"నువ్వు నాకు సాయం చెయ్యాలని వచ్చావు కానీ, నేను ......."
"నేను నీకు సాయం చెయ్యలేకపోయినా , నువ్వు నాకు చాలా సాయం చేసావు."
"నేను నీకు సాయం చేసానా?"
"అవును రాజూ! నువ్వు చిక్కుకుపోయిన ఊబిలోంచి నిన్ను కాపాడలేకపోయాను. కానీ, నేను చిక్కుకున్న ఊబిలోంచి నువ్వు నన్ను కాపాడావు!"
రాజు తెలివి తక్కువవాడు కాదు. లలిత ముఖం చూసినప్పటి నుండీ ఆశలు నిలుపుకోలేకపోతున్న రాజు మనసు ఈ మాటలతో పూర్తిగా నిరాశతో నిండిపోయింది. అయినా తన ప్రయత్నం మానుకోదలచుకోలేదు. ప్రస్తుతం అతని కున్న ఆధారం లలిత మాత్రమే! ఆమాటే అన్నాడు మరో రకంగా. "నాకీ లోకంలో ఎవరూ నీకంటే ఎక్కువ కాదు లలితా! ఆవిషయం చాలా ఆలస్యంగా అర్ధం చేసుకున్నాను."
లలిత నవ్వింది. "ఫర్వాలేదు! రాజూ! రోజురోజుకి మనం మారుతూ ఉంటాం! మనతో పాటు మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఈ రోజూ ఈ అభిప్రాయానికి వచ్చావు. రేపు ఏ అభిప్రాయానికోస్తావో?"
"లేదు! లేదు! లలితా! ఇంక ఈ జన్మలో ఈ అభిప్రాయం మారదు. నువ్వు 'ఊ' అంటే ఈ క్షణంలో నిన్ను పెళ్ళి చేసుకుంటాను"
"నీ అభిప్రాయం మారకపోవచ్చు రాజూ! నా అభిప్రాయాలు మారచ్చుగా! నేనూ నీలాంటి మనిషినే!"
ఇలాంటి సమాధాన మేదో వినవలసి వస్తుందనే భయపడుతున్న రాజు చటుక్కున లలిత రెండు చేతులూ పట్టుకున్నాడు.
"ప్లీజ్ ! లలితా! నన్ను అర్ధం చేసుకో! నిన్ను నిజంగా ప్రేమించాను కానీ .......కానీ ." రాజుకి మాటలు దొరకటం లేదు. అతని ముఖంలో దైన్యమూ, మాటలలో ఆరాటమూ , లలితకు జాలిని కలిగిస్తున్నాయి. ఒక విధమైన కంపరాన్నీ కలిగిస్తున్నాయి.
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే రాజు అభ్యర్ధనని అంగీరించటమే మేలు! రాజుని పెళ్ళి చేసుకోనంటే , తన కిప్పుడు పెళ్ళి చెయ్యటానికి తల్లిదండ్రులు సిద్దంగా లేరు. పెళ్ళి కాకుండా ఒంటరిగా........
ఆలోచనలమధ్య మరొక రూపం లలిత మనసు మీద దాడి చేసింది. కాని దానికి స్పష్టమైన ఆకృతి లేకుండానే తరిమేసింది లలిత.
"ఏం రాజూ! ఇప్పుడేలాగూ పెద్ద పెద్ద ఆఫీసర్లు తమ కూతుళ్ళ నిస్తామని రారు కనుక నన్ను చేసుకుంటానంటున్నావా?"
ఈ మాటలతో రాజు ఊపిరి తీసుకున్నాడు. స్థిమితంగా కూచున్నాడు.
"అదేమిటి లలితా! ఇప్పుడు నేను ఐ.ఏ.ఎస్. అదీసర్ని కానా?"
"అవును సస్పెన్ షన్ లో ఉన్న ఆఫీసర్ వి!"
"నేరం లేదని రుజువయితే సన్పెన్ షన్ కేన్సిలవుతుంది!"
"కావాలిగా!"
"అవుతుంది, నువ్వు ప్రయత్నిస్తే."
"నేనా?అతి సామన్యురాలిని. నావల్ల ఏమవుతుంది?"
"నువ్వు మాధవరావుగారికి చెప్తే, మాధవరావుగారు ఏమైనా చేయగలరు."
లలితకు తల గిర్రున తిరిగిపోయింది. ఇదా సంగతి! ఇందుకా, రాజు తన దగ్గిరకు వచ్చింది?
"నీకు కావలసింది అదే అయితే, నువ్వు రావలసింది నా దగ్గిరకు కాదు రాజు! ఇలాంటి పనులకి నేను పనికి రాను!"
"ప్లీజ్ లలితా! నాకోసం ........కాదు! మనకోసం....."
లలితకు మండిపోసాగింది.
"ఎవరికోసమైనా నావల్ల ఏమవుతుంది రాజూ! ఇలాంటి పనులు సాధించటానికి కావలసిన 36"- 28"-36" లక్షణాలు నాకు లేవు."
