Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 18


    "నువ్వు కిల్లాడి నెంబర్ వన్ వి. నిన్నరాత్రి నువ్వో అమ్మాయిని రేప్ చేసి చంపావు కాబట్టి నిన్ను అరెస్టు చేస్తున్నాను. నడువ్."

 

    కానిస్టేబుల్స్ నెడుతుంటే అప్రతిభుడయ్యాడు శ్రీహర్ష.

 

    ప్రతిఘటించడం సమస్యకాదు.

 

    మామూలు స్థితిలో అయితే ఈపాటికే ఒకరిద్దరి కంఠాల్ని వృత్తంలా తిప్పి ప్రాణాలు తీసేవాడే.

 

    ఈ దేశంలోనే వున్న తనబిడ్డ జూలీని కలుసుకోవాలీ అంటే తను హంతకుడిగా మారకూడదు.

 

    కేవలం జూలీ కోసం తన ఆవేశాన్ని అదుపు చేసుకోవాలి.

 

    తన విషయంలో పోలీసులు పొరపడుతున్నారనుకున్న శ్రీహర్ష సున్నితంగా సమస్యనించి బయటపడాలని భావించాడు తప్ప తానో ట్రేప్ లో ఇరికించబడుతున్నాడని ఊహించలేకపోయాడు.

 

    స్టార్ హోటల్ ముందున్న జీప్ లో ఎక్కిన శ్రీహర్షని దూరంనించే గమనిస్తున్న ఓ ఆకారం నెమ్మదిగా పబ్లిక్ టెలిఫోన్ బూత్ ని చేరుకుంది.


                                   *  *  *


    జనం హోరుతో జార్జ్ హాస్పిటల్ దద్దరిల్లిపోతూంది.

 

    ఉదయం పదిగంటలకల్లా యూనివర్సిటీ విద్యార్థులంతా మార్చ్యురీ ముందు నిలబడి నినాదాలు మొదలుపెట్టారు.

 

    పటిష్టమయిన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయబడ్డా విద్యార్థుల్ని అదుపు చేయలేకపోతున్నారు.

 

    శమంత్ ఇంకా కోలుకోలేదు.

 

    అయినా గాయాలతోనే అక్కడికి చేరుకున్నాడు.

 

    తనపై దాడిచేసిన వ్యక్తులు ఇంటరాగేషన్ కు ముందే విడుదలచేయబడ్డారన్న ఉక్రోషం ఒకపక్క, తన డిపార్ట్ మెంటులోని అధికారులే నేరస్థులకు కొమ్ముకాస్తున్నారన్న బాధ మరోపక్క అతడ్ని వివశుడ్ని చేస్తుంటే జనం మధ్యనుంచి మార్చ్యురీ గదిని సమీపించాడు.

 

    లోపల నేలపై పరుండబెట్టిన రాజ్యం శవం కనిపిస్తూంది.

 

    సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న మరోవ్యక్తి.

 

    ఈమె కూడా యూనివర్సిటీ విద్యార్థిని.

 

    అదే శమంత్ ని అక్కడికి రప్పించింది కూడా.

 

    సరిగ్గా ఇలాంటి మరణాల విషయంలోనే పరిశోధన ప్రారంభించిన శమంత్ ఒక చిన్న ఆధారంతో మహేంద్రని అనుమానించి అతడ్ని వేటాడటం ప్రారంభించాడు. ఒక బలమైన వ్యవస్థకి ప్రత్యర్థిగా మారాడు. ఇది పన్నెండో శవం. ఇంకా ఇలా ఎంతమంది ఆహుతయ్యేదీ తెలీదు కాని ప్రతి శవాన్నీ అటాప్సీలోనే కలుసుకుంటున్నారు తప్ప అంతకుమించి అవసరమయిన వాస్తవాల్ని సేకరించలేకపోతున్నారు.

 

    రాజ్యం మొహంలో ఇంకా కనిపిస్తున్న అలజడి కాదు శమంత్ ని కదిలించింది.

 

    ఓ మూల గుండెలవిసేలా ఏడుస్తున్న ఓ వృద్ధుడు చుట్టూ చేరిన వాళ్ళతో రాజ్యం గురించి కథలా చెపుతున్నాడు. దాన్ని మీరు అర్థం చేసుకోండయ్యా. అది ఇలా చచ్చి తప్పు చేసిందేమోకాని తప్పు చేసినందుకు చచ్చిపోయుండదు. పిచ్చితల్లికి తండ్రన్నా, చెల్లెళ్ళన్నా చచ్చేంత ప్రేమబాబూ. అందుకే అంత ప్రేముందని నిరూపించడానికి చచ్చిపోయుంటుంది. ఇంతప్పటినుంచి అది కొడుకులా మాటాడింది. నిన్న మొన్నటిదాకా నీకు నేనున్నాను అని నా తల్లిలాగే నన్ను ఓదార్చింది -- మరెందుకు చచ్చిపోయిందీ అంటే -- నాలాంటి నిరుపేద తండ్రికి కూతురిలా బ్రతకలేక -- అంతే -- అంతేతప్ప అది మంచి పిల్లే.

