరు. "విరిచి కట్టుండి లం...కొడుకును" ఆజ్ఞాపించాడు అమీను.
తలారులు సింగన్నను విరిచికట్టారు. అతని గుండె మండుతూంది. అయినా మౌనంగా ఉన్నాడు. తలవంచుకున్నాడు.
"పచాస్ (యాభై) రూప్యే జుర్మానా" అమీను ఆజ్ఞ.
సమ్మయ్య వడికిపోయాడు. కోయగూడెం అదిరిపోయింది. యాభైరూపాయీలు ఏం చేయాలి? కాళ్ళూ కడుపులు పట్టుకున్నారు. పాతికకు ఒప్పించడానికి చూచారు. గిర్దావరు పడనీయలేదు.
సింగన్న కట్టుకొయ్యకే ఉన్నాడు. పిట్టలు వచ్చాయి. మాంసాలు ఉడికాయి. అధికారుల గుడిసెల్లో సంబరాలు సాగేయి. సింగన్న తల్లి సమ్మయ్య భార్య బుడుతుణ్ణి బుజాన వేసుకొని కట్టుకొయ్య దగ్గర చతికిలపడి వలవలా ఏడ్చింది.
సాయంకాలానికి మళ్ళీ చినుకులు మొదలైనాయి. చీకట్లతోపాటు వాన పెరిగింది. కట్టుగొయ్యకు సింగన్న అతని ముందు తల్లి-తండ్రి వానలో తడుస్తున్నారు. పచ్చిబాలెంత వద్దంటే వినదు. రాత్రి సాంతం నానింది. కొడుకును విడిచిపోదు. పోయాడనుకున్నవాడు దొరికాడు. ఎలా వదిలిపోతుంది పాపం తల్లి?