ఇవన్నీ కొనడానికి మనం కొంత మదుపు కడదాం. కొంత బ్యాంకు అప్పు తీసుకుందాం. కొంత పెట్టుబడి నేను పెడతాను. ఇదంతా మనం చేయగల్గిననాడు రైతుల బతుకులు బాగుపడతాయి - వారి రాబడి రెట్టింపు అవుతుంది. నలుగురు కల్సి పనిచేయడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. లాభ, నష్టాలు అందరికీ సరి సమానం అయినప్పుడు అందరం ఒక కుటుంబంలోని వారమన్న భావం పెరిగి హెచ్చు తగ్గులు లేని సమాజ స్థాపనకి నాంది జరుగుతుంది. నేను చెప్పింది మీకర్థం అయిందా - మీరంతా అంగీకారం తెలిపితే నేను కలక్టరుతో, ముఖ్యమంత్రితో మాట్లాడి బ్యాంకు లోను ఏర్పాటు చేస్తాను."
"అయ్యాగారూ... మాలాంటిచిన్న రైతులం పెట్టుబడి ఎంత పెట్టాల్సి వుంటుందండి. ఒక రైతు సందేహంగా అడిగాడు. అంతా తల వూపి జవాబు కోసం చూశారు."
"మొత్తం ఈ వూర్లో సేద్యపు నేల ఎంతుంది. ఎంతమంది రైతులున్నారు. మొత్తం ఎకరాలకి ఖర్చు ఎంత, రాబడి ఎంత లాంటివన్నీ లెక్కలు కట్టాకగాని ఎకరానికి ఎంత మనం పెట్టాలి. ప్రభుత్వం బ్యాంకులు రుణం ఎంతిస్తాయి లాంటి వివరాలన్నీ లెక్కకట్టి గాని చెప్పలేను. చూడండి. మీకు భారమయ్యేంత పెట్టుబడి పెట్టనక్కరలేదని మాత్రం చెప్పగలను. కావలిస్తే యిలాంటి చిన్న రైతులకి ముందు నేను పెట్టుబడి పెడతాను మీ తరపున - రాబడి వచ్చాక అప్పుడు యిద్దురుగాని నాకు - మీకు నమ్మకం కలిగి, మీకు చేతిలో డబ్బు వుండడం ఆరంభించాక నా అప్పు చెల్లగొడుదురుగాని..." కేశవరావు చెప్పడం ఆపి అందరివంక చూశాడు.
రైతులందరూ మొహాలు చూసుకున్నారు. వారి మొహాలలో ఆనందం ప్రస్ఫుటంగా కనిపించింది.
"ఏమిటి ముందు మీరు పెట్టుబడి పెడతారా!...డాక్టర్ గారూ ఆలోచించి అనండి ఆ మాట. ఇదేదో వేలల్లో ఖర్చు కాదు- లక్షల వ్యవహారం" లక్ష్మయ్య చౌదరి అన్నాడు.
"చౌదరిగారూ, కొండలైనా తవ్వడం మొదలుపెడితే తరిగిపోతాయని నాకు తెలుసు. ఎల్లకాలం నేను డబ్బు ఖర్చుచేస్తాను అనడంలేదు. ఈ సన్నకారు రైతులకి ముందు పెట్టుబడికి డబ్బుండదు. వడ్డీకి లేకుండా నేను మదుపు పెడతాను. పంట చేతికి వచ్చి డబ్బు అందాక వారి ఖర్చు వారు చెల్లించి లాభం తీసుకుంటాను. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతింటే ఒక ఏడాది డబ్బు చెల్లు కట్టకపోయినా వూరుకుంటాను. ఈ మొత్తం లెక్కలన్నీ అకౌంటు వుంటుంది. జమ, ఖర్చు ప్రతి రైతుకి ఓ పుస్తకం మెయిన్ టైన్ చేస్తాం - నేను కేవలం రైతులు అప్పుల ఊబిలో దిగిపోకుండా వడ్డీలేని రుణం ఇస్తానని మాత్రం చెపుతున్నాను. ముందు "బ్యాంకులు ఎంత యిచ్చేది తేల్చుకుని అవసరమైతే నేనూ మదుపు పెడతాను."
రైతులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు.
