ఇంటికి వచ్చింతరువాత వేగంగా పుస్తకాలు తిరగేశాను.
నవలలో ఆరు పదహారు ఇరవై ఆరు ముప్పైఆరు సరీగ ఆరు వచ్చిన పేజీలో నాకు కావాల్సిన క్లూ వుంది. నా అనుమానం అక్షరాల కరెక్ట్ అయితే ఈ పాత పుస్తకాల వల్ల ప్రయోజనం లేదు. రేపే మార్కెట్ లోకి షాక్ అనే నవల అతను రాసింది వస్తుంది. ఇంక నేను రంగంలోకి దిగవచ్చు.
నేను డ్యూటీలో లేను అయినా సరే నావృత్తి ధర్మం నేనెప్పుడూ మర్చిపోను.
"డ్యూటీ లేనప్పుడు హాయిగా ఎంజాయ్ చేయక అన్ని పట్టించుకుంటావ్ ఎందుకోయ్!" అన్న వాళ్ళకి చిన్న కధ చెప్పి నోరు మూయిస్తుంటాను.
"అనగనగా ఓ ఇన్ స్పెక్టర్. అతను డ్యూటీలో వున్నప్పుడు దొంగల్ని పట్టుకోవటం వాళ్ళను చీల్చి చండాడటం ధైర్యంగా చేసేవాడు. ఓరోజు అతను డ్యూటీలో లేడు. అతని కళ్ళముందే ఓ దొంగ ఒకడి జేబు కొట్టేసి అది బైటపడేసరికి ఆ దొంగ కత్తితీసి బెదిరిస్తూ అక్కడనుంచి పారిపోయాడు. ఇన్ స్పెక్టర్ చూస్తూ వుండిపోయాడు. అలా వుంటే బాగుంటుందా?"
"చెప్పింది కాకమ్మ కధ అయినా మారు మాట్లాడటానికి వీలులేకుండా చేస్తావ్." అంటూ నవ్వేవారు.
అదేమిటో నేను డ్యూటీలో లేనప్పుడే కేసులు తగులుతుంటాయి. అయినా నేను విచారించాను.
ఈ నవలల ద్వారా నేను తెలుసుకుంది కొద్ది విషయమే. నిజం బైట పెడితే మాత్రం అది చాలా పెద్ద విషయం కావటం మాత్రం ఖాయం. తన రచనల ద్వారా ఆరు అంకెలున్న పేజీలలో సీక్రెట్ కోడ్ రాస్తున్నాడు. అది ఎవరో చదివి ఏదో చేస్తున్నారు. ఆ ఏదో అన్నది ఘోరమైన నేరం అయి వుంటుంది. ఈ మధ్య నేరస్తులని మేము కొత్త రకాలుగా పధకాలు అల్లి పట్టుకుంటుంటే నేరస్తులు మాకన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివి కొత్త రకంగా నేరాలు చేస్తున్నారు. అందులో భాగమే యిది.
రచయిత పాతవాడు కాదు. కొద్ది నెలల క్రితం నుంచే రాయటం మొదలుపెట్టాడు. అతను మంచి రైటర్ కూడా కాదు. ఇంగ్లీషు నవలలు మక్కీ మక్కీ కాపీ చేయటమేగాక తన పైత్యం కూడా కాస్త కలిపి తెలివిగా కోడ్ ఇరికిస్తున్నాడు. ఆ కోడ్ చదివి ఎవరో పనిలోకి దిగుతున్నారు. ఆ పని చాటుపని దానిపేరు నేరం. ఆ నేరాన్ని పట్టాలి.
నవల స్టాక్ మార్కెట్ లోకి వచ్చేది రేపు. నేను ఈరోజు నుంచే రంగంలోకి దూకాలి. రెండో అద్దె పుస్తకాల షాపులో అతను ఆత్రుతగా నన్ను ప్రశ్నించాడు. పైగా యీ రచయిత రచనలు అడిగేది ఇద్దరు అన్నాడు. అది కోడ్ కాదు కదా! తను వెంటనే వాళ్ళిద్దరూ ఎవరు అని అడగలేదు. అలా అడక్కుండా కొత్త కధ కల్పించి చెప్పాడు. వాడు నమ్మేలా.
