పందెం పెడితే అందరూ ఆశపడి అందులో పాల్గొంటారు కదా! కాదు అనుకుంటే ఇదుగిదిగో! వీరు- వీరు- వీరు- పోటీలో పాల్గొనకూడదు. ఈ అర్హతలున్న వారే పాల్గొనాలి. ఈ అనర్హత వల్ల వీళ్ళు పాల్గొనకూడదు అని నిబంధించి ఉండరాదా?
ఊహూ! అవేమీ అనక, ఆనక ఏం జరిగిందోనని ఆలోచించక ఏదో మదికి తోచిన నిబంధన ఆ తంపులమారి నారదుడు నిర్ణయిస్తే దానిని ఆమోదించడం ఎందుకు?
అందులో ఆ గౌతముడే ప్రధముడుగా రావడం ఏమిటీ? హూ! ఇదంతా ఇంద్ర గర్వభంగానికి అందరూ ఆలోచించి పన్నిన పథకం అనుకోవాలి. కానీ అందుకు ఆస్కారం లేదు. కోరి కొరివితో తల గోక్కునే వెర్రి మానవులలాగ ఆ ఆలోచన తన బుద్ధిలోనే పుట్టుకొచ్చింది. బుద్ధిః కర్మాను సారిణీ అని అజనాభదేశంలో అందరూ అనడం నిజమే!
తనిలా అహల్యా విరహంలో అలమటించిపోవాలని తనకై తానే సృష్టించుకున్న ఆనలం ఆ అహల్య... అహల్య... అహల్య... మూడక్షరాల ముచ్చటైన పేరుతో ముప్పది మూడు కోట్ల దేవతాగణాన్ని మునీంద్ర గణాన్ని, ముప్పు తిప్పలు పెట్టిన ముగ్ధ... వాళ్లకేం. వాళ్ళంతా ఎప్పుడో మర్చిపోయి తమ తమ స్థావరాలకి వెళ్ళిపోయారు. తను తన లోకానికి వచ్చినా... తను ఎక్కడ వున్నా మనస్సంతా అక్కడ ఆ అహల్య సుందరాకారం చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది!
అమరలోక సుఖాలపై ఆశ పుట్టడం లేదు. అమర సుఖాన్నిచ్చే నందనోద్యానం సంచారం మనశ్శాంతి నివ్వడం లేదు. సురపై మనస్సు పోవడం లేదు. సుర భామినుల నృత్యంపై మనస్సు పోవడం లేదు.
ఎలా పోతుందీ? ఆ మనస్సిక్కడ ఉంటే కదా? అది ఆ అందాల సుందరి అహల్య సుందర చరణాల చెంత పడిగాపులు పడుతున్నది. నిట్టూర్చాడు ఇంద్రుడు. అప్పుడు చిరుగజ్జెలు ఘల్లుమన్నాయి.
మృదు మధుర పరిమళాలు గుప్పుమన్నాయి. మగువ పొలుపు తెలిపే మారుతం వీచింది. మరు కాకల పొగిలే దేవేంద్రుడి మనస్సు మరింత వేగింది.
11
గౌతమాశ్రమంలో నవ వధూ గృహప్రవేశ సమయంలో జరుగవలసిన విధులన్నీ శాస్త్రోక్తంగా విధి విధాయకంగా జరిగాయి. వృద్ధర్షులు పత్నీసమేతంగా వచ్చి అహల్యా గౌతములను ఆశీర్వదించారు. తదనంతరం విందు భోజనం మొదలయ్యింది.
ఆశ్రమంలో కంచే చుట్టూతా పెంచిన కదళీ వృక్షాలలో వెదికి వెదికి బారడేసి వెడల్పున్న ఆకులను అగ్రం చిరక్కుండా కోశారు గౌతమ శిష్యులు. భోజనం ఎంత కనువిందుగా కనిపించాలో భాజనం (భోజన పాత్ర) అంతకంటే కనువిందుగా కనిపించాలనేది పెద్దల మాట!
అందుకే వడ్డించే ఆహార పదార్ధాలు ఏవైనా, ఎన్నైనా, ఎలా ఉన్నాసరే వడ్డన చేయడానికి అరటిఆకు వాడి అరటి ఆకులో ఆహార పదార్థాలు వడ్డిస్తే అది విందుకొచ్చిన వారికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
బారడేసి వెడల్పున్న అరటి ఆకులలో ఎన్నెన్నో ఆహార పదార్ధాలు వడ్డించారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో వరి సమృద్ధిగా పండుతుంది.
