Previous Page Next Page 
మొగుడు ఇంకో పెళ్ళాం వజ్రాలు పేజి 18


    "అయితే నేనిప్పుడే స్నానం చేసి, నువ్వు చెప్పినట్లు 'మెయిల్' కొట్టేస్తా"
    "ఎంత త్వరగా ఆ పని చేస్తే అంత మంచిది సార్!"
    "ఈలోగా ఇంకేమైనా కొత్త డెవలప్ మెంట్స్ ఉన్నాయేమో కనిపెడుతూండు."
    "డేగలాగా చూస్తుంటానండీ"
    అతను హడావుడిగా కాఫీ తాగి బాత్ రూమ్ కెళ్ళి స్నానం ముగించాడు.
    డ్రెస్ చేసుకుంటూంటే వచ్చింది సీత.
    "ఆఫీస్ కి వెళ్ళనన్నావ్ గదా? మళ్ళీ ఎక్కడికి?"
    "అదే.. నేను నిన్న బర్త్ డే గిఫ్ట్ కొనటం మర్చిపోయాను కదా! వెళ్ళి తీసుకొచ్చేస్తాను."
    "ఆ... ఆ... అబద్ధాలు చెప్పకు బావా! ఆడపిల్లలు పుడతారు... ఇదిగో... అక్కయ్యకు నిన్నే కొన్నావుగా ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్" అంది పూజ విచిత్రమైన పెన్ చూపిస్తూ.
    ఆమె చేతిలో రాణి పెన్ చూసి పక్కనే బాంబ్ ప్రేలినంత కంగారుగా గాల్లోకెగిరి కిందపడ్డాడు.
    "అ.. అ... అ... అదెక్కడిది నీకు?" గాబరాగా అరిచి మళ్ళీ తీసేసుకోడానికి ప్రయత్నిస్తూ అడిగాడు.
    పూజ దానిని అమాంతం వెనుకకు తీసుకుంది.
    "అబ్బా! ఆశే పాపం. ఇది నువ్వు అక్కకి గిఫ్ట్ గా ఇస్తే అక్క నాకు బహుమతిగా యిచ్చింది."
    "కానీ... అది..."
    "ఊ ఏది?"
    "అది కొంచెం డిఫిక్టివ్ గా వుంది. ఐ మీన్_ ఇంతకన్నా మంచి కలరు ఇంకోటుంది. ఎక్సేంజ్ చేసి ఆ కలరు తెద్దామని"
    "కానీ నాకీ కలరే బాగుంది బావా! ఐ సింప్లీ లవిట్."
    "అలాగా! ఓకే_ ఓకే_ అయితే సరే."
    "థాంక్యూ! పెన్ కాఫ్ కి రెడ్ ఇండియన్ తలకాయ ఎంత బావుందో తెలుసా? సింప్లీ సూపర్బ్ సెలక్షన్ బావా!"
    "అయితే ఇంక మీరు బయటకు వెళ్ళక్కర్లేదు కదా!" అంది సీత.
    "ఆ అవసరం లేదనుకో! కానీ ఆ... గుర్తుకొచ్చింది, ఒక్కసారి ఆఫీస్ కెళ్ళాలి"
    "ఎందుకు?"
    "అల్మారా తాళం చెవి నా దగ్గరే వుంది. వాళ్ళకేమయినా ఫైల్స్ అవసరమొస్తే తీసుకోవాలి కదా! ఇచ్చేసి వస్తాను."
    బయటకు నడిచాడతను గాబరాగా.
    గేటు తీస్తూండగా షాక్ తగిలినట్లయింది.
    ఎదురుగా రాణి ఆటో దిగుతూ కనిపించింది.
    పై ప్రాణం పైనే పోయింది.
    "హాయ్" అందామె చిరునవ్వుతో దగ్గరకొస్తూ.
    "హాయ్ ఏమిటిలా వచ్చారు?" లోపల్నుంచి సీత చూస్తుందేమో అన్న భయంతో వెనక్కి తిరిగి చూస్తూ అన్నాడు.
    "ఏమిటలా కంగారుపడుతున్నావ్? ఎనీ ప్రాబ్లెమ్?"
    "అహహ ప్రాబ్లెమేం లేదు."
    "మరింట్లోకి ఇన్ వైట్ చేయరేం?"
    "ఆ.. ఇంట్లోకా?" గాబరాగా అరిచాడు.
    భజన్ రావ్ వెనుకవేపు నుంచి వచ్చాడు వారి దగ్గరకు.
    "ఇంట్లో ఇప్పటికే చుట్టాలు నిండిపోయారు మేడమ్!"
    "ఓ_ అలాగా!"