తన పరిశోధన అద్దె పుస్తకాల షాపునుంచి మొదలుపెట్టాలి. రచయిత అడ్రస్ తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టటమే మంచిది.
కొద్దిగా రూపం మార్చుకుని నాయర్ ఇచ్చిన టీ తాగి బయలుదేరాను.
15
అద్దె పుస్తకాల షాపుని చూస్తూ ఎదురుగుండా వున్న హోటల్లో కూర్చున్నాను.
"ఏం కావాలి!" సర్వర్ వచ్చి అడిగాడు.
"ఏమున్నాయి!"
సర్వర్ గడగడ పాఠం అప్పజెప్పినట్లు "ఇడ్లి వడ పెసరట్ ఆలూబోండా పూరి..." అంటూ లిష్ట్ ఏకరువు పెట్టాడు.
"స్వీట్స్ ఏమున్నాయి!"
"మైసూర్ పాక్ జాంగ్రీ!"
"ఇంకేం లేవా?"
"ఉహు!"
"అన్నీ తాజావేనా!"
"ఆ..."
"సాంబారు వుందా?"
"ఆ..."
"కాఫీ టీ కాక బ్రూ లాంటిది కూడా వుందా?"
"ఆ..."
ఇంక సర్వర్ ముఖంలో సహనం చచ్చిపోయినట్లుంది. ఆ అంటూ నా ముఖంలోకి ఉరిమి చూశాడు. నేను కొద్దిసేపు హోటల్లో గడపాలంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించక తప్పదు. తర్వాత హోటల్లోంచి బయటపడి హోటల్ పక్కనే వున్న షాపులో దూరి మరి కొద్దిసేపు అక్కడ కాలక్షేపం చేయాలి. అద్దె పుస్తకాల షాపుమీద ఓ కన్నేసి వుంచటానికి నేను యీ కాకమ్మ పనులు చేయక తప్పదు. కాకి ఆ ఇంటి మీద యీ ఇంటిమీద తన ఆహారం కోసం వాలినట్లు మాబోటి వాళ్ళు నేరస్తుల కోసం అన్ని షాపుల్లోను దూరి అక్కరలేనివన్నీ బేరం ఆడుతుంటారు. ఇప్పుడు నేను చేస్తున్నది ఆపనే.
పది నిమిషాలు సర్వర్ పనికి అంతరాయం కలిగించి అప్పుడు చెప్పాను. "ఓ కప్పు స్ట్రాంగ్ టీ" అని...
టీ తప్ప ఏమీ తీసుకోంది ఇన్ని వెధవ ప్రశ్నలు దేనికి! అన్నట్లు విసుగ్గా చూపి "టీ చాలా!" అన్నాడు.
"చాలు." సర్వర్ మాటలు పెంచితే మళ్ళీ కాస్త టైము గడుస్తుందని ముక్తసరిగా అన్నాను. కాని అలాంటి బుద్ధి పొరపాటు పని చేయకుండా వెళ్ళిపోయాడు.
సర్వర్ టీ తెచ్చి నా ముందు పెట్టి బిల్లు కూడా ఆ పక్కనే పెట్టాడు.
నేవచ్చిన హోటల్ చిన్నది. అయినా జనం వచ్చిపోతూ సందడిగా వుంది. కాఫీ టిఫిన్ పూర్తి అయిం తరువాత బిల్లు ఇచ్చే పద్ధతి ఇక్కడ.
"బిల్లు కూడా ఇచ్చావా!" అడిగాను టీ తాగుతూ టీ పక్కనే బిల్లు కూడా వుంచితే కళ్ళారా చూసి కూడా ఆ ప్రశ్న వేయటంతో నన్నో పిచ్చాడిని చూసినట్లు చూసి "ఊ..." అన్నాడు. ఆ "వూ" అన్న తీరు వురిమినట్లే వుంది.
"ఇందాక నిన్ను ఏమేమి వున్నాయని అడిగాను కదూ ఎందుకో తెలుసా!"
"తెలియదు."