Previous Page Next Page 
మౌనం పేజి 18

    ప్లానింగ్  చాలా పెర్ ఫెక్ట్ గా వచ్చింది.

    ఈ షోకి  చాలా ప్రత్యేకమైన మూవ్ మెంట్స్  నేర్పించింది  కొరియోగ్రాఫరు మౌసమి. ఆ రోజు షోకి  వి.వి.వి.పి.లు చాలా మంది వస్తున్నారు.

    స్టేట్ గవర్నరు, కల్చరల్ ఎఫైర్స్ మినిస్టరు....స్టేట్ ఇన్ఫర్మేషన్ మినిస్టరు....టూరిజం మినిస్టరు....టాప్ ఐ ఎ ఎస్, ఐ పి ఎస్ ఆఫీషియల్స్  వున్నారు.

    ఆంధ్రరాష్ట్రావతరణదినం  సందర్భంగా  జరుగుతున్న ఫ్యాషన్ షో అది.

    స్టేట్ కల్చరల్  ఎఫైర్స్ మినిస్ట్రీ స్పానర్సు  చేసిన ప్రోగ్రామ్ అది.

    తొలిసారి 78 లైట్లు  ఏర్పాటు చేశారు.

    మ్యూజిక్, ఆర్కెస్ట్రా, క్రూ, అంతా  కలిసి సుమారు 150 మంది పైగా  పని చేస్తున్నారు ఆ సమయంలో.

    వరసగా  ఒకరొకరుగా  వచ్చి ఎవరికి కేటాయించిన  సీట్లో  వాళ్ళు కూర్చున్నారు. నగరంలోని డబ్బున్న  ప్రజానీకం అంతా  అక్కడే వున్నారనిపిస్తోంది.

    మోడల్స్ ని  తలదన్నేలా....ఫ్యాషన్ ఈర్ష్యపడేలా  దుస్తులు ధరించిన  యువతీయువకులు  లోపలికొస్తున్నారు.

    వారి శరీరాల నుంచి వచ్చే సెంట్స్  వాసన  ఆ ప్రాంతమంతా....సున్నితంగా  నాసికలకు  తాకుతోంది.

    జరుగుతున్న  ఫ్యాషన్  షోని  అంతటినీ పిక్చరైజ్  చేయటానికి స్టేజికి కుడివైపు ఒకటి, ఎడమ వైపు ఒకటి, మధ్యలో  ఒకటి....మూడు వీడియో కెమెరాలు  సిద్ధం చేశారు.

    తమ తమ కెమెరాలు  సిద్ధం  చేసుకుని 'క్యాట్ వాక్'కి  ఇటూ అటూ చేరారు  దాదాపు 15 మంది స్టిల్ ఫోటోగ్రాఫర్లు.

    ఆ మోడల్స్  తళుకు  బెళుకులను  తమ కెమెరాలలో  ఎప్పుడు  బంధిస్తామా అన్న ఆతృత వాళ్ళ కళ్ళలో  మెదులుతోంది.

    సమయం  ఏడు కావస్తోంది.
 
    స్టేజి మీది లైట్స్ డిమ్ అయ్యాయి.

    అంతవరకూ  మంద్రస్థాయిలో  వినిపిస్తున్న  మ్యూజిక్ ఆగింది.

    క్షణకాలం  తరువాత  "గుడీవినింగ్ లేడీస్ అండ్ జంటిల్మన్" గంభీరంగా  మైక్ లో వినిపించింది డైరెక్టరు కంఠం.

    అంతవరకూ  కబుర్లతో, గుసగుసలతో  నిండిన  ఆ ప్రాంతం  నిశ్శబ్దంలోకి  సద్దుమణిగింది.

    అప్పటివరకూ  అక్కడ  నిలబడి  స్టేజివైపు  పరికించి  చూస్తున్న  కొరియోగ్రాఫర్  గబగబా  లోపలికి పరిగెత్తింది.

    "ఆర్యూ రెడీ?" దాదాపుగా అరిచినట్టుగా అంది అందర్నీ  పరికించి చూస్తూ.

    "ఎస్" అన్నట్లు  చూసారందరూ  ఆమె వైపు.

    మెడలోని  ముత్యాలదండని, అద్దంలో  చూసుకుంటూ  సరిచేసుకున్న ఆ యువతి  కూడా  కొరియోగ్రాఫరు వైపు చూసింది.

    ఆ యువతిని  సమీపించి  ఒకసారి  పరికించి  చూశాడు డిజైనరు సమీర్ వర్మ.

    సల్తనత్  వంశానికి  చెందిన స్త్రీల సాంప్రదాయ దుస్తులు  ధరించిందామె.

