రిక్షావాడు నవ్వాడు. "మందు లేకపోతే అసలు బండి కదులుద్దాండీ? రెండుపూటలా వెయ్యాల్సిందే."
రిక్షావాడు చిన్నవాడే. ముప్పైలోపే వుంటుంది వయస్సు. కండలు తిరిగిన శరీరం కాదుగానీ, బలంగా జబర్ధస్తీగా వున్నాడు.
"రోజూ త్రాగుతావా?"
"ఆఁ డబ్బులుండాలిగానీ రోజూ ఏసుకుంటాం."
"నీకు పెళ్ళాం పిల్లలు వున్నారా?"
"ఓ! పెళ్ళాం, ముగ్గురు పిల్లలూ, తల్లీ, తండ్రీ అంతా వున్నారు బాబూ! మా తమ్ముడుకూడా వున్నాడు బాబూ ఆడూ రిక్షా ఏస్తాడు."
హరి ఒక్కక్షణం ఏమీ మాట్లాడలేదు.
"నువ్వు రోజూ త్రాగితే నీ పెళ్ళాం గొడవచెయ్యదా?" అని అడిగాడు త్వరగా.
రిక్షావాడు మళ్ళీ పెద్దపెట్టున నవ్వాడు "బలేవారు బాబూ! అధి గొడవచేస్తే నాకు లెక్కేటి? నేను కష్టపడి రిక్షా తొక్కుతున్నాను. డబ్బు సంపాదిస్తున్నాను. పెళ్ళాం పిల్లల్ని పోషిస్తున్నాను. నా సుఖంకోసం నేను తాగితే, అదడ్డమొస్తే ఊరుకుంటానేంటి? మక్కెలిరగదంతాను" అన్నాడు.
"అయితే పెళ్ళాన్ని అప్పుడప్పుడూ కొడుతూ వుంటావన్నమాట?"
"ఓ! ఒకటేమిటి బాబూ? మాటకు మాట బదులు చెప్పిందంటే చితగ్గొట్టేస్తుంటాను. మనకేంటి బాబూ! మొగాళ్ళం....."
"అలా కొడుతుంటే ఊరుకుంటుందా నీ పెళ్ళాం ఎదిరించదా? లేకపోతే వెళ్ళిపోతానని బెదిరించదా?"
"అంత ధయిర్యమే? ఎదిరిస్తే తవ్వి పాతేస్తాను. వెళ్ళిపోతానంటుందా? ఆ మాట అని మళ్ళీ న ఐన్తి గుమ్మంలో కాలు పెట్టగలదా? నాయాల......"
హరికి రిక్షావాడంటే గౌరవం పెరిగింది. ప్రొద్దున భార్య అన్నమాటలు గుర్తుకువచ్చాయి. అతనికి చాలా ఆనందం కలిగింది.
"మరి నువ్వు పెళ్ళాన్ని తంతుంటే మీ అమ్మా, నాన్నా ఎవరూ అడ్డుపడరా? అసలు వాళ్ళు చూస్తారని నీకుండదా?" అనడిగాడు.
"ఆళ్ళు చూస్తే ఏమయిపోతాది? ఆళ్ళు చూస్తుండగానే తంతాను. ఇహ.....అడ్దొస్తారంటారా? నేను చెట్టంతోన్ని అయ్యాను. నా సొంతవిషయాల్లో ఆళ్ళెందుకు కల్పించుకుంటారు? ఒకవేళ అడ్డొస్తే ఈడ్చి అవతల పారేస్తాను" అన్నాడు రిక్షావాడు.
హరి ఆ దృశ్యాలన్నీ ఊహిస్తూ తర్వాత మౌనంగా కూర్చున్నాడు. మధ్య మధ్య "ఎటు పోనివ్వమంటారు బాబూ?" అన్న రిక్షావాడి ప్రశ్నలకు మాత్రం జవాబులు చెబుతున్నాడు.
