Previous Page Next Page 
రాగవాహిని పేజి 19

    అందులో ఓ కుర్రాడ్ని "ఏరా విష్ణూ బాగున్నావా?" అని పలకరించింది సత్య.

    "బావున్నాం అక్కాయ్! నువ్వెక్కడినుంచి వస్తున్నావ్? ఆయనెవరు? బావా?" అడిగేడు వాడు.

    కొద్దిక్షణాలు సిగ్గుపడేరిద్దరూ!

    జవాబుకోసం ఆగకుండానే "అక్కాయ్! అక్కాయ్! నిజామాబాదు లో నిజాం చనిపోతే ఏం మిగులుతుంది?" అని అడిగేడు.
   
      ఏదో ధ్యాసలో వున్న సత్య వెంటనే "బాదు" అనేసింది.

    దాంతో వాడు కిలకిల నవ్వుతూ "బాదు! బాదు!" అంటూ మృదువుగా కొట్టేడామెని.

    ఫక్కున నవ్వేడు సతీష్.

    ఆ అబ్బాయి సిగ్గు పడ్డాడు.

    పక్కనే మరో అబ్బాయిని చూస్తూ, "ఏమే మణీ! బావున్నావా?" అని అడిగింది సత్య.

    సతీష్ ఆశ్చర్యపోయాడా ప్రశ్నకి.

    "ఇది ఆడపిల్ల సతీష్! మగపిల్లలు లేకపోతే వీళ్ళమ్మ దీనికి బాబ్ చేయించి మగపిల్లల డ్రెస్ అలవాటు చేసింది. ఇది డ్రెస్ తో పాటు మగరాయుడై పోయింది" అని ఆ పిల్లవేపు తిరిగి "అమ్మ ఎక్కడుందే?" అని ప్రశ్నించింది.

    "అమ్మ పొలానికి కాడి కట్టుకుని వెళ్ళింది, నాన్నేమో ఇంటిలో వంట చేస్తున్నాడు. మేం అందరం భోంచేశాక అన్నం తీసుకెళతాడు నాన్న. అక్కాయ్ ఓ విచిత్రం చెప్పనా? మొన్న అమ్మ నాన్నకని చీరకొంది. మంచిచీర పది రూపాయలనేసరికి కొనేసింది అమ్మ. కానీ నాన్న వద్దనే అంటున్నాడు. అంతలో పక్కవీధి తులశమ్మత్త వుండ్లేదూ? నెల్లూరావిడ కేకలేసుకుంటూ వచ్చింది. బజారులో ఆరవేసిన కొత్తచీర ఎవరో ఎత్తుకొని పోయారట. తీరా చూస్తే అమ్మ నాన్నకోసం కొన్న చీర తులశమ్మ అత్తదేట!"

    ఆ అమ్మాయి చెప్పింది విచిత్రంగా విన్నాడు సతీష్.

    అతని ఆశ్చర్యం గమనించి పకపక నవ్వింది సత్య.

    "ఈ పిల్ల చిత్రమైంది! వాళ్ళమ్మని నాన్న అంటుంది. నాన్నని అమ్మంటుంది. చిన్నప్పటినుంచి అలాగే అలవాటు చేశారు"

    ఫక్కున నవ్వేడు సతీష్.

    "బావుంది! బావుంది! ఎవరు విన్నా నవ్వేస్తారు!"

    "ఇక మీరు వెళ్ళండర్రా!" అంది సత్య.

    పిల్లలు దూరంగా వెళ్ళిపోయేరు.

    సత్య చెప్పిన విధంగా కారు వెళ్ళి ఆ యింటి ముందు ఆగింది. కారు ఆగీ ఆగగానే తలుపు తెరుచుకుని శరవేగంతో "అమ్మమ్మా!" అని కేకేస్తూ వెళ్ళింది సత్య. తలవాకిలి మూయక పోవటం వలన అమ్మమ్మ పొలాలవేపు వెళ్ళలేదని అనుకుంది సత్య.

