Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 18


    మాలతి తల వంచుకుని మెదలకుండా వింటోంది.

    "ఏమ్మో, బాధపడుతున్నావా?"

    "లేదు, ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్నీగురించి రెండో ఆలోచన చేయటం నాకలవాటు లేదు."

    "అతనికి ఆపరేషన్ చేయించాలమ్మా! వెంటనేకాదు, అయిదారు వారాలు గడిచాక - అంటే గుండె ఆపరేషన్ తట్టుకునే స్థితికి వచ్చాక. లేకపోతే ఈ ఎపిసోడ్స్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి."

    "మీరు ఎలా చెబితే అలా చేస్తాం డాక్టర్! ఆయన్ని తిరిగి ఆరోగ్యవంతుణ్ణి చేయడమే నా లక్ష్యం."

    అపరేషన్ రాయవేలూరులో అయితే బాగుంటుడమ్మా! నేనక్కడికి ఉత్తరం రాసి అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఈలోపల అతను బాగా రెస్టు తీసుకుంటూ వుండాలి. ఏ మాత్రం ఎక్సయిట్ కాకూడదు. డాక్టర్లు అనుమతించేదాకా మీ ఇద్దరి మధ్యా....."

    మాలతి అర్ధమైనట్లు తల ఊపింది.

    "వస్తానమ్మా! ఈ విషయాలు మెల్లగా అతనికి చెప్పు."

    ఆయన వెళ్ళిపోయాక మాలతి తలుపులు తెరచి గదిలోకి అడుగుపెట్టింది.

    గోపయ్య బయటకు వచ్చేశాడు.

    "మాలతీ! నాజబ్బు సీరియస్ నెస్ గురించి డాక్టరు చెబుతున్నాడు కదూ?"

    "అహ, అదేంలేదు" అంటూ ఆమె అతని ప్రక్కకివెళ్ళి కూర్చున్నది.

    "ఆయన నాకు ముందే ఈ సంగతి చెప్పివుంటే నేనసలు పెళ్లే చేసుకునేవాడ్ని కాదు మాలతీ! నీ జీవితం నాశనం చేశాను."

    "మీరు నన్ను అవమానిస్తున్నారు."

    "కాదు, నా ఆవేదన చెబుతున్నాను."

    "మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినా పట్టుబట్టి నేనే చేసుకునేదాన్ని. ఈ మాలతిగురించి మీకు తెలియదు."

    "నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకునేందుకు ప్రయత్నించకు మాలతీ!"

    "ఆత్మవంచన చేసుకునే అలవాటు మొదట్నుంచీ లేదు. జీవితమన్నాక అనుకోని సంఘటనలు అనేకం ఎదురవుతుంటాయి. నిలబడి వాటిని తట్టుకోవాలిగానీ కలవరపడి పారిపోకూడదు. పోనీ ఇది నాకిష్టమైన చేదు. సరేనా?"

    "మాలతీ!" అతని గొంతు వణికింది.

    "కొందర్ని కొందరు వ్యక్తులు అదృష్టవంతుల్ని చేస్తారుగానీ విధి ఆ దృశ్యం అనుభవించ నివ్వలేదు."

                                        *  *  *

    ఆ రాత్రి ఏ పన్నెండు దాటాకో మాలతికి నిద్రపట్టింది. ఆ నిద్రలో ఎన్నోకలలు. అందులో ఓ కలలో భానుమతి తన ఎదుట నిలబడి బెదిరిస్తున్నట్లు, సరదాలు చేస్తున్నట్లు ఎన్నో రూపాలలో గోచరిస్తోంది.

    "మాలీ! నువ్వు గెలవలేవు."

    "గెలిచి తీరతాను భాను. గెలిచి తీరతాను."

    "జీవితం నీకన్నా బలమైనది."

    "నేను స్త్రీని. స్త్రీ, జీవితంకన్నా బలమైనది."

    "చూద్దాం."

    "అలాగే చూద్దాం"

    ఆ కల ముగిసిపోయింది.

    మెడమీద సున్నితమైనవేవో వ్రాలినట్లు, అవి ముందుకు పాకుతున్నట్లు శరీరమంతా పులకించినట్లు అనుభూతి.

