భావరహితంగా అన్నాడు శమంత్. "కాని ఈలోగా కొంతయినా విజయం సాధిస్తాను."
"మిమ్మల్ని అభినందించాలో లేక మిమ్మల్నిచూసి జాలిపడాలో నాకు అర్థం కావడంలేదు మిస్టర్ డియస్పీ" తాత్వికంగా చెప్పుకుపోయాడు రాణా. అతి ప్రముఖుడయిన దేశ ఉపప్రధాని కొడుకుని మీరు నిర్భంధించాలనుకుంటే మీలాంటి వ్యక్తి ఉనికిని సహించని మహేంద్ర మీ పాత్ర ముగించేయాలని ఒక పక్క ప్రయత్నిస్తున్నాడు. దానికి మీ అధికారులూ సహకరిస్తున్నారు. మీపై దాడి జరిగితే మీరు ఐపిఎస్ ఆఫీసరన్న జ్ఞానం సైతం లేని మీ ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడమేగాక మీపై దాడిచేసిన అయిదుగురు నేరస్థుల్ని పరామర్శించి చాలా మామూలుగా విడిచిపెట్టేశారు. మీరున్నది ఎలాంటి సర్కిల్లోనే మీకు తెలుసు. అయినా ట్రబుల్ షూటర్ లా ఇక్కడో రాజ్యం మరణానికి రియాక్టయి ఇటొచ్చారు. ఇప్పటికి చాలాసార్లు రావడం మీకూ తెలుసు. ఇలా ఒక పద్ధతిలో కడతేరిపోతున్న ఆడపిల్లల మరణానికి అసలు కారణమూ తెలుసు. కాని నిరూపించలేరు. ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయని తెలుసు. కాని నివారించలేరు. అది కాదు మిస్టర్ శమంత్" క్షణం ఆగేడు రాణా. "మీ డిపార్టుమెంట్ అవినీతికి పరాకాష్ట ఏమిటో తెలుసా... ఇక్కడ రాజ్యం చావుకి మరెవర్నో కారణంగా నిరూపించాలని ఓ వ్యక్తిని అప్పుడే అరెస్టు చేశారు."
"వ్వాట్"
"ఎస్ మిస్టర్ శమంత్... ఇంకో అనామకుడ్ని కస్టడీలోకి తీసుకున్న మీ పోలీసు బలగం అతన్ని ఒప్పించాలని అప్పుడే నరమేధం ప్రారంభించింది."
* * *
"చెప్పు నా కొడకా"
రోకలితో బలంగా మోకాళ్ళపై కొట్టాడు రాజారెడ్డి.
"నువ్వే చేశానని సంతకం పెడతావా లేదా"
ఒకరూ ఇద్దరూ కాదు. సుమారు పదిహేనుమంది ఒకేసారి శ్రీహర్షని హింసించే కార్యక్రమంలో ఉత్సాహం చూపిస్తున్నారు. అచ్చాదన లేని అతడి శరీరంపై రక్తం కమిలినట్లుగా పేరుకుంటుంది.
నిజానికి అతడు భరించలేకపోతున్నాడు.
జ్ఞానం తెలిసాక ఇంతబాధని ఎప్పుడూ అనుభవించి ఎగరనివాడు. రెప్పపాటులో తనముందున్న వాళ్ళని మట్టి కరిపించగలడు.
కాని జూలీ గుర్తుకొస్తూంది.
నేరస్థుడిగా మారలేక నేరస్థుడై ఇక్కడ పోలీసులచేత వెంటాడబడటం ఇష్టంలేక కోపాన్ని అదిమిపడుతూ బాధని భరిస్తున్నాడు.
కనీసం ఆ తర్వాతైనా తనను నిర్దోషిగా భావించి విడిచిపెడితే చాలన్న ఆశతో శరీరాన్ని అప్పజెప్పి నిశ్శబ్దంగా నిలబడిపోయాడు.
ఇది ఉత్సాహంగా లేదు రాజారెడ్డికి.
అరగంటసేపట్నుంచి మోదుతున్నా ఇంకా నేరం అంగీకరించని శ్రీహర్షని చూస్తుంటే అలసటగా ఉంది... అంతకుమించి ఆందోళనగా ఉంది.
