"మనిద్దరి మధ్యా అచ్చట్లూ ముచ్చట్లు గురించి"
"నాకిలాంటివి నచ్చవని చెప్పాను. ఇప్పటికే రోడ్డుమీద అందరూ మనవైపు వింతగా చూస్తున్నారు...గట్టిగా కేకలేస్తాను."
"అంతపని దేనికిలెండి. ఇవాల్టికి వెళతాను... రేపటిదాకా ఎంతో ఆశతో ఎదురుచూస్తాను. అంటూ దీక్షిత్ భారంగా అక్కడ్నుంచి కదిలాడు."
7
రామేశం, అమ్మాజీ...చివరకు వాళ్ళ వూరెళ్ళిపోయారు.
ఈలోగా రామేశం పర్సు అనేకసార్లు అవసర సమయాల్లో మరిచిపోయాడు. ఊరెళ్ళే ముందయితే ఏకంగా కొన్ని వందల రూపాయలతో వున్న పర్సు పోయింది.
దానికి అయిదొందల రూపాయల ముడుపు విజయ్ కుమార్ చెల్లించుకున్నాడు.
ఈ దేశంలో నిత్యం అనేకమంది పర్సులు పారేసుకుంటుంటే వాటి మూలాన కొంతమంది మెత్తని వాళ్ళు భరించాల్సి వస్తూ వుంటుంది.
వినోద్ ఒక రోజున గదిలో కూర్చుని సీరియస్ గా లెక్కలు వేస్తూ కనిపించాడు.
సుజాత గదిలో కడుగుపెట్టింది. "వినోద్ ఏమిటి లెక్కలు వేస్తున్నావు?"
"రామేశం మావయ్య పద్దులో ఎంత ఖర్చయిందీ చూస్తున్నాను."
సుజాత చిరునవ్వు నవ్వింది.
"వదినా! అలా నవ్వి ఊరుకుంటున్నావేం? నీకు గుండె ధైర్యం చెదిరిపోవటం లేదూ?"
"లేదు"
"జీవితంలో అర్థంలేని ఇలాంటి దురాక్రమణలను తప్పించుకోలేం. బాధపడి ప్రయోజనం లేదు. కాబట్టి__వాటి గురించి ఆలోచించను."
వినోద్ ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. ఆ చూపుల్లో ఓ ఆరాధనా భావం గోచరిస్తోంది. ఆమె విశిష్టమైన వ్యక్తిత్వం, అణువణువునా తొణికిసలాడే ఔన్నత్వం అతన్ని పులకితుడ్ని, వినత్రుడ్ని చేశాయి.
"వదినా!" అన్నాడు.
"ఏమిటి వినోద్"
"నీలాంటి వరాలతల్లి వదినగా లభించినందుకు..." భక్తి భావంతో చెప్పాలనుకుంటున్నాడు. కాని...ఆమెకలాంటి పొగడ్తలు ఇష్టంలేదని తెలుసు. అంతేగాక కొన్ని కొన్ని అద్భుతభావాలు బయటకు వ్యక్తీకరించకుండా మనసులో పదిలంగా, గౌరవప్రధంలో దాచి వుంచినప్పుడే వాటి విలువలు ఇనుమడిస్తాయి."
* * * *
ఓ సాయంత్రం ఐదుగంటలావ్వేళ వినోద్ ఫ్రెండ్స్ తో అంతవరకూ గడిచి యింటికొచ్చాడు. ఆరోజు వాళ్లకు బాగా పరిచయస్తులింట్లో పెళ్ళి జరుగుతున్నది. బాగా బలవంతం చెయ్యటంవల్ల ఇంటిల్లపాదికి వెళ్ళక తప్పలేదు. సుశీలమ్మగారికెప్పుడూ "వొంట్లో బావుండలేదు. అనే స్లోగనున్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఉపద్రవమైన సరదా, ఉత్సాహం వురకలేస్తాయి. ఆవిడ లేకపోతే ప్రసాదరావుకింట్లో క్షణం తోచదు. అందుకనీ ఆయనా బయల్దేరతాడు. వినోద్ తనకు బోర్ అని చెప్పి ఫ్రెండ్స్ తో గడిపి పదిగంటల తర్వాత తిరిగొస్తానని బయటకెళ్ళిపోయాడు...కాని కొంతసేపటి తర్వాత బాగా తలనొప్పిగా, వొళ్ళంతా బాధగా వున్నట్లనిపించింది. నాకు అనీజీగా వుంది" ఇంటికెళ్ళి రెస్టు తీసుకుంటానని చెప్పి వచ్చేశాడు.
