నేను తయారు చెయ్యదల్చుకున్న మంచి సిటిజెన్స్ లో మొదటివాడు వీడే!"
కృష్ణాజీ చెప్పినది తనకు పూర్తిగా నచ్చినట్లు మెప్పుదలగా చూశాడు ఆనందరావు.
"అయితే ఇకనుంచి ఈ పిల్లవాడు మీ సంరక్షణలో ఉంటాడన్న మాట" అన్నాడు చిరునవ్వుతో.
"కాదు...." అన్నాడు కృష్ణాజీ.
"మరి....?"
"ఈ పిల్లవాడు... వీడి పేరు రాజా... ఇవాళ్టి నుంచి వీడు మీ సంరక్షణలో వుంటాడు."
ఆశ్చర్యపోయాడు ఆనందరావు.
"నా సంరక్షణలోనా? చిత్రంగా మాట్లాడుతున్నారే?"
కృష్ణాజీ అన్నాడు -
"మీలాంటి వ్యక్తులు ఎక్కడో అరుదుగా ఉంటారు. గురుకులంలో ఉంచినట్లు రాజాని మీ దగ్గర వుంచేస్తే వాడు సక్రమంగా పెరుగుతాడు. సొసైటీకి పనికివచ్చే సిటిజన్ అవుతాడు."
విని మౌనంగా ఉండిపోయాడు ఆనందరావు.
వెంటనే కృష్ణాజీ అన్నాడు -
"ఒక పిల్లవాడిని పోషించడం అంటే చాలా భారమని నాకు తెలుసు. అందుకని దానికి అవసరమయిన ఏర్పాట్లు కూడా నేనే చేస్తాను." అని జేబులో నుంచి పర్సు తీశాడు కృష్ణాజీ. అందులో ఒక చెక్ లీఫ్ వుంది.
ఆంధ్రా బ్యాంకు సేవింగ్స్ అకౌంట్.
త్వరత్వరగా ఇరవై వేల రూపాయలకి సెల్ఫ్ చెక్కు రాశాడు కృష్ణాజీ. చెక్కుని ఆనందరావుకి అందించబోయాడు.
ఆనందరావు ఆ చెక్కుని అందుకోలేదు.
"మాతోబాటు వాడికో ముద్ద పెట్టడం అంత కష్టం కాదు. కానీ అదికాదు విషయం! ఈ రాజా మీద మీకు అంత గురి ఏర్పడినప్పుడు అతని బాగోగులు మీరే స్వయంగా చూసుకోవడం మంచిది కదా!"
సంతోషం లేని నవ్వు నవ్వాడు కృష్ణాజీ.
"సార్! నా పొజిషన్ మీకు చెప్పినా అర్థం కాదేమో! నేను నిప్పులాంటి మనిషిని! అందుకే నా డిపార్ట్ మెంట్ లోనే నాకు లెఖ్ఖలేనంతమంది శతృవులు వున్నారు. ఏ వూళ్ళో కూడా నన్ను ఏడాదికంటే వుంచరు."
వింటున్నాడు ఆనందరావుగారు.
కృష్ణాజీ చెప్పాడు -
"నేను ఇక్కడ ఎన్నాళ్ళుంటానో తెలియదు. మళ్ళీ ఎప్పుడు, ఎక్కడికి ఏ వంక మీద ట్రాన్స్ ఫర్ చేస్తారో తెలియదు. ఎప్పుడు నన్ను ఏం చేస్తారో తెలియదు. ఎన్నాళ్ళు బతుకుతానో, చివరికి ఎలా చస్తానో నాకే తెలియదు.
నాకు తెలిసిందల్లా -
సహజమైన చావు మాత్రం నాకు రాదని!
నేను ఒక్కడిని! శతృవుల సంఖ్య లెఖ్ఖకి అందదు.
నా ప్రాణాలు కాపాడుకోవడం మీద నాకు అంత శ్రద్ధ లేదు... ఎక్కడో ఒకచోట, ఎవడో ఒకడు దొంగ దెబ్బ తీస్తాడు నా మీద!
ఈ కుర్రాడు కూడా నాతో ఉన్నాడనుకోండి. అప్పుడు వాడు కూడా అదే ప్రమాదంలో పడిపోతాడు.
అది నాకు యిష్టం ఉండదు.
అందుకే సార్! ఈ అబ్బాయిని మీ దగ్గరే ఉంచి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. మీరే వీడిని పెంచండి. చదువు చెప్పండి. మంచి మనిషిగా తయారుచెయ్యండి. ఈ కుర్రాడిని మీ దగ్గర వుంచుకోవడం వల్ల మీకేం డబ్బు యిబ్బంది కలగకుండా నేను కొద్దో గొప్పో పంపుతూనే వుంటాను."
"డబ్బుదేముందిగానీ...సరే...మీరు చెప్పిన ప్రకారమే చేద్దాం. ఆ తర్వాత అన్నిటికీ దేవుడే వున్నాడు."
కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు కృష్ణాజీ.
తన ప్రమేయం లేకుండానే తన భవిష్యత్తుని వాళ్ళిద్దరూ అలా నిర్ణయించేస్తూ వుండటం రాజాకి నచ్చలేదు.
"నేను ఈ మేష్టారి దగ్గర ఉండను" అన్నాడు దృఢంగా.
సీరియస్ గా రాజా వేపు తిరిగాడు కృష్ణాజీ.
"ఏం? ఎందుకని?"
మనసులో అనుకున్నాడు రాజా -
"ఎందుకనా? ఇక్కడ ఉంటే నేను జైల్లో ఉన్నట్లే!"
అతని భావం గ్రహించినట్లు అన్నాడు కృష్ణాజీ -
"బలవంతం లేదురా! ఇక్కడ ఉండకపోతే జైల్లో ఉండొచ్చు! నీ ఇష్టం."
రాజా అనుకున్నాడు -
"వద్దులే! జైల్లో నుంచి పారిపోవడం కంటే ఇక్కడ నుంచి పారిపోవడమే సులభం"
"ఏమంటావ్?" అన్నాడు కృష్ణాజీ.
అయిష్టంగానే తల ఊపాడు రాజా.
"సో! దట్ సెటిల్స్ ఇట్!" అన్నాడు కృష్ణాజీ.