చివరకు అతని స్నేహితుడు అప్పారావింటికి చేరుకున్నాడు. సాదారణంగా సాయంత్రాలు మిత్రబృందమంతా అక్కడే కలుస్తుంటారు. అక్కడ్నుంచి ప్రోగ్రాం వేసుకుని ఎటో అటు వెడుతూ వుంటారు.
రిక్షావాడికి ఓ రూపాయిచ్చాడు. మామూలుగా అయితే అర్ధరూపాయి కన్నా ఎక్కువ ఇవ్వక్కర్లేదు. రిక్షావాడు సంతోషంతో రూపాయి కాయితాన్ని ముద్దుపెట్టుకుని, తన చిన్న పర్సులో వేసుకుని అక్కడ్నుంచి హుషారుగా సైకిలు త్రొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.
హరి లోపలకు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు.
ఒక నిముషం గడిచాక అతని భార్య తలుపుతీసింది. హరిని చూసి చిరునవ్వు ముఖంతో నమస్కారంచేసి 'ఆయన ఊళ్ళో లేరండీ! వాళ్ళన్నయ్య గారికి సుస్తీగావుందని ఉత్తరం వస్తే చూసి వస్తానని వెళ్ళారు. బహుశా రేపు సాయంత్రం వస్తారనుకుంటాను" అంది.
"అలాగా? అయితే వస్తానండీ" అని అతను వెనుదిరిగాడు.
అతను గేటువరకూ వెళ్ళాక ఆమె తలుపు వేసుకుంది.
అతనికెందుకో ఎక్కడికి వెళ్ళాలా అన్న ఆలోచన రాలేదు. రిక్షావాడి మాటలు మననం చేసుకుంటూ నెమ్మదిగా నడువసాగాడు.
కొంతదూరం నడిచాక వెనుకనుంచి కారు హారన్ మ్రోగి, అతను తల త్రిప్పి చూసేటంతలో ప్రక్కన వచ్చి ఆగింది.
అందమైన, ఆకుపచ్చరంగు ఫియట్ కారు, స్టీరింగు ముందు కూర్చుని వున్న ఓ యువకుడు "హలో మిస్టర్ హరీ!" అన్నాడు ఎంతో ఆదరంగా.
"హలో ఆనంద్! ఎప్పుడొచ్చావిక్కడికి?" అన్నాడు హరి ఆనందం నిండిన ముఖంతో.
హరికి స్నేహితులెవర్నయినా చూస్తే ప్రాణం లేచివస్తుంది.
"చెబుతాను. నువ్వేం పనిమీద పోవటంలేదుగా? అయితే కారెక్కు" అంటూ అతను కొంచెం ప్రక్కకు వాలి ఫ్రంట్ డోర్ తెరిచాడు.
ఫియట్ తనకు హుందాతనాన్నిచ్చే ఎయిరోప్లేన్ చప్పుడుచేసి, మెత్తగా ముందుకు కదిలింది.
దార్లో ఆనంద్ చెప్పాడు. అతను ఐ.ఎల్.టి.డి. కంపెనీలో బైయర్ గా వుంటున్నాడు. మొన్నటిదాకా సత్తెనపల్లిలో వున్నాడు. ఇప్పుడు సీజన్ స్టార్టవుతుంది కాబట్టి ఈ ఊరు ట్రాన్స్ ఫర్ చేశారు.
"వచ్చి పదిహేను రోజులయింది. ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఇంకో ఆరేడు నెలలు ఈ ఊళ్ళో వుండాలిగా..... కంపెనీ జీపు ఉంటుందనుకో అయినా స్వంత పనులమీద వెళ్ళినప్పుడు నా ఫియట్ ని వాడుకుంటాను."
పదినిముషాల్లో కారు అతని ఇంటిముందు ఆగింది.
మేడమీద పోర్షన్ లో కాపురం తెరచివున్న గేటులోంచి కారు లోపల పెట్టి దిగాక క్రింద ఆడుకుంటున్న ఇంటివారి పిల్లల్ని నవ్వుతూ పలకరించి స్నేహితుడి భుజంమీద చెయ్యేసి పైకి తీసుకెళ్ళాడు.
