"ఏమిటీ?" అంది అపురూప కళ్ళు పెద్దవి చేస్తూ.
"మనం ఇప్పుడు టైం మెషిన్ ఎక్కి ముందుగా గతంలోకి వెళదాం."
"టైం మెషిన్ ఎక్కి గతంలోకి వెళదామా? అజిత్! ఆర్ యూ ఆల్ రైట్? ఇవాళ భోజనం హెవీ అయిపోయి వికటించడంలేదు కదా?" అంది అపురూప ఆదుర్దాగా.
నవ్వుతూ తల అడ్డంగా ఆడించాడు అజిత్.
"టైం మెషిన్ అనేది ఉత్త ఊహ! హెచ్.జి.వెల్సు అనే రచయిత అలాంటి మెషిన్ ని ఊహించి, దాన్లో ఎక్కి ముందుకు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో వర్ణిస్తూ ఒక ఫాంటసీ రాశాడు."
"థాంక్ గాడ్! అంతేకదా!" అంది అపురూప తెరిపిన పడ్డట్లు చూస్తూ.
"కమాన్! కారెక్కు! నా కార్లో 'ఇమేజ్ సిమ్ములేటర్' అని ఒక మెషిన్ ఉంది. మనం కోరిన దృశ్యాలను మన చుట్టూతా త్రీ డైమన్షనల్ ఎఫెక్టుతో సృష్టిస్తుంది. అంటే నిజంగా ఆ సంఘటనలలో పాల్గొంటున్నట్లే అనిపిస్తుంది మనకి. టైం మెషిన్ లో ఎక్కి గతంలోకి వెళ్ళినట్లే ఈ కారు ఎక్కి సిమ్యులేటర్ ద్వారా గతాన్ని ఊహించుకుని చూడవచ్చు మనం. అదిగో చూడు! బ్రహ్మాండం బ్రద్దలవుతోంది!" అన్నాడు.
వెంటనే వర్ణించనలవి కానంత శబ్దం! కాంతీ! తర్వాత రెండు నిమిషాల పాటు కళ్ళు బైర్లు కమ్మాయి. తమ కారు బ్రహ్మాండమైన ప్రేలుడికి కేంద్రంగా ఉన్నట్లు భ్రమ కలిగింది.
కారులోని సిమ్యులేటర్ యంత్రం, గాలిలోనే పొడవూ, వెడల్పూ, లోతూ కూడా కనబడుతున్న త్రీ డైమన్షనల్ దృశ్యాలని సృష్టిస్తోంది. తెరలేని సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతోంది వాళ్ళకి.
"ఏమిటా ప్రేలుడు?" అంది అపురూప భయంగా.
"'బ్రహ్మాండం బద్దలయింది' అని మాట వరుసకి అనేస్తూ ఉంటారు చూడు. అది నిజంగానే సంభవించింది. కాస్మిక్ ఎగ్ పగిలింది. దీన్నే 'బిగ్ బ్యాంగ్' అంటారు"
"పదిహేను వేల మిలియన్ల సంవత్సరాల క్రితం సంభవించిన ఈ ప్రేలుడు వల్లనే ఇప్పుడు మనకి తెలిసిన విశ్వం ఉత్పన్నమయింది. సృష్టి సమస్తం దీనివల్లనే జరిగిందంటున్నారు శాస్త్రజ్ఞులు"
దిగ్భ్రాంతి పొంది చూస్తోంది అపురూప.
"ఇప్పుడు మనం సృష్టికి మొదట్లో ఉన్నామన్న మాట! మన టైం మెషిన్ ని కాలంలో ఇంకొంచెం ముందుకి తీసుకెళదాం. అదిగో చూడు. మన 'పాలపుంత' గెలాక్సీ తయారవుతోంది. దానిలో అదిగో సూర్యుడు పుడుతున్నాడు. సౌర కుటుంబం, గ్రహాలూ ఏర్పడుతున్నాయి.
సిమ్యులేటర్ త్రీడీ ఎఫెక్టులో ఈ సృష్టి నాటకాన్నంతా గాలిలో తిరిగి సృష్టిస్తోంది. కారు చుట్టూతా మిలమిల మెరిసే నక్షత్రాలు కనబడుతున్నాయి. కనురెప్ప వేయటం కూడా మర్చిపోయి చూస్తోంది అపురూప.
"అదే మన భూగోళం! దాని చుట్టూ ఆక్సిజన్ తో కూడిన వాతావరణం ఏర్పడుతోంది. అటుచూడు! మొదటి ఏకకణజీవి!"
ఆ తర్వాత దృశ్యాలలో ఏకకణజీవులు కీటకాలుగా, చేపలుగా, జంతువులుగా రూపొంది సముద్రాన్ని వదిలి భూతలం మీదికి వచ్చాయి. చెట్లు పెరిగాయి.
నిజంగా కాలంలో ప్రయాణం చేస్తూ, మిలియన్ల సంవత్సరాలని దాటేస్తున్న భ్రాంతి కలిగిస్తోంది ఆ సిమ్యులేటర్.
