Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 20


    చెంగున దూకి పరిగెత్తారు మిగతా సిబ్బంది.

 

    రాజారెడ్డి సైతం తప్పించుకునేవాడే... కాని అప్పటికే అతడి మొహం శ్రీహర్ష పిడికిలిలో చిక్కుకుపోయింది.

 

    అది క్రమంగా బిగుసుకుంటుంటే చేపపిల్లలా ఉక్కిరిబిక్కిరయిపోతున్నాడు రాజారెడ్డి.

 

    కపాలం చిట్లిపోతున్నట్టుగా ఉంది.

 

    ఏ రాక్షస ప్రవృత్తి కూడదని అంతసేపూ నిభాయించుకున్నాడో అది కాస్త ఆవిరి కావడంతో రాజారెడ్డి మెడ వృత్తంలా తిరిగిపోతూంది.

 

    సరిగ్గా ఇదే సమయంలో...

 

    పారిస్ లోని ఇంటర్ పోల్ హెడ్ క్వార్టర్స్ లో సెక్రట్రీ జనరల్ జాన్ నెపోటే శ్రీహర్షకి సంబంధించిన అతి ముఖ్యమైన వివరాల్ని సేకరించగలిగాడు.

 

    సరిగ్గా నెలా పదిహేనురోజుల క్రితం స్పెయిన్ దేశంలోని ఓ ప్రముఖ ప్లాస్టిక్ సర్జెన్ ద్వారా తన రూపురేఖల్ని మార్చుకున్నాడు శ్రీహర్ష.

 

    ప్రస్తుత రూపం తెలిసిపోయింది.

 

    వెంటనే తన సిబ్బందిని మరో ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడానికి పురమాయించాడు.

 

    కెనడా విదేశాంగశాఖలోని పాస్ పోర్టుల్ని క్షుణ్నంగా పరిశీలిస్తే చాలు శ్రీహర్ష ప్రస్తుతం ఏ పేరుతో సంచరిస్తున్నదీ అర్థమైపోతుంది.

 

    అంతకుమించీ...

 

    ఆ రూపంగల పాస్ పోర్టుతో శ్రీహర్ష కెనడానుంచి ఏదేశానికి ప్రయాణం చేసిందీ బోధపడిపోతుంది.

 

    శ్రీహర్ష ఆచూకీ తెలుసుకోవడంలో పూర్తి విజయాన్ని సాధించాడు నెపోటే.

 

    ఇంటర్నేషనల్ డెత్ వారెంట్ గల శ్రీహర్షపై మరో బలమయిన 'ఎత్తు'కి పథకం వేశాడు నెపోటే.

 

    "స్టాపిట్."

 

    ఆ క్షణంలో శమంత్ అక్కడికి రావడం రాజారెడ్డి చేసుకున్న అదృష్టం. దూకుడుగా శ్రీహర్షని చేరుకున్న శమంత్ "ప్లీజ్ కూల్ డౌన్" అన్నాడు అర్థింపులా...

 

    పట్టు సడలించాడు శ్రీహర్ష "ఎందుకు... నేను చేయని తప్పుని నన్నెందుకిలా రెచ్చగొడుతున్నారు? అసలు నన్నెందుకిలా వారించారు" నిభాయించుకుంటూ అడిగాడు.

 

    "మీరు రాజ్యాన్ని హత్య చేయలేదని నాకు తెలుసు కాబట్టి... యిక్కడ ఓ హత్యచేసి మీరు హంతకుడిగా మారడం నాకు యిష్టంలేదు కాబట్టి".

 

    తూలిపోతున్న శ్రీహర్షకి ఆసరాగా మారాడు శమంత్. రక్తసిక్తమైన అతడి శరీరాన్ని చూడగానే బోధపడిపోయింది ఎంత దారుణంగా అతను హింసించబడ్డాడో అన్న విషయం.

 

    ఏ క్షణంలో అయినా స్పృహ తప్పేట్టున్నాడు శ్రీహర్ష.

 

    అక్కడ కొందరు కానిస్టేబుల్స్ రాజారెడ్డికి సపర్యలు చేస్తున్న సమయంలో శమంత్ శ్రీహర్షని యింటికి తీసుకెళ్ళాడు.

 

    డాక్టర్ పిలిపించడంగాని, ఫస్ట్ ఎయిడ్ చేయించడంగాని శ్రీహర్షకి గుర్తులేదు.

 

    మగత నిద్రలోకి జారిపోయాడు.

 

    రేవతి గుండె బెదిరిపోయింది.

 

    తమకు ఏమీకాని ఆ వ్యక్తి తన భర్తను రక్షించిన ఒకే ఒక నేరంపై యీ స్థితిని ఎదుర్కోవాల్సివచ్చిందీ అన్న ఆలోచనో లేక తన పసుపు, కుంకుమలు కాపాడిన అతడ్ని కాపాడుకోవడం తిరుగులేని తన విద్యుక్తధర్మం అన్న భావమో తోబుట్టువులా కంటతడి పెట్టుకుంది.