ఎప్పుడన్నా అలా జరిగినప్పుడు...తాళంచెవి యింటివాళ్ళకిచ్చి వెళ్ళట మలవాటు. కాని వాళ్ళ ఇల్లు కూడా తాళం పెట్టి వుంది. బహుశా సినిమాకిగాని వెళ్ళారేమో అనుకున్నాడు. ఇంటి వాళ్ళకు ఊళ్ళో కొచ్చిన ప్రతి సినిమా చూడటమలవాటు. లేకపోతే అరికాళ్ళు మంటలు పుడతాయి.
విమలాదేవిగారిల్లు కూడా లాక్ చేసి వుంది.
అటువైపు రాధాప్రియగారిల్లు. అక్కడకి వెళ్ళటానికి కొంచెం సంకోచించాడు. మొదట్నుంచీ ఆమె అంటే ఎలర్జీ. చేతులనిండుగా గాజులు, మెళ్ళో కొట్టొచ్చినట్లు ఏవేవో బంగారు నగలు, చెవులకు ఓసారి మాటేలు, ఇంకోసారి ఎర్రరాళ్ళ రింగులు, నుదుటికి మీదకు పడతా కావాలని వదిలేసిన ముగురులు, నడుము చాలా మేదబహిర్గతం చేస్తూ బొడ్డు క్రిందకి చీర, రకరకాల షేపులతో జాకెట్లు...వయస్సు కన్నా చాలా ఏళ్ళు చిన్నగా కనిపించాలన్న ఆరాటం...ఆ ఆరాటం కొంతవరకూ సఫలీకృతమై చూపరుల్ని ఆకర్షించే మాట నిజం.
వినోద్ కి రాధాప్రియ ఇంటికి వెళ్ళక తప్పలేదు. తలుపులు వేసి వున్నాయి. లోపలెక్కడో లైటు వెలుగుతోంది. కాలింగ్ బెల్ కోసం చూస్తే కనబడలేదు.
"ఏమండీ! ఏమండీ" అని పిలిచాడు.
లోపల్నుంచి ఏ జవాబూ లేదు.
గొంతు కొంచెం పెద్దది చేసి మళ్ళీ పిలిచాడు.
"ఎవరూ...?" అంది ఎక్కడ్నుంచో వినిపించినట్లు ఆమెగారి కంఠం.
"నేనండీ..."
"నేనంటే!"
ఏం చెప్పాలో తెలీలేదు. కొంచెం తటపటాయించి "ప్రక్క పోర్షన్ లో వుండే వినోద్ ను."
ఒక్కక్షణం నిశ్శబ్దం..."ఉండండి వొస్తున్నా" స్నానం చేస్తున్నాను."
గతుక్కుమన్నాడు. ఏం చెయ్యాలో తెలీక ఓ ప్రక్కకి తొంగి నిలబడ్డాడు.
నాలుగయిదు సెకండ్లు గడిచాక రాధాప్రియ వరండాలో కొచ్చింది. వరండాలో లైటు వెలగటం లేదు. లోపల వెలుగుతోన్న లైటు కాంతి కొంతవరకూ ప్రసరిస్తోంది. ఆ కాస్త కాంతిలో ఆమె రూపం కనిపించింది. లంగా, పైనా అచ్చాదనం చేసివున్న పల్చటి టవల్.
తలుపు తీసి "రండి లోపలకు" అంది.
వినోద్ మొహమాటంగా "మా యింటి తాళం చెవి మీకేమయినా ఇచ్చారా?" అనడిగాడు.
"ఇచ్చారు" అంది నవ్వుతూ.
ఆ సందర్భాని కలంకారమనుకున్నప్పుడు అవసరమున్నా లేకపోయినా పెదవుల మీదకి నవ్వు చిందించుకోవట మాట కలవాటు.