Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 19


    హాస్పిటల్ లో చేరాక వారంరోజులవరకూ ఏవేవో పరీక్షలు చేస్తూ, చివరకు అక్కడి డాక్టర్లందరూ శేఖర్ పరిస్థితికి తృప్తి పడి, ఆపరేషన్ కు అనువైన కేసుగా నిర్ణయించి ఒకానొకరోజు విజయవతంగా నిర్వహించారు.

    మాలతికి అవి విషమ ఘడియలు. కొంతమంది జీవితాలు మధ్యలోనే చిరిగిపోయి, అంతటితో అర్ధం లేకుండా ముగిసిపోతూ వుంటాయి. జీవితాలనేవి చాలా అనుభవాలపుట్టలు. బయటకు కనిపించేవి పదివంతులుయితే లోపల జరిగేవి తొంభయివంతులు. కొంతమంది మామూలుగా వున్నట్టు కనిపిస్తూ -ఏ డెబ్భై ఏళ్ళో, ఎనభ్యైఏళ్ళో బ్రతికిన వాళ్ళని చూస్తే ఏ ఎగుడుదిగుళ్ళూ లేకుండా ఎలా బ్రతికారా? ఇది సాధ్యమా అనిపిస్తుంది.

    "నేను జీవితంలో ఓడిపోకూడదు" అనుకుంది మాలతి.

    ఈ అధ్యాయంలో ఆమె ఆశ ఫలించింది.

    పోస్ట్ ఆపరేటివ్ కేర్ లో ఆమె కంటికిరెప్పలా శేఖర్ ని కాపాడుకుంటూ వచ్చింది.

    దాదాపు నెలరోజులు అక్కడ వుండాల్సివచ్చింది.

                                          9

    అక్కడ్నుంచి బయల్దేరేముందు ఊరువెళ్ళాక ఏమేమి చెయ్యాలో, ఎలా వుండాలో అన్నీ బోధించారు. మూడు నెలలదాకా బహు జాగ్రత్తగా వుండాలి. అతన్ని గాజుని చూసినట్లు భద్రంగా చూసుకోవాలి. శరీరానికి ఏమాత్రం అలసటా, మనసుకు ఏమాత్రం ఆవేశమూ కలగనివ్వకూడదు. మూడునెలల తర్వాత మళ్ళీ చెకప్ కు వచ్చి, డాక్టర్లు అనుమతిస్తే అప్పుడు మామూలు జీవితం సాగించవచ్చు.

    రాయవెల్లూరునించి మద్రాస్ వచ్చి అక్కడ్నుంచి మెయిల్ లో బయల్దేరారు. విజయవాడలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని వేరే రైల్లో హైదరాబాద్ వెళ్లాలని సంకల్పం.

    కంపార్టుమెంటులోకి ఎక్కి చూసిన మాలతి గుండెని ఎవరో నొక్కినట్లు బాధపడింది. మాలతికీ, శేఖర్  కీ పైబెర్తులు వచ్చాయి. క్రింద రెండూ ఎవరివో. ఆ ప్రయాణీకులింకా రాలేదు. క్రిందసీట్లో కూర్చోబెట్టి గోపయ్యని తోడుగా వుంచి టి.సి తో మాట్లాడి వద్దామని మాలతి ప్లాట్ ఫారం మీదకు వచ్చింది.

    ప్లాట్ ఫారమంతా జనసమ్మర్ధంగా, హడావుడిగా వుంది. టి.సి  ఎక్కడ వున్నాడా అని నలువైపులా కళ్ళతో వెదుకుతూ నడుస్తోన్న మాలతి హఠాత్తుగా ఎవరో ఢీకొన్నట్లయి అడిరిపడింది. ఆమెచేతిలోని వెనీటీ బాగ్ క్రింద పడిపోయింది.

    మాలతి కోపంగా ఈ పనిచేసింది ఎవరా అని చూసేసరికి పొడవూ, దృఢంగా వున్న ఓ వ్యక్తి "ఐ యామ్ సారీ" అంటూ క్రిందకు వంగి బ్యాగ్ తీసి ఆమెచేతికి అందించాడు. బ్యాగ్ అందుకుంటూ మాలతి అప్రయత్నంగా అతని ముఖంలోకి చూసింది. అతనికి దాదాపుగా శేఖర్ వయసే వుంటుంది. ముఖంలో కొంటెతనం, కళ్ళలో ఆకలి తనవైపు సభ్యతను దాటి ప్రసరిస్తోన్న చూపులూ, పెదాలమీద సందర్భంలేని చిరునవ్వూ - అతని ప్రవర్తన నచ్చక "థ్యాంక్స్"అంటూ ముఖం ప్రక్కకి త్రిప్పుకుంది.

