Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 18

 

    " అయ్ డోంట్ లైకిట్ - రోజా మేడమ్ కూడా ఇలా టైమింగ్స్ మార్చటం లైక్ చేయరు -" అంది కోపంగా.
    "ఇది రైల్వే స్టేషన్ కాదు - ఏ టైం కారైలు వచ్చిందా, లేదా అని చూట్టానికి! చానెల్ -- ప్యూయర్ షిప్ ముఖ్యం! ప్రోగ్రాం కాదు - అర్ధమైందా? ఇంగ్లీష్ లో చెప్పనా?"
    రాధా చమేలీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
    జైరాజ్ హాపీగా అతని భుజం తట్టాడు.
    "మంచిగ జెప్పినావ్ రా భయ్ - నాకైతే ఆ సీరియల్స్ జరంత కూడా నచ్చలే!"
    "కానీ రోజా ఆఫెండవుతుందేమో అంకుల్-"
    "డోంట్ వర్రీ - నేను జెప్తా కదా-"
    సడెన్ గా బృందావనం చానెల్లో హోమ్ మినిస్టర్ ఇంటర్యూ స్టార్టయింది.
    "నా ఇంటి మీద ఎవళ్ళు రాళ్ళేసిన్రో నాకెరుక! అయితే ఆళ్ళని పట్టుకుని అల్లా నోటితోనే చెప్పిస్తా! ఆ పని ఎవరు చేయించిన్రో-"
    భవానీ హాపీగా ఫీలయ్యాడు.
    "ఒండర్ ఫుల్ ! అగ్గి రగులుకుందంకుల్! రేపల్నుంచి మన చానెల్లో ప్రోగ్రామ్స్ అన్నీ ఇంత హాట్ గా ఉండేట్లు చూద్దాం! అప్పుడు గానీ ప్రతి వారికీ మన చానెలంటే ఏంటో తెలీదు -"
    అప్పుడే ఫోన్ మోగింది .
    "అన్నా విజయ్ ని-"
    "కాంగ్రాచ్యులేషన్స్! దుమ్ములేపేశారు-"
    "థాంక్సన్నా-"
    "పోలీసులు మిమ్మల్ని చూళ్ళేదు కదా!"
    "వాళ్ళా? పగలు చూసినా దిక్కులేదు. ఇంక రాత్రిళ్ళు మొఖాలెం కనబడతాయ్ వాళ్ళకి -"
    "అందరూ డబ్బు పంచుకున్నారా?"
    "నైట్ కి అందరం మజా చేస్తున్నాం -"
    "జాగ్రత్త - ఈ న్యూస్ గురించి మీలో మీరు కూడా డిస్కస్ చేసుకోవద్దు -"
    "ఇంకేమన్నా గిసంటి డేరింగ్ ఫీట్స్ చేయాల్నంటే చెప్పన్నా! మొత్తం నిరుద్యోగుల బాచ్ కదా! పైసలు అవసరం !"
    "డోంట్ వర్రీ! చేతి నిండా పనే ఇంక - రేపు ఇంకో పని చెప్తాలే ! బై-"
    ఆ రాత్రి భవానీ, జైరాజ్ ఇంటికి చేరుకునేసరికి రోజా నిద్రపోకుండా వాళ్ళ కోసం ఎదురు చూస్తోంది.
    "డాడీ -- అక్కడ మీరూ, రాకేష్ చేస్తుందేమీ నాకు నచ్చలేదు -' అంది కోపంగా.
    "చూడు రోజా! మనది నాలుగు దినాల్లో బంద్ చేసే చానెల్ - అవునా , కాదా?"
    "అలాగని లేనిపోని ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోకూడదు కదా!"
    "ఏ ప్రాబ్లమ్స్ రాకుండా రాకేష్ మానేజ్ చేస్తాడ్లె బిడ్డా! నువ్ బేఫికరుండు - నాకు నీ హెల్త్ బాగుండటం గావాలె -- ఈ చానెల్ గురించి జరంత గూడా సొంచాయించకు-"
    రోజా ఇంక మాట్లాడలేకపోయింది.
    నిజమే! అది మూతబడటమే మంచిది. లేకపోతే ఇంకా చాలా డబ్బు పోగొట్టుకోవాల్సి వస్తుంది -- ఏదేమయినా రాకేష్ అతి తెలివితేటల్తో ఏదొక సమస్య తప్పదనిపిస్తోంది.
    ఆమె అనుకున్నంతా అయింది.
    మర్నాడు న్యూస్ పేపర్లో హెడ్ లైన్ చదివి షాకయింది.
    "తప్పుడు న్యూస్ టెలికాస్ట్ చేసినందుకు బృందావనం చానెల్ మీద కేస్ రిజిస్టర్ చేసిన పోలీస్ డిపార్ట్ మెంట్-"
