తర్వాత ఆనందరావుతో అన్నాడు -
"వీడికి కావలసిన బట్టలూ, సామాన్లు అవీ కొనిచ్చి, తర్వాత యిక్కడ వదిలేస్తా సార్!"
"సరే!" అన్నట్లు తల ఊపాడు ఆనందరావు.
"ఎక్కరా" అన్నాడు కృష్ణాజీ మోటారు సైకిలు స్టార్టు చేస్తూ.
మోటారు సైకిలు వెనక ఎక్కి కూర్చున్నాడు రాజా.
ముందుగా ఒక రెడీమేడ్ బట్టల షాపుకి తీసుకెళ్ళాడు కృష్ణాజీ రాజాని.
"మూడు జతల బట్టలు తీసుకో" అన్నాడు కృష్ణాజీ.
జాగ్రత్తగా అన్నిటినీ పరిశీలించాడు రాజా.
ఎరుపూ, నలుపూ పట్టా పట్టీల డిజైను షర్టు ఒకటీ, నేరేడు పండు రంగు షర్టు ఒకటీ, బెలూన్ షేపు జీన్స్ ఒకటీ, నల్ల కాటన్ గేబర్డిన్ ప్యాంటు ఒకటీ సెలెక్ట్ చేసుకున్నాడు రాజా.
కృష్ణాజీ వాటిని చూసి నవ్వాడు.
"ఇవి వేసుకుని వెళితే ఆనందరావు మేష్టారు బెత్తం పుచ్చుకు వెనకబడతాడు. ఆయనకీ యిలాంటివన్నీ గిట్టవు. సాదాగా వుండే డ్రెస్సులు సెలెక్ట్ చేసుకో" అన్నాడు.
మాడిపోయిన బల్బులా అయిపోయింది రాజా మొహం.
'సాదా' అంటే ఏం సెలెక్టు చేసుకోవాలో అర్థంకాక అతను అవస్థపడుతుంటే, కృష్ణాజీనే సెలెక్టు చేసేశాడు. తెల్ల పైజమా, లాల్చీలు రెండు జతలు, బ్రౌన్ కలర్ ఫ్యాంటు ఒకటి, లేత క్రీం కలర్ షర్టు ఒకటి.
మూడు కర్చీఫులు కొన్నాడు.
అండర్ వియర్ కొన్నాడు.
తర్వాత ఇంకో షాపుకి తీసుకెళ్ళాడు.
ఒక స్టీలు కంచమూ, గ్లాసూ కొన్నాడు.
ఇంకో షాపులో ఒక రెడీమేడ్ పరుపూ, దిండూ కొన్నాడు.
తన మోటార్ సైకిలు ఒక షాపు దగ్గర పార్క్ చేసి, ప్యాక్ చేయించిన వస్తువులన్నీ ఆటోలో పెట్టుకుని, రాజాతో కలిసి ఆనందరావు ఇంటికి వచ్చేశాడు కృష్ణాజీ.
అప్పటికి బాగా చీకటి పడిపోయింది.
ఆనందరావు గారింట్లో అది భోజనాల వేళ.
ఆయనకీ వేళ ప్రకారం పెందరాళే భోజనం చేసి, పదింటికల్లా పడుకోవడమూ, మళ్ళీ తెల్లవారుజామునే లేచెయ్యడమూ అలవాటు.
"భోజనాల టైముకి వచ్చారు. మీరు కూడా ఇవాళ్టికి మాతో కలిసి తినేస్తే మాకు సంతోషం!" అన్నాడు ఆనందరావు కృష్ణాజీతో.
ముందు వద్దన్నాడు కృష్ణాజీ.
కానీ ఆనందరావు బలవంత పెట్టడం మానలేదు.
తర్వాత ఒప్పుకున్నాడు కృష్ణాజీ.
ఇంకోటి కూడా అనిపించింది అతనికి.
తను ఇవాళ ఇక్కడే భోజనం చేస్తే, రేపటినుంచి రాజా తినబోయేది ఎట్లా వుంటుందో కూడా అర్థమైపోతుంది.
వాడు బార్లలో, రెస్టారెంట్లలో తినడానికి అలవాటు పడ్డవాడు, ఇక్కడ అసలు ఇమడగలడా?
భోజనాలు వడ్డించేలోగా కాసేపు లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు.
ఆనందరావు విజ్ఞాన ఖని అని పూర్తిగా నమ్మకం కుదిరిపోయింది కృష్ణాజీకి.
మాటల సందర్భంలో ఆనందరావు అడిగాడు రాజాని.
"ఏరా బాబూ! పెద్దయ్యాక ఏం చెయ్యదలుచుకున్నావ్?"
"సుఖంగా బతకదలుచుకున్నాను" అన్నాడు రాజా తక్షణం.
"సుఖంగా బతకాలంటే ఏదో ఒకటి చెయ్యక తప్పదుగా! ఏం చేస్తావ్?"
తడుముకోకుండా జవాబు చెప్పాడు రాజా.
"గ్యాంగ్ లీడర్ ని అవుతా!"
కృష్ణాజీ తన నవ్వు ఆనందరావుకి కనబడకుండా మొహం పక్కకి తిప్పుకున్నాడు.
కొద్దిక్షణాలపాటు దిమ్మెరపోయినట్లు ఉండిపోయాడు ఆనందరావుగారు.
తర్వాత తేరుకుని అన్నాడు -
"గ్యాంగ్ లీడరా? అంటే?"
"తెలీదా? రౌడీలకి రౌడీ!"
"అంటే...నువ్వు పెద్దయ్యాక రౌడీవి అవ్వాలనుకుంటున్నావా?"
"కాదు! ఇప్పుడే నేను రౌడీని! పెద్దయ్యాక పెద్ద రౌడీని, అంటే రౌడీలకి రౌడీని అవుతాను."
"రౌడీగా బతికితే, రౌరవాది నరకాలు తప్పవు నాయనా!"
"రౌరవాది నరకాలు అంటే...టూ టౌన్ పోలీసుస్టేషన్ లాకప్ సెల్ లాగా వుంటాయా?
ఏం చెప్పాలో తోచక, కృష్ణాజీవేపు చూశాడు ఆనందరావు.
"వాడినలాగే మాట్లాడనివ్వండి" అన్నట్లు సైగచేశాడు కృష్ణాజీ.
"నరకంలో పెట్టే బాధలతో పోలిస్తే, పోలీసుస్టేషన్ లో పెట్టే హింసలు ఆటలో అరటిపండు లాంటివన్నమాట" అన్నాడు ఆనందరావు.
"అంటే అక్కడేం చేస్తారు?"
"అక్కడా...అక్కడ పాపం చేసిన వాళ్ళని సలసల కాగే నూనెలో వేయిస్తారు. ఇంకా మహా పాతకాలు చేసిన వాళ్ళనయితే, ఒంటికి గాట్లుపెట్టి దాన్లో ఉప్పు, కారం కూర్పి మరీ వేయిస్తారు."
ఆయన ఊహించినట్లు రాజా భయపడలేదు.
పైపెచ్చు పడీపడీ నవ్వాడు.
"ఏమిటీ? మనిషిని కోసి ఉప్పు, కారం పెట్టి వేయిస్తారా? డీప్ ఫ్రై అన్నమాట!"