లీల ఓ ప్లేటునిండా వేయించిన జీడిపప్పు, మరోప్లేటులో ఉప్పు, కారం, నిమ్మకాయ, ఉల్లిపాయలూవేసి మసాలాచేసిన వేరుశెనగపప్పు తెచ్చి బల్లమీద పెట్టి, హరివంక చూసి ఆదరపూర్వకంగా నవ్వి లోపలకు వెళ్ళిపోయింది. అతను సిగ్గుతో కుచించుకుపోయాడు.
"నువ్వు వైఫ్ ముందు భయంలేకుండా తీసుకుంటావా?" అనడిగాడు ఆనంద్ ని.
ఆనంద్ నవ్వాడు. "డ్రింక్ చేయటానికికూడా భయమెందుకు? నేను ఆల్ మోస్ట్ డెయిలీ తీసుకుంటాను. నేను సీజన్ లో టైర్ అయి ఇంటికి రాగానే తనే ఫ్రెష్ గా వుండటంకోసం కలిపియిస్తుంది. నాగురించి తనకు తెలుసు. నేను లిమిట్స్ దాటనని" అని అన్నాడు.
కొంతమంది డ్రింక్ చేసినప్పుడు ఎక్కువగా భార్యల్నిగురించి మాట్లాడు]తారు. అలాగే ఆవేళ ఆనంద్ కూడా మాట్లాడాడు.
తన భార్యకీ, తనకీ రహస్యాలు లేవట. ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకున్నారట. తన స్నేహితుల్ని తన భార్య గౌరవిస్తుందట. ఒకసారి ఆమె బంధువులెవరో తనగురించి ఆమెకు చెడుగా చెబితే ఆయనెవరో, ఏమిటో నాకు క్షుణ్ణంగా తెలుసు. ఆయనగురించి ఒకరు నాతో కంప్లెయింట్ చేయవల్సిన ఖర్మ నాకేం పట్టలేదు. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను అనికూడా హెచ్చరించిందట. ఇలా చాలాచాలా చెప్పాడు. అయితే ఏ విషయం ఎక్కడ ఆపాలో జాగ్రత్తపడుతూ చాలా బ్యాలెన్సుతో మాట్లాడాడు.
హరి అనుకోకుండా మూడు రౌండ్లు పూర్తిచేశాడు. అతనికి తల తిరుగుతోంది. శరీరం ఎక్కడికో ఆకాశంలోకి లేచిపోయి గాలిలో తెలుతున్నట్లుగా వుంది. పెదవులమీదికి పిచ్చినవ్వు వస్తోంది.
స్నేహితుడి బలవంతంమీద అక్కడే డిన్నర్ పూర్తిచేశాడు. క్యాబేజి, పొటాటో సూప్, ఆమ్లెట్ అన్నీ మస్తుగా తిన్నాడు. తర్వాత ఆనంద్ "కమాన్, నిన్ను మీ ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాను' అంటూ లేచాడు.
* * *
ఆ రాత్రి కుమార్ భోజనాలదగ్గర మహా అవస్థపడ్డాడు. భాస్కరం అతనికోసం కనిపెట్టుకుని కూర్చుని అతన్తోపాటు భోజనానికి లేచాడు.
కుమార్ కి ప్రొద్దుననుంచీ సతాయిస్తున్న కోరిక తీరకుండానే ఉండిపోయింది. భాస్కరం అతని ప్రక్కనే కూర్చుని భోజనంచేస్తూ తను పోగొట్టుకున్న ఉద్యోగాన్నిగురించి తనమీద అధికారం చెలాయించాలని చూసిన పై ఆఫీసరుగురించి, ఆ ఆఫీసర్ మీద తిరగబడ్డ తన వ్యక్తిత్వాన్నిగురించీ అదే పనిగా చెబుతున్నాడు. గాజులు చప్పుడు చేసుకుంటూ భోజనంలోకి అవీఇవీ తెచ్చి వడ్డిస్తున్న ప్రభావతి, అతని కళ్ళకి ప్రొద్దుటికంటే అందంగా కనిపించింది. ఆమె కళ్ళకి కాటుక పెట్టుకోలేదు. తల్లో పూలు పెట్టుకోలేదు. ఇంట్లో కట్టుకునే సాదా చీరె కట్టుకుంది. అయినా ఆ సమయంలో అతనికది చాలనిపించింది. బావమరిది చెప్పేమాటలు అతను వినిపించుకోవటంలేదు.
