"ఏయ్ సూర్యా!"
ఎవరో మధురంగా పిలుస్తున్నారు.
ఆ స్వరం హిప్నటైజ్ చేస్తున్నట్టుగా వుంది.
సూర్య కళ్లు తెరిచాడు.
"అడవిలో వెన్నెల ఎలా విరగబడిందో చూడవా? ప్రకృతి సౌందర్యారాధకుడివి కదా?"
సూర్య లేచి కూర్చుని దిక్కులు చూశాడు.
పిండారబోసినట్లుగా తెల్లని వెన్నెల. ఆ వెన్నెల్లో ఒక యువతి. ఆమె కట్టుకున్న ఉల్లిపొర లాంటి తెల్లచీర గాలికి అల్లనల్లన ఆడుతోంది.
"రా!నాతో రా! వెన్నెల్లో కొండలు, కోనలు ఎంత అందంగా వుంటాయో చూపిస్తాను. ఇంత సౌందర్యాన్ని నీ చుట్టూ పెట్టుకుని మొద్దులా నిద్రపోతావా?"
వెన్నెల, ప్రకృ-తీ రెండూ ఇష్టమైనవే సూర్యకు.
నీరవంగా వున్న అడవి.
తెల్లటి వెన్నెల్లో స్నానమాడుతోంది.
తెల్లచీర కట్టుకున్న యువతితో షికార్లు.
మగవాడై పుట్టాక, మధురమైన క్షణాలను అనుభవించకపోతే ఎందుకు?
ఇరవై ఎనిమిదేళ్ల నిండు యవ్వనంలో ఎన్నడూ తాకని మోహజ్వాల అతడిని చుట్టుముట్టింది. మంత్ర ముగ్దుడిలా లేచి ఆమెను అనుసరించాడు.
ఆమె ముందుకు సాగుతూనే మాట్లాడసాగింది. ఆమె గొంతు చాలా మధురంగా వుంది. మత్తు జల్లుతున్నట్లుగా వుంది.
"జన్మజన్మల బంధం మనది. ఈ అడవితో అనుబంధం కూడా తక్కువది కాదు. ఈ చెట్లలో, పుట్టల్లో, ఆడాము, పాడాము, ఇంకొన్ని గంటల్లో ఈ పైశాచికత్వం నుండి విముక్తి పొందుతున్నాను. మళ్లీ మానవ జన్మ ఎత్తబోతున్నానంటే చాలా ఆనందంగా వుంది. ఈ చివరి రాత్రి..... ఒకసారి భైరవుని కొండకు వెళ్లిరావాలని వుంది. ఎన్నేళ్లు కాపలాకాశాను ఆ నిధిని? ఆ గుహలో మంత్ర బద్దమైన రెండు నాగినులు కూడా వున్నాయి. మంత్ర బంధం చేసింది నువ్వే. నిధికి కాపలాగా వాటిని పెట్టావు. వాటి చెర విడిపించు. నువ్వు నిక్షిప్తంచేసిన నిధిని ఒక్కసారి తాకు. ఆ నిధిని ఆవరించివున్న దుష్టశక్తులు అంతరిస్తాయి."
భైరవుని కొండకి వున్న పెద్ద బండరాయి మీద చెక్కిన కేతకి బొమ్మకి ప్రాణం వచ్చినట్లుగా వుమదామె. వ్రేలి కొసలతో ఆ బండరాయిని ఇలా తట్టిందో లేదో ఆ బండరాయి నెమ్మదిగా ప్రక్కకి జరిగింది. ఒక మనిషి మాత్రమే పట్టేంత సందు ఏర్పడింది అక్కడ.
"రా సూర్యా!"
గుహలో ఏముందో ఒకసారి చూస్తే?
ఎన్నో ఏళ్లుగా ఎవరికీ కనిపించక, ఎందరినో ఊరిస్తున్న ఆ అపూర్వమైన నిధిని ఒకసారి చూస్తే? తనకా నిధిని కేతకి వరకట్నంగా ఇస్తానంది కదా? పెద్ద హాస్పిటల్ పెట్టాలన్న తన కల నిజం చేసుకోవచ్చు. డబ్బుంటే ఎన్నెన్నో మంచి పనులు చేయవచ్చు.
ఎదురుగా కాంతా కనకాలు!
ఊరిస్తున్నాయి అతడిని.
మోహపాశం మెడకు వేసి లాగుతున్నాయి.
ఏనుగు కుంభస్థలం మీదకి లంఘించిన సింహంలా వున్నాయవి.