మళ్ళీ దృశ్యాలు మారాయి. డినోసార్స్ అనే రాక్షస బల్లులు కొంతకాలంపాటు ప్రపంచాన్ని డామినేట్ చేసి, తర్వాత హఠాత్తుగా నశించిపోయాయి. ఆ తర్వాత స్తన్య జంతువులు, కోతులు, కోతులలో మెదడు ముందు భాగం బాగా డెవలప్ అయింది.
కోతుల జాతుల్లో నుంచి 'నేకెడ్ ఏప్' - అంటే శరీరం మీద దట్టంగా రోమాలు లేకుండా, నగ్నంగా కనబడే మనిషి వచ్చాడు. నిటారుగా రెండు కాళ్ళమీద నడుస్తూ చేతులతో ఆయుధాలు పట్టుకోవడం నేర్చుకున్నాడు. తక్కిన జంతువులని వేటాడుతూ, తను అన్నిటికంటే అధికుడైపోయాడు.
తర్వాత నిప్పు తయారు చెయ్యడం నేర్చుకున్నాడు. జంతువులని మచ్చిక చేసుకున్నాడు. వ్యవసాయం మొదలెట్టాడు. నగరాలు కట్టాడు.
ఆ తర్వాత ఇంక నాగరికత విజృంభించింది. జంతువులని వేటాడటానికి కాకుండా, మనిషి సాటిమనిషిని అదుపులో పెట్టుకోవడానికి ఆయుధాలు తయారుచేశాడు. యుద్ధాలు మొదలయ్యాయి.
తుపాకి మందు కనిపెట్టాడు. తుపాకులు, ఫిరంగులు వచ్చాయి. అణువును బద్దలు చెయ్యడం నేర్చుకున్నాడు. ఆటంబాంబూ, న్యూట్రాన్ బాంబూ వచ్చాయి.
మానవజాతినంతా నిర్మూలించగల బాక్టీరియాని కనుక్కున్నాడు.
ఇలాంటి దృశ్యాలు ఒకవైపు కనబడుతుండగా, మరోవైపు మనసు పులకరింపజేసే మరికొన్ని దృశ్యాలు గోచరించాయి అపురూపకి. మెడిసిన్ అత్యద్భుతంగా డెవెలప్ అయింది. ముసలితనాన్ని నిర్మూలించడం, చావుని చావుదెబ్బ కొట్టడం జరిగింది. మానవజాతిని పీడిస్తున్న వ్యాధులన్నిటినీ లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సృష్టికి ప్రతిసృష్టి జరుగుతోంది.
దృశ్యాలు అక్కడ నిశ్చలమై పోయాయి.
'వెల్! మనం వర్తమానంలోకి వచ్చాం! మానవ జాతిని మారణహోమం చెయ్యడానికి సర్వసన్నాహాలూ చేసి ఉంచాడు మనిషి. పొరబాటున ఎక్కడ ఏ ఆటంబాంబో ప్రమాదవశాత్తు పేలినా, లేదా ఏ విషక్రిమి తాలూకు కాప్స్యూలో పగిలినా, తీవ్రమైన పరిణామాలు వచ్చేస్తాయి. దానితో మానవజాతే మట్టి కొట్టుకుపోతుంది.
"అపురూపా! మానవుడు ఈ భూగోళం మీద అవతరించిన తర్వాత తన జాతి అంతరించడానికి ఎంత త్వరగా ఏర్పాట్లు చేసేశాడో తెలుసా? ఈ విషయం సులభంగా అర్థం కావాలంటే, కార్లో సాగన్ అనే ప్రొఫెసరు తయారు చేసిన కాలెండరు లాంటి సూచిక చూడాలి.
"ఈ విశ్వం తాలూకు వయసు పదిహేను వేల మిలియన్ల సంవత్సరాలు. ఈ మొత్తం కాలాన్ని ఒక సంవత్సరమని వూహించుకుంటే, జనవరి ఒకటో తారీఖున బ్రహ్మాండం బద్ధలై విశ్వం రూపు దిద్దుకోవడం మొదలెట్టింది. మే ఒకటో తారీఖున మన మిల్కీవే గెలాక్సీ తయారయింది. సెప్టెంబరు పధ్నాలుగో తారీఖున అల్పమైన ప్రాణులు ఉద్భవించాయి. డిసెంబరు ఇరవై తొమ్మిదో తారీఖున కోతులు పుట్టాయి.
"డిసెంబరు ముప్పయ్ ఒకటో తారీఖు రాత్రి పది గంటల ముప్పయ్ నిమిషాలకి మనిషి పుట్టాడు. రాత్రి పన్నెండు గంటల ఒక్క సెకెండుకి - సైన్సులో, టెక్నాలజీలో అద్భుతమైన అభివృద్ధి సాధించి, దానితోబాటుగా తన జాతి మొత్తాన్ని తుడిచిపెట్టేసే మారణాయుధాలు కుప్పలు తెప్పలుగా తయారుచేసేశాడు!
