సూర్య శవాన్ని ఈడ్చుకుపోతున్నారు మునిరాజు వాళ్లు.
"లోయలోకి విసిరేద్దాం. కాకులు గద్దలు పీక్కుతింటాయి."
"ఎవరైనా చూస్తే పోలీసులతో తంటా. గొయ్య తవ్వి పూడ్చిపెడదాం."
"అనవసరంగా చంపేశావు మునిరాజూ! నిధి రహస్యం వాడితోనే అంతమైపోయింది కదా?"
"వాడు బ్రతికినా చెప్పేవాడు కాదు. ఎప్పుడో మనకు తెలియకుండా నిధిని వాడే చంకనబెట్టుకుని పోయేవాడు."
దేశికాచారి చెట్టు చాటునుండి వాళ్ల మాటలు వింటున్నాడు. అతడికి దుఃఖం ఆగింది కాదు. ఒక్కసారి సూర్యను చూడాలని వుంది.
కానీ ఈ సమయంలో ఆ దుర్మార్గుల కంటబడితే, వాళ్లు తననీ వదిలిపెట్టరు. చంపి సూర్యతోపాటు తననీ పాతిపెడతారు.
ఎందుకిలా జరిగింది?
సూర్య దగ్గరున్న యోగశక్తి అతడిని కాపాడాలేకపోయింది.
ఎప్పుడూ వెన్నంటి తోడుగా వుండే మారుతీ అతడిని అనుగ్రహించలేకపోయాడు. ఏ యోగశక్తీ, ఏ దేవుడూ లేని ఆయుష్షుని ఇవ్వలేరుకదా అతడి జాతకంలో స్పష్టంగా యమగండముంది.
పసిబాలుడిగా వున్నప్పుడే రక్కసి పూనతను చంపి, శకటాసురుణ్ణి తుత్తునియలు చేసి, కాళింది పీచమణచి, కంసమామను హతమార్చి తన లీలలు చాటుకున్న శ్రీ కృష్ణుడు అంతటివాడే బోయవాడి చేతిలో బాణపుదెబ్బ తిని, అసువులు బాశాడు. రామావతారంలో దొంగచాటుగా బాణంవేసి వాలిని చంపిన పాపం శ్రీకృష్ణుడిగా పుట్టి, బోయవాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైంది.
దేవుడికీ కర్మఫలం తప్పలేదు.
మానవుడెంత?
విధికి తన యోగశక్తిని అడ్డువేయడం సూర్యకిష్టం లేకపోయిందేమో?
గత జన్మలో చెంచుపిల్లను హత్యచేసిన పాపం అతడిని ఈ విధంగా వెంటాడి, వేటాడింది.
ఎక్కడి జయసూర్య?
ఎక్కడ భైరవుని కొండ?
చివరికి ఇక్కడికే వచ్చి మట్టిలో కలిశాడు.
మునిరాజు వాళ్లు సూర్యని పూడ్చి మట్టి కప్పి వెళ్లిపోయాక వెళ్లిమూడు దోసిళ్ల మన్ను పోశాడు దేశికాచారి.
"ఇద్దరూ కలసి వెళ్లారుకదా!నా కొడుకు ఏడి?" అని అడిగితే ఏం చెప్పాలి ఆ వృద్దతండ్రికి.
ఈ అడవిలో అనాధ శవం కాకుండా తన సహచరుడి కన్నీటి చుక్కలు నోచుకున్న జయసూర్య కొంతలో కొంత పుణ్యం చేసుకు పుట్టాడేమో?
* * * * *
తరువాత దేశికాచారి ఏం చేశాడు?
మునిరాజు ముఠాకి భైరవుని కొండలోని నిధి దొరికిందా? అన్న ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను జయసూర్య కథ అక్కడితో అఖరైపోయింది కాబట్టి.
ఆమధ్య యదార్ద సంఘటన అటూ వ్రాయబడిన ఒక కథ చదివాను.
అయిదేళ్ల పిల్లవాడు తన పూర్వజన్మలో ఫలానా ఊళ్లో ఫలానా వారి కొడుకునని, తన ఇరవై అయిదవ ఏట హత్యకు గురిఅయ్యానని చెబుతాడు. ముందు ఆషామాషీగా తీసుకున్నా ఆ పిల్లవాడు పదేపదే చెబుతుంటే వాస్తవం ఎంతో తెలుసుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. ఆ పిల్లవాడు అతడు చెప్పిన ఊరికి తీసుకువెళతారు. ఆ పిల్లవాడు క్రితం జన్మలో తన తల్లిదండ్రులను, స్నేహితులను గుర్తుపడతాడు. తనని హత్యచేసి పూడ్చిపెట్టిన స్థలాన్ని కూడా చూపి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాడు.
