Previous Page Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 20

    వేద నవ్వింది. "నేను మరీ అంత తెలివితక్కువదానిని కాను" అన్నట్లు.... ...
    "అవన్నీ బేంక్ లాకర్ లో ఉన్నాయి. గీతకేమయినా అయిందని తెలిసిన మరుక్షణం వెల్లడి చెయ్యవలసిందన్న ఆదేశాలతో.... ...."
    "అబ్బా ఎంత గడుసుతనం."
    "పరిస్థితులు ఎంతటివారినైనా రాటుదేలుస్తాయి."
    "పిచ్చిదానా! నేను చెపుతున్నదంతా నీ మేలుకోరి! నీ చెల్లెలు మేలుకోరి. నీరద్ బొత్తిగా నిలకడలేని మనిషి.
    "డాన్స్ లంటూ క్లబ్బులవెంట తిరగటంతప్ప మరొకపనిచెయ్యడు. ఈనాడు వయసు పొంగులో నీ చెల్లెలిని ప్రేమించానంటున్నాడు. యేదో హడావుడి పెళ్ళికూడా చేసేసుకున్నాడు. రేపు మరొకదాని వలలోపడి నీ చెల్లెలి ముఖం చూడకపోతే నీ చెల్లెలి గతి ఏమౌతుంది? ఆలోచించావా?"
    "ఆలోచించేందుకేముంది? తరతరాలుగా వస్తున్న ఆడదాని దీనగాధే ఇదిగదా! మీరు మీ గరల్ ఫ్రెండ్సుతో తిరుగుతుంటే మీ భార్య ఏం చెయ్యగలగారు?"
    మళ్ళీ మనసు రగిలిపోయింది జయపాల్ కి__ఎంత దుస్సాహసం? తననే అంటుందా? దీనికి బుద్దిచెప్పాలి. చెపుతాను.
    "నీకు నేనంటే మరీ ఆటగా వుంది. ఇప్పటికిపుడు నిన్ను ఉద్యోగంలోంచి తీసిపారేస్తే ఏం చేస్తావు?" పరిహాసంలాగ అడిగాడు.
    "వెంటనే రిట్ పడేస్తాను. ఎంత ప్రైవేట్ కంపెనీ అయినా సంవత్సరంపైగా సర్వీసులో వున్నాక కారణంలేకుండా పీకిపారెయ్యలేరు!"
    "కారణాలు సృష్టించలేనంటావా?"
    "సృష్టించండి. అపుడు కోర్టులో నేను నా కారణాలు చెప్తాను."
    "అహ్హహ్హహ్హ" అని నవ్వాడు జయపాల్ తన పెద్ద బొడ్డు ఊగించుకుంటూ....
    "యెక్సలెంట్! అన్నివిధాలా నా పర్సనల్ సెక్రటరీగా ఉండటానికి తగినదానివి...."
    ఆమె చెయ్యిపట్టుకుని ముద్దు పెట్టుకొని పెళ్ళిపోయాడు. ఇతనితో ఢీకొని ఎంతవరకు నిలవగలనా? అని ఆలోచనలో పడింది ఆమె....
                                       14
    బొంబాయిలో ఫైవ్ స్టార్ హోటల్ లో జర్నలిస్టులందరినీ పిలిచి పెద్ద పార్టి ఇచ్చాడు నీరద్ ....అందరితోనూ తమ ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తున్న వేదవతిగారి చెల్లెలు గీతను తను ప్రేమించి పెళ్ళి చేసుకున్నట్లు చెప్పాడు. ప్రముఖ దినపత్రికలన్నింటిలోనూ ఈ వార్త ఫోటోలతో సహా వచ్చేలా చూశాడు.
    "ఎందుకింత పబ్లిసిటీ?" అంది గీత భయంగా__
    నీరద్ నవ్వుతూ "మా నాన్న అంటే ఏమనుకున్నావ్? ఆయన సామాన్యుడుకాదు నిజంగానే ఏమైనా చెయ్యగలడు__ఆయన భయపడేది పబ్లిసిటీకి మాత్రమే!" అన్నాడు__
    చూడముచ్చటగా ఉన్న తమ జంటను పేపర్లో చూసి, "ఇది చూసి అక్క ఎంత మురిసిపోతుందో!" అంది గీత.
    "మా నాన్న ఎంత మండిపడతాడో?" అన్నాడు నీరద్.