    తెల్లని  ఆ వస్త్రాలలో ఆమె దేవతలా  మెరిసిపోతోంది.

    "యువార్ లుకింగ్  ఫెంటాస్టిక్  అర్చనా! ఐ వాంట్ యు టు బి కమ్ ది సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. ఇక్కడున్న  మోడల్స్ అందరూ  ఒక ఎత్తు....నీ అందం  ఒక ఎత్తు. నీ హావభావాలతో  వాకింగ్  స్టయిల్స్ తో, మూవ్ మెంట్స్ తో....ఈ ప్రోగ్రాంకి జీవం  తీసుకురావాలి. అఫ్ కోర్స్....నువ్వాపని  చేయగలవన్న  నమ్మకం ,ధైర్యం  నాకున్నాయి" అన్నాడామెకు  మాత్రమే  వినిపించేటంత  మంద్రస్థాయిలో.

    అర్చనతో  అతనేదో  పర్సనల్ గా  మాట్లాడుతున్నాడనుకున్నారు అక్కడున్న  మిగతా మోడల్స్.

    "విష్ యు ఆల్ ది బెస్ట్" అన్నాడు సున్నితంగా  ఆమె చెయ్యి నొక్కి వదిలేస్తూ.

    చిరునవ్వు  నవ్విందామె.

    అందమైన ఆమె చిరునవ్వుకి  శరీరం  పులకరించినట్లైందతనికి.

    "ఓ.కె. ఫ్రెండ్స్! విష్ యు ఆల్ ది బెస్ట్" అంటూ  అందరికీ  కరచాలనం  చేశాడతను.

    బయట  నుంచి  ఎనౌన్స్ మెంట్  వినిపించింది.

    అంటే షో మొదలవుతోందన్నమాట.

    త్వరత్వరగా వచ్చి స్టేజీ మీదకు  ఎంటరయ్యే  డోరు  దగ్గర  నిలబడ్డారందరూ.

    ఒక్కసారిగా  స్టేజీ మీద లైట్లన్నీ  ఆగిపోయాయి.

    ఒకింత చీకటి  ఆవరించింది.

    త్వరత్వరగా  స్టేజి మీదకు వచ్చి వరుసలో  నిలబడ్డారు  మోడల్స్ అందరూ.

    క్షణకాలం తర్వాత  ఒక స్పాట్ లైట్ ఆన్ అయింది. అది ఒక బీమ్ లాగా  మొదటి  మోడల్ మీద పడింది.

    "షి ఈజ్ మిస్ మోనా!" మైక్ లో వినిపించింది  డైరెక్టరు కంఠం.

    అభివాదం  చేసింది మోనా.

    ప్రేక్షకులంతా  క్లాప్స్  కొట్టారు.

    అదే సమయంలో  తన హైబ్యాండ్  వీడియో  కెమెరా  స్విచ్  ఆన్ చేశాడు  ఆ యువకుడు. సుమారు 28 ఏళ్ళు వయస్సుంటుందతనికి. అందముగా, బలిష్టంగా  వున్నాడతను.

    మిగతా వీడియో  కెమెరాలు  కూడా పనిచేయనారంభించాయి.

    మోనా  మీద పడుతున్న  లైటు  ఆఫ్ అవటం....ఆమె ప్రక్కనున్న మరో మోడల్ మీద లైట్ ఆఫవటం  రెండూ  ఒకేసారి  జరిగాయి.

    "హీ ఈజ్  మిస్టర్ హరీస్" మళ్ళీ  వినిపించింది డైరెక్టరు  గొంతు.

    మరోసారి క్లాప్స్  కొట్టారందరూ.

    తన వీడియో  కెమెరాతో  రికార్డింగ్  సరిగా  అవుతోందో  లేదో  అని మానెటర్ లో  చూసుకుని  సంతృప్తిగా తలాడించాడు  ఆ యువకుడు.

    "షి  ఈజ్  మిస్ అర్చన!"

    ఆ మాటతోపాటే  ఆమె మీద పడింది  లైటు.

    ఆ హేలో  జన్ లైటు  వెలుగులో తెల్లని  ఆమె వస్త్రాలు  బంగారువర్ణంలో కనిపిస్తున్నాయి. అప్సరసలా  మెరిసిపోతోందామె.

    క్లాప్స్ తో  దద్దరిల్లిపోయిందా  ప్రాంతం.

    రెప్పవాల్చటం  మర్చిపోయాడు ఆ వీడియోగ్రాఫర్.

    ఫెంటాస్టిక్!

    మోనాలిసా, మడోనా....ఎవరూ  పనికిరారు.

