"మీరే అలా అంటే ఇక న్యాయానికి నిలువ నీడ ఎక్కడ సార్?"
"న్యాయం గురించి మాట్లాడుతున్నారు? రాగిణితో మీకేమిటి స్నేహం?"
రాజు తలవంచుకున్నాడు. గొణుగుతున్నట్లు అన్నాడు.
"ఆఫ్ కోర్స్ ఆయామ్ వీక్ సర్! రాగిణి ఏదో నా ఆఫీసర్ హోదా చూసి వస్తోందని చాపల్యానికి లొంగిపోయాను . అంతే సార్! అంతకు మించి ఏమీ లేదు."
"సరే వెళ్ళండి చూద్దాం!"
ఆ మాత్రమే మహాభాగ్యమనుకుని వెళ్ళిపోయాడు రాజు. 'థెంక్యూ లలితా!" అనుకున్నాడు మనసులో.
లలిత వ్యక్తిత్వం, ఆమెలోని నిజాయితీ మాధవరావుపై ఎంతో ప్రభావం చూపాయి. రాజు వ్యవహారంలో ఆమె పరిస్థితి పై జాలి కలిగింది.
"నీకోసం తప్పకుండా రాజుకి సాయం చేస్తాను లలితా!" అనుకున్నాడు మనసులో.
14
ఏది తమకందదో దానిమీదే ఆశలు పెంచుకోవటం మానవ స్వభావం కాబోలు! రాగిణి యెంత ప్రయత్నించినా మాధవరావును మరిచిపోలేక పోతోంది! మాధవరావులో రాగిణి ఏం చూసింది? అన్నదానికి సమాధానం లేదు. అసలెవరిలో నైనా ఏమైనా చూడటానికి రాగిణి ఎన్నడూ ప్రయత్నించలేదు. తనను తిరస్కరించిన మాధవురావులో ఏదైనా విశిష్టత రాగిణి మనసు మీద ఆమెకు తెలియకుండానే ముద్ర వేసిందేమో! ఈరకంగా తిరస్కరింపబడటం కూడా రాగిణికి మొదటి అనుభవం. బాధాకరమైన వింత అనుభవం. సాధారణంగా శ్యామలాంబగారు బాపీనీడు గారి దగ్గిరకు పంపించటం. బాపీనీడు గారు మరొకరి దగ్గిరకు పంపించటం శాయశక్తులా ఆ వ్యక్తిని ఎవరనే ఆలోచన కూడా లేకుండా అలరించటం బాపినీడుగారిచ్చిన బహుమతులందుకుని సంతోషంగా తిరిగి రావటం. ఇదే అలవాటు రాగిణికి. తనంత తానుగా ఏనాడూ ఎవరికీ దగ్గిర కావాలని ప్రయత్నించలేదు. అలా ప్రయత్నించిన నాడు ఆ వ్యక్తీ తనను తిరస్కరిస్తాడనేది ఊహ కందనిది!
రాగిణి మాధవరావు గురించి ఊహిస్తున్న సమయంలోనే మాధవరావు దగ్గిర నుంచి రాగిణిని రమ్మని కబురు వచ్చింది. ఆ కబురు వచ్చినందుకే ఆశ్చర్యపోతున్న శ్యామలాంబ రాగిణి ఉత్సాహంగా బయలుదేరటం చూసి మరింత ఆశ్చర్యపోయింది. సాధారణంగా ఆ సమాజంలో పిల్లలు డబ్బు పేరు చెపితే తప్ప ఉత్సాహం చూపించరు. పోలీస్ ఆఫీసర్ల పేరు వింటేనే భయపడతారు. విధి లేనప్పుడు తప్ప వాళ్ళ దగ్గిరకే వెళ్ళటానికి ఒప్పుకోరు. బయలుదేరబోతున్న రాగిణి దగ్గిరకు వచ్చి "మాధవరావు గారు నిన్నెందుకు పిలిపించారో తెలుసా?" అంది శ్యామలాంబ.
రాగిణి తనకు అలవాటైన ధోరణిలో చిలిపిగా నవ్వి "ఎవరైనా నన్నెందుకు పిలిపిస్తారు?" అంది.
శ్యామలాంబ ముఖం చిట్లించి "మాధవరావుగారు అలాంటి వ్యక్తీ కాదని విన్నాను. జాగ్రత్తగా ఉండు." అంది హెచ్చరిస్తున్నట్లు.
రాగిణి ముఖం చిన్నబోయింది.
మాధవరావు తన ప్రైవేట్ రూంలోకి రాగిణిని చిరునవ్వుతో ఆహ్వానించాడు.
"మీకు బాపీనీడు గారు ఎంత కాలంగా తెలుసు?" రాగిణి పూర్తిగా కుర్చోకుండానే అడిగాడు మాధవరావు.
ఆ ప్రశ్న వింటూనే "అమ్మో!" అనుకుంది రాగిణి. అలాంటి ప్రశ్నలకు సమాధానాలు లియ్యకూడదని రాగిణికి తెలుసు. వాళ్ళ శిక్షణలో అదొక భాగం. పకపక నవ్వింది రాగిణి.
