"ఆ సంగతి నువ్వు చెప్పాల్రా? రాస్కెల్ నీ అంతు తెల్చేస్తా నిప్పుడు. బాటిల్ తీసుకుని నువ్వు తూలుతూ వచ్చినప్పుడే నాకు అనుమానం కలిగింది. అందులో కొంచెం తాగేసి మళ్ళీ హాఫ్ నీళ్ళతో ఫుల్ చేసి తెచ్చి వుంటావని."
"నేనలాంటి వాడిని కాద్సార్! అయ్యగారిచ్చిన రిఫరెన్స్ సర్టిఫికెట్ చూడండి కావాలంటే" అంటూ గోపాల్రావ్ వైపు చూపించాడు.
గోపాల్రావ్ వైపు అప్పుడు చూశాడు కనకారావ్.
"వ్వాట్? నువ్వొచ్చేశావా?" కోపంగా అన్నాడు.
"వచ్చేశాను_ చాలా సేపయిపోయింది"
"ఏం కాదు. వచ్చి అయిదు నిమిషాలు కూడా కాలేదు"
"నాకు తెలుసు. బేబీ! ఐ నో_ మీ పెళ్ళయిన కొత్తలో ఆ సెక్సీ ఆడ గొంతు ఫోన్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇతని కేరెక్టర్ మీద"
"ఆ గొంతు మా ఆఫీస్ స్టెనోదనీ, కేవలం ఆఫీస్ కి సంబంధించిన విషయం మాట్లాడ్డానికే ఫోన్ చేసిందని చెప్పాను కదా!" నిష్ఠూరంగా అన్నాడతను.
"అయితే ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసిన స్టెనో గొంతు ఇంకోరకంగా ఎందుకుంది?"
"ఎందుకంటే పాత స్టెనో రిజైన్ చేసేసరికి కొత్త స్టెనోని తీసుకోవలసి వచ్చింది. కొత్త స్టెనో గొంతు సెక్సీగా వుండదు"
"ఐ డోంట్ బిలీవ్" అన్నాడు కనకారావ్.
"ఇంతకూ రాత్రంతా ఏమైపోయావో చెప్పు ముందు" అంది సీత.
"ఎస్! యూ వొవ్ యాన్ ఎక్సప్లనేషన్"
అతను చకచక ఆలోచించాడు. పక్కన కల్నల్ ఉండగా కథలు చెప్పటం ఇంపాజిబుల్.
జరిగిందంతా ఉన్నదున్నట్లు చెప్పేయటం మంచిది. రాణీ సంగతి తప్ప.
"అసలు జరిగిందేమిటంటే..."
"ఎస్! ఏం జరిగింది?" పై వెలిగించుకుంటూ అన్నాడు కల్నల్.
"మా ఫ్రెండ్... ఐ మీన్ చిన్నప్పటి ఫ్రెండ్ ఒకతను అనుకోకుండా నాకోసం ఆఫీస్ కొచ్చాడు. ఇద్దరం కలుసుకుని అయిదేళ్ళయిపోయింది. కేవలం నన్ను కలుసుకుని నాతో సరదాగా గడపటం కోసం పాపం అంతదూరం నుంచీ వచ్చాడు. అలాంటి వాడిని డిజప్పాయింట్ చేయటం బావుండదని వాడితోపాటు బార్ కి వెళ్ళాను. కొంచెంసేపు వాడితో గడిపి సీత బర్త్ డే పార్టీకి వచ్చేయవచ్చని నా ప్లాన్. కానీ ఇద్దరం చిన్ననాటి కబుర్లతో పడిపోయేసరికి టైమ్ తెలీలేదు. రాత్రి పన్నెండింటివరకూ తాగుతూనే వున్నాం" సీతనూ, కర్నల్ నీ తన కథ ఎంతవరకూ ఇంప్రెస్ చేస్తుందో జాగ్రత్తగా కనిపెడుతూ మాట్లాడుతున్నాడతను. వాళ్ళ ముఖకవళికలను బట్టి తను చాలా విజయవంతంగా కథ చెపుతున్నట్లనిపించింది.
"వద్దంటున్నా వాడు కొంచెం ఎక్కువ మందు కొట్టించేసరికి నాకు కొంచెం మైకం కమ్మినట్లయింది. దాంతో బర్త్ డే సంగతి పూర్తిగా మైండ్ లో నుంచి వెళ్ళిపోయింది. నా పరిస్థితి చూసి పాపం వాడు ఆ స్థితిలో నన్ను ఇంటికి పంపటం ఇష్టంలేక ఆ పక్కనే వున్న హోటల్లో వాడి రూమ్ కి తీసుకెళ్ళాడు. దాంతో అక్కడే నిద్రపోయాను. సడెన్ గా తెల్లారుజామున నాలుగ్గంటలకు మెలకువ వచ్చింది."
"రాగానే నేనెక్కడున్నానూ అని ఉంటావ్" అంది పూజ నవ్వాపుకుంటూ.
గోపాల్రావ్ కి మరదలి మీద కోపం వచ్చింది గానీ అది కోపాలు ప్రదర్శించే టైమ్ కాదని రాజీపడి ఓ చిరునవ్వు నవ్వాడు.
