"ఛీ ఛీ! వెధవబ్రతుకు. ఇంతకన్నా ఏ రిక్షావాడికో ఇచ్చి పెళ్ళిచేసినా బాగుండేది" అని గొణుక్కుంటూ అవతలికి వెళ్ళిపోయింది.
ఆవేశంతో హరి ఒళ్ళు వేడెక్కిపోయింది. అంతకోపం అతనికి ఎప్పుడోగానీ రాదు. తింటున్న అన్నం ఆమె ముఖంమీద విసిరికొట్టాలనిపించింది.
తింటూవున్న అన్నం వదిలిపెట్టి డైనింగ్ టేబిల్ దగ్గర్నుంచి లేచి వెళ్ళిపోయాడు.
"అదేమిట్రా? తింటూ తింటున్న అన్నం వదిలిపెట్టి అలా లేచిపోతావు?" అంది శారదమ్మగారు. చిన్న కొడుకూ, కోడలూ ఏదో కీచులాడుకుంటున్నారని ప్రక్కగదిలో నివపడ్డ మాటలవల్ల ఆమె గ్రహించింది. అది దేన్నిగురించో తెలుసుకోవాలని ఆమెకు కుతూహలంగా వుందికూడా.
"ఏమీ లేదమ్మా! ఒక్కొక్కసారి వున్నట్లుండి ఆకలి చచ్చిపోతుంది" అని పెరట్లోకి వెళ్ళి వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడుక్కుంటూ భార్య ఎక్కడయినా కనిపిస్తుందేమోనని అటూఇటూ చూశాడు.
విమల ఎప్పుడు పైకి వెళ్ళిందోగానీ మేడ మెట్లమీదనుంచి దిగి వస్తూ కనిపించింది.
కారణం లేకుండా ఆమె తనని అవమానించింది. ఈ విషయం తలుచుకుంటుంటే అతనిరక్తం ఉడుకులెత్తిపోతుంది. ఒక్కోసారి కొన్ని చిత్రమైన కోరికలు కలుగుతాయి. అవి తీరకపోతే తీరని వ్యధగా వుంటుంది. ఆమెను ఊచిపెట్టి ఒక్క చెంపకాయ కొట్టాలని అతనికి మహా కోరికగా వుంది. గబగబ దగ్గరకు వెళ్ళాడు.
చెయ్యి ఎత్తబోతున్నాడు.
విమల నిండుమనిషి అన్న విషయం అప్పుడతనికి గుర్తురాలేదు. మరుక్షణంలో ఆమె చెంప చెళ్ళుమనేదే కానీ అంతలో లోపల్నుంచి ప్రభావతి అక్కడికి వచ్చింది.
వదినగారు చూస్తూండగా తను భార్యను కొట్టలేడు. ఆమె స్థితి తను చేతులారా వెలితి చేసినట్లు వుంటుంది.
కోపాన్ని దిగమ్రింగుకుని గబగబ లోపలకు వెళ్ళిపోయాడు.
ప్రభావతి పరిస్థితి కొంతవరకూ అర్ధం చేసుకుంది. తోడికోడలి దగ్గరకు వెళ్ళి మెల్లగా "ఏమిటి మరిదిగారు ధుమధుమలాడుతున్నారు?" అంది.
"ఈ మగాళ్ళకు అంతకుమించి వేరే ఏం చేతనౌతుంది?" అని విమల మొగుడుతిన్న కంచం ఎత్తడానికి డైనింగ్ టేబిల్ దగ్గరకు వెళ్ళింది.
శారదమ్మగారు చిన్న కోడలిని ఏదో ప్రశ్నిస్తూ వుండటం ప్రభావతికి వినబడింది.
