మైథిలి నవ్వుకుని "ఇప్పుడేం చేస్తున్నారు మీరు?" అంది.
"జయపాల్ ఇండస్ట్రీస్ లో ప్రొప్రైటర్ గార్కి పి,ఏ. ని."
మైథిలి కనుబొమలు పైకెత్తి "మంచి ఉద్యోగమే" అంది మెచ్చుకోలుగా.
"మీరేం చేస్తున్నారు?" అని అడిగింది వేద శ్రీనివాస్ ని.
"ఎట్టకేలకు ఇన్ కంటాక్స్ ఆఫీసర్స్ టెస్ట్ పాసయి ఇంటర్వ్యూలో సెలెక్టు కాగలిగాను. ప్రస్తుతం ఇన్ కంటాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను" అని భార్యను మోచ్చేత్తో పొడిచి ఏదో సైగచేసాడు శ్రీనివాస్.
మైథిలి వెంటనే "మాఇంటికి రండి" అని అడ్రసిచ్చింది. అంతలో లైట్లు ఆరిపోవటంతో తన సీట్ లోకి వచ్చి కూచుంది. ఆ తరువాత తెరమీద మనసు నిలవలేదు వేదకి. ముందువరసలో జంటగా కూచున్న ఆ దంపతులనే చూస్తూ కూచుంది-మనసంతా వికలమయింది. అది ఈర్ష్య కాదు. ఒక నిర్వేదం. తనకు జయపాల్ తో ఉన్న సంబంధం తెలిసినా తనను వివాహం చేసుకుంటానన్నాడు! ఎలాగో ఒకలా బ్రతకగలం! జయపాల్ ని వదిలిరమ్మన్నాడు! అలాంటి ఉత్తముడిని చేసుకున్న మైథిలి అదృష్టవంతురాలు! ఇంత జరిగినా, ఏమీ జరగనట్లు తనను ఇంటికి ఆహ్వానిస్తున్నాడు.
సినిమా అయిపోయాకకూడా తమ ఇంటికి రమ్మని మరోసారి ఆహ్వానించింది మైథిలి.
నాలుగైదురోజులు వెళదామా, వద్దా అని మధనపడి చివరకు ఒకరోజు సాయంత్రం బయలుదేరివెళ్ళింది. వేద ఆటో దిగేసరికి భార్యా భర్తలిద్దరూ బాల్కనీలో టీ తాగుతూ ఏదో చెప్పుకుని నవ్వుకుంటున్నారు.
మైథిలి వేదను చూడగానే "రండి! రండి!" అని ఆహ్వానించింది- శ్రీనివాస్ కూడా పలకరింపుగా నవ్వాడు.
ఇల్లు మరీ చిన్నదికాదు, ఒకమోస్తరుగా బాగానే వుంది. ఫర్నిచర్ కూడా అందంగా సర్దివుంది. భార్యాభర్తలిద్దరూ కష్టపడి సంపాదించుకొని ఒకటొకటే అమర్చుకుంటున్నారు.
"ఇవాళే మాకు ఫ్రిజ్ వచ్చింది. ఆయన అల్లరి చూడండి! ఈ ఫ్రిజ్ లో ఐస్ క్రీమ్ తినేవాడు ఎన్నాళ్ళలో వస్తాడని అంటున్నారు. అందుకే నవ్వుకుంటున్నాము" సిగ్గుపడుతూ మురిపెంగా అంది.
ఇల్లంతా చూపించింది. "కొంచెంసేపు హాల్లో కూచుని మాట్లాడుతూ ఉండండి! కాఫీచేసి పట్టుకొస్తాను" అంది.
వేద హాల్లో కూచుని "కంగ్రాట్యులేషన్స్! మైథిలి నాకు చాలా నచ్చింది" అంది శ్రీనివాస్ తో. నిట్టూర్పు బలవంతాన అణచుకున్నాడతను.
"ఏం? మేము మరీ బీదరికంలో ఉన్నామంటావా?"
"నాకన్నా బాగానే ఉన్నారు."
"దేనికైనా టైమ్ రావాలి. కొంచెం ఓపికపడితే చేతిలో ఉన్న డిగ్రీకి ఉద్యోగం రాకపోదు. లేకపోతే మీరు మైథిలిలాగ బి.యిడి, చేసి వుండవలసింది. అప్పుడు తేలిగ్గా దొరికేది ఉద్యోగం. తాత్కాలికమైన ఇబ్బందులకు బెదిరిపోయి దారుణమైన స్టెప్ తీసుకున్నారు" అన్నాడు.
