ఆ వ్యక్తి శేఖర్ ప్రక్కన కూర్చుని వున్నాడు. అతని చేతులు శేఖర్ చేతుల్లో వున్నాయి. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకుంటున్నంత చేరువగా వున్నారు.
శేఖర్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది.
"మాలతీ! నా ప్రాణస్నేహితుడు శంకర్ అని చెప్పానే వీడే. ఇద్దరం సంవత్సరాల తరబడి ఒకే రూంలో వున్నాం. ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకున్నామన్నా అతిశయోక్తి లేదు. మాలతీ! వీడు నాటకాలాడ్డంలో ఉద్ధండుడు. గొప్ప స్టేజి యాక్టరన్నమాట! కాలేజీలో ఆడపిల్లలంతా వీడంటే పడి చచ్చేవాళ్ళు."
"అంత అవేశం ఎందుకండీ? డాక్టర్లు ఏం చెప్పారు?" అంది మాలతి వారించడానికి ప్రయత్నిస్తూ.
"మాట్లాడనియ్యి మాలతీ! వీడంటే నాకెంత ఇష్టమో తెలుసా? వీడిని మళ్ళీ చూస్తానని కల్లోకుడా అనుకోలేదు. నిజంగా నాకెంతో ఆనందంగా వుంది. అన్నట్లు శంకర్! మా శ్రీమతిని పరిచయం చెయ్యలేదు కదూ.....?"
"పరిచయం చెయ్యక్కరలేదు" అన్నాడు శంకర్ నవ్వుతూ.
"అయితే మా కో ప్యాసింజర్ నువ్వే అన్నమాట. ఈ మధ్య నాకు హార్టు ఆపరేషన్ జరిగిందిలే. స్ట్రెయిన్ తట్టుకోలేనని నేను పైబెర్తుమీదకు వెళ్ళటం మాలతికి ఇష్టంలేదు......అన్నట్లు ఇప్పుడేం చేస్తున్నావు?"
"బిజినెస్!"
"ఏం బిజినెస్?"
"ఒకటేమిటి? చాలావున్నాయి. తాపీగా చెప్పకపోతే అర్ధంకాదు. సరే, నీకు హార్టు ఆపరేషనేమిట్రా?"
శేఖర్ వివరించి చెప్పాడు.
"మైగాడ్! చిన్నతనంలో ఏమాత్రం సూచనగానైన తెలియలేదే? పోన్లే, అంత పెద్ద ఆపరేషన్ తట్టుకుని తిరిగి మనిషివయినందుకు ఎంతో సంతోషంగా వుందిరా శేఖర్!"
"సరేకానీ, ఎంతవరకూ నువ్వు?"
"హైదరాబాద్!"
"అరె? అయితే నువ్వు బయటెక్కడా వుండటానికి వీల్లేదు. మా ఇంట్లో దిగాల్సిందే..."
మాలతి ముఖం పాలిపోయినట్లయింది.
"ఎందుకులేరా! అక్కడ నాకు రెండుమూడు నెలల పనివుంది- అన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టటం....?"
"ఏడిశావు. నువ్వు మా ఇంట్లో వుండటం నాకు ఇబ్బందా? నేనుకూడా జాబ్ కు రిజైన్ చేసి స్వంతంగా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నాను. వీలయితే కలిసి ప్రారంభిద్దాం."
వాళ్ళిద్దరి మాటలు వింటుంటే మాలతికి మతి పోయినట్లయి కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డది.
ఇంతలో రైలు కదిలే టైమ్ కూడా అయింది. అంతవరకూ కిటికీకి దగ్గరగా ప్లాట్ ఫారం మీద దిక్కులు చూస్తూ నిలబడ్డ గోపయ్య వస్తానని చెప్పి తన పెట్టెదగ్గరకు పరిగెత్తాడు.
మెల్లిగా రైలు కదిలింది.
"ఏరా, పెళ్ళి చేసుకున్నావా?"
"లేదురా" అన్నాడు శంకరం నవ్వి.
"ఏం?"
"పెళ్ళనేది అందరి మనస్తత్వాలకు ఒకేవిధంగా సరిపోదు. కొందరిపాలిట అది స్వర్గతుల్యం అయితే, మరికొందరి పాలిట కత్తులబోను అవుతుంది."