"అప్పుడు వాడిని నిద్రలేపి నాలుగు తిట్టాను_ అనవసరంగా నాకు తాగించి బంగారం లాంటి నా ప్రోగ్రాం అంతా అప్సెట్ చేశావు కదరా! మా మిసెస్ బర్త్ డే నిన్న. ఆమెకు మాంచి గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకున్నాను. అనేసరికి పాపం వాడు చాలా ఫీలయిపోయాడు. సారీ బ్రదరూ! నేనే మీ ఇంటికొచ్చి సిస్టర్ కి స్వయంగా క్షమార్పణలు చెప్పుకుంటాను అన్నాడు."
"ఏడీ వచ్చాడా?" అనుమానంగా అడిగాడు కర్నల్.
"వద్దామనే అనుకున్నాడు. కానీ అతను పాపం_ ఆరు గంటల బస్ కి వాళ్ళూరు వెళ్ళడానికి రిజర్వేషన్ ముందే చేసుకున్నాడు కదా_ టైమ్ చాలదని వెళ్ళిపోయాడు."
సీతకు ఈ కథ మీద ఏమాత్రం నమ్మకం కలగనట్లు ఆమె ముఖం చూస్తే తెలిసిపోతుంది.
ఆమె కనకారావ్ వైపు చూసింది.
కనకారావ్ గోపాల్రావ్ చెప్పిన కథంతా ఓసారి మననం చేసుకుంటూ అందులోని లూప్ హోల్స్ వెతకడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించాడు. గోపాల్రావ్ ఇంక ఈ కథ ముగిసిందని వాళ్ళకు ఫీలింగ్ ఇవ్వడం కోసం రిలాక్సయినట్లు సోఫాలో కూర్చుని టీపాయ్ మీదున్న వీక్లీ తిరగేయసాగాడు.
"మీ ఫ్రెండ్ పేరేమిటన్నావు?" మొదటి బాంబ్ వేశాడు కల్నల్.
అతనికి చెమటలు పట్టేశాయి.
ఏం చెప్పాలో తెలీలేదు.
ఛటుక్కున అతని దృష్టి తన చేతుల్లో ఉన్న మాగజైన్ మీద పడింది. అందులో ఓ టీవీ సీరియల్ రచయిత పేరు కొట్టొచ్చినట్లు కనబడింది.
ఠక్కున అదే పేరు చెప్పేశాడతను.
"చంద్రకాంత్"
"చంద్రకాంతా? ఇంతకుముందెప్పుడూ నువ్వా పేరే తల్చుకోలేదే?" అనుమానంగా అడిగింది సీత.
"లోలోపల తల్చుకునే వుంటాను. వాడినెలా మర్చిపోగలను? వెరీ క్లోజ్ ఫ్రెండ్! దొంగ వెధవ_ తెగ క్లోజ్"
"అతనింటి పేరేమిటి?"
అతను మళ్ళీ పత్రికలోకి దొంగతనంగా చూశాడు.
"సిరివెన్నెల చంద్రకాంత్"
"ఓ_ ఐసీ! అన్నాడు కల్నల్. "సిరివెన్నెల_ ఈ పేరుతో ఏదో సినిమా ఉన్నట్లుందే..." తనలో తను అనుకుంటున్నాడు.
"సిరివెన్నెల చంద్రకాంతా?" ఆశ్చర్యంగా అడిగింది పూజ.
"అవును."
"అతని అడ్రసేమిటి?" అడిగింది సీత మరింత అనుమానంగా.
అతనికి ఊపిరాడటం లేదు. బుర్ర బొత్తిగా పనిచేయటం మానేసింది.
"అడ్రసా?"
"అవును. ఎక్కడుంటాడు. అతని అడ్రసేమిటి?" మరింత దబాయింపుగా అడిగింది.
"వాడి అడ్రస్ వెరీ సింపుల్" అంటూ మళ్ళీ మాగజైన్ లో పేజీ చూశాడు చంద్రకాంత్ అడ్రస్ కోసం. కనబళ్ళేదు_.
"ఆ! సిరివెన్నెల చంద్రకాంత్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్_" అన్నాడు చిరునవ్వుతో.
కల్నల్ అప్పటికప్పుడే ఆ అడ్రస్ ఓ కాగితం మీద రాసుకుంటూ కనబడ్డాడు.
అతనికి కల్నల్ చర్య కొంచెం ప్రమాదకరంగా కనిపించింది.
తను కొంచెమయినా ఆఫెన్స్ లో కెళ్ళకపోతే వాళ్ళు తను చెప్పిన కథని చీల్చి చెండాడే అవకాశాలు ఎక్కువగా వున్నట్లు అర్థమైంది.
"కానీ మీరు మరీ ఇన్ని వివరాలడగటం టూమచ్. నేను మరీ అబద్ధాల కోరునయినట్లూ, రోజూ రాత్రుళ్ళు ఇంట్లో వుండకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నట్లూ బిహేవ్ చేస్తున్నారు. ఐ డోంట్ లైకిట్" అన్నాడు ప్రొటెక్ట్ చేస్తున్న ధోరణిలో.
"ఆ! గుర్తుకొచ్చింది" కెవ్వున కేక వేసింది పూజ.
గోపాల్రావ్ కి వణుకు పుట్టుకొచ్చింది ఆ కేక వినేసరికి.