"ఏం గుర్తుకొచ్చింది?"
"మీ ఫ్రెండ్ పేరు చంద్రకాంత్ అన్నావు కదూ?"
"అవును" భయంగా అన్నాడు.
"ఇంటిపేరేమన్నావు?"
"సిరిమువ్వల అన్నాను."
"ఛట్_ కాదు. సిరివెన్నెల అన్నావు"
"ఆ అవునవును! సిరివెన్నెల చంద్రకాంత్ కరెక్టే! నాకు భలే కన్ ఫ్యూజన్ లే ఎప్పుడూ."
"వండర్ ఫుల్ బావా! ఫేమస్ రచయిత చంద్రకాంత్ మీ ఫ్రెండని ఎప్పుడూ చెప్పలేదే మరి?" ఎగ్జయిటయిపోతూ అంది.
అతని గుండె ఆగిపోతుందేమో అనిపించింది.
అంతా సద్దుమణికిపోతుందనుకుంటూంటే ఈ పూజ మళ్ళీ ఏవో గోతులు తవ్వుతోంది.
"ఆ.. అందులో పెద్ద చెప్పుకునేదేముంది? ఏదో రాస్తుంటాడు వాడు హోప్ లెస్ ఫెలో"
"అయ్యో! అంత గొప్ప రచయితను పట్టుకొని ఏదో రాస్తుంటాడేమిటి బావా? నీకు తెలుసో తెలీదో, అతను ఒకప్పుడు నా అభిమాన రచయిత! నాకే కాదు_ ఆంధ్రదేశంలో ఎంతోమందికి అభిమాన రచయిత!"
"అయితే నువ్వు రాత్రంతా ఆ రచయిత చంద్రకాంత్ తో గడిపానంటావ్? అడిగాడు కల్నల్.
"ఎస్! సెంట్ పర్సెంట్! తప్పలేదు. చెప్పాను కదా కొంచెం మందు ఓవర్ అయి..."
"ఆల్ రైట్! ఇందులో ఎంతవరకూ నిజముందో నేను కనుక్కుంటాను"
గోపాల్రావ్ గుండె గుభేల్ మంది.
కొంపదీసి ఈ కల్నల్ గాడు ఆ రచయితను కలుసుకుంటాడా ఏమిటి?
రత్నప్రభ కల్పించుకుంది.
"అయిందేదో అయింది. పాపం అతగాడినలా నిలబెట్టి హింసిస్తున్నారేంటి? భజన్ రావ్" అంటూ పిలిచిందామె.
అతను కప్పుతో కాఫీ తాగుతూ వచ్చాడు.
"ఏంటి మేడమ్?"
"మా అందరికీ బెడ్ కాఫీ ఇవ్వవేం?"
"నేను ముందు తాగాలి కదండీ! బెడ్ కాఫీ తాగందే ఏ పనీ చేయటం అలవాటు లేదు."
"ముందు నువ్వు తాగాలా?" మండిపడుతూ అంది.
"ఔనండీ! అందుకిష్టమైతేనే పని చేస్తానని ముందే చెప్పాను. కావాలంటే మేడమ్ ని కనుక్కోండి"
"అవును మమ్మీ! నిజమే.. వంటవాళ్ళ షార్టేజ్..." వప్పుకుంది సీత.
"బేబీ...! నువ్వు అనవసరంగా అందరికీ లీనియెన్స్ ఇచ్చి చెడగొడుతున్నావ్. నాకొక్కసారి ఫోన్ చేసి పిలిస్తే ఆ ఒప్పందం ఇంకోరకంగా వుండేది" కోపంగా అన్నాడు కనకారావ్.
భజన్ రావు తన బెడ్ కాఫీ తాగి అప్పుడు వంటింట్లో కెళ్ళాడు.
"సీతా! రాత్రంతా నిద్రలేదు సరిగ్గా. ఇవాళ రెస్టు తీసుకుంటాను. ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే నేను రానని చెప్పేసెయ్"
అనేసి తన బెడ్ రూమ్ లోకి నడిచాడు గోపాల్రావ్ వాళ్ళనుంచి తప్పించుకోడానికి.
తలుపులు వేసుకుని బెడ్ మీద వాలాక కొంత ధైర్యం వచ్చింది.
జరిగిందంతా ఓసారి గుర్తు తెచ్చుకున్నాడు.