    "మెన్షన్ నాట్!" అంటూనే "చూడండి, మిమ్మల్నెక్కడో చూసినట్లుగా వుంది" అన్నాడు.

    "నేనెప్పుడూ చూడలేదు మిమ్మల్ని" కోపంగా అని ముందుకు కదలబోయింది.

    "వన్ మినిట్. ఏమీలేదు, కొంతమందిని మొదటిసారిగా చూసినప్పుడే ఇదివరకే వారితో పరిచయమున్నట్లు అనిపిస్తుంది. అదే వారిలోని ఆకర్షణ..."

    అతని అతిచనువు ధోరణకి మాలతి విస్తుపోయింది. జవాబు చెప్పకుండా తన దారిన పోదామనుకుంది గానీ లోపల్నుంచి పొంగుకువస్తున్న ఆవేశం అణచుకోలేక "కొంతమందిని చూస్తే జీవితంలో మళ్ళీ కలుసుకోకూడదనిపిస్తుంది" విసురుగా అని ముందుకు నడిచింది.

    ఆమెకు టి.సి. కనిపించాడు. అతనితో తనభర్తకు హార్ట్ ఆపరేషన్ అయిందనీ పైబెర్తు ఎక్కలేడనీ, ఎలాగైనా ప్రయత్నించి క్రింద ఏర్పాటుచేస్తే బాగుంటుందనీ అడిగింది. 'రండీ చూద్దాం, కో పాసింజర్ సహకరిస్తే వీలవుతుంది' అంటూ టి.సి. ఆమెతోపాటు కంపార్టుమెంటు దగ్గరకు వచ్చాడు.

    అప్పటికి ఒక ప్రయాణీకుడు వచ్చివున్నాడు. అయితే అతను ఎనభైఏళ్ల ముదుసలి. దానికితోడు ఉబ్బసం వున్నట్లు ఊరికే రొప్పుతున్నాడు. అతన్ని చూస్తోంటే అడగటం అనవసరమే అనిగాక, తప్పు అనికూడా అనిపించింది. రెండో ప్రయాణీకుడింకా రాలేదు.

    "మీరు కూర్చునివుండండి మేడమ్! వేరేపని చూసుకుని ఇప్పుడే వస్తాను" అని చెప్పి టి.సి. వెళ్ళిపోయాడు.

    "ఫర్వాలేదు మాలతీ! నేను పైబెర్తుమీదకు వెడతాను" అన్నాడు శేఖర్.

    మాలతి అతనివంక నవ్వుతూ చూసి "వెళ్ళగలరు, కానీ నేను వెళ్ళనివ్వను" అన్నది.

    శేఖర్ కూడా నవ్వాడు. "ఇంటికి వెళ్ళాక నీతో చాలా ప్రమాదాలున్నాయి, నాకు తెలుసు" అన్నాడు.

    "మీకు తెలుసు. కానీ మీతో నాకూ తిప్పలున్నాయనీ నాకు తెలుసు" అని మాలతి ఆ రెండో ప్రయాణీకుడు ఎంతకూ రాడేమని విసుక్కుంటూ డోర్ దగ్గరకు వచ్చింది.

    సరిగ్గా అదే సమయానికి "మేడమ్! కొంచెం దారి ఇస్తారా?" అంటూనే ఒక వ్యక్తి ఆమెను రాసుకుంటూ పైకి ఎక్కి "అరె, మీరా?" అన్నాడు.

    మాలతి అతన్ని గుర్తుపట్టి తిరస్కారంగా చూసింది.

    "జీవితంలో రెండోసారి చూడకూడనుదన్న మనిషి, అయిదు నిముషాలన్నా గడవకముందే రెండోసారి సిద్దమయిపోయాడు. చూశారా విధి? అంతేకాకుండా మనమిప్పుడు ఒకే కంపార్టుమెంటులో ప్రయాణం చేస్తున్నామన్నమాట."

    ఆ రెండో ప్రయాణీకుడెవరో తెలిసినమీదట మాలతి గతుక్కుమని నోటమాట రానట్లయిపోయింది. పోర్టర్ అతనితాలూకు సామాను లోపల పెడుతున్నాడు.

    ఇతన్నా తను రిక్వెస్ట్ చెయ్యాల్సింది?

    అతను ఆమె మాట్లాడకపోవటం చూసి ఒకరకంగా నవ్వి లోపలకు వెళ్ళాడు.

    "అరె, శేఖర్!"

    "ఒరే, శంకర్!"

    "ఏమిటిది? నిజమే? నిన్నేనా నేనుచూస్తున్నది?  అబ్బ! ఎన్నాళ్ళయిందిరా?"

మాలతి ఈ మాటలువింటూ ఆశ్చర్యంలోంచి కోలుకుని లోపలకు నడిచింది.                              

 Previous Page Next Page