నాకంత స్పష్టంగా గతజన్మ జ్ఞాపకాలు లేకపోయినా అప్పుడప్పుడు నా మనఃఫలకంమీద సినిమారీలులా తిరిగే కొన్నిదృశ్యాలనుబట్టి నాకొచ్చే కలలనుబట్టి జయసూర్య కథ చెప్పాను. నేను ఊహించినదంతా నిజం కాకపోవచ్చు. నిజం కానూవచ్చు.జయసూర్య కథలో వచ్చిన కొందరిపేర్లు నిజంగా అవి కాకపోవచ్చు. నా మనసుకు తోచినట్లుగా రాశాను.
ఆ వూరు... ఆ నది... ఆ మెట్లు.... ఆంధ్రదేశంలో సరిగ్గా ఎక్కడున్నాయో చెప్పలేను.
కొందరిని చూసినప్పుడు వీళ్లు నాకు బాగా తెలుసుననిపిస్తూ వుంటుందగి. కానీ ఎలా తెలుసో స్పష్టంగా తెలియదు.
అలాగే నిన్ను రోడ్డుమీద మొదటిసారి చూడగానే నాకు బాగా తెలిసినదానివనిపించావు. అంతకుమించి కావలసినదానివనిపించావు. హరిచందన వైనా కావచ్చు. చంద్రరేఖవైనా కావ్చచు. ఒకసారి ఆ ఊరికి వెళ్లాలని, ఆ వృద్దుడిని పరామర్శించాలని వుంది.
ప్రయత్నిస్తే ఆ ఊరు ఎక్కడో తెలుసుకోకపోను. నేను సింగపూర్ నుండి వచ్చాక అదే ప్రయత్నంలో పడతాను.
మనం కలుసుకునే శుభఘడియ దగ్గర పడుతోంది కౌస్తుభా! ఆ రోజు నీ నుండి ఎటువంటి స్వాగతం లభిస్తుందోనని భయంగా వుంది. నా మెడలో పూలహారం వేస్తావో.....
బహుశా ఇది నా చివరి ఉత్తరం అనుకుంటాను. మీ మామయ్య పెట్టిన గడువు ముగియగానే వచ్చి నిన్ను కలుసుకోవడమే. సరే నేనిక వుంటాను.
ఇట్లు
శ్రీ.
* * * * *
"-జయసూర్య కథ అయిపోయినా ఇంకా కొంత సస్పెన్స్ అలాగే వుండిపోయింది మామయ్యా!"
అవునన్నట్లుగా ఆయన తలాడించాడు.
"తానే ఒప్పుకున్నాడు కదా జయసూర్య గురించి తను వ్రాసినదంతా నిజం కాకపోవచ్చునని?అంతా ఏమిటి? కొంత నిజం కూడా వుండదని నా ఉద్దేశ్యం. తనకి పడే పిచ్చి పిచ్చి కలలకి పిచ్చి ఆలోచనలకి పూర్వజన్మ జ్ఞాపకాలన్న రంగు పులిమి ఏదో వ్రాశాడు."
"పూర్వజన్మ జ్ఞాపకాలు కొందరికి వున్నట్లు మనం పత్రికల్లో అప్పుడప్పుడు చదువుతూనే వుంటాంగా మణీ! ఆత్రేయ కవి పూర్వజన్మలో తానెవరో చెప్పేవాడట. కొందరు మహానుభావుల చరిత్రలు చదివినా పూర్వ జన్మలో తామెవరో చెప్పినట్లుగా వుంటుంది. పుట్టపర్తి సాయిబాబా తాను గత జన్మలో షిర్డీబాబానని చెప్పుకున్నాడు. ఆ షిర్డీబాబా కథ చదివితే అంతుకుముందు జన్మ గురించి కూడా వుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారి గురించి శ్రీచక్ర వ్రాసాడుకదా. అలా కొందరికి తన పూర్వ జన్మలో తామెవరో తెలుస్తూ వుంటుంది. శ్రీచక్రదంతా వట్టి భ్రమ అని కొట్టిపారేయడానికి వీలులేదు" అన్నాడు యోగానందం.
కథ చదవడానికయితే బాగుంటుంది. ఏదైనా పత్రిక్కి పంపించమని చెబుతాను"
"అతడు చెప్పినదంతా యదార్దమే అయితే శ్రీచక్రని మామూలు మనుష్యుల్లో జమ కట్టడానికి వీల్లేదని నా ఉద్దేశ్యం."
* * *
"మీ బావగారికి చాలా జబ్బు చేసిందండీ, పిల్లలను వెంటబెట్టుకుని మిమ్మల్ని రమ్మన్నారు" అని చెప్పాడు ఆరోజు వూరినుండి వచ్చిన మనిషి.
"ఏమిటి సుస్తీ?" అనడిగాడు యోగానందం.
"ఆమధ్య చాలా జ్వరం వచ్చిందండీ. నెలరోజులు ఒకటే జ్వరం. జ్వరంలోనే పసిరికలు కనిపించాయి."
"మందులేమీ వాడడంలేదా?"
"ఏదో నాటుమందులు వాడుతూనే వున్నారు. కాళ్లమీద, ముఖం మీద వాపులు కనిపించాయి. ఇంకేం బ్రతుకుతాడండీ! ఇహ రోజులే."
