"ఇప్పుడు నేను నేనేనా! మోహన్ నేనా?
"సరిగ్గా అదే ప్రశ్న వేశారు నా భార్యాబిడ్డలు. నా ఆస్తికోసం కోర్టుకెళ్ళారు. నా శరీరంలో ముప్పాతిక వంతులు, మెదడులో ఒక భాగంతో సహా మారిపోయాక, ఇంక నన్ను పూర్వపు మోహన్ కుమార్ గా గుర్తించడానికి వీల్లేదంది కోర్టు. ఆస్థిపాస్తులన్నీ వాళ్ళ పరమయ్యాయి. నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు" నరహరి గొంతు గాద్గదికమైంది.
"నాకు మళ్ళీ ప్రాణంపోసి ఉపకారం చేస్తున్నామనుకున్నారు ఆ సైంటిస్టులు. వాళ్ళకు సైన్సు మాత్రమే తెలుసు. లోకం తెలియదు పాపం!
ఆ రోజు మంటల్లో చనిపోయిన తర్వాత మళ్ళీ బతకకుండా ఉంటే చాలా బాగుండేదని నేను విచారించని రోజు లేదు.
ఇంకా చిత్రమేమిటంటే "నేను ప్రాణాలకు తెగించి వాళ్ళను కాపాడానా? వాళ్ళు మళ్ళీ నాకు ప్రాణంపోసి బతికించారా? అయితే ఆపరేషను అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు విమాన ప్రమాదం జరిగి ఆ ఆరుమందిలో అయిదుగురు చనిపోయారు. ఒక్క సంజీవ్ గారు తప్ప! చాలా దురదృష్టం!"
అజిత్ నోరు పెగల్చుకుని అన్నాడు "డాక్టర్ సంజీవ్ గారు కూడా చనిపోయారు కొద్దిరోజుల క్రితం!"
నరహరి నిర్ఘాంతపోయాడు.
"ఆయన సృష్టించిన మరమనిషి మీరేననీ, మీరే ఆయన్ని చంపారనీ, ప్రపంచమంతా గగ్గోలుగా ఉంది!" అన్నాడు అజిత్. ఈ ఊళ్లో టీవీలు కూడా ఉన్నట్లు లేవు. అందుకే వీళ్ళకేమీ న్యూస్ తెలుస్తున్నట్లు లేదు.
"డాక్టర్ సంజీవ్ గారు చనిపోయారా? ఆయన్ని నేనే చంపాననుకుంటున్నారా? దేవుడా! ఎంత దౌర్భాగ్యపు బతుకయ్యా నాది!" అని చేతుల్లో మొహం దాచుకుని కూలబడిపోయాడు నరహరి. అతను దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుంటున్నట్లు రొమ్ము ఎగిరెగిరి పడుతోంది.
"ఏదో పొట్ట చేత్తో పట్టుకుని ఈ వూరొచ్చానన్నావు గానీ ఈ కథంతా మాకెప్పుడూ చెప్పలేదేరా నరహరీ!" అంది బామ్మగారు జాలిపడుతూ.
"బతికినన్నాళ్ళూ ఇలా నరహరిగానే బతికేసి వెళ్ళిపోదలుచుకున్నా బామ్మా! ఇంక మళ్ళీ గతమంతా తవ్వుకుని ఏం లాభం?"
"నరహరి మా వూరికి కొత్తగా వచ్చినప్పుడు మేమూ దడుచుకున్నాం. ఆ తర్వాత తెలిసింది, అతను చాలా మంచివాడని. అప్పటినుంచీ మాతో కలిసిపోయి, ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయాడు" అన్నాడు బ్రహ్మానందం.
"ప్రపంచంలోని పెద్ద పెద్ద నగరాలూ, వాటిలో దుమ్మూ ధూళీ, అక్కడి మనుషుల్లో కుళ్ళూ... ఇవన్నీ చూసిన నాకు ఈ లోయలోని చిన్న ఊరూ, ఈ చెట్లూ, ఈ పూల మొక్కలూ, ఈ పైరగాలీ, ఈ మనుషుల ఆప్యాయతా నచ్చి ఇక్కడే ఉండిపోయాను" అన్నాడు నరహరి. తర్వాత అపురూపవైపు తిరిగి, "రాత్రి నిన్ను చూసి వూరికే పలకరిద్దామని దగ్గరికి వచ్చానమ్మా! నన్ను చూసి నువ్వు చాలా బెదిరిపోయినట్లున్నావ్, అవునా?" అన్నాడు.
మొహమాటంగా నవ్వింది అపురూప.
జరగరాని ఘోరం ఏదో జరుగుతుందని భయపడుతుంటే, అదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి రాకుండానే తప్పిపోయింది.
'ఇంతేనా జరిగింది?' అనుకుంది అపురూప.