    ఇద్దరూ కారులో బోంబే అంతా తిరిగారు. "గేట్ వే ఆఫ్ ఇండియా" చూసి గీత పెద్ద ఆనందించలేకపోయింది. అంత జనమర్ధం మధ్య సముద్రంకూడా చిన్నబోయినట్లపించింది. 
    రాకరాకల బొమ్మలు ఆటవస్తువులు, ఫ్యాన్సీ సామాన్లు చిరుతిళ్ళు, మొదలైనవి అమ్మేవాళ్ళతో.... వచ్చేవాళ్ళతో....పోయేవాళ్ళతో చాలా గొడవగా ఉంది, ఆ ప్రదేశమమతా....
    "జహంగీర్ ఆర్టు గేలరీ" చూసిమాత్రం చాలా ఆనందించింది. మోడ్రన్ ఆర్టు అర్ధంకాలేదు. కాని, తైలవర్ణ చిత్రాలు ఎంతో బాగున్నాయనుకుంది, ఎక్కువభాగం కాశ్మీర్ ప్రకృతి సౌందర్య దృశ్యాలే! కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం మధ్య ఏ పడవలోనో అమాయకంగా నిలిచిన కాశ్మీర్ సుందరి చిత్రపటాలే!
    భారతదేశంలో ప్రకృతి సౌందర్యానికి కాణాచి కాశ్మీర్ కాబోలు! అక్కడ ఒక్కొక్క చిత్రం వెల 400 రూపాయలకుపైగా ఉండటం చూసి "అబ్బా!" అంది గీత అప్రయత్నంగా__
    నీరద్ అల్లరిగాఫ్ "ఏమిటనుకున్నావ్ మరి! మీరంతా కూచుని పుస్తకాలు భట్టీపడితేనే ప్రయోజకత్వం అనుకుంటారు. కళ విలువ తెలుసుకోలేరు. కొన్ని వందల యుగాలు, కొన్ని కోట్ల పుస్తకాలు కంఠతా పట్టినా, కళాత్మక ప్రతిభ వున్నవాళ్ళతో సాటికాలేరు__" అన్నాడు.
    "ఒప్పుకున్నాం సార్! మీ డాన్స్ ముందు మా డిగ్రీ లెందుకూ కొరగావు. సరేనా!" అని నవ్వింది గీత.
    మెరైన్ డ్రైవ్ దగ్గిర నూతన దంపతులిద్దరూ చాలా హాయిగా గడిపారు__ఎంతో కోలాహలంగా ఉన్న సముద్రపు గాలుల చల్లదనంలో హాయి అన్నింటినీ మైమరపిస్తోంది_విద్యుద్దీపాల వెలుగులో ధగధగలాడుతూ "క్వీన్స్ నెక్ లెస్" అనబడే రోడ్డుని చూసింది.
    ఆ మరునాడు ఇద్దరూ హేంగింగ్ గార్డెన్స్ కి వెళ్ళారు. రకరకాల జంతువుల ఆకారాలతో కత్తిరించబడిన ఆ చెట్లు, రంగురంగుల పూలూ, మెత్తని పచ్చికలాన్స్. ఎంతో ఆనందంగా గడిచింది అక్కడ.
    అన్నీ ఒక ఎత్తు, ఎలిఫింటాకేవ్స్ ఒకటీ ఒక యెత్తు....స్టీమర్ లో సముద్ర ప్రయాణమే అద్భుతమయిన అనుభవం. ఉవ్వెత్తున ఎగిరిపడే అలలను స్టీమర్ అంచుమీద కూచుని చేత్తో అందుకుంటు ఆ అగాధజలరాశిని చూస్తూ మధ్యమధ్య ద్వీపాలలా అనిపించే ఏవో కొండలను చూస్తు తనను తను మరిచిపోయింది గీత.
    ఒక చెయ్యి నడుముచుట్టు చుట్టి గీతను దగ్గరగా లాక్కుని చెవి దగ్గర గుసగుసగా ఏదో చెపుతున్నాడు నీరద్. ఆ అనుభవంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అరమోడ్పు కళ్ళతో ఏ లోకాలకో వెళ్ళిపోయింది గీత.
    మధ్యలో నీరద్ ఆపేసాడు. గీత కళ్ళు తెరిచి "ఆపేసావేం?" అంది.
    "ఎందుకు? నువ్వు వినటం లేదుగా."
    "మాటలు వినటంలేదు. కానీ అవి వినిపిస్తున్న సంగీతాన్ని వింటున్నాను."