"మనం ట్రాక్టరు, కోతకి మిషను, రైసుమిల్లు వగైరాలన్నింటికి ఎంత అయ్యేది లెక్కలు కట్టి దీర్ఘకాలిక రుణం తీసుకుని వచ్చేరాబడిలోంచి ప్రతి యేడాది కొంత అప్పు చెల్లగొట్టాలి. ఈ లెక్కలన్నీ పకడ్బందీగా వేయిస్తాను. నా మీద నమ్మకం వుంచండి చాలు. నాకు డబ్బు అవసరం లేదు. ఎవరి సొమ్ముకి కక్కుర్తిపడి దొంగలెక్కలు వేయాల్సిన అవసరం లేదు. ఎవరిసొమ్ముకి కక్కుర్తిపడి దొంగలెక్కలు వేయాల్సిన అవసరం లేదు. అయినా ఈ లెక్కల వ్యవహారం నేను ఒక్కడినే చూడను. కమిటీ వుంటుంది. మన ప్రెసిడెంటుగారు ఎమ్మెల్యేగారు, నేను, చౌదరిగారిలాంటి పెద్ద మనుష్యులు ఒకరిద్దరుండి - చేయాల్సిన ఖర్చు వగైరాలన్నీ కమిటీ తీర్మానించాకే చేయడం జరుగుతుంది.
"బాబూ, మాకు మీ మీద నమ్మకం వుంది. రైతులందరూ ముక్తకంఠంతో అన్నారు.
"నమ్మకం, అపనమ్మకం మాట అటుంచి ప్రతి పైసకి లెక్క వుండాలి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. నేనున్న, మరెవరున్నా మనం చేసే దానికి జమా ఖర్చులుండాలి...
"మనం మన వూర్లో రోడ్లు బాగుచేసుకుందాం. స్కూలు బిల్డింగ్ పడిపోవడానికి సిద్ధంగా వుంది. బాగుచేయించాలి. మిడిల్ స్కూల్ ని ప్రతి ఏడాది ఒక క్లాసు చొప్పున పెంచుతూ హైస్కూల్ చేయించాలి. దేవాలయం ఉగాదినాటికి బాగుచేయించి సున్నం వేయించాలి. ఆస్పత్రికి బిల్గింగు కట్టించాలి. వైద్యానికి మరో వూరు ఎవరూ వెళ్ళక్కరలేకుండా డాక్టరుగా నా చాతనయినంతగా శ్రమపడ్తాను. కావల్సిన మిషన్లు అమెరికా నుంచి వస్తున్నాయి. నాకింద ఇంకో డాక్టరుని అపాయింట్ చేస్తాను. ఇదంతా ఒక్కరోజులో చేస్తానని చెప్పాను. ఒక యేడాది పట్టచ్చు, ఇంకా ఎక్కువ పట్టచ్చు నేను అనుకున్నది సాధించడానికి. ఇది నా ఒక్కడి వల్ల కాదు.
మీ అందరి సహాయ సహకారాలుంటేనే అవుతుంది.
"డాక్టరు బాబూ - మీరెలా చెపితే మేం అలా వింటాం - దేముడిలా వచ్చారు. మీ మాట కాదనం" రైతులందరూ ముక్తకంఠంతో అన్నారు.
