ఒక్కసారిగా మొదలయ్యింది మ్యూజిక్.
దేదీప్యమానంగా వెలిగాయి లైట్లన్నీ.
స్మోక్ ఎఫెక్ట్ మొదలయింది.
మ్యూజిక్ లో నుండి వచ్చే డ్రమ్ బీట్ కి అనుగుణంగా మూవ్ మెంట్సిస్తూ క్యాట్ వాక్ ప్రారంభించారు మోడల్స్ అంతా.
అంతవరకు ఒకింత దూరంగా వున్న ఆ వ్యక్తి మరింత దగ్గరకు నడిచాడు.
అతని దృష్టి అర్చన మీదే వుంది.
రెప్పవాల్చకుండా చూశాడామెను.
సుమారు పది అడుగుల దూరం వుంటుంది వాళ్ళిద్దరి మధ్య.
ఆమెను మరింత సన్నిహితంగా చూడాలనిపిస్తోందతనికి.
అద్భుతమైన సౌందర్యం!
సృష్టిలో ఏ కొద్దిమందికో వుంటుందా అందం.
ఆమె అందమైన కళ్ళను, సున్నితమైన ఆ పెదవులను దగ్గర నుండి చూడాలని, మృదువుగా తాకాలని అనిపిస్తోంది.
అదే సమయంలో గిర్రున వెనక్కి తిరిగి కెమెరా దగ్గరకు నడిచాడతను.
అతని అసిస్టెంట్ హేండిల్ చేస్తున్నాడు ఆ సమయంలో కెమెరాని.
అక్కడికి సమీపించి అసిస్టెంట్ ని పక్కకు తప్పుకోమన్నట్లుగా చేతితో సైగ చేశాడు. అసిస్టెంటు తప్పుకున్నాడు.
కెమెరాలోంచి చూడసాగాడతను.
అద్భుతంగా జరుగుతోంది పెరేడ్.
క్లాప్స్ తో జరుగుతున్న షోకి మరింత శోభని చేకూర్చుతున్నారు ప్రేక్షకులు.
అందరి దృష్టి అర్చన మీదే వుంది.
రెండు నిమిషాలు గడిచింది.
ఆ పెర్ ఫార్మెన్స్ పూర్తయింది.
క్లాప్స్ తో దద్దరిల్లింది ఆ ప్రాంగణం.
మ్యూజిక్ ఆగిపోయింది.
లైట్స్ డిమ్ అయ్యాయి.
తిరిగి కామెంటరీ మొదలుపెట్టాడు డైరక్టర్.
అతని కళ్ళు తిరిగి ఆమె రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.
మరికొద్ది క్షణాలు గడిచాయి.
తిరిగి మ్యూజిక్ మొదలయింది.
మళ్ళీ ఆమె వచ్చింది.
ఈసారి మరో డ్రస్. దేవతలనే తలదన్నే అందం కనిపిస్తోంది ఆమెలో.
ఆమెను చూసిన మరుక్షణం అతని కళ్ళు మెరిశాయి.
అతని చేతులు కెమెరా బటన్స్ మీద కదలసాగాయి.
ఆమెను జూమ్ చేశాడు.
క్లోజప్ లోకి ఆమె పెదవులు వచ్చాయి.
ఆమె కళ్ళను, కళ్ళలోని భావాలను, చిరునవ్వు తొణికిసలాడే పెదవులను....వరుసగా క్లోజప్స్ షూట్ చేస్తున్నాడు.
కెమెరామెన్ గా అతనికున్న అనుభవాన్ని, ప్రజ్ఞని మిళితం చేసి వీడియో షూట్ చేస్తున్నాడు.
ఒకసారి వేగంగా ,మరోసారి మెల్లగా మ్యూజిక్ కి అనుగుణంగా క్యాట్ వాక్ చేస్తున్నారు మోడల్స్ అంతా.
కానీ అర్చనను మాత్రమే ఆ కెమెరా తనలో బంధించుతోంది.
* * * * *
"మీతో కొంచెం వివరంగా మాట్లాడాలి"
కౌశిక్ మాటకు తల ఎత్తి చూసింది సంజు.
"ఎస్....ఐ హేవ్ టు టాక్ టు యు. ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్ రూమ్."
ఎందుకు? ఏమిటి మాట్లాడతారు? అన్నట్లుగా అర్ధం వచ్చేలా చూశాయామె కళ్ళు.
"ఇక్కడ కాదు. కారణం....మా నాయనమ్మ క్షణం తరువాత వచ్చేస్తుంది. ఆవిడకి మనం ఏం మాట్లాడుకుంటున్నామా అన్న ఆతృతెక్కువ. ఆవిడ వినటం నాకు ఇష్టంలేదు దట్స్ వై....ప్లీజ్ కం" మళ్ళీ అన్నాడు అభ్యర్ధనగా.
ఆమె చైర్లోంచి లేచి నిలబడింది.
"రండి వెళదాం" అంటూ చేయి చూపించాడు బయటికి.
ఇద్దరూ బయటకు నడిచారు.
"దీని నెక్ట్స్ ఫ్లోర్ లోనే నా ఆఫీస్ రూమ్" అంటూ స్టెయిర్ కేస్ వైపు నడిచాడతను.
యాంత్రికంగా అతన్ని అనుసరించిందామె.
మెట్లవరకు వచ్చి ఆగిపోయాడతను.
కారణం....మెట్లమీదుగా దిగి క్రిందికి వస్తున్నాడు అతని తండ్రి విజయరామారావ్.
కళ్ళజోడులోంచి ఆయన చూపులు సంజుని షార్ప్ గా చూశాయి.