విశాలమైన అందమైన పోర్షన్ మేడమీద, వసారాలో తెల్లని పేముకుర్చీలు, చిన్న పేముబల్ల వేసి వున్నాయి.
"కూర్చో, వన్ మినిట్.....లీలా!" అని పిలుస్తూ అతను లోపలకు వెళ్ళాడు.
మరో నిముషంలో తన భార్యను వెంటబెట్టుకుని బయటకు వచ్చాడు.
"ఇతను నా స్నేహితుడు హరి. మేమిద్దరం బి.కాం.లో క్లాసుమేట్స్ మి. ఈ ఊళ్ళో వున్నాడని తెలుసు. కలుసుకుందామని అనుకుంటుండగానే పదిహేను రోజులు గడిచిపోయాయి" అని ఇంట్రడ్యూస్ చేశాడు.
హరి లేచి నిలబడి నమస్కారం చేశాడు.
ఆమెకూడా చిరునవ్వు ముఖంతో నమస్కారం చేసి, "కూర్చోండి, వస్తాను" అని లోపలకు వెళ్ళిపోయింది.
ఆమె ముఖంలోంచి ఎడ్యుకేషన్ వెల్లివిరుస్తున్నట్లు అనిపించింది హరికి. గొప్ప అందగత్తె కాదుగానీ, శరీరాన్నిగురించీ, అలంకరణగురించీ ఆమె తీసుకున్న శ్రద్ద అత్యంత ఆకర్షణీయంగా చేసిపెట్టాయి.
ఆనంద్ చాలా అదృష్టవంతుడనిపించింది.
ప్రతివాడికీ ప్రక్కవాడి భార్యను చూస్తుంటే అలా వుంటుందేమో తెలియదు.
స్నేహితులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఎదురెదురుగా కూర్చున్నారు.
తనకి పెళ్ళయి మూడేళ్ళయిందట. పెళ్ళయిన మరుసటిరోజు నుంచీ తను వేరేకాపురం పెట్టేశాడట. తను వెనుకాడితే తండ్రి తనని ఇంట్లోంచి వెళ్లగొట్టేసేలాగున్నాడట. ఇంతవరకూ తమకి పిల్లలు పుట్టలేదుట. ఇంకో రెండేళ్ళయినా పుట్టకుండా జాగ్రత్త పడతారట.
"చాలా రోజులకు కలిశాం. కమాన్, లెటజ్ హావ్ సమ్ డ్రింక్" అంటూ లేచాడు ఆనంద్.
హరి కంగారుపడ్డాడు. "నో నో, నాకలవాటు లేదు. వద్దు, ఐ యామ్ సారీ!" అంటున్నాడు వణుకుతున్న గొంతుతో.
"వాట్ ఈజ్ దిస్? డ్రింక్ కి అలవాటేమిటి? టేక్ ఎ లిటిల్....." అంటూ ఆనంద్ వినిపించుకోకుండా లోపలకు వెళ్ళాడు.
కొంతసేపు గడిచాక ఒక ట్రేనిండా పడుకోబెట్టివున్న స్పెన్సర్ సోడాలూ, ఓ వైట్ హార్సు బాటిలూ తీసుకొచ్చాడు. రెండు పొడుగాటి గాజుగ్లాసుల్లో విస్కీ కాస్త కాస్త పోసి వాటిల్లో సోడా నింపాడు. ఓ గ్లాసు హరికి అందిచ్చి చీర్స్ చెప్పాడు.
హరి వణుకుతున్న చేతుల్తో గ్లాసందుకున్నాడు. సోదాలు ఫ్రిజ్ లో పెట్టి వుంచారేమో, చల్లగా వున్నాయి.
నోటిదగ్గర పెట్టుకున్నాడు.
వెగటుగా, ఘాటుగా, ఎలాగో ఉంది. బలవంతాన సిప్ చేశాడు.