    "అమ్మమ్మా! అమ్మమ్మోయ్! అమ్మమ్మోయ్!"

    తన కేకలికి సమాధానం రాకపోవడంతో నడవా, వంటిల్లు చూసిన సత్య చివరికి పడక గదిలోకి వెళ్ళింది.

    అక్కడ పరిస్థితి చూసిన సత్య అవాక్కయి నిలుచుంది. కాళ్ళు గజగజ వణికేయ్. కళ్ళు తిరిగినట్లయింది.

    సత్య తర్వాత కారు దిగిన సతీష్, యింటిముందు కారు ఆగగానే విచిత్రం చూడాలని వచ్చిన పిల్లలు పక్కింటి చంద్రమ్మకూడా లోపలికి వచ్చేశారు.

    చంద్రమ్మ సత్యని చూడగానే "వచ్చావా సత్తెమ్మా! నువ్వు టౌన్ కి అందరి వెంట వెళ్ళలేదు కదా? ఎలా చేరావో ఏమో అని అమ్మమ్మ భయపడుచూ ఉండింది. మొన్న నీ స్నేహితురాలు మళ్ళీ నీకోసం వచ్చింది. నిన్ను పిలుచుకెళ్ళాలని, దాంతో నువ్వెక్కడున్నావో- ఎలా వున్నావో అని భయపడి పోయింది అమ్మమ్మ. దిగులుతో మంచం పట్టేసింది. గుండెపోటు వచ్చిందన్నాడు డాక్టరయ్య! మందిస్తున్నాడు. గంజి నీళ్ళు పెట్టివ్వమంటే తెద్దామంటే వెళ్ళేను నేను" అని చెప్పిందామె.

    ఆ మాటలు వినగానే భోరున విలపించింది సత్య.

    "అమ్మమ్మా! ఇటు చూడు అమ్మమ్మా! నేను సత్యని .... నాకేం కాలేదు. నేను లక్షణంగా వున్నాను. నువ్వు కళ్ళు తెరిచి చూడమ్మమ్మా నేను.... నేను... వచ్చేశాను" అంది ఏడుస్తూనే.

    కానీ ఆమె కళ్ళు తెరవలేదు.

    "సత్యా!"

    పిలిచేడు సతీష్.

    "చూడు సతీష్! చూడు. అమ్మమ్మ ఎలా అయిపోయిందో, పాపిష్టి దాన్ని, తల్లినీ, తండ్రినీ పొట్టన పెట్టుకున్నాను పుట్టగానే. ఇప్పుడు అమ్మమ్మని యిలా చేశాను.... యిదంతా నా దురదృష్టమే!"

    "సత్యా!" ఆమె భుజం మృదువుగా తడుతూ మళ్ళి పిలిచేడతను.

    "ఏం చేయాలి సతీష్? అమ్మమ్మ నన్ను చూడటం లేదు. నా తప్పుకింత శిక్షా? అమ్మమ్మా! కళ్ళు తెరు.... నన్ను చూడు!" అంటూ వెర్రిగా ఆమెని కుదపసాగింది.

    ఇరుగు పొరుగు ఏం మాటాడకుండా చూస్తున్నారు. సత్యనీ, ఆమె కట్టుకున్న ఖరీదైన చీరని, సతీష్.... కార్లో వచ్చిన సత్య వాళ్ళకి వింత వస్తువుగా తయారైంది.

    "సత్యా! అమ్మమ్మని కారులో తీసుకెళదాం అక్కడయితే పెద్ద హాస్పిటల్ వుంది. మంచి స్పెషలిస్టు డాక్టర్లుంటారు. ఏం భయపడవలసిన పనిలేదు పద! ఆలస్యం కాకుండా త్వరగా వెళదాం!"

    "అవును సత్యమ్మా! అలా చెయ్యండి" అన్నారంతా.

 Previous Page Next Page