"గుర్తుంచుకో! ఈ లెఖ్ఖప్రకారం, రాత్రి పదిన్నరకు భూమి మీద అవతరించిన మానవజాతి, అర్దరాత్రి పన్నెండయేసరికి తనని తాను నిర్మూలించుకునే ఆయుధాలు తయారు చేసేసింది - సరిగ్గా గంటన్నరలో!
"అపురూపా! సైన్సు కోరిన వరాలు ఇవ్వగలదూ, కోరలతో కబళించగలదు కూడా! సైన్సుని ఎలా, ఎందుకు ఉపయోగించుకోవాలో మనిషి తక్షణం నిర్ణయించుకోవాలి.
"తనని తానే నాశనం చేసుకోకుండా మనిషి బతకగలిగితే, భవిష్యత్తులో ఎలా వుంటాడో చూడు!"
మళ్ళీ వాళ్ళ కారు టైం మెషిన్ గా మారి భవిష్యత్తులోకి పయనిస్తున్న అనుభూతి! కొత్త దృశ్యాలు కనబడుతున్నాయి.
ఎదురుగుండా ఒక ప్రాణి కనబడింది. మాంసం ముద్దలా వుందది.
"ఏమిటది?" అంది అపురూప, వెగటుగా చూస్తూ.
"మనిషి!" అని సంతోషం లేకుండా నవ్వాడు అజిత్.
"భవిష్యత్తులో మిలియన్ల సంవత్సరాలు ముందుకి వెళ్ళిపోయాం అపురూపా! మనిషి తెలివి మీరిపోయి అతి తెలివీ, చావు తెలివితో వెలిగిపోతున్నాడు. జీవితం పూర్తిగా యాంత్రికం. శారీరక శ్రమ అనేది మానవజాతి మర్చిపోయింది.
"అపురూపా! ఛార్లెస్ డార్విన్ చెప్పిన 'థియరీ ఆఫ్ ఎవల్యూషన్' ఆధారంగా ఆలోచిస్తే -
"ఉపయోగంలో లేని అవయవాలు కాలక్రమేణా చిన్నవై, చివరికి సూచన ప్రాయంగా మిగిలిపోతాయి. ఎక్కువ ఉపయోగంలో ఉన్న అవయవాలు మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతాయి. తోక మాయమైనట్లు, చిటారు కొమ్మలకి ఉన్న చిగురుటాకులని అందుకోవాలని ఆరాటపడుతూ మెడ సారించిన జిరాఫీకి మెడ సాగినట్లు అన్నమాట!
"మిలియన్ల సంవత్సరాల తర్వాత - మనిషికి నడక అలవాటు తప్పిపోవడం చేత కాళ్ళు ఉండవు. పనులు చేయకపోవడం వల్ల చేతులు ఉండవు.
"ఇలా పెద్ద ఉండలాగా అయిపోతాడు మనిషి. కాళ్ళూ చేతులూ సూచనప్రాయంగా పెన్సిళ్ళలాగా ఉంటాయి. జ్ఞానేంద్రియాలు మాత్రం బాగా డెవలప్ అయి వుంటాయి. దీన్ని ఇంక 'మనిషి' అని కాకుండా 'బుద్ధిజీవి' అనొచ్చు మనం!"
మాంసం ముద్దలా ఉన్న ఆ 'మనిషి'ని చూసేసరికే అపురూపకి వళ్ళు జలదరించింది.
"మైగాడ్! ఫర్ హెవెన్స్ సేక్! ఈ మెషిన్ ని ఇంక ఆఫ్ చేసెయ్ అజిత్!" అంది భయంగా.
"అపూ! ఇదంతా ఉత్త ఊహే అయినందుకు సంతోషించాలి మనం" అని నిట్టూర్చి "ఓకే! ఇంక షో అయిపోయింది" అంటూ స్విచ్ ఆఫ్ చేశాడు అజిత్.
ఆశ్చర్యం!
స్విచ్ ఆఫ్ చేసినా దృశ్యం తొలిగిపోలేదు!
వాళ్ళు ఊహించిన బుద్ధిజీవిలాంటిది నిజంగానే ఎదురుగా ఉంది!!!
అల్లంత దూరంలో దాని తాలూకు ఫ్లయింగ్ సాసరు!!!
* * * *
కళ్ళకు కనబడుతున్న యదార్ధాన్ని మెదడు అంగీకరించడానికి కొద్దిక్షణాలు పట్టింది.
విషయం గ్రహించగానే చటుక్కున కారులోనుంచి దిగడానికి చూశారు ఇద్దరూ.
"పారిపోవడానికీ, అఘాయిత్యం చెయ్యడానికీ వూరికే ఆరాట పడిపోకండి. అది అసంభవం!" అంది బుద్ధిజీవి. దాని మెడలో హారంలా ఉంది ఒకటి. ఆ హారానికి సూక్ష్మమైన మైక్రో రేడియో సెట్టులాంటిది తగిలించి ఉంది. బుద్ధిజీవి ఏదో తెలియని గ్రహం భాషలో మాట్లాడుతోంది. ఆ మాటలని పెదవి దాటీదాటక ముందే తెలుగులోకి అనువదిస్తోంది ఆ మైక్రో మెషిను.