ఏ మనిషి చేతనయినా ఐదు నిముషాలలో చేయని నేరాన్నయినా ఒప్పించగల తన సమర్థతకి ఇక్కడో వ్యక్తి సవాల్ గా నిలబడటం అతని రికార్డ్ కే కళంకంలా అనిపిస్తోంది.
"చచ్చిపోతావ్ ఒప్పుకో."
చేతిలో రోకలి క్రమంగా బరువనిపిస్తుంటే క్రోధంతో కూడిన నిస్త్రాణతో అన్నాడు రాజారెడ్డి "బ్రతకాలీ అంటే నే చెప్పించోట సంతకం పెట్టేయ్."
"నేను హత్య చేయలేదు."
"అది తెల్సురా నా కొడకా" నీరసంతో తూలిపోతున్నాడు రాజారెడ్డి "కాని నిన్ను వదలను. పెద్ద పెద్దోళ్ళకీ మాటిచ్చాను. చాలా బలంగా కమిటైపోయాను. కమిట్ మెంటు తప్పితే నా రికార్డుకే మచ్చ."
"నేను హత్య చేయలేదు."
"ఇక లాభం లేదు." ఉక్రోషంగా తన సిబ్బందికేసి చూశాడు. రాజారెడ్డి "లాకప్ డెత్ తప్పదు" తన కీర్తి కిరీటంలో మరో రాయిగా మారిపోతున్న శ్రీహర్ష విషయంలో ఇక ఉపేక్షించలేడు.
సంజ్ఞ చేశాడు కానిస్టేబుల్స్ ని చూస్తూ.
అంతే...
భీభత్సం ఉధృతమైంది.
భవనానికి పేర్చుతున్నా ఇటుకల్లా పోలీసుల చేతుల్లోని ఆయుధాలు నాట్యం చేస్తున్నాయి.
శరీరం బ్రహ్మజెముడు పొదలా చిట్లిపోతుంది.
శిల మోస్తున్న క్రీస్తులా రెండు చేతుల్నీ గోడకి ఆనించి బాధతో మెలితిరిగి పోతున్నాడు.
ఒక వికృత ప్రపంచాన్ని ఒంటరిగా ఎదురొడ్డి మండుతున్న మిస్సైల్లా అసాధారణమయిన అలజడిని సృష్టించిన 'షా'లో సహనం చచ్చిపోతూంది.
ఎందుకు నన్నిలా రెచ్చగొడుతున్నారు?
ఏం ఆశించి తననిలా హింసిస్తున్నారు?
శరీరం నజ్జుగా మారిపోతుంటే అలవాటులేని అర్థింపు శ్రీహర్ష గొంతులో నేను... హంతకుడ్ని కాను... ప్లీజ్!
"తెలుసు" రాజారెడ్డి ఫకాలున నవ్వాడు "కాని నువ్వో పుండాకోర్ గాడివి" విస్మయంగా చూసాడు శ్రీహర్ష.
"పెద్దలన్న తారతమ్యం లేని లఫూట్ గాడివి."
శ్రీహర్ష పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి.
"అసలు సవ్యసాచిగారుగాని, మహేంద్రబాబుకాని..."
ఆ తర్వాత రాజారెడ్డి ఏమన్నాడో గుర్తులేదు.
ఉన్నవాడికి అమ్ముడుపోయిన ఈ వ్యవస్థ యిప్పుడు తనను హింసిస్తూందని గ్రహించిన మరుక్షణం మెరుపులా వెనక్కి తిరిగాడు.
ఇప్పుడతను నిస్సహాయుడు కాడు. కసితో మండుతున్న అగ్నిహోత్రం.
"బాస్టర్డ్!"
కానిస్టేబుల్స్ క్షణంపాటు కట్రాటలయిపోయారు.
"నీయమ్మ! సర్కిల్ గార్ని అంతమాట..." స్వామిభక్తిని ప్రకటించబోయిన ఓ కానిస్టేబుల్ కళ్ళు బైర్లుకమ్మి నేలకూలిపోయాడు.
ఏం జరుగుతున్నదీ గుర్తించేలోగా మరో అయిదుగురు కానిస్టేబుల్స్ స్పృహ తప్పిపోయారు.
హఠాత్తుగా ఆ సెల్ లో కలవరం... ..