'వడ్ల గింజలో బియ్యపు గింజ!' అని తేలిగ్గా కొట్టేస్తారే, అలాంటిదేనా ఇది?
రాబొట్ తప్పించుకుపోవడం, ప్రపంచాన్ని గంగవెర్రులెత్తించడం, అదంతా కేవలం రజ్జు సర్ప భ్రాంతేనా?
తామందరూ రాక్షసి, మరమనిషి అని భ్రమపడుతున్న నరహరి, దురదృష్టవంతుడైన ఓ అమాయకుడా?
మరి...మరి... డాక్టర్ సంజీవ్ ఎలా చనిపోయారు? తన తల్లి, డాక్టర్ శోధన ఏమయిపోయింది? విషక్రిములు ఎక్కడున్నాయి? ఆకాశంలో కనబడుతున్న ఫ్లయింగ్ సాసరు కూడా భ్రాంతేనా?
ఆలోచిస్తున్న కొద్దీ తల తిరిగిపోతున్నట్లు అనిపించింది.
అజిత్ కూడా సీరియస్ గా ఆలోచిస్తూ వున్నాడు.
"బామ్మగారికి ఎప్పుడూ లేనిది కాస్త కళ్ళు తిరుగుతున్నాయంటే, కుర్చీలో కూర్చోబెట్టి ఎత్తుకు తీసుకొస్తున్నా!" అన్నాడు నరహరి. నిజంగానే అతను చాలా బలిష్టంగా వున్నాడు.
"ఇంక పదండి వెళదాం! పెళ్ళి ఇంట్లో బోలెడు పనులున్నాయి మనకి! రామ్మా చెల్లెమ్మా! రావయ్యా బావా!" అన్నాడు బ్రహ్మానందం - అపురూపతో, అజిత్ తో వరసలు కలిపేస్తూ.
"ఇంతకీ నీ పేరేమిటే అమ్మాయ్?" అంది బామ్మగారు చనువుగా. పండు తమలపాకులా వుందామె.
"అపురూప"
"మీ ఆయన పేరేమిటి?" అంది బామ్మగారు చనువుగా. పండు తమలపాకులా వుందామె.
"అపురూప"
"మీ ఆయన పేరేమిటి?"
ఒకసారి అజిత్ వైపు ఓరగా చూసి, మాట్లాడకుండా వుండిపోయింది అపురూప. తనకింకా పెళ్ళి కాలేదనీ, పెళ్ళి కాకుండానే ఈ కుర్రాడితో తిరుగుతున్నాననీ, అసలు తమ నాగరికతలో పెళ్ళిళ్ళనేవి లేవని చెబితే, ఈ బామ్మగారు కర్ర తీసుకుని కొడుతుందేమోనని భయమేసింది ఆ అమ్మాయికి.
"అబ్బోసి! బావగారి పేరు చెప్పడానికి సిగ్గుపడుతోంది బామ్మా!" అన్నాడు బ్రహ్మానందం నవ్వుతూ.
"నా పేరు అజిత్!" అని చెప్పేశాడు అజిత్, అపురూప ఇబ్బంది తొలగించడానికి.
* * * *
బ్రహ్మానందం ఇల్లు వచ్చింది.
చిన్న డాబా ఇల్లు అది. ముందువైపు వసారాకి బంగాళా పెంకులు పరిచి వున్నాయి. వసారాలో ఒక ముసలాయన తీరిగ్గా పడక్కుర్చీలో పడుకుని మూరెడు చుట్ట కాల్చుకుంటున్నాడు.
గుమ్మాలన్నిటికీ మామిడాకులు కట్టి వున్నాయి. గడపలకి పసుపు పూసి ఉంది. గోడలకి సున్నమేసి ఉంది.
మూడు తరాల బంధువుల కలయిక అది. అందరూ ఆ లోయలోనే దగ్గర దగ్గర వూళ్ళలో వుంటున్నారు. ఆ పాతిక ముప్పయి కుటుంబాలకీ ఆ బామ్మగారే పెద్దదిక్కు. ఆవిడని సంప్రదించకుండా ఎవ్వరూ ఏ పనీ చెయ్యడానికి ఇష్టపడటం లేదు. ఓపిక చేసుకుని నెమ్మదిగా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నా మొత్తానికి ఆమెకి నలతగానే ఉంది.
పెళ్ళికి వచ్చిన బంధువులలో క్రితం సంవత్సరమే పెళ్ళయి, నెలలు నిండిన ఓ చూలాలు కూడా వుంది. భద్రంగా పరుపులు పరిచిన రెండెడ్ల బండిలో తీసుకొచ్చారు ఆమెని.
పెళ్ళి తంతు అంతా కళ్ళు విప్పార్చి, చాలా శ్రద్ధగా గమనించింది అపురూప. మధ్యమధ్యలో అజిత్ వైపు చూస్తే అతనూ తనవైపే తదేకంగా చూస్తున్నాడు.