    "అదీగాక అమ్మగారికి అంటే గోపాల్రావ్ గారి మిసెస్ కి లేడీ ఫ్రెండ్స్ అంటే అంత లైకింగ్ వుండదు."
    అతను భజన్ రావ్ వేపు కోపంగా చూశాడు.
    "షటప్_ ఏమిటా పిచ్చివాగుడు?" అన్నాడు మందలింపుగా.
    "అర్థమయిందిలెండి. అయితే నేను తక్షణం ఇక్కడినుంచి వెళ్ళిపోవటం మంచిది కదూ?" చిరుకోపంతో అంది రాణి.
    "అహహ.. అలా అని కాదు. పోనీ మా ఆఫీస్ కొస్తారా?"
    "అవసరం లేదు! మీకు రావాలనిపిస్తే మీరే మా ఇంటికి రండి."
    "ఓ_ ష్యూర్! అడ్రసివ్వండి."
    ఆమె కార్డు ఇచ్చింది.
    "నేను మీ ఇంటికెందుకొచ్చానా అనుకుంటున్నారు కదూ?"
    "నో నో నో నో! అలా ఎందుకనుకుంటాను. వెల్ కమ్ వెల్ కమ్ కానీ_ ఇంకోసారి అహహ"
    "నాకు తెలుసులే_ అబద్ధాలు చెప్పకండి. నిన్న మర్చిపోయి ఆ ఫ్యాన్సీ పెన్ మీ బ్యాగ్ లో పెట్టాను. నిజానికది నాది కూడా కాదు, మా ఫ్రెండ్ ది. ఆమె వెంటనే అది తీసుకురమ్మని పంపింది. అదిస్తే ఇంకెప్పుడూ మిమ్మల్ని ట్రబుల్ చేయను"
    అతనికి మతిపోయినట్లయింది.
    "ఆ పెన్ను కోసమా? పోనీ ఓ పని చేయకూడదూ! అలాంటి పెన్ను ఇంకోటి కొనిస్తాను."
    "సారీ! మా ఫ్రెండ్ కి ఆ పెన్నుతో సెంటిమెంట్. అదే కావాలని పట్టుపట్టింది. నేనిక్కడే నిలబడతాను_ తెచ్చిచ్చారంటే...."
    "ఆల్ రైట్! రేపు ఆఫీసుకి రండి_ తెచ్చిస్తాను. ఓ.కె.! ప్రస్తుతం మళ్ళీ ఇంట్లోకెళ్ళి తేవటం కుదరదు. ఇల్లంతా గెస్ట్స్."
    "తప్పకుండా తెచ్చిస్తారా?"
    "సెంట్ పర్సెంట్"
    "ఒకవేళ లేకపోతే నేను మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది."
    "అహహ.... వద్దు వద్దు_ తప్పకుండా ఆఫీస్ కే తెచ్చిస్తాను."
    "ఓకే సీయూ."
    "సీయూ_ టాటా_ బై_ వెళ్ళరేం ఇంకా?"
    "అవునూ_ ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే కొంతమంది మగాళ్ళు అంత గౌరవంగా, ప్రేమగా, అంత స్నేహంగా బిహేవ్ చేస్తారు. కానీ ఆ అమ్మాయి ఇంటికొస్తే అంత అప్సెట్ అయిపోయి ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చుంటారెందుకని?" టీజింగ్ గా అడిగింది.
    అతను ఆలోచనలో పడినట్లు నటించాడు.
    "ఎందుకంటే ఆ అమ్మాయిని రియల్ గా లైక్ చేస్తారు కాబట్టి మేడమ్" అన్నాడు భజన్ రావ్.
    "ఎస్ కరెక్ట్!" అన్నాడతను.
    "ఎస్ యూ ఆర్ కరెక్ట్! ఓకే సీయూ" అనేసి అదే ఆటోలో వెళ్ళిపోయిందామె.
    "హమ్మయ్య.... పెద్ద గండం నుంచి బయటపడ్డాం" అన్నాడతను కర్చీఫ్ తో ముఖం తుడుచుకుంటూ.
    "అని మీరనుకుంటున్నారు సార్! కానీ ఆ కిటికీ దగ్గర్నుంచి చూస్తున్న మేడమ్_ ఆ మిలట్రీవాలా మాత్రం అలా అనుకోవటం లేదు."
    అతను అదిరిపడి వెనక్కి తిరిగి చూశాడు.
    సీత బయటికొచ్చిందప్పుడే.
    "ఎవరా అమ్మాయి?" అనుమానంగా అడిగింది.
    అతనికేం జవాబు చెప్పాలో తెలీలేదు. బ్రెయిన్ కి పక్షవాతం వచ్చినట్లయిపోయింది.

 Previous Page Next Page