అమ్మమ్మగారు మడిగట్టుకుని తన గదిలో వంట చేసుకుంటున్నదల్లా పెరట్లోకి వచ్చి ప్రభావతిని సమీపించింది. ఆవిడ ఒకళ్ళు వంటచేస్తే తినదు. వంట్లో శక్తి వున్న రోజుల్లో ఇంటిల్లిపాదికీ ఆమె వండిపెట్టింది. ఇప్పుడు శక్తి సన్నగిల్లడంవల్ల తన వంట తానే చేసుకుంటోంది. అయితే ఆవిడ మడి చిత్రంగా వుంటుంది. ఎవరయినా చూస్తున్నప్పుడు ఆవిడ ఆచారాలు, పట్టింపులూ విజ్రుంభిస్తాయి. చూడకపోతే పట్టింపులేదు. ఆవిడ రోజుకు నాలుగయిదుసార్లు కాఫీ త్రాగుతుంది. పాలూ, కాఫీపొడీ రంగారావుగారు చూడకుండా శారదమ్మగారు ఆవిడకు సప్లై చేస్తూ వుంటారు. ఇంట్లో మనుషులూ, పిల్లలూ చిరుతిళ్ళు తింటుంటే "ఎప్పుడూ ఏమిటే వెధవతిళ్ళు?" అని విసుక్కుంటూ వుంటుంది కానీ ఎంత జాగ్రత్తగా దాచినా ఇంట్లోని తిను బండారాలు, అవి ఎక్కడున్నాయో ఆవిడ ఎలా పసిగడుతుందోగానీ మాయమై పోతుంటాయి.
"ఏమిటీ? ఆ హరిగాడూ, వాడి పెళ్ళామూ వాడు భోజనం చేస్తున్నంతసేపూ దెబ్బలాడుకుంటున్నారూ?" అని ప్రభావతిని రహస్యంగా అడిగింది.
"ఏమోనండీ, వాళ్ళు నాకు చెప్పలేదు."
"చెప్పలేదనుకో, అసలెందుకూ అని....."
"ఎందుకేమిటి? మొగుడూ పెళ్ళాలు కాబట్టి" అని ప్రభావతి "ఆఁ వస్తున్నా అత్తయ్యగారూ!" అని లోపలకు వెళ్ళిపోయింది. అసలు శారదమ్మగారు ఆమెను పిలువలేదు. ఈ విషయం అమ్మమ్మగారికెందుకన్న ఉద్దేశమూ లేదు. అమ్మమ్మగారితో ఎక్కువసేపు మాట్లాడటం ప్రభావతికి ఎలర్జీ. అందుకని.
డ్రెస్ చేసుకున్నంతసేపూ హరి, విమల గదిలోకి వస్తుందేమో ఊచిపెట్టి లెంపకాయ కొట్టాలన్న తన కోరికను తీర్చుకుందామని ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాడు. అతని కోరిక తీరనేలేదు. ఆ అసంతృప్తితోనే బయటకు వెళ్ళిపోయాడు.
బ్యాంకులో పనిచేస్తున్నంతసేపూ అతను చిరాగ్గానే వున్నాడు. ఈ సంసారం, పిల్లలూ, ఈ బంధాలూ - ఇవన్నీ అతనికి వెగటనిపిస్తోంది. ప్రతిదానికీ ఇంట్లో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత అతనిమీద పరోక్షంగానైనా వుంది. ఈ ప్రశ్నలూ, సమాధానాలూ గృహవాతావరణంలో ఎక్కువైపోయాయి. ఏది ఇష్టమైన జీవితమో తెలుసుకోవటం కష్టంగానీ ఏది ఇష్టంలేని జీవితమో గ్రహించటం చాలా సులభం.
సాధారణంగా అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు. ఆరోజు సాయంత్రం వరకూ చిరచిరలాడుతూనే వున్నాడు.
సాయంత్రమైనా అతనికోపం చల్లారలేదు. అధి చల్లారేందుకు ఒకటే మార్గం.....తను భార్యను కొట్టాలి. ఆమె తనని అవమానించింది. డానికి బదులు తీర్చుకోవాలి.
సాయంత్రం ఇంటికి వచ్చాడు.