కుమార్ భోజనం త్వరగా అయిపోయింది. భాస్కరం ఇంకా తింటున్నాడు.
అతని తిండి ఎంతకీ తెగేటట్లు కనిపించలేదు. కుమార్ తో ఎడతెగకుండా మాట్లాడుతూనే అన్నీ పెట్టించుకుని మరీ తింటున్నాడు.
చివరికెలాగో భోజనం ముగించి చేతులు కడుగుకుని పైకి వెళ్ళేకకూడా భాస్కరం అతన్ని వదిలిపెట్టకుండా తను పోగొట్టుకున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ప్రయత్నించబోతున్న ఉద్యోగాన్ని గురించి, అందులో కుమార్ వహించబోతున్న పాత్ర గురించీ చెబుతున్నాడు.
కుమార్ లో సహనం పోతుంది.
ప్రభావతి పిల్లలతో పైకివచ్చి ముందు వాళ్ళను పడుకోబెట్టి తనూ పడుకుంది.
కొంతసేపు వాళ్ళమాటల్ని వింటూ కళ్ళు తెరచుకుని పడుకుంది. తర్వాత నిద్రలో మునిగిపోయింది.
హరి ఇంటిముందు నుంచుని తలుపు తట్టాడు. రెండుమూడుసార్లు తట్టాక తల్లి వచ్చి తలుపు తీసింది. ఆమె వాసన ఎక్కడ పసిగడుతుందోనని భయపడుతూ, తాను తూలుతున్న విషయం ఆమె పసిగట్టకుండా జాగ్రత్త పడుతూ లోపలకు వెళ్ళాడు.
గదిలోకివెళ్ళి తడబడుతున్న శరీరంతో బట్టలుమార్చుకుని మంచంవైపు చూసి నిశ్చేష్టుడైపోయాడు.
విమల మంచంమీద గాఢనిద్రా పరవశియై పడుకుని వుంది.
ఎప్పుడూ చూసే విమలే! ఎన్నో వందలసార్లు తనలో ఇమిడిపోయిన విమలే! ఆమెలో ఏ అణువూ తనకు క్రొత్తకాదు. అయినా అపూర్వంగా, అద్వితీయంగా కనిపించింది.
ఆమెను ఊచిపెట్టి లెంపకాయ కొట్టాలన్న కోరిక తను మరిచిపోయాడు.
సమయం దాటిన కోపం, నిస్సహాయంగా మూలకి నక్కి దాక్కుంది.
మోహితుడై, సమ్మోహితుడై ఆమెను సమీపించాడు.
* * *
భాస్కరం చివరకు ప్రక్కగదిలోకి వెళ్ళిపోయాడు.
కుమార్ గబగబ తలుపు గడియవేశాడు. 'ప్రభా!' అని పిలుస్తూ ఆమె దగ్గరకు వెళ్ళాడు.
ముఖంలో ముఖంపెట్టి 'ప్రభా! ప్రభా!' అని పిలుస్తున్నాడు.
* * *
పెదవులమీద వేడికి విమలకు తెలివొచ్చింది.
కళ్ళు తెరచిచూసేసరికి భర్త కనిపించాడు. చిరునవ్వుతో చేతులు రెండూ అతని మెడచుట్టూ వేసి తనమీదకు లాక్కుంది.