"సరే. మీకోసం నేను అన్నీ చేస్తాను. కాని మీరు నాకోసం ఒక్క మాట ఇవ్వాలి. యేంలేదు - మీరు మీ పిల్లల్ని పొలం పనుల్లో పెట్టవద్దు. వాళ్ళని స్కూల్ కి పంపాలి. చూడండి ప్రతివాడికి ఉచిత విద్య ప్రభుత్వం అందించినా మీరది అందుకుని సద్వినియోగపరచడం లేదు. పిల్లలకి చదువులేకపోతే వారి భవిష్యత్తు ఏమిటి. వాళ్ళూ మీలాగే వుండిపోవాలని కోరుతున్నారా. చదువు మనిషికి వికాసాన్ని, సంస్కారాన్ని ఇస్తుంది. విజ్ఞానాన్ని ఇస్తుంది. మీ పిల్లలని భూమినే నమ్ముకుని బతకమానండి. కాని ఇప్పుడు కాదు. ప్రతివారు కనీసం మెట్రిక్ వరకు చదివాక. మీ వృత్తినే నమ్ముకోండి. ప్రతివారు ఉద్యోగాలకు ఎగబడితే దొరకవు. చదువు వుద్యోగానికి కాదు విజ్ఞానానికి అన్నది గుర్తించండి. వృత్తినే నమ్ముకోండి. ప్రతివారు చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటూ కూర్చుంటే వృత్తిపనివారు కరువవుతారు. అటు ఉద్యోగాలూ లేక యువత నిస్పృహకి లోనవుతుంది. మీ పిల్లలకి కాస్త ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు వస్తే సేద్యం చేసినా, బట్టలు నేసినా, కుండలు చేసినా, వడ్రంగి, తాపీపని యేది చేసినా చదువుంటే వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లెక్కా డొక్కా తెలిస్తే ప్రతివాళ్ళచేతిలో మోసపోనక్కరలేదు. వాళ్ళ సరుకు వారు ఏ ధరకి అమ్ముకోవాలో, ఆఫీసర్లతో కల్సి మాట్లాడడానికన్నా ఓ అప్లికేషన్ పెట్టాలన్నా దేనికన్నా చదువు పనికి వస్తుంది - స్కూలు చదువు అయ్యేవరకు వారి బాల్యం సుఖంగా గడవనీయండి. తర్వాత తిప్పలు ఎలాగో వుంటాయి. పిల్లలందరూ హైస్కూల్ చదువులకి వేరే వూరు వెళ్ళక్కరలేదు. ఇక్కడే వుంటుంది. మీరంతా పిల్లలని స్కూలుకి పంపిస్తానని నాకు మాట ఇవ్వండి. ఈ సహకార సేద్యం ఆరంభిస్తే అంతా కల్సి పనిచేస్తారు గనక పిల్లల సాయం అవసరం వుండదు. ట్రాక్టరు, మిషను తెప్పిస్తాం కనక పని కూడా అంత వుండదు. సరేనా..."
"మీరెట్టా అంటే అట్టాగే బాబయ్యా - మా పిల్లలు చదువుకుని నాలుగక్షరం ముక్కలు నేర్చుకుంటే మాకు సంతోషమే -"
చౌదరి యేదో వినోదం చూస్తున్నట్టు కాళ్లు ఆడిస్తూ, కాస్త వ్యంగ్యంగా నవ్వుకున్నాడు. అది చూసిన కేశవరావు- ఏమంటారు చౌదరిగారూ మీరేం మాట్లాడడంలేదు.
"ఏం మాట్లాడమంటారు. మీ మాటలు వింటుంటే మీరు వుత్త థీరి వల్లిస్తున్నారు. ప్రాక్టికల్ గా జరిగినప్పుడు చూద్దాం లేండి-" కాస్త హేళనగా అన్నాడు.
"ఎందుకు జరుగదనుకుంటున్నారు..." రెట్టించాడు కేశవరావు.
"నే చెప్పడం ఎందుకులెండి- దిగితే లోతు మీకే తెలుస్తుంది."
"చౌదరిగారూ! ఇదంతా చెప్పినంత తేలికగాదు చెయ్యడం అన్నది నాకూ తెలుసు. కాని చేయకుండానే చేతులు ముడుచుకుని అబ్బే లాభంలేదు అనుకోవడం నాకు తెలియదు. నేను డాక్టర్ ని. ఓ పేషెంటు ఎంత జబ్బుగా వున్నా అబ్బే లాభంలేదు అని వదిలేయం. మా చాతనయినది చేసి ఫలితం దేముడిమీద వదిలేయడం- ఎంత చదివినా, ఎంత ఫారెన్ డాక్టర్లయినా అనే మాట అది.
అదే సూత్రం ఇక్కడ వుంటుంది. ఏది దానంతట అది మన వడిలో వాలదు. శ్రమపడాలి. ఓర్పు, నేర్పు, ధైర్యం, కృషి, పట్టుదల వుంటే ఒకరోజు కాకపోతే రెండోరోజుకన్నా సాధించగలం. ఈ నిరాశా నిస్పృహ ముందు మనం వదిలించుకోవాలి. అంటే చేతులు కలుపుదాం - శ్రమిద్దాం - జన్మభూమి రుణం తీర్చుకుందాం.