Previous Page Next Page 
రాగవాహిని పేజి 18

    ఆ విషయమై మాటాడాలనే వచ్చాడు డియస్పీ.

    "నువ్వేమో నీ హత్యా విషయమనుకున్నావ్"

    ముగించేడు సతీష్.

    కళ్ళప్పగించి చెవులు నిక్కబొడుచుకుని వింది సత్య.

    "అలాంటి వ్యక్తి వుంటాడా?" అనుకుంది.

    ఒక్కక్షణమాగి "సతీష్! ఏది ఏమైనా యీ మానసిక హింస భరించలేను. నువ్వూ నేనూ మా ఊరెళ్ళి వద్దాం. మా అమ్మమ్మని చూసి నాల్గయిదు రోజులయింది. ఆమె ఎలా వుందో చూడాలి. ఈ హత్యా అదీ ఏమీ తెలీకుండా పోయివుంటే నేను ఆగిపోతాను. లేదా అది రికార్డుకెక్కి వుంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను సరెండ్ అవుతాను. నేనీ మానసిక చిత్రహింస భరించలేను" అంది.

    సతీష్ మాటాడలేదు.

    ఆలోచిస్తూ వుండిపోయాడు.

    అయిదారు నిమిషాలు నిశ్శబ్దంలో కలిసిపోయాయి.

    "సత్యా! రేపు మీ ఊరు వెళ్ళొద్దాం!" అని హఠాత్తుగా లేచి వెళ్ళిపోయాడు.

    అతను వెళ్ళేక ఆమెలో ద్వివిధమైన ఆలోచనలు వెల్లువలా వచ్చాయి. ఊరికి వెళ్ళవచ్చనే ఆనందం, వెళ్ళితే ఆ హత్యా ఆ విషయం అవీ కలిగించే ఆందోళన....

    ఆలోచనా సంక్రాంతమైన మనస్సుతో అలాగే సోఫాకి చేరగిలబడి పోయి వేళగాని ఆ వేళలో నిద్రలోకి జారిపోయింది సత్య.

    మరికొద్దిసేపటికి వచ్చి చూసిన సతీష్ ఆమెని చూసి బరువుగా నిట్టూర్చేడు.

                                           *        *        *

    ఆ మరురోజు ఉదయం ఇద్దరూ బ్రేక్ ఫాస్టు ముగించుకున్న తరువాత బయలుదేరి వెళ్ళాలనుకుంటూ వుండగా ఫోన్ వచ్చింది సతీష్ కి.

    రైసుమిల్లు నుంచి వచ్చిందా ఫోను.

    ఆ రాత్రి ఎవరో దొంగలుపడి కేష్ చెస్టు పగలగొట్టి ఆ క్రితంరోజు కలెక్షన్ రెండువేలూ దొంగిలించుకుని పోయారు. మిగతా ఏం పోలేదు. రికార్ద్సు అన్నీ భద్రంగా వున్నాయ్ అని చెప్పేరు.

    ఒక్కక్షణం సమాధానం ఇవ్వలేదు.

    గంభీరంగా చెప్పేడు ఫోన్ లోనే "ఇదిగో చూడండి. నైట్ వాచ్ మన్ ని ఇక్కడికి పంపండి. క్లర్క్ ని కూడా పంపండి. వంద నోట్ లవి. యాభయ్ నోట్ లవి నంబర్లు నోట్ చేసి వుంటారు కదా? ఆ నంబర్లు ఇస్తూ పోయిన మిగతాసొమ్ము తెలియపరచి పోలీస్ రిపోర్టు ఇవ్వండి" అన్నాడు.

    ఆ నంబర్లు నోట్ చేయలేదన్నారు వాళ్ళు.

    మండిపోయిందతనకి ఆ నిర్లక్ష్యానికి.

    "ఆ క్లర్క్ నీ, వాచ్ మన్ నీవెంటనే డిస్మిస్ చేయండి.

    పోలీస్ కంప్లయింట్ వాళ్ళమీద కూడా అనుమానం వున్నట్టుగా ఇవ్వండి. తప్పుచేసిన వాళ్ళు తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. తప్పు తప్పే. శిక్ష అనుభవించాలి ఆ తప్పుకి" కఠినంగా అన్నాడు సతీష్.

    "అలాగే!" అన్నారవతలివాళ్ళు.

    ఫోన్ పెట్టేశాడు సతీష్.

    మరో ఐదు నిమిషాల్లో ఇద్దరూ ఇంపాలాలో బయలుదేరారు.

    ఊరు దాటేక వేగం పుంజుకుంది కారు.

    "సతీష్!"

    సరిగ్గా యాక్సిడెంట్ జరిగిన స్థలానికి రాగానే పిలిచింది సత్య.

    కారు నెమ్మదిగా పోనిచ్చాడు వేగాన్ని తగ్గించి.

    "కొంచెం ఆపు!"

    కారు ఆపుచేశాడతను.

    అక్కడ యాక్సిడెంట్ జరిగిన గుర్తులు కానీ, సత్య పారవేసుకున్న పాత్రలు అవీ కానీ ఏవీలేవు. చుట్టూ పరికించింది. రోడ్డుకి దిగువున చాలా దూరంలో పగిలిపోయిన మట్టిముంతల పెంకులు కనిపించేయి.

    "ఆ తర్వాత దారివెంట వచ్చిన వాళ్ళెవరో నీ గుడ్డలూ అవీ తీసేసుకుని, యీ పగిలిపోయిన పెంకులు విసిరివేసి వుంటారు. అంతే!" అన్నాడు సతీష్.

    సత్య ఏం జవాబివ్వలేదు.

    "పద!"

    అతను డ్రయివింగ్ సీట్లో కూర్చోగానే సత్య కూడా యెక్కి కూర్చుంది. కారు రివ్వున దూసుక వెళుతోంది. చలిని విరిచే ఎండ మెల్లి మెల్లిగా వెచ్చబడుతోంది. గాలి కిటికీలగుండా దూసుకొనివచ్చి గిలిగింతలు పెడుతోంది.

    "ఇక్కడే రోడ్డు దిగాలి"

    హఠాత్తుగా అంది సత్య.

    కారుని స్లోచేసి హై రోడ్డు నుంచి మట్టిరోడ్డుకి మళ్ళించేడు. దుమ్ము రేపుకుంటూ మెల్లిగా వెళుతోంది కారు. దుమ్ము లోపలికి రాకుండా అద్దాలు దింపేడు సతీష్.

    ఊరి మొగసాలకి వచ్చేశారు.

    కారుని చూసి అక్కడ ఆడుకుంటున్న అయిదారుగురు పిల్లలు బాణంలా దూసుకుని వచ్చారక్కడికి. కారు ముఖం ఎప్పుడూ చూడని వాళ్ళలాగా చుట్టుముట్టేరు.

    కారులో సత్యని చూసి "అక్కాయ్! అక్కాయ్!" అని కేకేశారు ఇద్దరు కుర్రాళ్ళు.

    అద్దాలు పైకెత్తాడు సతీష్.

 Previous Page Next Page