అప్పటి తన ఇంటిపరిస్థితులగురించీ, అన్నగురించీ, చెప్పలేకపోయింది వేద. చెప్పటానికి అది సమయమూ కాదు. కాసేపు వాళ్ళతో కూచుని మాట్లాడి బయలుదేరబోయింది.
మైథిలి చనువుగా "మీరు మమ్మల్ని మీ ఇంటికి పిలవలేదు. పోనీలెండి! పిలవకపోయినా వస్తాం. ఏదో ఒకరోజున ఏదో ఒక టైమ్ లో...."అంది.
వేదముఖం వెలవెలపోయింది. "ముందుగా ఫోన్ చేసి రండి" అంది.
వేద తనకు గర్ల్ ఫ్రెండ్ అయిన కొద్దిరోజులలోనే వేద ఇంటికి టెలిఫోన్ పెట్టించాడు జయపాల్.
ఫోన్ లేకపోతే అతడికి గడవదు.
"మా ఇంట్లో ఫోన్ లేదు. ఫోన్ చెయ్యకుండా వస్తేనేం?" మామూలుగా అడిగింది మైథిలి.
శ్రీనివాస్ కల్పించుకుని "తన డ్యూటీ అవర్స్ మనలా రెగ్యులర్ గా ఉండవు. కొన్నిసార్లు షిఫ్ట్ సిస్టము వుంటుంది. కొన్నిసార్లు ఓవర్ టైమ్ చెయ్యవలసి వస్తుంది" అన్నాడు.
"అయితే ఫోన్ చేసే వస్తాములెండి!" అని ఒప్పుకుంది మైథిలి.
ఇంటికి వచ్చినా మైథిలీ శ్రీనివాస్ లు కలిసి హాయిగా నవ్వుకుంటున్న దృశ్యం వేద మనసు వదిలిపెట్టలేదు. ఎంత అదృష్టం! జీవితంలోని సహజమాధుర్యానికి దూరమయిన దౌర్భాగ్యురాలు తను! కనీసం గీత ఐనా సుఖంగా వుండాలి. తను ఆశీర్వదించి పెళ్ళిచేసి పంపించింది. దానికే కష్టమూ రాకూడదు. వెంటనే తన కర్తవ్యాని నిర్ణయించుకుంది వేద__
ఉగ్రనరసింహమూర్తిలా వచ్చాడు జయపాల్__అతడలా వస్తాడని వేద అనుకుంటూనే వుందికనుక భయపడలేదు__
"నువ్వే వాళ్ళకు పెళ్ళిచేసి పంపించావటగదా?" అన్నాడు జయపాల్ కళ్ళలోంచి నిప్పులు రాలుస్తూ__
"నేను పెళ్ళిచేసి పంపలేదు. వాళ్ళే పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నన్ను ఆశీర్వదించమన్నారు__ ఎలాగూ పెళ్ళి జరగక తప్పదని నిర్ధారణ ఐపోయింది. ఇక శపించటమెందుకని ఆశీర్వదించాను__"
"ఛీ! సిగ్గులేదు__చివరకు వావివరుసలైనా లెక్కపెట్టలేదు. నువ్వు నాతో ఉండి నీ చెల్లెలిని నా కొడుక్కిచ్చి పెళ్ళిచేస్తావా?"
"మీరే అన్నారు ఒకసారి; 'నీకు వావివరుసలేమిటి? యు ఆర్ జస్ట్ ఎ గరల్ ఫ్రెండ్' అని__ఇంక వావివరుసలు ఎందుకు లక్ష్యపెట్టాలి? ఎలా లక్ష్యపెట్టాలి? అదీగాక నీరద్ కీ గీతకీ ఏ విధమయిన రక్తసంబంధమూ లేదు__అంచేత ఈ పెళ్ళిలో నాకేవిధమైన దోషమూ కనిపించలేదు."
"యూ బ్రూట్. ఇప్పటికయినా నీ చెల్లెలికి బుద్ధిచెప్పి ఒకదారిలో పెడతావా? లేదా?"
