Previous Page Next Page 
తదనంతరం పేజి 17


    ఆమాటకొస్తే నరసింహంగారికి జీవితంపట్ల యింకా అపారమైన ప్రేమ వుంది.


    ఆత్మ విమర్శ చేసుకుంటున్నాడు. ప్రేమేకాదు, యింకా చాలారోజులు బ్రతకాలన్న ఆసక్తి కూడా వుంది.


    తనకి మాత్రం చావంటే భయం లేదా?


    తెలీదు.


    చాలా మంది "నాకు చావంటే భయంలేదు" అని పదేపదే చెప్పుకుంటూ వుంటారు. ఇంకో నినాదంకూడా వల్లెవేస్తూ వుంటారు. "బ్రతికినన్నాళ్ళూ, ఇంకొకరితో చేయించుకోకుండా ఆరోగ్యంగా వుండాలనీ"


    ఇది కేవలం తమ ఒక్కరి కోరికే, హక్కు అయినట్లు.


    "ఏమిట్రా ఆలోచిస్తున్నావు?" అన్నాడు అవధాని మళ్ళీ.


    "యింట్లో పరిస్తితులేవీ బాగాలేదన్నావు ఏమిట్రా అవి?"


    "ఆస్తి పంపకాల కోసం పిల్లలు తగాదా పెట్టుకుంటున్నారా."


    "ఏమంటున్నారు?"


    "నాకు ముగ్గురు కొడుకులు కదా. అమ్మాయిల సంగతలా వుంచు. వాళ్ళ ధోరణులూ, అల్లుళ్ళ వేధింపూ అదో గొడవ. కొడుకులు ముగ్గురూ రాక్షసుల్లా తయారయ్యారు. వాళ్ళకు లేని దుర్వ్యసనం లేదు. తాగుడు, పేకాట, వ్యభిచారం. శక్తికి మించి అప్పుడు చేసేశారు. అవి తీర్చటంకోసం, వాళ్ళు అనుభవించటం కోసం బ్యాంకుల్లో వున్న డబ్బు, బంగారం, ఈ ఇల్లూ ఇప్పటికిప్పుడు పంచెయ్యమంటున్నారు. కేవలం అనటమే కాదు. దౌర్జన్యం చేస్తున్నారు. మా ఆవిడకూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తోంది. మొన్నయితే రెండోవాడు కొట్టటానికి మీదకొచ్చి చేయెత్తాడు. వాడి తల్లి చూస్తూ ఊరుకుందిగాని, యిదేమిట్రా అని మందలించలేదు. చీటికీ మాటికీ ముసలాడు అని నా గురించి విసుక్కుంటూ వుండటం వాళ్ళ పరిభాష అయిపోయింది. ఉన్నపళాన వాళ్ళకు ఆస్తి పంచెయ్యాలి, తర్వాత నేనేమైపోయినా పరవాలేదు."


    అవధాని గొంతు గాద్గరికంగా మారింది. కాంతి నశించిపోయిన కళ్ళలో కనిపించీ కనిపించనట్లు నీరు వుబికింది.


    నరసింహంగారిలో ఆవేశం పెల్లుబికింది. "ఈ ఆస్తంతా నీ స్వార్జితం. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి, సంవత్సరాల తరబడి శ్రమించి కూడబెట్టిన ఆస్తి వాళ్ళకు ధారాదత్తం చెయ్యాలా? అవధాని! గుర్తుంచుకో. ఈ ఆస్తంతా నీ స్వార్జితం. దీన్ని యిష్టమొచ్చినట్టుగా ఉపయోగించుకునే హక్కు నీకుంది. నీ పర్మిషన్ లేకుండా ఎవరూ చిల్లిగవ్వకూడా తాకటానికి వీల్లేదు. ఇది నీ స్వార్జితం. వింటున్నావా? ఇది నీ స్వార్జితం. అందులో కొడుకులు యిలాంటి దౌర్భాగ్యులు అయినప్పుడు వాళ్ళకు ఇందులో దమ్మిడి కూడా దక్కే హక్కులేదు. అవునూ విల్లు రాసేశావుకదూ."


    "రాశాను"


    "ఏమని రాశావు?"


    "నా తదనంతరం యీ యిల్లు అనుభవించటానికే గాని అమ్ముకోటానికీ, తాకట్టు పెట్టటానికీ వీల్లేదని రాశాను. ఆ తర్వాత మనమలకి చెందుతుంది. బంగారం మాత్రం మా ఆవిడకి, ఆడపిల్లలకూ, డబ్బు మా ఆవిడకూ, మొగపిల్లలకూ చెందేటట్లు రాశాను" అంటూ అవధాని వివరంగా చెప్పాడు.


    నరసింహంగారు ఆ వీలునామాపట్ల సంతృప్తి వెలిబుచ్చాడు.


    "ఇదిగో అవధానీ నీ పిల్లలు నీకు లొంగి వుండాలంటే కళ్ళెం నీ చేతుల్లో వుండి తీరాలి గుర్తుంచుకో. జీవించి ఉండగానే పంపకాలు చేశావా? నిన్ను వీధిలోకి తన్ని తగలేస్తారు జాగ్రత్త. నువ్వు ఇంటి యజమానివి. వయసొస్తే రానీగాక_పిల్లలు నిన్ను చూస్తే గడగడలాడుతూ వుండాలి. మనం వాళ్ళ మాటలకి ఎక్కడా లొంగిపోయినట్లు కనిపించకూడదు. మనకి వయసొస్తున్నకొద్దీ మన సొమ్ము తింటూనే పిల్లలు డామినేట్ చెయ్యటానికి ప్రయత్నిస్తారు. ఇదో విచిత్రమైన సమస్య. పైకి తేలిగ్గా కనిపిస్తూ లోలోపల అగ్నిపర్వతంలా మండుతూ సమయంకోసం కాచుకుని వున్నట్లు, ఉన్నట్లుండి ఒక్కసారి బ్రద్దలవుతుంది. ఎంతో మంచివాళ్ళనుకున్న వాళ్ళు అతి దుర్మార్గుల్లా మారిపోతుంటారు. సంవత్సరాల తరబడి అణిగి మణిగివున్న పెళ్ళాలు అమాంతం రాక్షసుల్లా మారిపోతుంటారు. మనిషిలోని వికృత స్వభావాలన్నీ యిప్పుడే బయటపడుతూ వుంటాయి. ఈ ఒత్తిడులన్నీ తట్టుకుని మనం తెలివిగా ప్రవర్తించగలగాలి."

 Previous Page Next Page