గురుదేవుల ఉపదేశం, పొందిన ఆత్మజ్ఞానం గాలికి కొట్టుకుపోయాయి.
ఏమాత్రం మనసు చిక్కబట్టినా ఆ ఘోర ప్రమాదం జరక్కపోయేది.
* * * * *
తోకచుక్కలా చుట్టుకుని పడగలెత్తిన అయిదు తలల నాగశేషు.
పడగలమీది మెరుస్తున్న మాణిక్యాల వెలుగు గూహలోని చీకటిని పారద్రోలుతున్నది.
నాగశేషు శరీరమంతా మేలిమి బంగారంతో పడగలెత్తి బుసకొడుతుందా అన్నంత సహజంగా వుంది.
కళ్లు వుండాల్సిన చోట ఎర్రగా కెంపులున్నాయి.
ఆ ఒక్క నాగశేషు చేస్తుంది కోటానుకోట్ల విలువ. నాగశేషు పడగలక్రింద వున్నాయి జోడు పెట్టెలు.
నవరత్నాలతో కూడిన అపురూపమైన నిధి.
కథలుకథలుగా ప్రచారమైన నిధి.
ఆ పెట్టెలకున్న తాళాలు కేతకి తాకగానే విడిపోయాయి. పెట్టెల కున్న మూత తెరిచింది.
చీకటిలో కణకణలాడే నిప్పుల్లా వున్నాయవి.
"ఒక్కసారి నీ చేత్తో వీటిని తాకు. వాటిని ఆవరించిన దుష్టసక్తులు అంతరిస్తాయి. నిధి నీ స్వంతమవుతుంది. ఇది నీకు నేను ఇస్తున్న వరకట్నం!"
"ఇది.... ఇది గతజన్మలో తను నిక్షిప్తం చేసిన నిధా? ఇక్కడేనా కేతకి తల నేలమీద రక్తపు మడుగులో దొర్లుతూ 'జన్మజన్మలకీ వెంటాడతాను' అని ప్రతినబూనింది."
"నువ్వు చేసిన మంత్రం దిగ్బంధనంలో ధనశక్తిగా మారిన ఆ నిధి నీ స్పర్శతో బంధనం విడి దనలక్ష్మిగా మారి నీ ఇంట వెలుస్తుంది. ఒక్క సారి నీ చేత్తో ఈ నిధిని తాకు!"
సూర్య తాకాడు.
ఏళ్ళ తరబడి నిద్రలో వున్న క్షుద్రశక్తులు నర స్పర్శ తగిలి రుధిర దాహంతో కళ్లు తెరిచాయి.
కేతకి నవ్వింది.
ఫెళ్లున నవ్వింది.
పగలబడి నవ్వింది.
"భస్మాసురుడి కథ విన్నావా? తన చెయ్యి ఎవరి నెత్తిన పెడితే వాడు భస్మం కావాలని తపస్సు చేసి, శివుడిని వరమడిగిన భస్మాసురుడు తన చేతిని తన నెత్తిన్నే పెట్టుకుని భస్మమైపోయాడట. సరిగ్గా నీ విషయంలోనూ అదే జరిగింది. నీ మంత్ర దృష్టితో ఆవరించిన క్షుద్రశక్తులు నీ స్పర్శతో మేలుకున్నాయి. ఇక చూసుకో. వేటకుక్కలై నిన్ను చీల్చి చెండాడతాయి. రక్తం ఏరులై పారుతుంది. ఆ రక్తంలో నేను స్నానమాడతాను. అప్పుడు కదా నా ఆత్మ శాంతించేది.
సూర్యకు కమ్మిన మైకపు పొరలు విడిపోయాయి.
కేతకి సృష్టించిన మాయాజాలంలో చిక్కానని అర్దమైంది.
ఆ నిజం తెలిసేసరికి సమయం మించిపోయింది.
ఏ నిధికి కేతకిని బలి యిచ్చాడో, ఆ నిధికే కేతకి తనని బలి చేస్తోంది.
సూర్య పరుగున గుహ బయటకి వచ్చాడు.
అతడు అడుగు బయట పెడుతూనే గుహ ద్వారం మూసుకుపోయింది.
ఎదురుగా వేటకుక్కల్లా మునిరాజు ముఠా.