"పోరా! నువ్వలాగే అంటావు. చిన్నప్పుడూ అలాగే అదే చెబుతూ వుండేవాడివి" అని మాలతివంక తిరిగి "కూర్చో మాలతీ! ఎంతసేపు నిల్చుంటావు? ఇలా కూర్చో."
ఆమెకు అతను అటువైపు అంత దగ్గర్లో వుండగా ఇటు తను కూర్చోవాలని లేదు. అయినా ఎలా నిరాకరించాలో తెలియక శేఖర్ ప్రక్కన కూర్చుంది.
స్నేహితులిద్దరూ చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. తన భర్తని ఎక్కువగా మాట్లాడవద్దని చెప్పాలని వుంది మాలతికి. ఆ ఉత్సాహంలో ఎలాగూ ఆలకించడని సంకోచంగా వుంది. ఎదురుగుండా ముసలాయన మెల్లిగా ప్రక్కమీదకి వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు.
"మాలతీ! ఆ షట్టర్ కొంచెం దింపేస్తావా, చలిగాలి వీస్తోంది" అన్నాడు శేఖర్.
మాలతి లేచి విండోషట్టర్ ని క్రిందకి లాగటానికి ప్రయత్నం చేస్తోంది. అది బిగుసుకుని వుండటంవల్ల చేతులు నొప్పిపుట్టాయి గానీ ఆమె సఫలురాలు కాలేకపోయింది.
"ఉండండి" అని శంకర్ లేచి ఆమె ప్రక్కకి జరిగే లోపలే చురుగ్గా వెళ్ళి తనచేతులు ఆ షట్టర్ మీద వేశాడు. అతని వ్రేళ్ళు ఆమె వ్రేళ్లకి తగిలాయి. ఆమె వేగంగా ఇవతలకు జరుగుతూ అతనివంక కోపంగా చూసింది.
శంకర్ కిటికీ మూసి అవతలకు వచ్చాడు.
"శేఖర్! నువ్వు పడుకుని రెస్టు తీసుకో. ఎక్కువగా మాట్లాడకూడదు" అంటూ మాలతి వారిస్తున్నా వినకుండా అతనిప్రక్క తనే సర్దాడు.
"నువ్వు నిద్రపో శేఖర్! నేను పైబెర్తుమీదకు వెళ్ళి పడుకుంటాను"అని మాలతివైపు తిరిగి "మీరు చాలా అలసిపోయినట్లు వున్నారు. పైకి వచ్చేయకూడదూ?" అన్నాడు.
ఈ మాటలు ఆమెకు చురుక్కుమని తగిలినట్లయాయి. అతనివంక వాడిగా చూసి "అక్ఖర్లేదులెండి, నేనిక్కడే కూర్చుంటాను" అన్నది.
శేఖర్ కూడా "అవును మాలతీ! ఇక్కడ కూర్చుని అనవసరంగా శ్రమపడటం దేనికి? పైకివళ్ళి పడుకో" అన్నాడు అనునయంగా.
పై బెర్తులమీద ఒకవైపు అతనూ, మరోవైపు తనూ పడుకున్న దృశ్యం ఊహించుకునేసరికి మాలతికి కంపరం పుట్టింది. "అబ్బ! మీకు దణ్ణం పెడతాను కానీ ఊరుకుందురూ!" అంది వినిపించీ వినిపించనట్లుగా.
"నీ ఇష్టం" అని శేఖర్ కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
శంకర్ పెట్టె తెరచి కొన్ని బట్టలు తీసుకుని బాత్ రూం వైపు వెళ్ళాడు. అయిదు నిముషాలతర్వాత పైజమా, షర్టూ వేసుకుని ఇవతలకు వచ్చి పైకి వెళ్ళిపోయాడు. ఈ నైట్ డ్రస్ లో అతను మరింత ఉన్నతంగా కనిపించాడు.
కొంచెంసేపటికి మాలతి లైటు తీసేసింది. బెడ్ లైట్ వెలుగులో శేఖర్ తల ప్రక్కన తెల్లవార్లూ అలా కూర్చునే వుంది.