    ఇద్దరూ నవ్వుతున్నారు. స్టీమర్ ఆగగానే చెయ్యిపట్టుకుని నీటిమీదుగా నడిపిస్తూ గీతను ఒడ్డుకు చేర్చాడు. అక్కడినుంచి మెట్లమీదుగా ఎత్తుగా ఉన్న కొండమీదకి ప్రయాణం. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఆ మెట్లన్నీ ఎక్కారు. ఆయాసమన్నది తెలియకుండా. కొండమీద ఒక కాంటిన్ కూడా ఉంది. అక్కడా కూలిజనం, పాపం? అక్కడ కూడా కూలిపనులు ఏం దొరుకుతాయో! కొండఎక్కాక ఎత్తుమీదుగా అగాధమైన లోయలోకి చూడటం ఒక చిత్రమైన అనుభవం. క్రింద అంతా అక్కడక్కడ కూలిజనం తిరుగాడుతూనే ఉన్నారు.
    ఆ శిల్పసంపదకు నివ్వెరపోయింది గీత. వంపుసొంపుల భంగిమలే కాదు. హావభావాలను సహితం మనోజ్ఞంగా ప్రదర్శిస్తున్నాయి శిల్పాలు! ఆ కాలంలో మరుగుజ్జులు ఎక్కువగా ఉండేవారు కాబోలు. చాలా శిల్పాలలో మరుగుజ్జు సేవకులు కనబడతారు.
    అంతకుముందు ఎన్నోసార్లు యెలిపెంటాకేప్స్ చూసినట్టున్నాడు నీరద్. అన్నీ గీతకు గైడ్ లాగ వివరించాడు చాలామందికి అది పిక్నిక్ స్పాట్ లాగ ఉంది.
    తిరిగి హోటల్ కి వచ్చాక కూడా ఆ అద్బుత ప్రపంచపు మైకం వదలలేదు గీతకి.
    అన్నింటికంటే మైకం కలిగిస్తున్నది, అనుక్షణం తనను పొదుపుకొంటున్న నీరద్ స్పర్శ.
    ఇద్దరు పక్కపక్కన పడుకుని వాదించుకుంటు నవ్వుకుంటూండగా ఫోన్ మోగింది, నీరద్ వెళ్ళి మాట్లాడాడు.
    "గీతా! నాకు తెలిసిన హోటల్ మేనేజర్ ఫోన్ చేసాడు. వెంటనే రమ్మని, ఒకసారి వెళ్ళి వస్తాను" అన్నాడు.
    బొంబాయికి వచ్చాక అప్పటివరకు గీత నీరద్ ని విడిచి ఉన్నదిలేదు. దిగులుగా చూసింది.
    గీత గడ్డం పట్టుకుని ఊరడిస్తూ "అలా చూడకు. వెంటనే వచ్చేస్తాగా!" అన్నాడు. తల వూపింది.
    కానీ, నీరద్ వెంటనే రాలేదు. అతడు వచ్చేసరికి రాత్రి పన్నెండు దాటింది, కాలింగ్ బెల్ విని తలుపు తెరవకుండా లోపలినుంచే "ఎవరు?" అంది గీత.
    ఆ కంఠమే ఎంతో సేపటినుండి ఏడుస్తున్నట్లు జీరపోయి ఉంది. భయంతో, కంగారుతో వణుకుతోంది.
    "నేనే! తలుపు తియ్యి" అన్నాడు నీరద్.
    అప్పటికి తలుపు తెరిచింది గీత, కంఠంలో వినిపించిన శోకమూ, భయమూ, ఆందోళనా, రూపుదాల్చి ఉన్నాయి గీత ముఖంలో - ఏడ్చి ఏడ్చి ముఖమమతా ఉబ్బి ఉంది. కళ్ళు ఎర్రగా వాచివున్నాయి. ఆగకుండా వెక్కిళ్ళు వస్తున్నాయి.
    నీరద్ లోపలికి రాగానే అతడి మెడచుట్టు చేతులువేసి బావురుమంది. నీరద్ గీత వెన్ను నిమురుతూ "ఊరుకో, ఏడవకు" అని సముదాయించాడు. ఆ స్పర్శకు కొంత తేరుకొని అతడికి మరింత సన్నిహితంగా హత్తుకుపోతూ "ఇందాకటినుంచీ, సముద్రంలో మునిగిచావాలా? ఎలక్ట్రిక్ షాకుతో చావాలా? లేక స్లీపింగ్ పిల్స్ తో చచ్చిపోవచ్చా? యెలా చచ్చిపోతే, బాగుంటుందా? అని ఆలోచిస్తున్నా!" అంది బేలగా.

 Previous Page Next Page