    అద్భుతమైన  సౌందర్యం!

    ఇంతవరకూ  ఎవరూ  చూడని  సౌందర్యం  అది.

    అక్కడి జనం  వూపిరి పీల్చటం  మర్చిపోయారు.

    రెండు చేతులూ జోడించి  అభివాదం  చేసిందామె.

    ఆ భంగిమలో  మరెంతో  అందంగా  వుందామె.

    సరిగ్గా  అదే సమయంలో  ఆమె వైపు  కదిలాడు  ఆ వీడియోగ్రాఫర్.
   

                                                         *    *    *    *

    "మీదేవూరమ్మా?"

    ఆ మాట  విని టిఫిన్  తింటున్న  ఆమె తలెత్తి  చూసింది.

    ఎదురుగా  నిలబడి  వుంది కౌశిక్  నాయనమ్మ.

    ప్లేటు టీపాయ్ మీద వుంచి  లేచి  నిలబడబోయింది  సంజు.

    "ఫరవాలేదు కూర్చో" అంటూ  ఎదురుగా  వున్న కుర్చీలో కూర్చుందావిడ.

    "మాది....ఇంగ్లండ్"

    "ఇంగ్లండ్....అంటే  మన దేశం కాదుగా?"

    అవునన్నట్లు  తల వూపింది  ఖాళీ  టిఫిన్లు  ప్లేటు  క్రిందపెడుతూ.

    "మరి తెలుగు  మాట్లాడుతున్నావ్?"

    ఆ ప్రశ్న  వూహించలేదు సంజు.

    "అంటే....తెలుగువాళ్ళమే. ఇంగ్లండ్ లో వుంటున్నాం"

    "ఎన్నేళ్ళయింది  వెళ్ళి?"

    "పదిహేనేళ్ళయిందేమో"

    "అయితే  తెలుగు బాగా  మాట్లాడుతున్నావు మంజులా!" అంది మెచ్చుకోలుగా  ఆవిడ.

    "నా పేరు సంజన" ఒకింత  ఇబ్బందిగా  అందామె.

    "ఆ....ఏదో మంజుల  అన్న  పేరులాగా  వుంటేనూ" అంది.

    సంజు  ఏమీ మాట్లాడలేదు.

    "మా కౌశిక్ నీకెలా  తెలుసు?" తిరిగి ప్రశ్నించిందావిడ.

    లావుగా  వున్న  సోడాబుడ్డి  కళ్ళద్దాలలోంచి  స్కానింగ్  చేసినట్లుగా  సంజుని  చూస్తోందావిడ.

    ఏం మాట్లాడాలో  అర్ధంకాలేదు  సంజుకు.

    "మావాడు  ఆడవాళ్ళతో మాట్లాడడులే. పెళ్ళి  పేరు చెబితే  పారిపోతాడు. అలాంటిది  నిన్ను వెంటబెట్టుకుని  తిన్నగా  యింటికి  వస్తేనూ! ఎవరా  అని అడిగాలే" ఎలా  మాట్లాడాలో  తెలియని  బోళాతనంతో  అడిగింది.

    అదిరిపడింది  సంజు. ఈవిడ  వాగ్ధోరణి  చాలా ఇబ్బందిగా  వుంది.

    "బామ్మా! ఏమిటా  ప్రశ్నలు?" ఒకింత  అసహనం  ధ్వనించిన మాటతో అక్కడికి వచ్చిన కౌశిక్ అన్నాడు.

    "అమ్మాయి ఒక్కతే వుంది....కాలక్షేపం  అవుతుందని  వచ్చా....లేకుంటే నాకేం పని?"

    "ఆయామ్ సారీ! మా నాయనమ్మకి  చదువు లేదు. అందుకే  మాట్లాడటం తెలియదు. ఏమీ అనుకోవద్దు" క్షమాపణ చెప్పాడతను.

    "ఫరవాలేదు" అంది ఇబ్బందిగా  కదులుతూ.

    నిమిషంపాటు  ఇద్దరి మధ్య  మాటలు లేవు.

    అప్పుడు  సమయం  ఉదయం  ఎనిమిదయ్యింది.

    అప్పటికి  ఆమె ఇంట్లోకి  వచ్చి సుమారు సగం  రోజు గడిచింది.

    "మీరు వైజాగ్ లో ఫెర్ ఫార్మెన్స్  యివ్వటంలేదు. అవును....మీ ప్రోగ్రాం కాన్సిల్ చేస్తున్నాను" గంభీరంగా పలకిందతని  కంఠం.

    ఆమె తెల్లబోయింది  ఆ మాటకి.


                       *    *    *    *
 

 Previous Page Next Page