    కళ్ళు తెరిచింది. బెడ్ లైట్ వెలుతురులో ఎప్పుడు జరిగాడోగానీ శేఖరం తన ప్రక్కమీదనుంచి ఆమె ప్రక్కమీదకు జరిగాడు. ఆమె మెడనీ, చెంపల్నీ మృదువుగా సవరిస్తున్నాడు. అప్రయత్నంగా ఆమె చేతులుకూడా అతన్ని చుట్టుకున్నాయి.

    అతని ముఖం ఆమె ముఖానికి దగ్గరగా వచ్చింది. మాలతికి ఏదో పిచ్చి ప్రేమ, వ్యామోహం నరనరాలా వ్యాపించినట్లయి అతని ముఖాన్ని మరింత దగ్గరగా లాక్కుని పెదవులమీద గట్టిగా ముద్దు పెట్టుకుంది.

    "మాలతీ!"

    "ఊ"

    "తప్పదు, నువ్వు నాకు కావాలి."

    వెన్నుమీద కొరడాతో ఛళ్ళున కొట్టినట్టయింది. గభాల్న అతన్నుంచి తప్పించుకుని "ఇదేమిటి? నా ప్రక్కలోకి ఎందుకొచ్చారు? మీరెంత జాగ్రత్తగా వుండాలో తెలుసా?" అన్నది అందోళనతో.

    "నేను జాగ్రత్తగా వుండను. అసహజమైన జాగ్రత్తకన్నా సహజమైన ప్రకృతే నాకు కావాలి. మాలతీ ప్లీజ్!" అంటూ అతను మళ్ళీ ఆమెను దగ్గరకు లాక్కోబోయాడు.

    ఆమె విడిపించుకుని చప్పున లేచికూర్చుంది. "మీరు చదువుకున్నవారు, సమస్యను అర్ధం చేసుకోగలిగే హృదయముంది. మొండితనం చెయ్యకండి. దయవుంచి మీ ప్రక్కమీదికి వెళ్ళి పడుకోండి" అంది కఠినస్వరంతో.

    ఒక్కనిముషం మెదలకుండా వుండిపోయి, అతను తన మంచంమీదకి జరిగి గోడవైపు తిరిగి పడుకున్నాడు.

    మాలతి తన మంచాన్ని కొంచెం అవతలకు లాగి, అతని ప్రక్కకి వెళ్ళి కూర్చుని "కోపం వచ్చిందా?" అన్నది మృదువుగా.

    అతనేం మాట్లాడలేదు.

    "చెప్పండి, కోపం వచ్చింది కదూ?" అంది మళ్ళీ అతని భుజంమీద చెయ్యివేసి నిమురుతూ.

    "ఏం....లేదు...."

    "చూడండి.....డాక్టరుగారి సలహాప్రకారం నడుచుకోవలసిన బాధ్యత మనకుంది. నేనెవర్ని? మీ భార్యను. మీ ప్రాణాన్ని, రక్తాన్ని, ఊపిరిని.  మీ శ్రేయస్సు నాకంటే ఎక్కువ ఎవరికీ తెలుసు? డాక్టరుగారు ఈవేళ చాలా విషయాలు నాతో మాట్లాడారు. ఖంగారు పడకండి.....మీకు ఆపరేషన్ చేయించాలట. రాయవెల్లూరు అయితే మంచిదట. ఆపరేషన్ చేయించుకుంటే మీరు మళ్ళీ మామూలు మనిషయిపోతారు. అప్పట్నుంచీ మనం నిజమైన దంపతులం. చెప్పండి ఆపరేషన్ చేయించుకుంటారు కదూ.....?"

    శేఖరం ఇటువైపు ఒత్తిగిల్లి, ఆమెచేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

    "నీ ఇష్టం మాలతీ! నువ్వేది చెప్పినా నేను కాదనలేను."

    ఆపరేషన్ జయప్రదంగా ముగిసింది. డాక్టరు కృష్ణారావుగారు రాయవెల్లూరుకు తనుకూడా వద్దమనుకున్నారు గానీ, తన నర్సింగ్ హోంలో చాలా సీరియస్ కేసులుండటంవల్ల వీలుకాలేదు. మాలతి గోపయ్యను తోడుగా తీసుకుని బాధ్యతంతా తానే స్వీకరించింది.                                             

 Previous Page Next Page