"ఎందుకు నవ్వుతున్నారు?"
"నేను లలిత ననుకున్నారా? మోహించిన వాళ్ళతో రహస్యాలన్నీ చెప్పెయ్యటానికి!"
రాగిణి ముఖంలోకి చూసి చిన్నగా నవ్వాడు మాధవరావు.
ఆ నవ్వు రాగిణిని ఇరిటేట్ చేసింది. అప్పుడప్పుడు లలిత కూడా ఇలాగే నవ్వుతుంది.
"అయితే, నాకు చెప్పరు కాని, రహస్యాలున్నాయన్న మాట!" హాస్యంగా అన్నాడు మాధవ్ "ఓ బోలెడన్ని రహస్యాలు! కమ్మని.......తీయని రహస్యాలు! ఎవరికీ చెప్పకూడని రహస్యాలు!" అంది నవ్వుతూ.
"తెలివైనది' అనుకున్నాడు మాధవరావు. ఈ 'తెలివి' లోను ఎన్నెన్ని రకాలు?
"పోనీ , మనం వ్యాపార సరళిలోనే మాట్లాడుకుందాం! నా ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు మీకెంత చెల్లించుకోవాలి?"
కలుక్కుమంది రాగిణికి. ఈ మాధవరావు తనలో కలిగిస్తున్న భావాలన్నీ తనకు కొత్తవే!
"నా వ్యాపారం రహస్యాలమ్ముకునే వ్యాపారం కాదు" అంది.
నీళ్ళు నిండిన కళ్ళతో ప్రతిఫలించే ఏదో వ్యధను విస్తుపోయి చూశాడు మాధవరావు. మొదటిసారిగా రాగిణి మీద జాలి కలిగింది.
"గుడ్! నాకు కావలసింది సాధించలేకపోయినా మీరంటే గౌరవం కలుగుతోంది. పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి నిబ్బరాన్ని మెచ్చుకో కుండా ఉండలేను......."
ఇంక వెళ్ళి రావచ్చు అనే ధోరణిలో మాట్లాడాడు.
రాగిణి కేదో నీరసం ఆవహించినట్లయింది. ప్రయత్నించినా కూర్చున్న చోటి నుంచి లేవలేకపోయింది.
"మీరు నాకోసం కబురు చెసారనగానే ఎంతో ఆశపడ్డాను......" మాధవరావు కనుబొమలు ఒక్కసారి ఆశ్చర్యంగా పైకిలేచి అంతలో క్రిందకు వాలిపోయాయి. ఏమీ అడగలేదు.
"నాలో అందం ఒక్కటే కాదు. నేను మొగవాడికి చాలా చాలా ఇవ్వగలను."
పూర్తిగా దిగజారిన రాగిణి పైకి నిలబడే ప్రయత్నంలో గర్వంగా అంది.
"అవును! ఎన్నెన్నో ఇవ్వగలరు. అనందం తప్ప......."
"ఏమంటున్నారు? ఒక్కసారి నాతొ ఆనందించిన వాళ్ళని అడిగితే........"
"అడక్కర్లేదు , నాకు తెలుసు , వాళ్ళకు , మీకు కూడా ఆనందమంటే ఏమిటో తెలియదు. అంచేత అనందం ఇచ్చానని, మీరు, పుచ్చుకున్నామని వాళ్ళు భ్రమపడుతున్నారు!"
రెండు కళ్ళు పెద్దవి చేసి చూసింది రాగిణి. "అయితే మీరు చెప్పండి! ఆనందమంటే ఏమిటో...."
"అలా మాటల్లో చెప్పేది కాదు కనుకనే చాలా మందికి తెలియదని అనగలిగాను. నిజమైన అనుభూతులేవీ ఏవేవో సూత్రాలకు లొంగిఉండవు. యాంత్రికంగా లెక్కవేసి చెప్పే స్థాయిలో అసలుండవు. మీరు ఎన్నో నేర్చుకోగలరు! ఎంతో ప్రదర్శించగలరు! కానీ మనసుని తాకే ప్రేమ ఎక్కడ సంపాదించగలరు? అది అక్కడా ఇక్కడా దొరికేది కాదు. ప్రయత్నించి పుట్టించుకునేది కాదు. నా ఉద్దేశ్యంలో సృష్టికి మూలమైన ఆనందానికి ఆధారం ప్రేమ మాత్రమే. అదొక్కటి చాలు కష్టపడి నేర్చుకున్న అన్ని చాతుర్యలనూ మించిన కళలతో జీవింప చెయ్యటానికి......."
తనను తను మరిచి మాట్లాడుతోన్న మాధవరావు కళ్ళ వెలుగుల మీద నుండి దృష్టి మళ్ళించుకోలేకపోయింది రాగిణి "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అనేసింది.
పకాలున నవ్వాడు మాధవరావు.
"మీకు ప్రేమంటే ఏమిటో తెలియదనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు!"