అక్కడి నుండి తెచ్చిన బియ్యంతో వండి వడ్డించిన అన్నం చూడగానే కడుపు నింపేంత కమనీయంగా ఉంది. మల్లె మొగ్గలాగ తెల్లగా సన్నగా మెతుకు మెతుక్కీ అంటూకోకుండా ఆస్వాదయోగ్యంగా కనిపిస్తోంది అన్నం.
మూడేసి వ్యంజనాలు, మూడేసి పొడి కూరలు, పప్పు, దప్పళం, పాయసాన్నాలు, పాయసాలు, భక్ష్యాలు, చోష్యాలు, లేహ్యాలు విస్తరి నిండుగా వడ్డించారు.
విందు ఇవ్వడానికి భరద్వాజుడు అజనాభదేశంలో సుప్రసిద్ధుడు. మనుషులు, మానవ నాధులు, మునులు, ఋషులే కాదు. దేవతలు కూడా భరద్వాజుడి విందంటే కడుపులు పెంచుకుంటారట. ఆ పేరు వింటేనే అందరికీ నోరూరుతుందట!
అయితే ఈనాడు గౌతమమహర్షి వివాహ సందర్భంగా ఏర్పాటైన ఈ విందు భోజనం భారద్వాజుడి విందుని తలపించడం కాదు. మరిపించేంత గొప్పగా తయారయింది. గతంలో గానీ వర్తమానంలో గానీ రాబోయే కాలంలో గానీ మరెవ్వరూ ఏర్పాటు చేయలేనంతగా ఈ విందు ఏర్పాటు చేయబడింది.
ఎందుకంటే- విందు ఇస్తున్నది సాక్షాత్తూ సృష్టికర్తలైన బ్రహ్మ అల్లుడు గౌతములు. ఆశ్రమంలో అడుగిడుతున్నది అహల్య. ఆ పరమేష్టి ఏకైక పుత్రిక అందాల రాశి. జగదేక సుందరి. సృష్టి ఆరంభించి ఇన్ని కోట్ల సంవత్సరాలు గడిచాయి. యుగాలు మన్వంతరాలు గడిచాయి. అయినా ఇన్ని సంవత్సరాలు ఒక లోపంతో గడిచిపోయాయి!
అదేమిటంటే అందరికంటే అందగత్తె ఎవరూ లేకపోవడం. ఏ లోటూ లేకుండా ఎవరూ తనకు సాటి రాకుండా తనకు తానే సాటిగా నిలువగలిగే సుందరీమణి లేనేలేదిన్నేళ్ళూ!
ఇన్నేళ్ళకి ఆ ఇంద్రుడి సంకల్పబలమా అన్నట్లు అహల్యణు సృష్టించాడు బ్రహ్మ! ఆ బ్రహ్మ మెచ్చి నిర్ణయించి మరీ పెళ్ళి అరిపించాడు గౌతములతో. గౌతమ మహర్షి కంటే ఉత్తమ ఋషి ఇంకెవరు?
అట్టి గౌతముల అర్ధాంగిగా అరుదెంచింది అహల్య! అందుకే యీ అపూర్వమైన విందు. ముని బాలకులు, ముని పత్నులు, ముని కన్నెలు, పదేపదే పంక్తుల మధ్య తిరుగుతూ, అడిగిందే అడుగుతూ, వడ్డించిందే కొసరి కొసరి వడ్డిస్తూ, విందారగించేవారికి బ్రహ్మ మరిన్ని 'కడుపు'లు ఇవ్వలేదే అన్న కొరత అనుభూతమయ్యేలా విందు జరిపారు.
ఒక మునీంద్రుడు పాయసం వడ్డిస్తే 'చాలు కడుపు నిండిపోయింది. ఇంకొక్క గరిటెడు ఊహూ! ఉద్ధరిణుడు కూడా లోపలికి పోదు' అని తిరస్కరించాడు. పక్కనే ఉన్న మరో ఋషి నవ్వాడు.
అంతలో మరో బ్రహ్మచారి భక్ష్యాలు తీసుకుని వచ్చాడు. అతని వెంట పాలు, నెయ్యి పట్టుకుని ఇద్దరు మునికన్నెలు వచ్చారు.
భక్ష్యాలు చూడగానే విస్తరిలోని పదార్ధాలన్నీ అటూ ఇటూ జరిపి విస్తరి మధ్యలో ఖాళీ చేశాడు. పాయసం పట్టదన్న మునీంద్రుడు భక్ష్యాలు పదీ పన్నెండు వడ్డించి, గోకర్ణం నెయ్యి కుమ్మరించారు. వాటిని ఆ నెయ్యిలో బాగా మెదిపాడు ముని. పాలున్నాయి అంటూ ఓ ముని కన్య అంది.