ఎప్పుడో ఏడెనిమిదేళ్లక్రితం ఒకసారి వచ్చాడు కౌస్తుభ తండ్రి రామనాధం. ఆ తరువాత ఉత్తరాలు మాత్రం రాసేవాడు. వచ్చి పిల్లలను చూడాలని మనసు ఆరాటపడుతోందని, కానీ వాళ్ళకేమీ తెచ్చివ్వలేని అశక్తత తన కాళ్లకి బందమైందని, కన్నానేకానీ ఒక్కనాడూ వాళ్ళకి ఒక చీరగుడ్డగానీ ఒక పదిరూపాయలుగానీ ఇవ్వలేకపోయాననీ, ఈ దరిద్రపు ముఖంతో పిల్లల ముందుకు రావాలంటే సిగ్గుగా వుందని వ్రాసేవాడు.
ఈ పిల్లలకి తండ్రిమీద పెద్ద ఇదేమీ లేదు. అత్తామామా చచ్చిన తల్లినీ, బ్రతికివున్న తండ్రినీ ఎప్పుడో మరపించారు.
మరునాడు ఉదయం ముగ్గురు పిల్లల్ని వెంటబెట్టుకుని వెళ్లాడు యోగానందం.
రామనాదం పరిస్థితి సీరియస్ గానే వుంది.
మనిషి చిక్కిపోయి అస్థిపంజరంలా వున్నాడు. పాదాలమీద, ముఖం మీద వాపువచ్చి వికృతంగా కనిపిస్తున్నాడు. తన ముగ్గురు పిల్లల్నీ, యోగానందాన్ని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. పిల్లల బుగ్గలమీదా, చేతులమీదా స్పృశించాడు. ఒకసారి మతి వున్నట్లుగా ఒకోసారి లేనట్లుగా మాట్లాడుతున్నాడు.
"ముగ్గురు ఆడపిల్లలు. వీళ్ల పెళ్ళిళ్ల గురించి నాకు చింత లేదనుకోకు యోగానందం. వీళ్లను పెంచడంలో, చదివించడంలో నేనేమీ నీకు సాయం చేయలేకపోయాను. కనీసం పెళ్లిళ్ల కోసమైనా నేనేమీ చేయకపోతే నన్ను దేవుడు కూడా క్షమించడు."
"నీ దగ్గరేముంది ఇచ్చిపోవడానికి రాళ్లు తప్ప" రామనాధం విధవప్పగారు వెటకారం చేసింది.
"ప్రపంచంలో అతి విలువైనవిగా చెప్పబడే వజ్రాలన్నీ కనుక్కోకముందు రాళ్లేకదా అక్కా!"
"అందుకే కదా రోజూ బుట్టెడు రాళ్లు తెప్పించి దొడ్లో రాళ్లగుట్ట ప్రోగేశావు."
"అక్కకేమీ తెలియదు యోగానందం. రవ్వలు రాళ్లలోంచే వస్తాయని ఆమెకు తెలియదు. వజ్రకరూర్ లో వజ్రాలగనిలో కొంతకాలం పనిచేసినవాణ్మి. నాకామాత్రం తెలీదా? నువ్వూ నన్నో పిచ్చివాడిక్రింద జమ కట్టకేం? నా ఇన్నేళ్ళ శ్రమ, అన్వేషణ వృధా పోలేదు తెలుసా? కొద్దిరోజుల క్రితం వజ్రపురాయి నా చేతికి వచ్చింది. దాన్ని తీసుకువెల్లి ఎవరైనా వజ్రాల నిపుణుడికి చూపించాలని వున్నా పల్లెటూరివాడినని వాళ్లు నన్ను ఎక్కడ మోసం చేస్తారోనని భయమేసి వూరుకున్నాను. నవ్వు పట్నంలో ఎవరినైనా వజ్రాల వ్యాపారిని పట్టుకో. ఈ రాయి చూపించు. ఏమాత్రం మోసం జరగకుండా జాగ్రత్తపడు. అది లక్షలు ఖరీదుచేస్తుందని నా నమ్మకం. దానికి సరైన ఖరీదు కట్టిచ్చేవాడు దొరికితే లక్షలు వస్తాయని నా నమ్మకం. ఆ డబ్బుతో నా ముగ్గురు పిల్లల పెళ్లిళ్లేకాదు, నీ కూతుళ్ల పెళ్లిళ్లు కూడా మహరాజులా చేయవచ్చు "అంటూ దిండు కిందనుండి ఒక రాయిని తీసిచ్చాడు యోగానందం చేతికి. రాయి మామూలుగానే వుంది. కాకపోతే పగలు రాయి. తెలుపులో కొద్దిగా రంగులో కలిసి వుంది. స్పటికంలా ఒక విధమైన మెరుపు వుంది. ఇలాంటి రాళ్లు ఎక్కడైనా దొరుకుతాయి.