 

    ఆడపిల్ల అస్థికలతోసైతం జూదమాడే లోకపు నడిబొడ్డున నిలబడ్డ ఓ తండ్రి ఇక్కడ తన కూతురి మరణానికి ఆ స్థితిలో సైతం అందమైన సంజాయిషీ ఇస్తున్నాడు.

 

    ద్వేషం ఎవరిమీదో తెలీదు.

 

    ఆడపిల్లల శీలానికి నిప్పంటించి జువ్వలా పైకి దూసుకుపోయే దుమారాల రూమర్లకి ఇప్పుడు ఆ తండ్రి భయపడుతున్నాడు. మరణం గురించి కాదు... మిగిలిన రుణం గురించి బాధపడుతున్నాడు.

 

    ఉద్విగ్నంగా శమంత్ వెనక్కి తిరగబోతూండగా మొదలయింది అలజడి.

 

    ఉన్నట్టుండి విద్యార్థులు పోలీసులపై రాళ్ళు రువ్వుతున్నారు.

 

    పోలీసులకి ప్రతికూలంగా కేకలు పెడుతూ తమ రోషాన్ని చల్లబరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

    లాఠీచార్జి మొదలయింది.

 

    జనం కకావికలమధ్య తొక్కిసలాట -- గాయాలు.

 

    శమంత్ నిశ్శబ్దంగా చూస్తుండగానే ఓ రాయి అతడి నుదుటిపై గాయం చేసింది.

 

    కోపం రాలేదు -- ఆనందంగా వుంది. కాలుతున్న వ్యవస్థలో న్యాయం చేయలేని కాటికాపరిలా నిలబడ్డ నిజాయితీగల ఓ పోలీసాఫీసరు ఆ క్షణంలో ఎందుకలా ఆలోచిస్తున్నదీ ఆ స్థితిలో వున్నవాళ్ళకి తప్పు అర్థంకానిది.

 

    అతడా ట్రాన్స్ లో ఉండగానే ఎవరో గోడవారగా లాగారు.

 

    విదిలించుకుబోతూ చూసాడు.

 

    రాణా నిలబడివున్నాడు సమీపంలో.

 

    ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టరైన రాణా శమంత్ కి సుపరిచితుడే. సంచలనాత్మకమైన వార్తల సేకరణలో రాణా చాలామంది పోలీసాఫీసర్లకి ప్రత్యర్థిలాంటివాడయినా శమంత్ కి ఆత్మీయుడయిన వ్యక్తి.

 

    దూరంగా కేకలు, ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తున్నాయి.

 

    "ఐలవ్యూ మిస్టర్ శమంత్. కాబట్టే కొంత శారీరకంగా, చాలా మానసికంగా గాయపడ్డ మిమ్మల్ని అలా వదిలిపెట్టలేకపోయాను" నవ్వాడు రాణా. "అయినా ఇదేమిటి అప్పుడే హాస్పటల్ నుంచి బయటి కొచ్చేసారు."

 

    శమంత్ జవాబు చెప్పలేదు.

 

    "మీ వేగం భరించలేని ప్రత్యర్థులు మిమ్మల్ని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలనుకుని విఫలమయ్యారు. కనీసం కొద్దికాలంపాటు అక్కడ విశ్రమించయినా ఆ వ్యవస్థకి కాస్త స్వేచ్చ ఇవ్వొచ్చుగా."

 

    నిర్లిప్తంగా నవ్వేడు శమంత్ "ఏం చేయగలిగాను రాణా? గాలిలా ణా చుట్టూ పేరుకుపోయిన వాళ్ళని పిడికిలితో బంధించాలనుకుంటున్నానే తప్ప ఏం సాధించానని."

 

    "అలాంటప్పుడు మీ పై అధికారులందరితో మీరే చేతులు కలిపేయొచ్చుగా."

 

    "అది చావులాంటి జీవితం."

 

    "ఆ జీవితాన్ని అంగీకరించకపోతే చావు ఖాయం" చనువుగా అన్నాడు రాణా.

 

    "పోరాడుతూ చావడాన్ని నేను ఇష్టపడతాను."

 Previous Page Next Page