"అది కాదు లలితా! మాధవరావుగారికి నీమీద ప్రేమ! నీమాట కాదనరు!"
"మాధవరావుగారికి నామీద ప్రేమా? నాకే తెలియని ఈవిషయం నీకెలా తెలుసు రాజూ!"
"సారీ లలితా! నేను మరొక దురేద్దేశ్యంతో అనలేదు. ఎంతో ఆత్మీయులతో కాని పోలీస్ ఆఫీసర్లు ఇలాంటి రహస్యాలు చెప్పరు. అందుకని." లలిత ముఖం నల్లబదిపోయింది. మనసు విపరీతంగా బాధపడింది.
"ఆత్మీయురాలి ననుకొని అయన నాకు రహస్యం చెప్పలేదు. నేను ఆత్మగౌరవం గలిగిన దాన్నని భ్రమపడ్డారు. నా అభిమానం నిలబెట్టడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో ఒక అపార్ధాన్ని తొలగించటానికి విషయం చెప్పారు. బలహీనురాలినై అయన నాకిచ్చిన విలువను నిలుపుకోలేకపోయాను. అయన స్వభావం నాకు తెలుసు. నానిజ స్వరూపం తెలిస్తే నన్ను ఎంతైనా అసహ్యించుకుంటారు!"
ముడుచుకున్న లలిత ముఖాన్ని , కళ్ళలో తెరుగుతున్న నీళ్ళనీ చూస్తోంటే రాజుకి చేదు మింగుతున్నట్లుగా ఉంది. తెలియకుండానే ఏదో అక్కసు కలిగింది.
"ఆ మాధవరావుకి మణిమాల మీద చాల ప్రేమ. ఆవిడ ఎలాంటిదైనా ఆవిడను వొదిలిపెట్టడు. ప్రేమ మాట ఎలా ఉన్నా పరువు ప్రతిష్ట లను వదులుకోడు. మాధవరావు నిన్ను పెళ్ళిచేసుకోడు!"
ఉలికిపడి విచిత్రంగా రాజు ముఖంలోకి చూసింది లలిత? ఏమిటిది? రాజు కింకా తన మీదా........ఆలోచించదలుచుకోలేదు లలిత.
"రాజూ వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపో" కఠినంగా అంది లలిత. ఒక చవటనవ్వు నవ్వి అక్కడనుంచి వచ్చేయ్యటం తప్ప గత్యంతరం లేకపోయింది రాజుకి.
ఎలాగైనా తను నిర్ధిషినని రుజువు చేసుకోవాలి! ఎలా? అలోచించి అలోచించి, మాధవరావుగారి దగ్గరికే బయలుదేరాడు రాజు.
రాజుని చూసి ముఖం చిట్లించుకున్నాడు మాధవరావు. కూచోమని కూడా అనలేదు మాధవరావు. తనే కూచున్నాడు.
"లలిత మీ దగ్గిరకు వెళ్ళమంది. అందుకే ధైర్యంగా వచ్చాను." అన్నాడు.
ఉలికి పడ్డాడు మాధవరావు.
"లలిత.......లలిత పంపించిందా , మిమ్మల్ని నా దగ్గరికి?"
మాధవరావు ఆశ్చర్యానికి పరమానడం అనుభవించాడు రాజు. తన చేస్తున్న అన్యాయమేమీ లేదు అన్నీ నిజాలే చెప్తున్నాడు. నిజాలు కావా?
"అవును. లలిత వెళ్ళమంది. "మాధవరావుగారు న్యాయస్వరూపులు. న్యాయాన్ని తప్పకుండా కాపాడతారు!" అంది.'
"ఈ న్యాయా న్యాయాలు ఎవరు నిర్ణయించగలరు? అన్యాయమని రుజువయ్యేవరకూ అంతా న్యాయమే!"
"నేను సిన్సియర్ గా చెబుతున్నాను సార్! నేను ఏ తప్పు చెయ్యలేదు. ఇప్పుడాలోచిస్తే ఇదంతా ముందు నుంచీ పెద్ద ట్రాప్ అనిపిస్తోంది."
మాధవరావు కుతూహలంగా ముందుకు వంగాడు.
"బాపీనీడు గారికీ, రాగిణీకి ఉన్న కాంటెక్ట్స్ బట్టి ఇందులో బాపీనీడు గారి జోక్యం ఉందనిపిస్తోంది. ఆయనకు అన్ని విషయాలూ తెలిసి ఉండవచ్చు."
అదిరిపడ్డాడు మాధవరావు.
"బాపీనీడు గారెవరో, తెలిసే మాట్లాడుతున్నారా మీరు?"
"తెలిసే మాట్లాడుతున్నాను సార్! మీరూ ఆలోచించండి! అలాంటి వాళ్ళే ఇలాంటివి అవలీలగా సాధించగలరు!"
"ఒకవేళ మీరన్నమాట నిజమే అయినా, ఆయన్ని టేకిల్ చెయ్యటం సామాన్య సిశయం కాదు."