హరికి కొత్తగా, ఏదో మైకంలో వున్నట్లుంది.
నిజం చెప్పండి, త్రాగారా?" అంది విమల అర్ధనిద్రలో సరిగ్గా అర్ధంకాకుండా వుండగా.
"ఛీఛీ! లేదు, ఆమ్లెట్ తిన్నాను అంతే" అన్నాడు హరి.
* * *
ప్రభావతి ఎంతకీ లేవలేదు.
గట్టిగా 'ప్రభా!' అని పిలిచాడు.
ఆమె ఉలికిపడి కళ్ళుతెరచి 'నిద్రలో వున్నదాన్ని లేపుతారేమిటి? ఛీఛీ! వెధవబ్రతుకు. రాత్రిపూట కూడా సుఖంలేదు' అని గోడవైపుకు తిరిగి పడుకుంది.
కుమార్ కి ముఖంమ్మీద ఉమ్మేసినట్లయింది. తనని చూసి ఎవరో నిర్దాక్షిణ్యంగా వెక్కిరించినట్లయింది.
కోపంతో రక్తం ఉడుకులెత్తింది. ఊచిపెట్టి చెంపకాయ కొడదామనుకున్నాడు.
5
ఓ రోజు సాయంత్రం సుధాకర్ తన పాత ర్యాలీ సైకిలేసుకుని బయటికి బయల్దేరాడు. సాయంత్రాలు అలా సైకిలేసుకుని తిరగటం, దారిలో ఎవరన్నా స్నేహితుడు కనిపిస్తే బాతాఖానీ కొట్టటం, లేకపోతే పార్కుకి వెళ్ళాక ఊరిబయటకు వెళ్ళి, కాలవ ఒడ్డునవున్న ఏ ఇసుకతిన్నెమీదనో వంటరిగా కూర్చుని ఆలోచిస్తూనో, లేకపోతే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుతూనో కాలక్షేపం చెయ్యటం అతనికి అలవాటు.
కొద్దిగా నలిగిన తెల్లప్యాంటూ, దానిపైన తెల్ల స్లాకూ వేసుకుని, పాత ర్యాలీ సైకిలు తొక్కుకుంటూ పోతున్న సుధాకర్ కి, దార్లో కాఫీహోటళ్ళు, వాటినిండా కిటకిటలాడే జనం చూసేసరికి మంచి కాఫీ త్రాగాలనిపించింది. మధ్యాహ్నం ఇంట్లో త్రాగాడు. అయినా త్రాగాలనిపించింది.
సైకిలాపి క్రిందకి దిగి జేబులు చూసుకున్నాడు. ఖాళీగా తగిలాయి. దాన్నిగురించి అట్టే ఆలోచించకుండా మళ్ళీ సైకిలెక్కి రివ్వున ముందుకెళ్ళి పోయాడు. సుధాకర్ చిన్నతనంనుండీ కొన్ని చిత్రమైన అలవాట్లు చేసుకున్నాడు. జేబులో డబ్బులు వున్నా, లేకపోయినా ఒకే మాదిరిగా రోజులు వెళ్ళదీయగలడు. మెత్తటి పరుపుమీద ఎంత సుఖంగా పడుకుంటాడో, కటిక నేలమీదైనా అంతే సుఖంగా పడుకోగలడు. వేడినీళ్ళతో ఎంత హాయిగా స్నానం చేయగలడో, చన్నీళ్ళతోకూడా అంతే హాయిగా స్నానంచేయగలడు. తనకు ఇష్టమైన వంటకాలున్నప్పుడు ఎంత తృప్తిగా భోజనంచేయగలడో, ఏమాత్రం ఇష్టంలేని అధరవులు చేసినప్పుడు కూడా అంతే తృప్తిగా భోజనంచేయగలడు. కారుమీదా, సైకిలుమీదా, కాలినడకనా ఒకే మనసుతో పోగలడు.