లోపలకు వస్తూనే భార్యకోసం వెతికాడు. ఆమెకనిపించింది. కానీ ఒంటరిగా లేదు. ఒకసారి తల్లితో కనిపించింది. ఒకసారి వదినగారితో కనిపించింది. ఒకసారి అప్పుడే కాలేజీనుంచి వచ్చిన చెల్లెలితో కనిపించింది. ఇహ ఇల్లంతా పిల్లలు విలయవిహారం చేస్తున్నారు. చాలామంది మొగవాళ్ళు ఇంట్లో వుండకుండా బయట తిరుగుతూ ఉండటానికి కారణం - సగం ఆడవాళ్ళు, సగం పిల్లలు.
ఆఖరుకి విమల కాఫీ తీసుకుని గదిలోకి వచ్చింది. కాఫీగ్లాసు అందుకుని ఊచిపెట్టి చెంపకాయ కొడదామనుకున్నాడు. కొట్టేవాడే.....ఇంతలో వెనక అతని ఇద్దరుపిల్లలు రాణీ, సురేషూ లోపలకు వచ్చేశారు. రాణికి నాలుగేళ్ళు, సురేష్ గాడికి రెండేళ్ళు. విమల రెండేళ్ళకొకసారి పిల్లల్ని కంటోంది లెక్క ప్రకారమన్నట్లు.
అతను పెళ్ళాన్ని కొడితే పిల్లలేడుస్తారు. గట్టిగా కేకలు పెడతారు. ఇహ తన తల్లీ, వదినగారూ అంతా లోపలకు పరిగెత్తుకువస్తారు. పెద్ద రభస అవుతుంది.
విమల కాఫీగ్లాసు విసురుగా అందించి లోపలకు వెళ్ళిపోయింది. అతనికి కాఫీ త్రాగాలనిపించలేదు. చేసేదిలేక రుచి తెలుసుకోవడానికి నిరాకరిస్తూ గబగబా త్రాగేసి, లేచి నిల్చున్నాడు.
రోజూ అయితే ముఖం కడుక్కుని, పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పి ఒక్కొక్కసారి బట్టలు మార్చుకుని బయల్దేరేవాడు. ఈవేళ ఒక్కక్షణం కూడా ఇంట్లో వుండబుద్ది పుట్టక యెలా వున్నవాడలా బయల్దేరాడు.
బయటకు రాగానే ఓ రిక్షా కనిపించింది. అందులో ఎక్కి కూర్చుని "పోనియ్!" అన్నాడు.
రిక్షా నెమ్మదిగా బయల్దేరింది.
లారీలు, కార్లు, బళ్ళూ, రోడ్డుకడ్డంగా నిలబడి బాతాఖానీ కొట్టే మనుష్యులు వీళ్ళందర్నీ తప్పుకుంటూ రిక్షా పోతుంది.
కార్లో పోతుంటే రిక్షావాళ్ళది తప్పులా కనిపిస్తుంది. రిక్షాలోపోతుంటే కార్ల వాళ్ళది పొగరులా కనిపిస్తుంది. రిక్షా తొక్కేవాడికి రిక్షాలో కూర్చున్న వాడికీ, కారు తోలేవాడికీ కారులో ప్రయాణం, చేసేవాడు ధనమదాంధకారుడిలా కనిపిస్తాడు. కారు డ్రైవరుకు కారులో కూర్చున్నవాడికి రిక్షా లాగేవాడు బారి తెగించినవాడిలా కనిపిస్తాడు.
రిక్షావాడు కొంచెం డోసు పుచ్చుకుని బయల్దేరినట్లున్నాడు. అతని దగ్గర్నుంచి ఒక విధమైన వాసన వస్తోంది.
ప్రొద్దుట తన భార్య అన్నమాటలు జ్ఞాపకం వచ్చాయి. "ఇంతకన్నా ఏ రిక్షావాడ్నో కట్టుకున్నా బాగుండిపోయేది...." అని.
"ఏమోయ్!" అని పలకరించాడు.
"ఏటి బాబుగారూ? నన్నేనా పిలిచారు" అన్నాడు రిక్షావాడు.
"మందు పుచ్చుకున్నావా ఏమిటి కొంచెం?"