    కంగారుగా ఆ పేపర్ హల్లో కూర్చుని భవానీశంకర్ తో మాట్లాడుతున్న తండ్రి దగ్గరకు తీసుకెళ్ళింది రోజా-
    "చూశారా డాడీ! మన చానెల్ మీద పోలీస్ కేస్ పెట్టారు-'
    ఆమె చేతిలోని పేపర్ ఎగ్జయిట్ మెంట్ తో లాక్కున్నాడు భవానీ -
    "ఒండర ఫుల్ రోజా! నాక్కావలసిందిదే! మన చానెల్ పేరు రాష్ట్రమంతా మార్మోగిపోవాలి - అప్పుడు గానీ జనం మన చానెల్ ని వెతికి మరీ చూడరు. అన్నీ న్యూస్ పేపర్స్ లో మన చానెల్ గురించే రాసి ఉంటారివాళ! ఆ పబ్లిసిటీయే మన చానెల్ కి కావాలి! ఇంక వ్యూర్ షిఫ్ రేటింగ్ ఎలా పెరుగుతుందో చూసుకో-"
    పేపర్ హెడ్ లైన్ చూసి భయపడ్డ జైరాజ్ - భవానీ మాటలు వినేసరికి ఆనందంతో పొంగిపోయాడు.
    "అవును రోజా! ఈ కేస్ ల గురించి వర్రీ అవకు! ఇవి తేలటానికి ఇరవై ఏళ్ళు పడుతుంది -"
    రోజాకి మండిపోయింది.
    "డాడీ ! చానెల్ ని ఎలా నడపాలో ఎబిసిడి తెలీని వాళ్ళని మన చానెల్ కి పంపటం రాంగ్! రాజేష్ ఈజ్ ఓన్లీ ఎ జర్నలిస్ట్ - న్యూస్ పేపర్లో పని చేసుకునే వాళ్ళకేం తెలుస్తుంది చానెల్ రన్ చేయటం?"
    భవానీ ఆమె కేదురుగ్గా కూర్చున్నాడు.
    "రోజా! నువ్ అమెరికాలో ఈ మీడియం గురించి చదువుకొచ్చి అన్నీ తెలుసుకుంటున్నావ్! అమెరికాలో టీవి చానెల్ రన్ చేయటం వేరు. ఇండియాలో టీవి చానెల్ రన్ చేయటం వేరు. అమెరికాలో ఎదిక్స్ ఉన్నాయ్. చాలా కఠినమయిన రూల్స్ ఉన్నయ్. అక్కడ వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబులిటీ ఉంది. మన దగ్గర అవేమీ లేవు. ఏ చానెల్ ఉద్దేశమయినా - ఎంత అడ్డదారిలోనయినా సరే - డబ్బు సంపాదించటం! ఎంత నీచానికయినా దిగజారి వ్యూయర్ షిప్ పెంచుకోవటం - అంత తేడా ఉంది!"
    "అవన్నీ ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళ మాటలు - ఎంత తన్నుకున్నా చానెల్ ని నెంబర్ వన్ చేయటం అంత తేలిక్కాదు- దానికి చాలా డబ్బు కావాలి! చాలా టైం కావాలి! ఇంకో రెండేళ్ళు బృందావనం చానెల్ ని నడపగలిగెంత స్తోమతు ఉంటె దీన్ని నేనే నెంబర్ వన్ చేయగలను -"
    "అది నీ వ్యూ! కానీ నా వ్యూ ఏంటో తెలుసా? నేను ఒక పైసా ఖర్చు లేకుండా మన చానెల్ ని మూడు నెలల్లో నెంబర్ వన్ చానెల్ చేయగలను!'
    "ఛాలెంజ్ ?" కోపంగా అంది రోజా.
    "ఛాలెంజ్!"
    "అయితే ఒక విషయం గుర్తుంచుకో మూడు నెలల్లో దీన్ని నెంబర్ వన్ చానెల్ గా చేయలేకపోతే దీని మీద తీసుకున్న ఇరవై కోట్ల లోన్ నువ్వే తీర్చాలి-"
    "ఇరవై కోట్ల లోనుందా దీని మీద?" షాకవుతూ అడిగాడు భవానీ!
    "అవును రాకేష్! నా ఇన్ వెస్ట్ మెంట్ కాక ఇరవై కోట్లు లోన్ తీసుకుని దీని మీద ఖర్చు పెట్టాను. వప్పుకున్నాడు జైరాజ్.
    "ఏం? భయం పట్టుకుందా?" కసిగా అడిగింది రోజా.
    "నా దగ్గర దమ్ము లేకపోతే కదా భయపట్టానికి -"
    "డాడీ- రేపే మన చానెల్ ని రాకేష్ పేరు మీదకు మార్చండి! రేపట్నుంచీ మూడు నెలల గడువు ! బృందావనం చానెల్ ని నెంబర్ వన్ చానెల్ గా మార్చడానికి!"

 Previous Page Next Page