మౌనంగానే వూసులాడుకుని ఒక అంగీకారానికి వచ్చాయి వాళ్ళ కళ్ళు.
పెళ్ళి తంతు ముగిసిన అరగంటలోనే, పండు ముసలి అయిన బామ్మగారు, తన బంధుజనం మధ్య సునాయాసంగా కళ్ళు మూశారు.
కుటుంబం అంటే అర్ధమేమిటో తెలిసింది అపురూపకి. ఒకళ్ళ కష్టసుఖాలు ఒకళ్ళు పంచుకోవడం, ఒకరిపై ఒకరు సానుభూతి కలిగి ఉండటం, అవసరాలకి సహకరించుకుంటూ ఉండడం, జీవితాంతం తన వాళ్ళకోసం శ్రమపడి, వృద్ధులై, జవసత్వాలు ఉడిగిపోయినవారికి ఆశ్రయం కలిగించడం -
మనసు ఆర్ద్రంగా అయింది అపురూపకి. ఇలాంటి అభిమానాలన్నీ తనకు తెలిసిన నాగరికతలో ఏవీ? జంతువులలాగా కోరిక మాత్రం తీర్చేసుకుని, ఎవరికి వారే యమునా తీరేలాగా వెళ్ళిపోవడం!
జంతువుల లాగానా? పొరబాటు! చాలా రకాల జంతువులకి కూడా కొద్దో గొప్పో అనుబంధాలూ, ఆప్యాయతలూ ఉంటాయి.
మృగం కంటే హీనమైపోయిన ఈ నాగరికుడిలో ఆప్యాయతా అనుబంధాల కోసం వెదకడం మృగతృష్ణే అవుతుంది.
ఇరవయ్యో శతాబ్దంలో మనిషి స్వార్ధపరుడిగానే బతికినా, కనీసం తన కుటుంబ సభ్యులు నలుగురి కోసమన్నా కొద్దో గొప్పో త్యాగం చేసేవాడు. వివాహం అనే వ్యవస్థ లేకుండా పోయాక, స్వార్థం మితిమీరిపోయి, ఎవడికివాడు "చిన్న నా పొట్టకు శ్రీరామరక్ష" అనుకోవడం మొదలెట్టాడు.
పండుటాకులా రాలిపోయిన ఆ ముసలామె కోసం ఎవరూ ఉత్తుత్త శోకాలు పెట్టి ఏడవలేదు. కానీ, ఆమె తమకోసం చేసినదంతా తలుచుకుంటూ, చాలాసేపటివరకూ దిగాలుపడి కూర్చుండిపోయారు.
చిత్రంగా వినబడింది 'కేర్' మని ఏడుపు. నెలలు నిండిన అమ్మాయి ప్రసవించింది. ఆడపిల్ల. "బామ్మగారే మళ్ళీ పుట్టారు!" అన్నారెవరో.
"అవునవును!" అని ఏకీభవించారు అందరూ సంభ్రమంగా.
అది నిజం కాకపోవచ్చు. మూఢత్వమే కావచ్చు. కాకతాళీయం అయి ఉండవచ్చు. కానీ ఆ భావనే, తమకి ప్రాణప్రదమైన బామ్మగారు మళ్ళీ మరో ప్రాణి రూపంలో పుట్టిందన్న భ్రమే, వాళ్ళకి ఊరట కలిగించింది.
ఆ తర్వాత బామ్మగారి అంత్యక్రియలు ప్రశాంతంగా జరిగిపోయాయి.
* * * *
అందరి దగ్గరా శెలవు తీసుకుని, కారుని వదిలేసివచ్చిన చోటికి చేరుకున్నారు అజిత్, అపురూప.
కారు అక్కడే ఉంది గానీ, కారులో పొట్టి రాబొట్ కేటూ లేదు.
"ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉందేమో!" అంది అపురూప.
అజిత్ సాలోచనగా తల పంకించి, చుట్టూతా పరికించి చూశాడు.
ఒక్కసారి వెనక్కి తిరిగి లోయలో కనబడుతున్న ఆ పల్లెటూరిని తదేకంగా చూసింది అపురూప. "అతి నాగరికతా, విచ్చలవిడి జీవితం, సూపర్ టెక్నాలజీ, ఇదంతా చూసిన మనకు ఈ పల్లెటూరుకొస్తే కాలంలో వెనక్కి ప్రయాణం చేస్తూ వచ్చినట్లుంది కదూ?" అంది.
నవ్వాడు అజిత్.
"అపూ! నీకు నిజంగానే కాలంలో ప్రయాణం చెయ్యాలని ఉందా? గతంలోకీ, భవిష్యత్తులోకీ ఒకసారి సరదాగా తొంగి చూడాలని ఉందా?" అన్నాడు.