ఇంతవరకూ ఎలాగోలా మానేజ్ చేశాడు గానీ ఇప్పుడు ఆ మావగాడు సీత కింకేమైనా కొత్త మెలికలు నేర్పిస్తాడేమో కనిపెట్టి వుండాలి.
వంటవాడు కాఫీ తీసుకొచ్చాడు.
"భజన్ రావ్..."
"ఏం సార్?"
"గొడవంతా సద్దుమణిగినట్లేనా?"
"ప్రస్తుతం అలాగే వుంది సార్...! ఓ ఇరవై రూపాయలుంటే ఇస్తారా సార్? షేవింగ్ క్రీమ్ కొనుక్కోవాలి."
అతనికి అర్థమైంది.
వాడితో తనకిప్పుడు అవసరం వుంది గనుక బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
వెంటనే లేచి పర్సులో నుంచి ఇరవై రూపాయలు తీసి ఇచ్చాడు.
"మీరు చెప్పిన కథ బాగానే వుందిగానీ, అందులో కొన్ని లూప్ హోల్స్ వున్నాయ్ సార్!"
అతను ఉలిక్కిపడ్డాడు.
"నేను చెప్పింది కథేమిటి? నిజంగానే జరిగింది"
"బుద్ధున్నోడెవడూ అది నిజమంటే నమ్మడు సారూ!"
"అంత వీక్ గా వుందంటావా?"
"కిండర్ గార్డెన్ కుర్రాడు ఇంకొంచెం మంచి కథ చెప్పగలడు సార్!"
వాడిని దబాయించి లాభం లేదని అర్థమైందతనికి.
"సరే! నేను చెప్పింది కథే అనుకో. అందులో లూప్ హోల్స్ ఏం కనబడ్డాయ్ ఆ మిలటరీ వాడికి?"
"అదే సార్! మీరిచ్చిన అడ్రస్."
అతను గాబరాగా చూశాడు.
"ఏమైందా అడ్రస్ కి?"
"ఇప్పుడే అమ్మగారూ, వాళ్ళ మిలట్రీ నాన్నా కలిసి ఆ రచయితకు_ అంటే మీ మీ ఫ్రెండ్ గారికి టెలిగ్రామ్ ఇచ్చారండీ!"
గోపాల్రావ్ సగం తాగిన కాఫీ అంతా బయటకొచ్చేసింది.
"ఏమని?" అదిరిపడుతూ అడిగాడు.
"అదేసార్_ మీ ఫ్రెండ్ చంద్రకాంత్ ని ఓసారి మీకు తెలీకుండా ఇక్కడికొచ్చి అమ్మగారిని కలుసుకోమని"
అతనికి కాళ్ళూ చేతులూ వణకటం మొదలుపెట్టినయ్.
"కొంప మునిగింది భజన్ రావ్!"
"చాలా నేచురల్ గా మునిగిందండీ. బహుశా ఇంక ఛస్తే బయటకు రాదు"
"ఇప్పుడిందులో నుంచి బయటపడటం ఎలా?"
"ఓ పాతికుంటే కొడతారా? మా గాళ్ ఫ్రెండ్ కి ఫెయిర్ అండ్ లవ్ లీ కొనాలి"
"ఆ! మీ గాళ్ ఫ్రెండ్ అంత కాస్ట్ లీ క్రీమ్ వాడుతుందా?"
"కొనిచ్చేవాడుంటే ఎంత కాస్ట్ లీ అయితే మాత్రం ఏముంది?"
అతను ఇంకో పాతిక ఇచ్చాడు.
"మీరు ఆ చంద్రకాంత్ అనేవాడికి వెంటనే ఇంకో టెలిగ్రామ్ ఇవ్వండి."
"ఏమని?"
"నేనే ఫలానా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కల్సుకుంటాను. డోంట్ కమ్_ సీత" అని.
"వండర్ ఫుల్ ఐడియా. ప్రస్తుతానికి గండం తప్పుతుంది"
"అవున్సార్! కొంతవరకూ_ ఆ మిలటరీవాలా స్వయంగా వెళ్ళి ఆ చంద్రకాంత్ ని కలుసుకోవాలని ప్లాన్ లో వున్నాడు. ఒకవేళ అలా చేస్తే మాత్రం మిమ్మల్ని ఆ దేవుడు కాదుగదా_ ఆఖరికి నేను కూడా రక్షించలేను"