"నీకు నిధి రహస్యం తెలుసునన్న మా ఊహ నిజమైంది. ఒకనాడు మనమందరం ఈ నిధికోసం ప్రయత్నించినవాళ్లమే. కానీ నీకొక్కడికే నిధి దక్కించుకోవాలన్న ఆశ పుట్టింది. తపస్సు పేరుతో వచ్చి చేరావు ఏదో మంత్రతంత్రాలు నిర్వహించావు. చివరికి ఈ పున్నమి రాత్రి గుహలో జొరబడ్డావు. మేం నిన్ను రాత్రీ పగలు కనిపెట్టి వున్నామన్న విషయం నీకు తెలియదు. మర్యాదగా గుహద్వారం తెరువు. నిధిని అందరం సమానంగా పంచుకుందాం' మునిరాజు అన్నాడు.
"ఆ నిధి నాకేం అక్కర్లేదు. మీరే తీసుకోండి. కానీ నాకు గుహ ద్వారం తెరవడం తెలియదు. కేతకి తెరిచి నన్ను లోపలికి తీసుకుపోయింది
"కథలు చెప్పకు. మర్యాదగా ద్వారం తెరువు' పీర్ సాహెబ్ కరుగ్గా అన్నాడు.
"కథ కాదు. నిజం కేతకి నన్ను నిద్రలేపి తీసుకువచ్చింది ఇక్కడికి. ఆమే నన్ను గుహలోకి తీసుకుపోయింది. ఆ నిధిని ఏదో దుష్టశక్తులు ఆవరించి వున్న మాట నిజం. నాకు భయమేసి బయటకి వచ్చాను."
"ఏముందక్కడ?" అడిగాడు మారుతి పట్టలేని కుతూహలంతో.
"చీకటి. నాకేమీ కనిపించలేదు. భయమేసి బయటకు వచ్చాను"కావాలనే అబద్దం చెప్పాడు. నిధి వుందని చెబితే తనని వదలరని తెలుసు.
"చీకటిగా వుండటం అబద్దం. మేం పరిగెత్తుకుని వస్తుంటే , వెలుతురు కనిపించింది."
"ఇక్కడంతా అతీతశక్తులు మాయాజాలం నిండివుంది. మీకు ఏం కనిపించిందో ఏమో!"
"వీడు మంచి మాటలతో చెప్పేట్టులేడురా. " జేబులోంచి బటన్ చాకు తీశాడు పీర్ సాహెబ్ చాకు మొన సూర్య గొంతుకు ఆనించాడు.
"మీరు పొడిచినా, చంపినా గుహద్వారం తెరవడం నాకు తెలియదు" వాళ్లనుండి తనను కాపాడుకోడానికి పారిపోవడం మినహా మరో ఉపాయం తోచలేదు సూర్యకు. పరుగు తీయడం మొదలుపెట్టాడు.
వెనుక తోడేళ్లు తరుముతున్నట్లుగా మునిరాజు ముఠా.
పుచ్చపువ్వులా వున్న వెన్నెల్లో అంతా స్పష్టంగా కనిపిస్తోంది.
సూర్యని వాళ్లు చుట్టుముట్టడానికి ఎంతోసేపు పట్టలేదు.
ఎంత ప్రయత్నించినా గుహలో ప్రవేశ మార్గం చెప్పని సూర్యమీద కసి పెరిగిపోయింది. అందరిలో. చాకులతో శరీరమంతా చిల్లులు పడేలా పొడిచారు. ఆగ్రహం పట్టలేని మునిరాజు ఏకంగా కత్తిని అతడి గుండె లోనే దింపాడు.
గండి పడిన చెరువులా అతడి శరీరమంతా రక్తప్రవాహమైంది.
మడుగు కట్టిన రక్తంలో అతడి శరీరం దొర్లుతుంటే -
కేతకి నవ్వుతోంది. ఆమె నవ్వులో మహదానందం.
మూతలు పడుతున్న కళ్లను బలవంతంగా ఎత్తి "ఇప్పుడు తృప్తి కలిగిందా?" నీ ఆత్మ శాంతించిందా?"అన్నాడు.
సూర్య కళ్లు మూతలు పడ్డాయి.
రుధిర పానంతో తృప్తిచెందిన క్షుద్రశక్తులు సెలవు తీసుకున్నాయి.
నిద్రలో వున్నదేశికాచారికి హఠాత్తుగా ఎవరో కొట్టినట్టుగా మెలకువ వచ్చింది. ప్రక్కన చూస్తే సూర్య లేడు.
అతడి మనసెందుకో కీడును శంకించింది. సూర్య కోసం బయలుదేరాడు. అతడు వచ్చేసరికి అంతా అయిపోయింది.