 

    ఇక్కడ శ్రీహర్ష యిలా ఉండగానే శమంత్ యూనిఫారంలో స్టేషన్ కి వెళ్ళాడు.

 

    "మిస్టర్ రాజారెడ్డి" అసహనంగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు "నేనున్నా ప్రస్తుత స్థితిలో నిజానికి డ్యూటీలో చేరాల్సిన అగత్యం లేదు. కాని మీకోసం శలవు పెట్టకుండా స్టేషనుకి రావాల్సి వచ్చింది."

 

    వినయంగా నిలబడ్డాడు రాజారెడ్డి. పొద్దుటనుండి ఆలోచిస్తున్నాడు కపాలాన్ని వేళ్ళతో పీకేయడం సాధ్యమా అన్న విషయం గురించి. ఇంకా జవాబు దొరక్క ముందే శమంత్ స్టేషనులో అడుగుపెట్టాడు కపాలంలోని మెదడు తినడానికన్నట్టు."

 

    "వెల్" శమంత్ సూటిగా అడిగాడు "అతడ్ని నిర్భంధించడానికి మీకున్న ఆధారాలేమిటి?"

 

    నిశ్శబ్దం.

 

    "కనీసం క్లూసేమన్నా దొరికియా?"

 

    జవాబు లేదు.

 

    "మరి పని గట్టుకుని అతడ్నే కస్టడీలోకి తీసుకోవడంలో మీ వుద్దేశ్యం?"

 

    "రాజ్యం మరణవాగ్మూలంలో తెలియజేసిందా...? స్పీక్."

 

    "లేదండి. ఆవిడ శవం మనం చూసేటప్పటికే సముద్రపొడ్డున దొరికిందండీ."

 

    "కరెక్ట్ యువర్ సెల్ఫ్. "మనం కాదు."

 

    "అవును సర్. మేం."

 

    "మేం అంటే" శమంత్ వెంటనే అడిగాడు "ఎవరెవరూ"

 

    "నేనూ, మన కానిస్టేబుల్స్."

 

    "అక్కడ శవం వుందని ఎవరన్నా చెబితే వెళ్ళారా లేక సముద్రపొడ్డున శవాలు వుండును అనే థియరీ బలంగా నమ్మి సీషోని చేరుకున్నారా"

 

    రాజారెడ్డి గొంతు తడారిపోయింది "అదేం లేదుసర్" ఉదయం అయిదుగంటలకి జాగింగ్ కెళ్ళిన మహేంద్రబాబుకి శవం కనిపించగానే మాకు ఫోన్ చేసి చెప్పాడు.

 

    "ఐసీ." చాలా అర్థమైనట్టు తలపంకించాడు శమంత్. "మహేంద్ర జాగింగ్ కి వెళ్ళాడా... అక్కడ శవం కనిపిస్తే మీకు ఫోన్ చేశాడా?"

 

    "ఎక్కడికి ఫోన్ చేశాడు?"

 

    "మా యింటికి" తత్తరపడుతూ చెప్పాడు.

 

    "అప్పుడు మీరేం చేసారు"

 

    "వెంటనే రంగంలోకి దూకేసానండి"

 

    "ఐసీ." రెండు క్షణాలు నిశ్శబ్దంగా వుండిపోయాడు శమంత్. "సముద్రపొడ్డున శవం కనిపిస్తే ఆ జూరిస్ డిక్షన్ కు చెందిన పోలీసులకు కాక ఎక్కడో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ కు సంబంధించిన మీరు కర్తవ్యదీక్షతో మీదికాని కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలని పాపం హోటల్లో అడుగుపెట్టి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. చిత్రమేమిటంటే అతడుంటున్న హోటలు కూడా మీ జూరిస్ డిక్షన్ లోది కాదు."

 

    రాజారెడ్డికి ముచ్చెమటలు పోస్తున్నాయి "క... క... కరెక్టుసర్... కాని మహేంద్ర."

 

    "దేర్ యూ ఆర్" ఆవేశంగా పైకిలేచాడు శమంత్. 'నువ్వీ పని చేసింది మహేంద్ర ఆదేశంపై... ఎందుకంటే నువ్వు వాడితొత్తువి కనుక. నీకు ప్రజల సొమ్ముతింటూ బ్రతుకుతున్నావన్న విశ్వాసం లేదు. వాడ్ని సంతృప్తి పరచాలన్న ఆలోచన తప్ప, ఒక నిరపరాధిని అమానుషంగా బాధిస్తున్నానన్న వూహలేదు వాడి అడుగులకి మడుగులొత్తడం తప్ప. యూ బచ్చర్! నీలాంటి రాస్కెల్స్ మూలంగా మన డిపార్టుమెంటు పరువు మంటగలిసిపోతుందన్న సెన్స్ లేకపోయినా పర్వాలేదు కాని ఒక నిర్దోషిని దోషిగా నిరూపించే హక్కు నీకెవడిచ్చాడు? చెప్పు. ఏ ఆధారంతో అతడ్ని నేరస్తుడనుకున్నావు?

 Previous Page Next Page