"అంటే! పెళ్ళయిన ఆ దంపతులను విడదీయమంటారా?"
"పెళ్ళి?! అదొక పెళ్లి! వాళ్లు దంపతులూ! నువ్వు మర్యాదగా దానికి బుద్ధిచెప్పావా సరేసరి! చూడు, లేకపోతే దానినేం చేస్తానో?"
"మీరు నా చెల్లెలిని ఏం చెయ్యలేరు."
"చెయ్యలేరు! ఓహో! ఏమిటో ఆ ధీమా! నీ అందానికి దాసానుదాసుణ్నయిపోయి, నీ చెల్లెలిని నా ఇంటి కోడలిని చేసుకుంటాననుకున్నావా?"
"అనుకోలేదు. మీరు నా అందాన్ని వాడుకుంటున్నారే తప్ప నన్ను అభిమానించటంలేదని ఏనాడో అర్ధం చేసుకున్నాను__
"రాత్రి అనుభవించిన స్త్రీని ఉదయాన్నే ఉరితీసే అరేబియన్ నైట్స్ కథల్లోలాంటి రాజులు సంఘమంతట ఉన్నారని నాకు తెలుసు! నేను మీ అనురాగాన్ని నమ్ముకోలేదు. మీ క్షుద్రత్వాన్నే నమ్ముకున్నాను.
"తాగిన మైకంలో మీ నోట్లోంచి వెలువడ్డ అమూల్య వాక్సంపద అంతా రికార్డుచేశాను. మీరు ఆ మైకంలో ఉన్నప్పుడు ఏం వాగుతున్నారో కూడా మీకు తెలియదు. అంచేత ఇటీవల నేను మధ్య మధ్య యెన్నో ప్రశ్నలువేసి మీనుండి అనేక విషయాలు రాబట్టానని గ్రహించలేదు__మీ జాతకమంతా ఆ టేప్ లో వుంది. మీరు యెప్పుడెప్పుడు యెవరెవరిని ఇన్ ఫ్లుయన్స్ చేసారో, ఎవరు మీ మాట విన్నారో, ఎవరు వినలేదో, వినని వాళ్ళమీద ఎలా పగతీర్చుకోవాలనుకున్నారో, పగతీర్చుకున్నారో__అన్నీ ఉన్నాయి. అంతేగాక, మీ పర్సనల్ సెక్రటరీగా మీరు ఎగేసిన ఇన్ కమ్ టాక్సు లెక్కలన్నీ నాకు తెలుసు,"
"రాక్షసీ!" కోపంతో తగిలిపోతూ అరిచాడు.
వేద శాంతంగా "ఔను! రాక్షసినే! విషసర్పాలమధ్య రాక్షసిగా తప్ప బ్రతకలేను" అంది.
చూస్తుండగానే జయపాల్ ముఖభంగిమలు మారిపోయి, క్షణాలలో అతడు తనను తాను నిగ్రహించుకున్నాడు. ఫ్రేముసోఫాలో కూచుని "కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు!" అన్నాడు.
వేద తను లేకుండా పనిపిల్లని పిలిచి మంచినీళ్ళు తెప్పించింది. ఆ నీళ్ళు తాగి శాంతంగా నవ్వుతూ "ఈ కొత్త పనిపిల్లని ఎపుడు పెట్టుకున్నావ్?" అన్నాడు.
"గీత తన భర్తతో హనీమూన్ వెళ్ళాక ఒంటరితనం భరించలేక, రాత్రింబగళ్ళు నాతో వుండేలాగ దీనిని పెట్టుకున్నాను" అంది.
"గీత భర్తతో .... ...." అన్న మాటలు వినగానే ఎంత నిగ్రహించుకున్నా జయపాల్ ముఖం జేవురించింది. కావాలనే ఆ మాటలు వాడింది వేద.
"నిన్ను ప్రాణంగా చూసుకుని, నిన్నూ నీ కుటుంబాన్నీ అన్ని విధాలా ఆదుకున్నందుకు నామీదనే పగబట్టావన్నమాట."
"పగబట్టలేదు, కేవలం రక్షణోపాయం చూసుకున్నాను. మీరు గీతకు ఆపద తలపెట్టనంతవరకూ ఆ విషయాలేవీ బయటకు రావు."
"ఎక్కడ దాచావు అవి!"