"అతన్లోని నిజాయితీకి ముగ్ధురాలవుతున్నట్లు ముఖంలోకి తదేకంగా చూసింది.
"ఏమిటలా చూస్తున్నావు?"
"మిమ్మల్ని"
"చెప్పు"
"ముద్దు పెట్టుకోబోతున్నాను."
తమాషా కనుకున్నాడు. కాని నిజంగానే దగ్గరగా జరిగి ముఖం అతనివైపు వొంచుతోంది.
కొంచెం కంగారుపడ్డాడు.
"అమ్మా నాన్నా ఇంట్లోనే వున్నారు."
"ఉంటే ఉండనివ్వండి"
"మాధురి కూడా వుంది."
"ఉంటే ఉంది."
ఆమె పెదవులు అతని పెదవులకు దగ్గరగా వస్తున్నాయి.
"భయంకరమైన మామయ్యా అత్తయ్యా ఉన్నారు"
"కేర్ చెయ్యను"
"అయ్యో. చెబుతే వినిపించుకోవేం! వినోద్ కూడా ఉన్నాడు."
"పట్టించుకోను"
ఆమె రెండు చేతుల్లో అతని తలను వుంచుకుని పెదిమల మీద పెదిమలు ఆన్చింది. ముద్దుపెట్టుకుంటోంది.
చిన్నగా "అయ్యో, అయ్యో అంటూనే ఆస్వాదిస్తున్నాడు.
అలా రెండు మూడు నిమిషాలు తెలీకుండా గడిచిపోయాయి.
* * * *
మాధురి బజార్లో చిన్న షాపింగ్ చేసింది. ఆమె చేతిలో ఓ ప్యాకెట్ వుంది. ఎదురొస్తున్న మనుషుల్ని తప్పించుకుంటూ వడివడిగా నడుస్తోంది.
"హలో" అని వినిపించింది ఓ ప్రక్కనుంచి.
తలత్రిప్పి చూసేసరికి అతను ఆరోజు గార్డెన్ లో కలిసిన యువకుడు. పెదవుల మీద చిన్న చిరునవ్వుతో ఆమెను పలకరిస్తున్నాడు."
ఇది...యిలా జరగటం మొదటిసారి కాదు. గత పదిహేను రోజుల్లో నాలుగయిదుసార్లు జరిగింది. ఎలా పసిగడుతున్నారో, ఎక్కడ్నుంచి గమనిస్తున్నారో తాను ఎప్పుడు బజారు కెళ్ళినా తారసపడుతున్నాడు. అంతటితో ఊరుకోవటంలేదు. చొరవగా పలకరిస్తున్నాడు.
అతని ధైర్యానికాశ్చర్యంగా వుంది. తాను అల్లరి చేస్తానని ఎందుకు భయపడటంలేదు? తనలో ఏమన్నా వీక్ నెస్ కనిపెట్టాడా?
తల విసురుగా త్రిప్పేసుకుని ముందుకు నడుస్తోంది.
రెండు మూడు సెకండ్లు గడిచి ఉంటుంది. చాలా దగ్గరగా చూడండి." అని వినిపించింది.
ఆగి, అతని ముఖంలోకి కోపంగా చూసింది.
"ఒక చిన్నమాట"
ఏమిటన్నట్లు మళ్ళీ కోపంగా చూసి మౌనంగా ఉండిపోయింది.
"నేనెన్నిసార్లు పలకరించినా మీరు వినిపించీ వినిపించనట్లు జవాబు చెప్పకుండా వెళ్ళిపోవటం ఏం బాగాలేదు."
"మీరిలా అసభ్యంగా వెంటపడటం, ఏదో హక్కు ఉన్నట్లు పలకరించటం నాకూ బాగాలేదు."
"ఆ సంగతి నాకూ తెలుస్తూనే ఉందండి. మిమ్మల్ని విసిగిస్తున్నానని తెలుసు. కాని తప్పటం లేదు."
"ఓహో అలాగా" అంది మాధురి వ్యంగ్యంగా" ఎందుకో.
"మీలో వున్న ఆకర్షణ శక్తి ఇటువైపే లాగేస్తూ వెంటపడేలా చేస్తోంది. నా వళ్ళు అఫ్ కోర్స్...మనసు కూడా అనుకోండి. నా స్వాధీనంలో ఉండటంలేదు."
"పాపం. అలాగా? ఒక్కమాట చెప్పానంటే అన్నీ స్వాధీనంలో కొస్తాయి"
"ఎవరితో?"
"మా చిన్నన్నయ్య వినోద్ తో. వాడికి బోలెడుమంది రౌడీ ఫ్రెండ్స్ వున్నారు తెలుసా?"
"మనిద్దరి మధ్యా రౌడీలు, గివుడీలు దేనికండి. ఇది చాలా సున్నితమైన సుందరమైన వ్యవహారం"
"ఇదిగో. మీ పేరేమిటో తెలీదుగాని, నేను చాలా సీరియస్ గా చెబుతున్నాను."
"ఆగండాగండి. మీమాట కడ్డువస్తున్నాను. నా పేరేమిటో తెలీదన్నారు కదూ" దీక్షిత్.
కోపంతో ఏదో అనబోతున్న మాధురి ఒక్కసారిగా అవాక్కయిపోయింది.
దీక్షిత్.
మాధురీదీక్షిత్.
అప్రయత్నంగా అతని ముఖంలోకి చూసింది. అందంగా వున్నాడు. ఆ అందంలో చిన్న అమాయకత్వం కూడా మిళితమై వుంది.
ప్రవర్తన కొంచెం అల్లరిగా వున్నా ముఖంలో ఆకతాయితనం, గడుసుతనం కనబడటంలేదు.
పాపం. మంచివాడేనేమో.
అయితే మాత్రం నాకేమిటి! అతని మంచి చెడులతో నాకేమి సంబంధం?
"అదేమిటండీ అలా ఉండిపోయారు?"
ఆమె ఇంకా కోలుకోలేదు. ఊ అంది పరధ్యానంగా.
"మిమ్మల్నేనండీ. అలా సైలెంట్ గా ఉండిపోయారేమిటి?"
ఊ...అంది మళ్ళీ.
"ఇందాక కూడా ఊ అని వూరుకుండిపోయారు."
"ఏమిటి మీరనేది?" అన్నది ఆలోచనలనుండి యివతలకొస్తూ.
"ఏదో చెబుతానన్నారు?"
"అవును. ఏదో చెబుతానన్నాను. ఇంతలోనే మరిచిపోయానేమిటి?" అంది తనలో తాను గొణుక్కుంటున్నట్లు.
"...ఏదో సీరియస్ గా చెబుతానన్నారు."
"ఆఁ గుర్తొచ్చింది. సీరియస్ గా చెబుతున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నాకు నచ్చవు."
"ఇంత అందమైన బంధానికి అలాంటి పిచ్చి పేర్లు పెట్టకండి, ప్లీజ్"
"బంధమా?"
"అవునండీ"
"ఏమిటండీ మీ ఉద్దేశం? ఒక్కొక్క పదంతో ముందుకు దూసుకొస్తున్నారు."
"అబ్బ! మీకంత కోపం దేనికండి? నేనెంత ముచ్చట పడుతున్నాను?"
"ముచ్చటా? దేని గురించి?"