Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 17

 

    సరిగ్గా అప్పుడే ఆమె సెల్ ఫోన్లోకి జైరాజ్ వచ్చాడు.
    "రోజా! నాకు ఫోన్ గిట్ట జేసినావా ఏంది? పద్నాలుగు మిస్ డ్ కాల్స్ ఉన్నాయ్-"
    "అవును డాడీ! అరగంట నుంచీ ట్రై జేస్తున్నా -"
    "ఎందిమ్మా? ఎనీ ప్రాబ్లమ్?"
    "ఆ రాకేష్ చేసింది చాలా పెద్ద క్రైం డాడీ! అతను చేసిన పనికి నేను జైలు కెళ్ళాల్సి వస్తుంది . తెలుసా?"
    జైరాజ్ గాబరాపడ్డాడు -
    "వ్వాట్? జైలా? ఏం చేశాడు రాకేష్?"
    "కావాలని వేరే గొంతుతో మాట్లాడించి -- హోమ్ మినిస్టర్ స్టేట్ మెంట్ ని మార్చేసి టెలికాస్ట్ చేశాడు డాడీ -- స్టేటంతా దాని మీద పెద్ద రియాక్షన్ వస్తోంది -"
    జైరాజ్ గాబరాపడ్డాడు.
    "అదేంది ? గట్లేందుకు జేసిండు రాకేష్?"
    "అంటే చానెల్లో ఏం జరుగుతోంది కూడా మీకు తెలీదా? అసలు మీరు చానెల్ ఆఫీస్ లో ఉన్నారా డాడీ?"
    జైరాజ్ కంగారుగా తన చేతిలోని పేకముక్కలు పడేసి డ్రాప్ అన్నాడు.
    "నేను చానెల్లోనే ఉన్నా -- ఒకసారి రాకేష్ ని కల్సుకుని మాట్లాడతాన్లే?" అన్నాడు భయంగా.
    "యస్ - వెంటనే ఆ హోమ్ మినిస్టర్ క్లిప్పింగ్స్ టెలికాస్ట్ అవకుండా ఆపండి డాడీ!"
    "ఓకే - ఓకే ' అంటూ ఫోన్ కట్ చేసి బయటకు పరుగెత్తి కార్లో చానెల్ వేపు దూసుకుపోయాడు.