"మా ఫాదర్" అన్నాడు ఆయనను చూపిస్తూ కౌశిక్.
"నమస్తే"అంది రెండు చేతులూ జోడించి మర్యాదపూర్వకంగా.
ప్రతినమస్కారం చేసిన విధంగా తల ఆడించి అక్కడినుండి వెళ్ళిపోయారాయన.
ఏ మాత్రం నవ్వులేని మువం ఆయనది.
కౌశిక్ తండ్రి అంటే ఏ మాత్రం నమ్మేలా లేడు.
అతను అరడుగుల పొడవుంటే....ఆయన ఐదడుగులు మించి వుటడరు.
అతను తెల్లగా వున్నాడు.
ఆయన నల్లని నలుపు.
కౌశిక్ బలిష్టంగా వుంటే....ఆయన బక్కపలచగా వున్నారు.
"మా ఫాదర్ కి, నాకు ఏ మాత్రం పోలిక లేదు కదా?" మెట్లు ఎక్కుతూ అన్నాడతను.
ఆమె మాట్లాడలేదు.
"నేను మా అమ్మ పోలిక. మా అమ్మ ఎత్తుగా, తెల్లగా చాలా అందంగా వుండేది. ఇంకొక విషయం తెలుసా! మా అమ్మది, నాన్నది లవ్ మ్యారేజ్" అన్నాడు.
నవ్వు వచ్చింది ఆమెకు. కానీ పళ్ళ బిగువున ఆపుకుంది.
"దిస్ ఈజ్ మై రూమ్" ఆ రూమ్ లోకి అడుగుపెడుతూ అన్నాడు కౌశిక్.
గదిలోకి రాగానే ఒకసారి చుట్టూ పరికించి చూసిందామె.
గదికి రెండు పెద్ద పెద్ద విండోస్....వాటికి గ్రే కలర్ వేనిషన్ బ్లయిండ్స్....ఒక వైపు పెద్ద బుక్ షెల్ఫ్. దానికి ముందుగా ఒక పెద్ద టేబుల్, రివాల్వింగ్ చైర్....ఇవతలి వైపు మూడు విజిటర్స్ చైర్స్.
గదంతా మైల్డ్ గా వ్యాపించింది ఫ్రషనర్ వాసన.
అతను చెప్పకుండానే అక్కడి చైర్లో కూర్చుందామె.
కౌశిక్ కు వెనుకనున్న గోడకి ఓ వ్యక్తి ఫోటో వుంది. ఆ వ్యక్తికి అరవై సంవత్సరాల వయసు వుండచ్చు.
క్షణకాలం ఆ ఫోటో వైపు చూసి తల తిప్పి కౌశిక్ ని చూసి "ఆ ఫోటోలోని వ్యక్తి పేరు....ఏదో పటేల్ కదూ?" అంది.
అతను కనుబొమ్మలను చిత్రంగా ముడివేశాడు.
"మీకు....మీకెలా తెలుసు?"
"అంటే....నేను చెప్పింది కరెక్టేనా?"
"హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. ఆయన పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇండియాస్ ఫస్ట్ హోంమినిస్టర్.
ఆమె కళ్ళు ఒకింత ఆనందంగా మెరిశాయి.
"నాకు ఇంకా గుర్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాలలో ఆయన ఫోటో చూసినట్లు....ఆయన గురించి చదివినట్లు...."
"అంటే మీరు ఇండియాలో చదివారా?"
"అవును!"
"ఆశ్చర్యంగా వుందే. ఎప్పుడు చదివారు?"
"ఎప్పుడంటే ఆహా....ఇప్పుడు చెప్పను."
"ఏం?"
"చెప్పటం ప్రారంభిస్తే చాలా టైం పడుతుంది. బిఫోర్ దట్....ఐవాంట్ టునో వైయువార్ ఆస్కింగ్ మి నాట్ టు గోటు వైజాగ్."
"ఆల్ రైట్! ముందుగా నేనే చెబుతాను" అంటూ రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు కౌశిక్.
అతను కూర్చున్న బరువుకి చిన్నగా శబ్దం చేసింది చైర్.
"ముందుగా నాకీ విషయం చెప్పండి. మీరు వైజాగ్ లో ప్రోగ్రాం ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు?"
"కారణం....అది నేను పుట్టిన వూరు"
"ఐసీ."
"మరి ఆ వ్యక్తులు....ఐమీన్....మిమ్మల్ని వెంబడిస్తున్న వ్యక్తులు ఎవరు?" తిరిగి అతనే ప్రశ్నించాడు.
"తెలియదు."
"అబద్ధం"
"వాట్ డూ యూ మీన్?"
"అబద్ధం అని నేను ఖచ్చితంగా అనటం మీకు నచ్చకపోవచ్చు. బట్....మీకు ఎవరో తెలియదు కానీ మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు. అంటే ఎలా నమ్మేది?"
"నేను చెబుతున్నది నిజం. వాళ్ళెవరో నాకు తెలియదు."
"పోనీ! మిమ్మల్ని చంపాలనుకుంటున్న వాళ్ళు ఎవరు?"
"తెలియదు."
"ఐమీన్....మీకు శతృవులు ఎవరైనా?"
"నాకు శతృవులా లేరు....ఉండరు."
"కనీసం అభిప్రాయభేదాలున్న వ్యక్తులున్నారా?"
"ఖచ్చితంగా లేరు."
"మిమ్మల్ని ఎవరైనా ప్రేమించడం! మీరు కాదనటమో! జరిగాయా?"