        
                          ***

    ఇప్పుడు మిగతా న్యూస్ చానెల్స్ అన్నీ బృందావనం చానెల్ టెలికాస్ట్ చేస్తున్న హోమ్ మినిష్టర్ వీడియో క్లిప్పింగ్స్ ని కాపీ చేసి వాళ్ళ చానెల్లో టెలికాస్ట్ చేయటం మొదలుపెట్టారు.
    భవానీశంకర్ అది చూసి హాపీగా ఫీలయ్యాడు.
    అప్పుడే జైరాజ్ హడావుడిగా లోపలికొచ్చాడు.
    "ఏంది రా భయ్- ఏదో గడబిడ జేసినావంట-"
    "అంకుల్ ! ఈ దినాల్లో ఏదొక గడబిడ చేయకుంటే -- నెంబర్ వన్ చానెల్ అవటం కష్టం! ఒక్కసారి చూడండి -- రాష్ట్రమంతా పబ్లిక్ మన బృందావనం చానెల్ గుంపులు గుంపులుగా గుమికూడి చూస్తున్నారు- మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు - అందరూ మన చానెల్లో మనం చూపించిన వార్తల గురించే డిస్కస్ జేస్తున్నారు -"
    "కానీ ఆ హోమ్ మినిస్టర్ తల్చుకుంటే మనమీద క్రిమినల్ కేస్ గిట్ట పెట్టొచ్చు గదా!"
    భవానీశంకర్ పగలబడి నవ్వాడు.
    "క్రిమినల్ కేసులా? మంచిగున్నావంకుల్! మనదేశంలో కోర్ట్ లేలా పనిచేస్తయ్యో మీకు తెలీదా? సల్మాన్ ఖాన్ తాగి తన కారుతో నలుగురైదుగురిని లేపేసిన కేసేమయింది? అతని మీదున్న వైల్డ్ లైఫ్ కేస్ లేమయినాయ్? దావూద్ ఇబ్రహీం మీద కేసులేమాయే? రాజ్ ధాకారే మీద కేస్ లేమాయే - టెర్రరిస్ట్ కసబ్ కేసేమయింది?"
    జైరాజ్ కి ధైర్యం వచ్చింది.
    "అవ్! కేసుల గురించి నాకు బుగుల్లేదు గానీ -- ఇంతకూ నువ్ జేసిన గడబిడెంది?"
    భవానీ అతనికి జరిగిందంతా క్లుప్తంగా వివరించాడు.
    "ఇప్పుడు చూడండి! మన బృందావనం చానెల్ పేరు మోగిపోతుంది పబ్లిక్ లో! మిగతా చానెల్స్ అన్నీ మన చానెల్ న్యూస్ ని రికార్డ్ చేసుకుని వాళ్ళూ టెలికాస్ట్ చేస్తున్నారు - ఇలాంటి ట్రిక్స్ తోనే మన చానెల్ వ్యూయర్ షిప్ పెరుగుతుంది "
    "చానెల్స్ న్నీ గొర్రెలేకున్నయ్యే -"
    "ప్రస్తుతానికి గొర్రెలే అంకుల్ - ఫ్యూచర్ లో ఎమోతాయో తెలీదు -"
    జైరాజ్ ధైర్యంగా రోజాకి ఫోన్ కొట్టాడు.
    "రోజా ! రాకేష్ జరంత గడబడి జేసిన మాట నిజమే గానీ -- నువ్వేం వర్రీ అవకు బిడ్డా! నేను సముజాయించుకుంటా గదా-"
    రమణ కెమెరాతో పాటు హోమ్ మినిస్టర్ ఇంటి ముందున్న సేక్యురీటీ తో మాట్లాడుతుండగా సడెన్ గా నాలుగు మోటార్ సైకిళ్ళు శరవేగంతో వచ్చి సడెన్ బ్రేక్స్ తో అగినాయ్. ఆగిందే తడవుగా నలుగురు యువకులు కిందకు దిగి తాము తెచ్చుకున్న కంకర్రాళ్ళు తీసి హోమ్ మినిస్టర్ ఇంటి అద్దాలను పగులగొట్టసాగారు.
    రమణ ముందు షాకయినా వెంటనే కెమెరా అన్ చేసి ఆ రాళ్ళ దాడిని రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు.
    కొద్ది క్షణాల్లో మళ్ళీ మాయమయిపోయారు వాళ్ళు. పోలీసులు వెంటనే జీప్ లో వాళ్ళను చేజ్ చేయడానికి ప్రయత్నించారు గానీ వాళ్ళ వల్ల కాలేదు.
    మరుక్షణంలో రమణ ఫోన్ మోగింది.
    భవానీ గొంతు విని ఎగ్జయిటయిపోయాడు రమణ.
    "సార్! ఇక్కడో ఇన్సిడెంట్ జరిగింది -" అంటూ జరిగినదంతా చెప్పాడు.
    'అయితే - ఇంక అక్కడేం చేస్తున్నావ్ -- వెంటనే చానెల్ కొచ్చేయ్ - నువ్ షూట్ చేసిన క్లిప్పింగ్స్ న్యూస్ లో చూపించాలి - కమాన్ - ఆర్జంట్-"
    మరో గంటలో బృందావనం చానెల్లో హోమ్ మినిస్టర్ ఇంటి మీద కొంతమంది దుండగులు దాడి చేసి అద్దాలు పగలుగొట్టిన దృశ్యం బ్రేకింగ్ న్యూస్ లో టెలికాస్ట్ అయింది.
    "హోమ్ మినిస్టర్ తనే ముఖ్యమంత్రి అవుతానన్న స్టేట్ మెంట్ చూసి ఆవేశానికి గురయిన ముఖ్యమంత్రి వర్గీయులు కొంతమంది హోమ్ మినిస్టర్ ఇంటి మీద దాడికి పాల్పడి ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారు ' అంటూ కామెంటరీ తో పాటు స్క్రోలింగ్ కూడా రన్ చేయించాడు భవానీ!
    దాంతో మళ్ళీ బృందావనం చానెల్ చూట్టానికి రాష్టమంతా జనం మూగిపోయారు.
    ఆ విజువల్ చూస్తూనే రోజా ఉలిక్కిపడింది. మిగతా ఏ చానెల్స్ కూ దొరకని ఆ  క్లిప్పింగ్స్ బృందావనం చానెల్ కెలా దొరికిందో ఆమె కర్ధం కావటం లేదు. అసలు ఆ టైం లో చానెల్ కెమెరా హోమ్ మినిస్టర్ ఇంటి దగ్గరెందుకుందో ఆమెకి తేలీలేదు.
    జైరాజ్ కూడా ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ లేంది తమ చానెల్లో ఇన్ని విచిత్రాలు ఎలా జరుగుతున్నాయో అర్ధం కావడం లేదతనికి!
    అదే భవానీ శంకర్ నడిగాడతను.
    "ఇలాంటి గిమ్మిక్స్ చేయకపోతే మన చానెల్ ఎవరూ చూడరంకుల్- ఇప్పుడు చూడండి. పబ్లిక్ అంతా మిగతా చానెల్స్ వదలి మన చానేలె చూస్తున్నారు"
    వాళ్ళు మాట్లాడుతుండగానే రాదా చమేలీ హడావుడిగా లోపలి కొచ్చింది.
    "సీరియల్ రావాల్సిన చంక్ లో న్యూస్ చూపిస్తున్నారెంటి? సీరియల్ చూసే ప్రేక్షకులు గొడవ చేస్తారు కదా!" అంది చిరాగ్గా.
    "సీరియల్ ఒక అరగంట లేటవుతే కొంప మునగదు మేడమ్. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోరు -- ఇంకో అరగంట లేటుగా సీరియల్ స్టార్టవుతుందని స్క్రోలింగ్ వేయించండి -"

 Previous Page Next Page